Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్There are no health drinks !: హెల్త్ డ్రింక్స్ అనేవే లేవు!

There are no health drinks !: హెల్త్ డ్రింక్స్ అనేవే లేవు!

కొబ్బరి నీళ్లు వంటివి మాత్రమే హెల్త్ డ్రింక్స్

ఆరోగ్య పానీయాల మీద దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. తాము ఉత్పత్తి చేస్తున్న ఆరోగ్య పానీయాల గురించి కంపెనీలు చేస్తున్న ప్రచారాలను నిపుణులు ఖండించడం జరుగుతూనే ఉంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా
నుంచి తొలగించవలసిందిగా సంబందిత కంపెనీని ఆదేశించడంతో ఈ ఆరోగ్య పానీయాల వ్యవహారంపై మళ్లీ దేశవ్యాప్త చర్చ ప్రారంభం అయింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (2006) ప్రకారం దేశంలో ఎక్కడా ఆరోగ్య పానీయాల ఉత్పతి జరగడం లేదు. పైగా ఎక్కడా ఆరోగ్య పానీయమనేదే లేదు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ విచారణలో ఇది స్పష్టంగా తేలిపోయింది. ఆరోగ్య పానీయానికి సంబంధించి ఎక్కడా ఎవరూ ఎటువంటి ప్రమాణాలనూ నిర్ధారించలేదు. ఇందుకు సంబంధించి ఎక్కడా ఏ చట్టమూ లేదని కూడా అది తేల్చి చెప్పింది. డెయిరీ, సిరియల్స్, మాల్ట్ పేరుతో పానీయాలను ఉత్పత్తి చేసి, వాటికి ఆరోగ్య పానీయాలని, ఎనర్జీ పానీయాలని లేబుల్స్ పెట్టడం జరుగుతోందని, వాటిని ఆరోగ్య పానీ యాలుగానో, ఎనర్జీ పానీయాలుగానో పరిగణించాల్సిన అవసరం లేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ) కూడా ఈ మధ్య స్పష్టం చేసింది. దేశంలో ప్రజానీకం తాగుతున్న పానీయాలన్నిటినీ వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐని ఆదేశించడం జరిగింది.

- Advertisement -

అనేక ఆరోగ్య పానీయాల్లో కనీస పౌష్టిక పదార్థాలైనా ఉన్నాయా అన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. దేశంలో 1500 కోట్ల డాలర్ల మేరకు ఆరోగ్య పానీయాలు విక్రయం అవుతున్నాయి. వీటిని ఎక్కువగా సేవిస్తున్నది బాల బాలికలే. అనారోగ్యాలతో అవస్థలు పడుతున్నవారు, అనారోగ్యాల నుంచి కోలుకుంటున్నవారు, గర్భిణీలు, బాలింతలు కూడా ఈ పానీయాలను తీసుకోవడం జరుగుతోంది. ఈ పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిఫారసు చేసిన దాని కంటే ఎక్కువగా ఈ పానీయాల్లో చక్కెరను కలపడం జరుగుతోంది. ఈ కారణంగా పిల్లల్లో ఊబకాయం ఏర్పడడం, దంతాలు దెబ్బతినడం, చిన్న వయసులోనే మధు మేహం వ్యాధి ప్రబలడం, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో కొన్ని కంపెనీలు తమ పానీయాల్లో చక్కెర శాతాన్ని బాగా తగ్గించడం జరిగింది కానీ, అంత మాత్రాన ఇవి ఆరోగ్య పానీయాలుగానో, ఎనర్జీ పానీయాలుగానో మారిపోయే అవకాశం లేదు. సాధారణ నీటి ఆధారిత పానీయాలను కూడా ఆరోగ్య పానీయా లుగా, ఎనర్జీ పానీయాలుగా ప్రచారం చేయడం జరుగుతోంది.

ఈ సాధారణ పానీయాల మీద ఆరోగ్య పానీయాలని, ఎనర్జీ పానీయాలని లేబుల్స్ అంటించడం వల్ల, ఇతరత్రా ప్రచారాలు చేయడం వల్ల అవి ఆరోగ్య లేదా ఎనర్జీ పానీయాలనే అభిప్రాయం బల పడుతోంది. ఇటువంటి ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఇవి ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉందని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆరోగ్య పానీయాల మీద లేబుల్స్ అంటిస్తున్నామని, ఈ పానీయాల్లో ఉన్న మూలకాలనన్నిటినీ ఇందులో పేర్కొంటున్నామని, వీటిని బట్టి వినియోగదారులు సరైన ని‍ర్ణయం తీసుకోవచ్చని కంపెనీలు వాదిస్తున్నాయి. కానీ, భారతదేశం వంటి మార్కెట్టులో
ఈ లేబుల్స్ ను చదివే వారి సంఖ్య, వాటిని అర్థం చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది వీటి గురించి జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే నమ్మడం జరుగుతుంది. వీటికి నటులు, క్రికెటర్లు ఇతర ప్రముఖులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మడం కూడా జరుగుతుంటుంది. ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయం అయినందువల్ల, ఈ ఆరోగ్య పానీయాల విషయంలో కొన్ని నియంత్రణలు, ఆంక్షలు అవసరం. ఆహార పదార్థాలు, ఆరోగ్య పానీయాలకే కాదు, మందులు, వైద్య పరికరాల విషయంలో కూడా ప్రభుత్వపరంగా నియంత్రణలు చాలా అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News