Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్The wrestling star Vinesh Phogat: రెజ్లింగ్‌ క్రీడపై నిలువెత్తు సంతకం ఫోగట్ !

The wrestling star Vinesh Phogat: రెజ్లింగ్‌ క్రీడపై నిలువెత్తు సంతకం ఫోగట్ !

భారత్‌కు స్వర్ణం తీసుకురావాలన్న సంకల్పంతో పారిస్ వెళ్లిన వినేశ్ ఫోగట్ పై దురదృష్టవశాత్తూ అనర్హత వేటు పడింది. దీంతో భారత్ కలలు కల్లలయ్యాయి. కేవలం వంద గ్రాముల అధిక బరువు వినేశ్ ఆశలను ఛిద్రం చేసింది. ఈ పరిణామం వినేశ్ ఫోగట్ జీర్ణించుకోలేకపోయారు. అలాగే వినేశ్ ఫోగట్ ఆటను ఆరాధించే కోట్లాది మంది హృదయాలు కలుక్కుమన్నాయి. అనర్హత వేటుకు మనోవేదనకు గురైన వినేశ్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.అంతిమంగా రెజ్లింగ్ క్రీడకు శాశ్వతంగా గుడ్ బై కొట్టారు. మరోవైపు కిందటేడాది బీజేపీ పార్లమెంటు సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో వినేశ్ ఫోగట్ కీలక పాత్ర పోషించారు. రోజుల తరబడి తన సహచర రెజ్లర్లతో కలిసి వినేశ్ ఫోగట్ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకాన్ని చవి చూశారు. ఒక దశలో అమె అరెస్టు కూడా అయ్యారు. ఒకదశలో తనకు సర్కార్ ఇచ్చిన ఖేల్ రత్న అవార్డును కూడా వినేశ్ ఫోగట్ వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమెను నానా మాటలు అనడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు మరొకరు అయితే …ధర్నాను పక్కన పడేసి వెళ్లిపోయేవారు. అయితే వినేశ్ ఫోగట్ ఆ బాపతు కాదు. ధైర్యంగా నిలబడి పోరాడారు.

- Advertisement -

భారత రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌ చెదిరింది. కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా యావత్ భారతదేశం కలలు కల్లలయ్యాయి. రింగ్‌లోకి దిగడానికి కొన్ని గంటల ముందు బరువు చూసుకోగా, వందంటే వంద గ్రాములు ఎక్కువ ఉన్న సంగతి తెలిసింది. దీంతో అధిక బరువును తగ్గించుకోవడానికి వినేశ్ నానా పాట్లు పడింది. అయినా బరువు తగ్గలేదు. తిండి మానేసింది. నీళ్లూ ముట్టలేదు. జట్టు కత్తిరించుకుంది. రాత్రంతా మెలకువగానే ఉంది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం కావాలని ఒలింపిక్స్ అధికారులను ఆమె ఎంతగానో బతిమిలాడింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతకుముందు ఓటమి ఎరుగని డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకికి పరాజయం రుచి చూపించింది వినేశ్ ఫోగట్‌. క్వార్టర్స్ లో ఉక్రెయిన్‌కు చెందిన ఓక్సానా లివాచ్ పై విజయం సాధించిన వినేశ్ ఫోగట్ , సెమీస్‌లో క్యూబాకు చెందిన యుస్నేలిస్ గుజ్‌మన్‌ను ఓడించింది. అట్నుంచి అటు ఫైనల్ పోరుకు దూసుకెళ్లింది. వినేశ్ ఫోగట్ ఫైనల్ కు చేరుకోవడంతో దేశమంతా ఆనందం వెల్లివిరిసింది. ఫైనల్‌లో విజయం సాధించి వినేశ్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని యావత్ భారతదేశం భరోసా పెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ఒక వేళ పసిడి పతకం వచ్చినా రాకున్నా…వెండి పతకమైనా దక్కుతుందని నిశ్చింతకు వచ్చారు దేశ ప్రజలు. చాలా మందికి ఎక్కడో ఓ ఆశ. ఫైనల్‌లో వినేశ్ ఓ అద్భుతం సృష్టిస్తుందని ఆశ పెట్టుకున్నారు. అయితే భారత్ భరోసా దెబ్బతింది. భారత్ ఆశలు కూలిపోయాయి. కోట్లాదిమంది భారతీయుల హృదయాలు కులుక్కుమన్నాయి. యాభై కిలోల బరువు పోటీకి వంద గ్రాములు ఎక్కువగా ఉండటమే వినేశ్ కు మైనస్ పాయింట్ అయింది. దీంతో వినేశ్‌ ఫోగట్‌ పై అనర్హత వేటు పడింది. అంతిమంగా ఓ మహిళా రెజ్లర్ కెరీర్ తలకిందులైంది. కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చిలకరించింది అనర్హత వేటు నిర్ణయం. అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో వినేశ్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఆరో ప్రాణంవంటి రెజ్లింగ్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నాకు ఇక పోరాడే ఓపిక లేదు. అందుకే నాకు ఎంతో ఇష్టమైన క్రీడ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని ఎక్స్‌లో రాసుకున్నారు వినేశ్ ఫోగట్. ఇక్కడ ఒలింపిక్స్ నియమాలను ఓసారి తెలుసుకోవాలి. ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా తలపడే రెజ్లింగ్ క్రీడలో కచ్చితంగా వేర్వేరు బరువు విభాగాలుంటాయి. ఒక బరువు విభాగంలోని అథ్లెట్లందరూ ఒకరితో మరొకరు తలపడతారు. ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థిపై పై చేయి సాధించే ఆస్కారం ఉంటుంది. ఈ కారణంతోనే అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన పెట్టారు. అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగా ఉందో…లేదో తనిఖీ చేస్తారు.నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉన్నా అనుమతిస్తారు కానీ, ఎక్కువగా ఉంటే అనుమతి ఇవ్వరు.

ఫోగట్ కెరీర్‌లో అనేక రికార్డులు
వినేశ్ ఫోగట్….భారత క్రీడారంగంపై ఓ నిలువెత్తు సంతకం. ఫ్రీ స్టయిల్ రెజ్లర్‌గా క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో అనేక సార్లు దేశానికి స్వర్ణాలు తెచ్చిపెట్టిన ఘనత స్వంతం చేసుకున్నారు ఆమె. 2014, 2018 అలాగే 2022 కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి ఫోగట్‌ గోల్డ్ మెడల్స్ తీసుకువచ్చారు. కామన్వెల్త్ , ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌ వినేశ్ ఫోగట్ యే. అంతేకాదు వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్ లో రెండు కాంస్యం పతకాలు వినేశ్‌ ఫోగట్ సాధించారు.వినేశ్ ఫోగట్ ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. ఆమె ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇది మూడోసారి. 2016 లో 48 కిలోల బరువు రెజ్లింగ్ పోటీలో ఆమె పాల్గొన్నారు. ఆ తరువాత 2020 లో 53 కిలోల బరువు రెజ్లింగ్ పోటీలో వినేశ్ పాల్గొన్నారు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో 50 కిలోల పోటీలోనూ ఆమె పాల్గొన్నారు. వినేశ్ ఫోగట్ హర్యానా బిడ్డ. హర్యానాలోని చర్ఖి దాద్రిలో 1994 ఆగస్టు 25న ఆమె జన్మించారు. వాస్తవానికి వినేశ్ ది కుస్తీలు పట్టే కుటుంబం. సోదరి ప్రియాంక కూడా పేరొందిన రెజ్లర్. అలాగే వినేశ్ ఫోగట్ కుటుంబంలోని పలువురుకు రెజ్లింగ్‌ తో సంబంధాలున్ననాయి. వినేశ్ ఫోగట్ కు బాల్యం నుంచే కుస్తీలు పట్టడం పై ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ని గమనించిన దగ్గరి బంధువు మహావీర్ సింగ్ ఫోగట్…..ఆమెకు కుస్తీలు పట్టడంలోని మెలకువలు నేర్పించాడు. అయితే కుటుంబంలో రెజ్లింగ్ క్రీడ ఉన్నప్పటికీ, ఆడవారు కుస్తీలు పట్టడం ఫోగట్ కుటుంబంలో లేదు. ఫోగట్ కుటుంబంలో రెజ్లింగ్ నేర్చుకున్న తొలి మహిళ వినేశే. దీంతో ఆమె రెజ్లింగ్ పోటీలకు వెళతానంటే బంధుమిత్రులు వద్దని వారించారు. అయితే తండ్రి రాజ్‌పాల్ ఫోగట్ ..ఆమెకు అండగా నిలిచారు. కూతురును అత్యుత్తమ క్రీడాకారిణిగా రాజ్‌పాల్ ఫోగట్ తీర్చిదిద్దారు.

ఫోగట్ ఓ పోరాట కెరటం
వినేశ్ ఫోగట్, చాలా కాలం నుంచి రెజ్లింగ్ క్రీడలో ఉన్నారు. అయితే క్రీడాభిమానులకు తప్ప మిగతా వారికి ఆమె పేరు పెద్దగా తెలియదు. అయితే కిందటేడాది న్యాయం కోసం దేశవ్యాప్తంగా మహిళా రెజ్లర్లు ఢిల్లీ నగరంలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. న్యాయం కోసం మహిళా రెజ్లర్లు చేసిన ఆందోళనలతో వినేశ్ ఫోగట్ ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో వినేశ్ ఫోగట్ కీలక పాత్ర పోషించారు. రోజుల తరబడి తన సహచర రెజ్లర్లతో కలిసి వినేశ్ ఫోగట్ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకాన్ని చవి చూశారు. ఒక దశలో అమె అరెస్టు కూడా అయ్యారు. వినేశ్ ఫోగట్ సహా మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టినా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. బ్రిజ్ భూషణ్ ను తిరిగి రెజ్లింగ్ సమాఖ్య లోకి రానివ్వకుండా చేయడానికి వినేశ్ ఫోగట్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో తనకు సర్కార్ ఇచ్చిన ఖేల్ రత్న అవార్డును కూడా వెనక్కి ఇచ్చేసింది వినేశ్ ఫోగట్. దీంతో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమెను నానా మాటలు అనడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు మరొకరు అయితే …ధర్నాను పక్కన పడేసి వెళ్లిపోయేవారు. అయితే వినేశ్ ఫోగట్ ఆ బాపతు కాదు. ధైర్యంగా నిలబడి పోరాడారు. ఆందోళనా కార్యక్రమాలతో తాను అనుకున్నది సాధించారు వినేశ్ ఫోగట్. బ్రిజ్ భూషణ్ తిరిగి సమాఖ్య ఎన్నికలకు దూరమయ్యారు. దీంతో వినేశ్ మళ్లీ ఆటపై దృష్టి పెట్టారు. ఈ సమయంలోనే ఆమె మోకాలికి గాయం అయింది. దీంతో మోకాలి గాయానికి ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా ఏడాదిపాటు రెజ్లింగ్‌ కు వినేశ్ దూరమయ్యారు. అయినా అమె మనోధైర్యం కోల్పోలేదు. కఠోర శ్రమ చేశారు. శిక్షణలో రాటు దేలారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లారు.

                  - ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్  63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News