Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Tirumala a political weapon: ‘తిరుమల’ అస్త్రం పని చేస్తుందా?

Tirumala a political weapon: ‘తిరుమల’ అస్త్రం పని చేస్తుందా?

రాజకీయ గుళ్లు..

తిరుమలలో ఒక్కసారిగా బయటపడిన లడ్డూల కల్తీ వ్యవహారాన్ని గమనించినవారికి రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు కళ్లకు కడతాయి. సి-ఓటర్‌ అనే సంస్థ ఈ అవినీతి మీద దేశ వ్యాప్తంగా ఒక సర్వేను నిర్వహించినప్పుడు ఈ అవినీతి కార్యకలాపానికి సంబంధించి కొన్ని సాఫ ల్యాలు, కొన్ని వైఫల్యాలు కూడా కనిపించాయి. తిరుమలలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూల్లో జంతు వుల కొవ్వు నుంచి తీసిన నూనెలను కలిపారా, లేదా అన్నది వేరే విషయం. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం కూడా వేరే విషయం. అయితే, పరస్పర విరుద్ధమైన విషయాలకు వస్తే మాత్రం రెండు ప్రధాన విషయాలు ఎవరినైనా ఆలోచింపజేస్తాయి. హిందువుల విశ్వాసాలు, నమ్మకాలు, మనోభావాలను దెబ్బ తీయడానికే లడ్డూలను కల్తీ చేయడం జరిగిందనేది ఇందులో మొదటిది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులకు శ్రీవారి తర్వాత అత్యంత ప్రధానమైనది లడ్డూ ప్రసాదమే. సర్వే చేసినప్పుడు ప్రతి పది మందిలో ఆరు గురు లడ్డూల కల్తీ హిందువుల విశ్మాసాన్ని దెబ్బతీయడానికేనన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సి-ఓటర్‌ సర్వేలో ప్రత్యేకంగా ఇండీ కూటమి, ఎన్‌.డి.ఏ కూటమికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు. హిందూ దేవాలయాల్లో ఇటువంటి అరాచకాలు జరగకుండా నివారించడానికి వీటిని ఇతర మతాల మాదిరిగా ప్రజలకే అప్పగించడం మంచిదా అన్నప్పుడు మాత్రం పదిమందిలో కేవలం నలుగురు మాత్రమే సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆలయాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు, ఈ నలుగురు ఆలయాల ధర్మ కర్తల మండలిలో లేదా నిర్వహణ మండలిలో హిందూయేతరులను సభ్యులుగా చేర్చకూడదని కూడా తెగేసి చెప్పారు. ఈ సర్వేలో వ్యక్తమైన అనేక అభిప్రాయాలను బట్టి చూస్తే దేశంలో హిందుత్వ అనేది ఒక రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. మరో నగ్న సత్యం కూడా ఈ సర్వేలో బయటపడింది. దేశంలో ముస్లింల మాదిరిగా హిందువులను సంఘటితం చేయడం కూడా కష్టసాధ్యమైన వ్యవహారం. వక్ఫ్‌ బోర్డులో సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినప్పుడు ఈ సవరణలను తుంగలో తొక్కాలంటూ లక్షలాది మంది ముస్లింలు మద్దతు కూడగట్టడం, సంఘటితంగా వీటిని ప్రతిఘటించడాన్ని గమనిస్తే హిందుత్వ పరిస్థితి అర్థమైపోతుంది. దేశ ఎన్నికల చరిత్రను తిరగేసి చూసే పక్షంలో హిందుత్వం కంటే ఇస్లామిజం అనేది రాజకీయంగా లాభదాయకమైన వ్యవహారంగా కనిపిస్తుంది. ఏడున్నర దశాబ్దాల నుంచి ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.
హిందుత్వకు పరిమితులు
అంత మాత్రాన దేశంలో హిందుత్వ రాజకీయం సాధ్యం కాదని, అది విజయవంతం అయ్యే అవ కాశం లేదని భావించడానికి లేదు. లడ్డూల కల్తీ విషయంలో హిందువులందరిలో ఆగ్రవేశాలు తలెత్తిన విషయం నిజమే. అయితే, ఈ ఆగ్రవేశాలను సంఘటితం, సమన్వయం, సద్వినియోగం చేయడంలో రాజకీయ వర్గాలు ఘోరంగా విఫలం అయ్యాయి. గత జనవరిలో అయోధ్యలో రామా లయాన్ని ప్రారంభించిన తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాలు హిందుత్వవాదులకు ఉపయోగపడిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం హిందువుల్లో అత్యధిక సంఖ్యాకు లకు సామాజిక, మతపరమైన విషయాల కంటే ఆర్థిక విషయాలే అత్యంత ప్రధానమని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. అయోధ్య ఆలయం ఉన్న ఫైజాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలోనే కాదు, యావత్‌ ఉత్తర ప్రదేశ్‌లో కూడా హిందుత్వ పార్టీ అయిన బీజేపీ 99 స్థానాలకు తగ్గిపోయింది. మొత్తం మీద హిందుత్వకు అవకాశాలతో పాటు, పరిమితులు కూడా బీజేపీ ఉత్థాన పతనాలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
ఇక 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రారంభం కావడానికి ముందు నుంచీ దేశంలో అంతర్లీనంగా హిందుత్వ కొనసాగుతూనే ఉంది. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు హిందుత్వ ఒక తోక సిద్ధాంతంగానే ఉంటూ వస్తోంది. అప్పట్లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో జన సంఘ్‌ ఏనాడూ సీట్లు సంపాదించిన దాఖలాలు లేవు. నిజానికి, ముస్లింలు, క్రైస్తవులు తదితర అల్పసంఖ్యాక వర్గాల పట్ల ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని అనుసరిస్తున్నా యనే దుగ్ధ హిందుత్వవాదుల్లో ప్రబలంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలను అతిగా బుజ్జగిస్తోందనే అభిప్రాయం కూడా ఉంది.
ఇదంతా బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ హిందుత్వ పార్టీలకు హిందువులు ఓటు వేయడం మాత్రం జరగడం లేదు. అయితే, 1980ల నుంచి ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. షాబానో కేసు బీజేపీ చరిత్రను మలుపు తిప్పిందని ఇప్పటికీ పరిశోధకులు, చరిత్రకారులు చెబుతుంటారు. అదే రామమందిర నిర్మాణానికి కూడా పునాది వేసిందని భావిస్తుంటారు. సోషల్‌ మీడియా విస్తరించడంతో హిందుత్వ భావనలకు కూడా ఊతం లభించింది. 1984 నుంచి 2024 వరకు క్రమంగా ఎదుగుతూ వచ్చిన బీజేపీకి 2024 లోక్‌ సభ ఎన్నికలు హిందుత్వ పరిమితులను చెప్పకనే చెప్పాయి. రామ మందిర నిర్మాణం మాత్రం హిందుత్వకు ఉన్న అవకాశాలను విస్తరించాయి.
ప్రతికూల పవనాలు
ఇంతకూ ఈ పరిణామాలకు, లడ్డూ అక్రమాలకు ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్న ఉదయించవచ్చు. ఇది ఆశించినంతగా బయటికి కనిపించకపోవచ్చు. దీని మీద వ్యక్తమైన ఆగ్రవేశాలు భవి ష్యత్తులో తప్పకుండా హిందుత్వ మీద ఆధారపడిన పార్టీలకు ఉపయోగం కలిగించే అవకాశం ఉంది. సి-ఓటర్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం ఇది కొద్దిగా కష్టం కావచ్చు కానీ, అసాధ్యమైన వ్యవహారం మాత్రం కాదు. సగానికి పైగా ప్రజలు లడ్డూ వ్యవహారాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే, హిందువులు మనస్తాపం చెందిన విషయం నిజమే కానీ, ఇది రాజకీయంగా తేడా తీసుకు వచ్చే అవకాశం లేదు. ఇతర మతాలకు భిన్నంగా హిందువుల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. లడ్డూ కల్తీ వ్యవహారం వల్ల ఎక్కువగా స్పందించింది దక్షిణాది రాష్ట్రాలే తప్ప ఉత్తరాది రాష్ట్రాలు కావు. నిజానికి హిందుత్వ విషయంలో బీజేపీ వంటి పార్టీలు లబ్ధి పొందుతున్నది ఉత్తరాదిలోనే తప్ప దక్షిణాదిలో కాదు. హిందుత్వ ఆధారిత రాజకీయాలకు ఆంధ్ర ప్రదేశ్‌ లో అవకాశం చాలా తక్కువ. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాత్రమే బీజేపీ కొద్దో గొప్పో లభ్ధిపొందడం జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌ విభజనతో బీజేపీ తెలంగాణలో కొద్దిగా బలం పుంజుకోవడం ప్రారంభించింది.
విచిత్రంగా, తిరుమలలో ఇంత పెద్ద లడ్డూ కుంభకోణం జరిగినప్పటికీ బీజేపీ ఆశించినంతగా సద్వినియోగం చేసుకో లేకపోయింది. దాన్ని జనసేన అధిపతి, ఉపముఖ్యమంత్రి అయిన పవన్‌ కల్యాణ్‌ అందిపుచ్చుకున్నారు. గత ముఖ్య మంత్రి, వైసీపీ అధిపతి అయిన జగన్మోహన్‌ రెడ్డి, ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం జరుగుతోందని బట్టబయలు కావడం కూడా హిందుత్వకు అవకాశాలను పెంచింది కానీ, అది కొద్దో గొప్పో పవన్‌ కల్యాణ్‌ కు మాత్రమే ఉప యోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది కంటే 30 ఏళ్లు ఆలస్యంగా బీజేపీ దక్షిణాదిన అడుగుపెడుతున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో చాప కింద నీరులా మత మార్పిళ్లు చేసుకుంటుండడం అనేది ఎవరికీ తెలియని వ్యవహారం కాదు. దీని ప్రభావం కూడా ఇక్కడి హిందుత్వవాదుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అయోధ్య మందిర నిర్మాణం ప్రభావం పెద్దగా దక్షిణాది మీద లేనట్టే, లడ్డూ వ్యవహారం పెద్దగా ఉత్తరాది మీద కనిపించడం లేదు. రాజకీయాలన్నీ స్థానిక సమస్యలకే పరిమితం అవుతు న్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలే ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సి-ఓటర్‌ సర్వే ప్రకారం ఉత్తరాదిన మున్ముందు హిందుత్వ రాజకీయాలు సైతం అయోధ్యను దాటి ఆర్థిక విషయాల వైపే మొగ్గు చూపుతుండగా, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే హిందుత్వ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా మున్ముందు హిందుత్వ విషయంలో మరింతగా దూకుడుగా వ్యవహరించి బీజేపీని మించిపోయే అవకాశం ఉంది.

  • ఎస్‌. కేశవరెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News