Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Thirst of war: యుద్ధోన్మాదిలా కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Thirst of war: యుద్ధోన్మాదిలా కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఉత్తర కొరియాను సర్వ నాశనం చేస్తున్న కిమ్, కిమ్ పాలనలో అంతా కరువు కాటకాలే..

కిమ్‌ జోంగ్‌ ఉన్‌… ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా సంచలమే. ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందిగా సైన్యానికి ఆదేశాలిచ్చాడు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌. అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి మిలటరీ ఎక్సర్‌సైజులు చేస్తున్న నేపథ్యంలో తమ దేశానికి యుద్ధ ప్రమాదం పొంచి ఉందన్నది కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆందోళన. దీంతో అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా కూడా యుద్ధానికి రెడీ కావాలన్నది కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆలోచన. కథ ఇక్కడితో ఆగలేదు. యుద్ధ ప్రమాదం నేపథ్యంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని సైనికాధికారులను ఆదేశించాడు కిమ్‌. ప్రస్తుత సైనిక జనరల్‌ కు యుద్ధాన్ని ఎదుర్కొనే సత్తా లేదనుకున్నారో ఏమోకాని, ఏకంగా ఇంటికి పంపాడు. మిలటరీ చీఫ్‌గా రి యాంగ్‌ గిల్‌ ను అప్పటికప్పుడు నియమించాడు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దూకుడు చూస్తుంటే ఏదో ఒకరోజు చడీచప్పుడు లేకుండా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌తో పాటు మిలటరీ హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్న డేజియోన్‌ నగరంపై కూడా దాడులకు ఆదేశాలిస్తారేమోనని శాంతిప్రియులు భయపడుతున్నారు.
ఉత్తరకొరియా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకువచ్చేది క్షిపణులే. కిమ్‌ అధికారం చేపట్టాక, ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. ఈ ఏడాది జులైలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. అగ్రరాజ్యానికి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి యో జోంగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కథ అంతటితో ఆగలేదు. అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చిన మర్నాడే, ఉత్తర కొరియా ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో పడింది. వాషింగ్టన్‌ కు చెందిన నిఘా విమానాలు, తమ భూభాగంలోకి చొరబడితే కూల్చేస్తామని యో జోంగ్‌ హెచ్చరించారు. 2022 ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా మొత్తం వందకు పైగా క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. ఈ ఏడాది ఓ నిఘా ఉపగ్రహ ప్రయోగానికి కూడా ఉత్తర కొరియా ప్రయత్నాలు చేసింది. అయితే ప్యాంగ్యాంగ్‌ ప్రయోగాలు విజయవంతం కాలేదు. ఇదిలా ఉంటే అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకే శక్తి ఉన్న ఐసీబీఎంల అభివద్ధిపై కొంతకాలంగా ఉత్తరకొరియా దష్టి పెట్టినట్లు అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల సమాచారం.
సౌత్‌ కొరియా వర్సెస్‌ నార్త్‌ కొరియా
ఇరుగుపొరుగు దేశాలైన సౌత్‌ కొరియా, నార్త్‌ కొరియా మధ్య కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం అమెరికా దగ్గరవడం ఉత్తర కొరియాకు మింగుడపడటం లేదు. దీంతో ఉత్తర కొరియా జోరు పెంచింది. వరుస మిస్సైల్స్‌ను ప్రయోగిస్తోంది. దక్షిణ కొరియాతో పాటు ఆ దేశానికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికాతో వైరం నేపథ్యంలో రష్యాకు దగ్గరైంది ఉత్తర కొరియా. 2011లో అనూహ్య పరిస్థితుల్లో కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఉత్తర కొరియా పాలకుడు అయ్యాడు. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో కిమ్‌ ఏకంగా దేశాధినేత అయ్యాడు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అంటే మామూలోడు కాదు. అధికారంలోకి రాగానే అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు. తరచూ అగ్రరాజ్యమైన అమెరికాకు వార్నింగ్‌లు ఇస్తూ అంతర్జాతీయ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాడు. అంతేకాదు… అటు పొరుగుదేశమైన దక్షిణ కొరియాకు కూడా చెమట్లు పట్టిస్తుంటాడు. అందరూ నియంతల్లాగే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా బాగా భయస్తుడు. ఎప్పుడు, ఎవరు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీస్తారోనని తరచూ భయపడుతుంటాడు. ఈ భయంలోనుంచే ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని నెలల కిందట ఇంగ్లీషు సినిమాలను ఉత్తర కొరియాలో నిషేధించాడు. ఇంగ్లీషు సినిమాలు చూస్తూ పట్టుబడ్డ పిల్లలకు ఐదేళ్ల శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇంగ్లీషు సినిమాల ప్రభావంతో తన సర్కార్‌పై ఎవరైనా తిరుగుబాటు లేవదీస్తారేమోనని భయంతోనే కిమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నార్త్‌ కొరియా పొలిటికల్‌ సర్కిల్స్‌ కథనం.
ఉత్తర కొరియాలో తీవ్ర కరువు పరిస్థితులు
ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర కొరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలికేకలకు మారుపేరుగా ఉత్తర కొరియా మారింది. కడుపునిండా తిండికి కూడా గ్యారంటీలేని బతుకులు గడిపారు ఉత్తర కొరియన్లు. అయితే కరువు పరిస్థితులు భీకరంగా ఉన్నా, బయటి ప్రపంచానికి రవ్వంత సమాచారం లేదు. ఆకలికేకల సంగతిని రహస్యంగా దాచి పెట్టింది కిమ్‌ ప్రభుత్వం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరివారంలో వ్యవసాయరంగంలో సంస్కరణలపై రాజధాని నగరంలో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, పంటల దిగుబడి పెంచడానికి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. దీంతో ఉత్తరకొరియా జనం తిండిలేక మలమలమాడుతున్న రహస్యం బయటపడింది. ఇదంతా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వయంకతాపరాధమే అన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కిమ్‌కు అణ్వస్త్రాలపై ఉన్న ఆసక్తి తిండిగింజల ఉత్పత్తిపై లేకపోవడమే కరువు పరిస్థితులకు ప్రధాన కారణం అన్నారు. సర్కార్‌ దగ్గర ఉన్న సొమ్మునంతా క్షిపణులు కొనడానికి, వాటిని ప్రయోగించడానికే కిమ్‌ ఖర్చు పెట్టడంతోనే ఉత్తర కొరియాలో దారుణ కరువు పరిస్థితులు దాపురించాయన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
1990ల్లోనూ తీవ్ర కరువు పరిస్థితులు
ఉత్తర కొరియాకు కరువు కొత్తకాదు. 1990ల్లో కూడా ఇలాగే తిండి దొరకని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశమంతా కరువు వచ్చింది. కడుపునిండా తినడానికి అప్పట్లో జనం నోచుకోలేదు. ఈ ఏడాది మార్చిలోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయన్న రహస్యం చివరకు బయటకు వచ్చింది. ఉత్తరకొరియా దారుణ పరిస్థితుల్లో ఉన్న సంగతి యావత్‌ ప్రపంచానికి తెలిసినా, సాయం చేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదంటున్నారు నిపుణులు. తీవ్ర కరువు నుంచి నార్త్‌ కొరియా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వ్యవసాయరంగంలోనూ ఉత్తర కొరియా తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. రైతాంగ బాధలు కిమ్‌ పట్టించుకోకపోవడమే సమస్త అనర్థాలకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.దేశానికి అధ్యక్షుడు అయినా కిమ్‌ సహజంగా ఎవరితోనూ కలవరు. సామాన్య ప్రజల బాధలు ఏమాత్రం పట్టించుకోరు. అసలు కోటలాంటి ఇంటి నుంచి బయటకే రారు. అమావాస్యకో…పౌర్ణానికో కోట దాటి బయటకు వస్తాడు.
అలా వచ్చినా అది కూడా సైనికాధికారులతో భేటీ కావడానికే అయి ఉంటుంది. ముఖ్యంగా క్షిపణి ప్రయోగాలకు సంబంధించి చర్చలు జరపడానికే. పాలనకు సంబంధించిన ముచ్చట్లేవీ కిమ్‌ ఎవరితోనూ మాట్లాడడు. ఆయన దగ్గర దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ ప్రస్తావించారు.ధైర్యం చేసి అలా ఎవరైనా ప్రస్తావిస్తే…కిమ్‌ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఏమైనా ఉత్తర కొరియాలో ఎన్నో సమస్యలుంటే, వాటన్నిటినీ పక్కనపెట్టి కిమ్‌ ఓ యుద్ధ పిపాసిలా ప్రవర్తిస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి.

  • ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌,
    సీనియర్‌ జర్నలిస్ట్‌,
    63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News