Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Tirumala: తిరుమల చరితామృతం - ఒక ఉద్గ్రంథం

Tirumala: తిరుమల చరితామృతం – ఒక ఉద్గ్రంథం

తిరుమల గురించి సమస్త జ్ఞానం ఆకళింపు చేసే గ్రంథం

విశ్రాంత ఐఎఎస్‌ అధికారి పివిఆర్కే ప్రసాద్‌ విరచిత గ్రంధం ‘తిరుమల చరితామృతం’ ఎన్నో విశేషాలను, మనకు తెలియని ఎంతో చరిత్రను కూలంకుషంగా మన ముందు పరుస్తుంది. ఇటువంటి గ్రంధాన్ని వెలువరించి నందుకు ఆ మహానుభావునికి అభినందనలు తెలుపాలి. శ్రీ ప్రసాద్‌ 1978-82 ప్రాంతంలో పూర్తి స్థాయిలో కార్య నిర్వహణాధికారిగా పనిచేసి, అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎన్నో అమూల్య సేవలు అందించారు. ఈ గ్రంథంలో మొత్తం 92 అంశాల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. తిరుమలలో స్వామివారి ఉనికి మూడవ శతాబ్దంలో బయట పడిందని ముందుగానే సెలవిచ్చారు రచయిత. ఆలయ నిర్మాణానికి ముందు శ్రీ వెంకటే శ్వర స్వామి ఆరు బయట చెట్టు క్రింద ఆటవికులచే పూజింపబడే వాడట! వసువనే నిషాదుని వంశపు రాజుకు ఈ విగ్రహం ఉనికి తెలిసిందట. కుమ్మరి భీముని ఆర్చా విధానం ప్రకారం ఆదిలో జానపదులు మట్టి మూకుళ్ళలో స్వామికి ఆరగింపు చేసేవారని, దానికి ప్రతీకగా ఈ నాటికీ తిరుమల ఆలయంలో ఓడు (పగిలిన కొత్త కుండ మూకుళ్లు) లో శ్రీనివాసునికి నైవేద్యం అర్పించడం ఒక ఆచారంగా మారింది. దీనిని ‘ఓడు’ నైవేద్యం అంటారు. అందుకే, ప్రతి రోజూ బంగారు పూలతో స్వామి వారికి పూజ చేసిన తొండ మాన్‌ చక్రవర్తికి కలగని మోక్ష పథం కురవరపు నంబి భీమ అనే ఆటవికుడికి కలగటానికి కారణం, స్వామి వారిని భీమ త్రికరణ శుద్ధిగా అర్పించిన విధం అని తెలుస్తుంది. అందుకే, స్వామి వారికీ నేటికీ ఓడు నైవేద్యాన్ని గర్భాలయంలో అర్చకులు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరునితో శివుడు తనను తోడుగా వుండటానికి అంగీకరించమని కోరగా, కొండకు దిగువగా, ఆగ్నేయంగా నివసించమని వరమిచ్చాడు. అదే ‘కపిల తీర్థం’గా భక్తుల పూజలు అందుకుంటున్నది. తొలి రోజుల్లో శ్రీ రామానుజుల వారు పాదాలతో తొక్కకుండా మోకాళ్ళపై పర్వతం ఎక్కారని ఈ గ్రంధం ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగానే, ఆళ్వారులను కొండపై కాకుండా తిరుపతిలో ప్రతిష్టింప చేసారు. తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు ఇద్దరూ విష్ణువులేనని, ఆ కాలంలో కొండ ఎక్కలేని భక్తులకు తిరుపతి గోవిందరాజులకు పూజలు చేసే అవకాశం ఉండేదని తెలుస్తోంది. అలాగే, ప్రసాద్‌ తిరుమల కార్యనిర్వహణ బాధ్యతలను నిర్వహించేప్పుడు తిరుమల కొండపై స్త్రీలు పూలు ధరించే విధానాన్ని నిషేధించారు. అలంకరణ అంతా ఆ స్వామికే అని ఆయన అభిప్రాయం కావొచ్చు. సంప్రదాయబద్ధంగా స్త్రీలు పూలు ధరించ రాదనటం ఎందుకో సహేతుకం కాదనిపించింది. శ్రీనివాసునికి జరిగే సేవలు అన్నింటికీ తీర్థం ఆకాశగంగ, పాపనాశనం వంటి తీర్థాల నుంచి తెచ్చే విధానం వివరించబడింది. అనంతాచార్యులు విసరగా శ్రీవారి చుబుకానికి తగిలిన గునపం ఇప్పటికీ తిరుమల ఆలయంలో మహా ద్వారం గడప కుడివైపున వేలాడదీసి ఉంటుంది అని తెలిపారు రచయిత. విజిలెన్స్‌ విధానం, మిరాశీ దారుల వ్యవస్థ గురించైతే కొన్ని పేజీల్లో సవివరంగా వివరించారు రచయిత. తిరుమల ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం గురించి కొంత పరిశోధన జరగవలసిన అవసరం ఉందని తెలిపిన రచయిత, ఆ పరిశోధన తామున్న కాలంలో చేసి వుంటే బాగుండేది అనిపించింది. తిరుమల ఆలయం విజయనగర రాజుల సామ్రాజ్యంలో దినదినాభివృద్ధి జరిగిన వైనాన్ని, శ్రీ కృష్ణ దేవరాయల వారు స్వామి వారికి అంతులేని బంగారం, ఇంకా అనేక స్థిరాస్థులను భూరీ విరాళంగా ప్రకటించిన విధానాన్ని రచయిత ‘తిరుమల చరితామృతం’లో సవివరంగా వివరించారు. అన్ని కోరిక లు తీర్చగల శక్తి శ్రీనివాసుడిదేనని, అన్నింటినీ ఇవ్వగల శ్రీనివాసుడు ఉండగా ఇంకొకరిని కొలిచే పని లేదని వివరిస్తూ రచయిత తిరుమలలో మరో దేవతకు స్థానం లేకపోవడానికి కారణాన్ని వివరించారు. అందుకే, లక్షీ సన్నిధి కూడా శ్రీనివాసుని వక్ష స్థలంలోనే ఉంటుంది. తిరుమల ఆలయంలో జరిగే అవకతవకలను మీడియా మరింతగా హైప్‌ చేసి భక్తులలో గందరగోళం సృష్టించిన తీరుపట్ల రచయిత తన ఆవేదనను వెలిబుచ్చారు. గడచిన కొన్ని శతాబ్దాలలో ఆలయం లోపల కట్టడాల్లో పలు మార్పులు జరిగినా, దేవస్థానం వారు వెయ్యి కాళ్ల మంటపాన్ని తొలగించేప్పుడు కొన్ని వర్గాల నుంచి విమర్శలు తలెత్తాయన్న విధానాన్ని ఈ గ్రంథంలో తెలుసుకోవచ్చు. ఎన్నో శతాబ్దాల క్రితం ఆలయంలో తమిళ ప్రబంధ పారాయణం జరగటం వలన, తెలుగులో కూడా శ్రీనివాస సంకీర్తనలు తిరుమల ఆలయంలో పాడే అవకాశం కల్పించాలని ఆ నాటి రాజులపై ఒత్తిడి వచ్చింది. అదే కాలంలో తాళ్ళపాక అన్నమాచార్యులు వారు తిరుమల కొండకు వచ్చి తన సంకీర్తనలను ఆలపించడం, వాటికి బహు ప్రాచుర్యం కలగటం జరిగిందన్న విషయం తెలుస్తోంది. అలాగే, శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన విగ్రహం వలె లేదని, ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుంచి వుందన్న విషయం గ్రహించాలని, తన పూజా విధానము వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు, అందుకే, ప్రాచీన కాలం నుండి ఈ నాటి వరకూ వైఖానస పూజా విధానమే కొనసాగుతున్నట్లు తెలిపారు రచయిత ఈ గ్రంధం ద్వారా. స్వామి వారికి వేకువ జామున జరిపే సుప్రభాత సేవను విశ్వరూప సేవ అంటారని, ఆ సేవ జరిగే విధానాన్ని వివరించడమే కాకుండా, ఆ సమయంలో భక్తులను బంగారు వాకిలి ముందు నిలబెట్టి, ఆ వాకిలికి తెర వేసిన సమయంలో, గర్భాలయంలో జరిగే తంతును అద్భుతంగా రచయిత వివరించిన తీరు అభినందనీయం. ఇప్పుడు గానం చేస్తున్న సుప్రభాతం రచించిన ’ ప్రతివాది భయంకర అన్నన్‌ ’ అనే ఆయన దీనిని 14 వ శతాబ్దంలో గానీ, 15 వ శతాబ్దంలో మొదట్లో గానీ రచించినట్లు ఈ గ్రంధం ద్వారా తెలుస్తోంది. అలా, సుప్రభాత గానంతో కొంత కాలం జరిగాక, 16 వ శతాబ్దంలో అన్నమయ్య కీర్తనలు కూడా తెలుగులో పాడే సంప్రదాయం ప్రవేశపెట్టబడినాక, ఆ పద్ధతే ఇప్పటికీ కొనసాగుతోందని తెలుసుకోవచ్చు. సుప్రభాతం అనంతరం వివిధ రకాల సేవలు, దర్శనాలు జరిగాక, స్వామి వారికి జరిగే ఏకాంత, శయన సేవల తర్వాత నిద్రపుచ్చే విధానాన్ని సాహితీ భాషలో వివరించారు రచయిత. మూలమూర్తికి వారంలో శుక్రవారం మాత్రమే అభిషేకం జరుగుతుందనీ, పునుగు పిల్లి విసర్జించే పునుగుతో శ్రీవారి విగ్రహానికి అభిషేకం జరుగుతుందని తెలుస్తోంది. ఆ పునుగు నూనెను వేరుచేసే విధానం గురించి వివరించడమే కాకుండా, అభిషేకంలో ఏయే పదార్థాలు, ఏయే కొలతలతో వాడే విధానం ఈ గ్రంధం చదివితే అవగతం అవుతుంది. శ్రీవారి వస్త్రధారణ గురించి, ఆ వస్త్ర సమర్పణలకు వచ్చే ఆదాయం గురించి కూడా వివరించబడింది. విచిత్ర మేమిటంటే, 15 వ శతాబ్ద ప్రాంతంలో శ్రీనివాసునికి నాట్య సానులు హారతులిచ్చి, నాట్యం చేస్తేనే గానీ స్వామి వారి ఉత్సవ మూర్తులు ఊరేగింపుకు బయటకు వచ్చేవి కావన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలిసింది. ఏది ఏమైనా, విజయ నగర రాజుల కాలంలో ఆలయ చరిత్ర ఒక స్వర్ణ యుగంలా భాసిల్లింది అని గర్వంగా తెలిపారు రచయిత. వైష్ణవ మతానికి ప్రాచుర్యం కలగటం, పలు వెంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు జరగటం, పల్లెల్లోకి సైతం శ్రీ వైష్ణవం చొచ్చుకు పోవటం వంటివి విజయ నగర రాజుల కాలంలోనే జరిగాయని తెలుస్తోంది. దేవాదాయ భూములను, భవనాలను అక్రమంగా ఆక్రమించి, స్వాహా చేసిన స్వార్థ శక్తుల కుతంత్రాలను కూడా బాధతో రచయిత తెలిపారు. ఆలయ పాలనా వ్యవస్థ రకరకాలుగా ఎలా రూపాంతరం చెందిందో కూడా సోదాహరణంగా వివరించిన విధానం విజ్ఞానదాయకంగా ఉంది. ఆ కాలంలో దాదాపు 30 రకాల ప్రసాదాలు స్వామి వారికి వుండేవని, వాటికి చాలా వరకు తమిళ పేర్లే వుండేవని, ఈ నైవేద్యాల ద్వారా రిస్క్‌ లేని భక్తి వ్యాపారం జరిగేదని, తిరుమల ప్రసాదాల చరిత్రను ఎంతెంతగానో వివరించారు రచయిత. విజయ నగర రాజుల కాలంలో, అంతకు ముందు కొండ మీద స్థలాల క్రయ విక్రయాలు జరిగేవంటే ఆశ్చర్యం కలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంల కార్యనిర్వహణా అధికారులు అందరికీ 570 సం.ల క్రితం నాటి సాళువ నరసింహ రాయులే ఇప్పటికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారట! భక్తుల అవసరాలు, వసతి సదుపాయాలు, అధికారుల బాధ్యతలు, వీటన్నింటికీ బీజం వేసింది ఆ మహానుభావుడేనని రచయిత గర్వంగా తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలు పలు సందర్భాలలో శ్రీనివాసునికి సమర్పించిన, వేలాది సంఖ్య గల వరహాలు, కేజీల కొలది బంగారం వివరాలు రచయిత సోదాహరణంగా వివరిస్తోంటే అబ్బురమనిపించింది. అయితే, రాయల వారు సమర్పించిన సంపద ఇంకా స్వామివారి లెక్కలో ఉందా అనేది అనుమానమే! ఈ రోజు తిరుమల ప్రసాదంగా భావించే లడ్డు ఆ రోజుల్లో లేదట! 15 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకూ తిరుమల ప్రసాదం అంటే వడ ప్రసాదం మాత్రమేనట! ఆ స్థానాన్ని ఇప్పుడు తిరుపతి లడ్డు తీసుకుంది. దాదాపు 3000 రాగి రేకుల్లో 30 వేలకు పైగా స్వామి వారి కీర్తనలు అన్నమయ్య రాశారని, అవన్నీ ఇప్పుడు వున్నాయనడం ప్రశ్నార్థకమేనని చెప్పారు రచయిత. అలాగే, సాలీలు పద్మావతి అమ్మవారి వంశీకులని, అందువల్లనే, వారు ‘పద్మశాలీలు’గా పరిగణింపబడుతున్నారని తెలిపారు రచయిత. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కల్యాణోత్సవం ప్రాచీన కాలంలో లేదట. ప్రత్యేకం గా, స్వామి వారి వివాహోత్సవాన్ని మొదటిసారిగా 1546, జూలై, 17 నాడు తాళ్ళపాక పెద తిరుమల అయ్య గారు మొదలు పెట్టినట్టు శాసనాల ద్వారా తెలుస్తోందట. ఎంత నాస్తికుడు కూడా తిట్టలేని బాషలో కూర్మనాథ కవి అనే భక్తుడు దేవుడిని విమర్శించిన తీరు కొన్ని పేజీల్లో నిక్షిప్తం చేశారు రచయిత. తురుష్కుల దాడి నుంచి ఆలయాలను కాపాడలేక పోవడం వలన స్వామి వారిని పరుష పదజాలంతో నిందించిన తీరు గగుర్పాటు కలిగే విధంగా వివరించారు రచయిత. గోల్కొండ నవాబులు తిరుపతి కేంద్రంగా 1688 వరకు పాలించారట. దేశంలో అనేక ఆలయాలను ధ్వంసం చేసిన ముస్లిం పాలకుల తిరు మల ఆలయం మీద ఒక్కసారిగా దాడి చేయక పోవడం గురించి కూడా వివరించారు రచయిత. గతంలో తిరుమల కొండ ఎక్కాలంటే కూడా పన్ను వసూలు చేసేవారట! స్వామివారి అనుగ్రహానికి నోచుకున్న ‘హాధీరాంజీ బాబా’ సమాధి పాపనాశనం వెళ్ళేదారిలో వుందని వివరణ ఇచ్చారు రచయిత. తరిగొండ వెంగమాంబ స్వామివారి అనుగ్రహం పొందిన తీరు ఎంతో భక్తి పారవశ్యంతో రచించారు రచయిత. పుట్టుగుడ్డి బాలుడైన శ్రీనివాస దాసుడు 1880 ప్రాంతంలో స్వామి వారిని సేవించుకున్న విధానం గురించి రచయిత వర్ణించిన తీరు భక్తికి చూపు ప్రామాణికం కాదని తెలుపుతోంది. స్వామి వారి నిత్యాన్నదాన పథకం ప్రవేశ పెట్టిన తీరు, అనంతపురంకు చెందిన నూనె వ్యాపారి ఎల్‌.వి.రామయ్య తొలి విరాళంగా 16.50 లక్షలు ఇచ్చిన విధానం పలువురు దాతలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రతి ఏటా మూడు లక్షల కిలోలకు పైగా, భక్తులు అపరిమిత భక్తితో తల నీలాలు సమర్పించే విధానం, మహిళా క్షురకులను నియమించిన విధానం గురించి సోదాహరణంగా వివరించారు రచయిత. 2010లోనే జుత్తు అమ్మడం ద్వారా వచ్చిన ఆదా యం 150 కోట్లకు పైగానే ఉన్నదంటే ఆశ్చర్యం కలుగు తుంది. మరి, ఇప్పుడు ఆ మొత్తం ఎంత ఉంటుందో ఊహకు అందదు. 2011, జూన్‌,4 ఒక్కరోజునే 57,792 మంది తల నీలాలు ఇచ్చి రికార్డ్‌ సృష్టించారట. మరి, ఈ రికార్డ్‌ పదిలంగా ఉందో లేదో చూడాలి. చివరి పేజీల్లో, తిరుమలేశుని ఆభరణాలు భద్రమేనా? అంటూ కొన్ని పేజీలు రాశారు రచయిత. పత్రికల్లో, టెలివిజన్‌ లల్లో పుంఖాను పుంఖాలుగా వచ్చిన వార్తలు పూర్తిగా నిజం కావంటారు. అయితే, విజయ నగర రాజుల కాలంలో ఆలయానికి దానాలుగా వచ్చిన నగలు (శాసనాల ప్రకారం రికార్డ్‌ అయిన) 1933కు పూర్వమే మాయమై వుండాలని అనుమానం వ్యక్తంచేశారు రచయిత. ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్న అవకతవకలు భూతద్దంలో పెట్టి చూడవద్దంటారు రచయిత. ఇక, లోకం వాక్కుని కూడా ఇందులో ప్రస్తావించారు రచయిత. శ్రీనివాసుడు ధనికుల దేవుడా! అని, చాలామంది కొత్త దంపతులు హనీమూన్‌గా తిరుమలను ఎన్నుకోవడం అపచారం అని.. ఇలా చాలా విషయాలను సృజించారు. ఇక, శరణాగతి – ముగింపు అంటూ తన ఆత్మ సంఘర్షణను విశ్లేషించారు ప్రసాద్‌. కొసమెరుపు ఏమిటంటే, ప్రసాద్‌ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహనాధికారిగా ఆయన చవిచూసిన వింత అనుభవాలు, దేవస్థాన అభివృద్ధికై, శ్రీవారి సేవకై, ఆయన అహర్నిశం తమ మేధాశక్తిని ధారపోసిన విధానం చదువుతుంటే, ఆయన ఎంత అదృష్టవంతుడో కదా అనిపించింది. ఎంత భాగ్యశీలి కాకపోతే, ఆయనకు ఇంత గొప్ప సమున్నత స్థానం లభిస్తుందని! తనను తాను శ్రీనివాసుని దాసునిగా ప్రకటించుకున్న ప్రసాద్‌ ఈ ఉద్గ్రందాన్ని కలియుగ దైవం శ్రీ శ్రీనివాసునికి భక్తితో అంకితమివ్వడం సముచితం. అంతా, ఆ సర్వాంతర్యామిదే కదా! ఈ తిరుమల చరితామృతం చదువుతుంటే తిరుమల గురించి సమస్త జ్ఞానం ఆకళింపు అవుతుంది. అంత ఉదాత్తమం అయిన గ్రంధం ఇది! ఇది పుస్తకం కాదు గ్రంథమే! సుమారు 550 పై చిలుకు పేజీలు కలిగిన ఒక అజరామర గ్రంధం ఇది! శ్రీ ప్రసాద్‌ సునిశిత పరిశీలనకు, విషయ సేకరణకు ఇదొక కొలమానం నిస్సందేహంగా!
పంతంగి శ్రీనివాస రావు

  • 9182203351
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News