Friday, November 8, 2024
Homeఓపన్ పేజ్Tirumala Laddoo controversy: లడ్డూకు మతం రంగు పులమొద్దు

Tirumala Laddoo controversy: లడ్డూకు మతం రంగు పులమొద్దు

రాజకీయ అంశంగా..

తిరుమలలో పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు న్యాయ స్థానాన్ని రాజకీయ రణరంగంగా మార్చవద్దని పిటిషనర్లను తీవ్రంగా హెచ్చరించింది. అయితే, ఈ ప్రసాదానికి ఉన్న ఖ్యాతి, పవిత్రతదృష్ట్యా న్యాయస్థానం ఒక రణరంగంగా మారడానికే ఎక్కువగా అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ) డైరెక్టర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించడం ద్వారా న్యాయ స్థానం ఈ లడ్డూ కేసును నిష్పాక్షికంగా, జవాబు దారీతనంతో దర్యాప్తు చేయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇద్దరు సి.బి.ఐ అధికారులు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారులు, ఒక ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిపుణుడిని ఈ సిట్‌ బృందంలో నియమించడం జరిగింది. అయితే, ఈ సిట్‌ బృందం ఎంతవరకూ నిష్పక్షపాతంగా, తటస్థంగా వ్యవహరిస్తుందనేది సందేహాస్పదంగా మారింది. అటు సి.బి.ఐ, ఇటు ఆంధ్ర ప్రదేశ్‌ పోలీసులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి చేతుల్లో ఉన్నందువల్ల ఈ సిట్‌ బృందం నిష్పాక్షికంగా కొనసాగే అవకాశం లేదని ప్రతిపక్ష వై.ఎస్‌.ఆర్‌.సి.పి ఇప్పటికే ఆరోపణలు సాగిస్తోంది.
వై.ఎస్‌.ఆర్‌.సి.పి అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి క్రైస్తవుడైనందు వల్ల ఆయన తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా ‘తనకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు’ ప్రమాణ పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యురాలు అయిన దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయిన కె. పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేయడం వల్ల ఇప్పటికే ఈ లడ్డూ వ్యవహారం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మతం రంగు పులుముకుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో సెప్టెంబర్‌ నెలలో జగన్మోహన్‌ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్‌ రెడ్డి హిందువేతర వ్యక్తి అయినందువల్లే తిరుమలలో అన్య మతస్థులకు ఉద్యోగాలివ్వడం, కీలక బాధ్యతలు అప్పగించడం, చివరికి లడ్డూల తయారీకి నాసిరకం నెయ్యిని, కల్తీ నెయ్యిని ఉపయోగిస్తున్నా పట్టించుకోకపోవడం జరిగిందని బీజేపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తిరుమల క్షేత్రం మతానికి సంబంధించిన సంస్థ అయినందు వల్ల లడ్డూ వ్యవహారం సహజంగానే మతం రంగు పులుముకుంటుందని కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు.
వెనుకటి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో లడ్డూలలో జంతువుల కొవ్వును కలపడం జరిగిందని, ఇందుకు జగన్మోహన్‌ రెడ్డి అవకాశం ఇచ్చారని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆరోపించడంతో ఈ వ్యవహారం మొదటిసారిగా వెలుగు చూసింది. పరమ పవిత్ర ప్రసాదాలైన లడ్డూలలో ఎద్దు, పంది, చేపల కొవ్వు కలపడంలో గత ప్రభుత్వ ఆంతర్య మేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ లడ్డూలను తయారు చేసే నెయ్యిని పరీక్షల కోసం గుజరాత్‌ ఆనంద్‌లోని నేషనల్‌ డెయిరీ డెవలప్మెమెంట్‌ కార్పొరేషన్‌ కు చెందిన ప్రయోగశాలకు పంపడం జరిగింది. లడ్డూలను తయారు చేసే నెయ్యిలో జంతు మాంసం కలిసి ఉన్న మాట నిజమేనని ఆ ప్రయోగశాల నివేదిక పంపించింది. అక్రమంగా నిధులు స్వాహా చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం నాణ్యతలేని నెయ్యిని కొనుగోలు చేసిందని, ఫలితంగా లడ్డూల నాణ్యత తగ్గడంతో పాటు లడ్డూల పవిత్రత, ఆలయ పవిత్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని చంద్రబాబు ఆరోపించారు.
కళ్ల ముందు బహిరంగంగా కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నా జగ న్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చూసీ చూడకుండా వదిలేసిందని జనసేన పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో హిందువునని చెప్పుకుని తిరుమల ఆలయంలో ప్రమాణ పత్రం లేకుండా ప్రవేశించిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు తాను క్రైస్తవుడినని బయటపడినం దువల్ల ఇక తప్పనిసరిగా ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, కాశ్మీర్‌ నాయకుడు ఫారూఖ్‌ అబ్దుల్లా, పలువురు బాలీవు్‌డ నటులు ప్రమాణ పత్రాలు సమర్పించే తిరుమల ఆలయంలో ప్రవేశించిన సందర్భాలను వారు గుర్తు చేశారు. తమిళ నాడుకు చెందిన ఏ.ఆర్‌. ఫుడ్స్‌ అనే సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందా, లేదా అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా ఆరా తీయాల్పిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి సరఫరా అయిన నెయ్యిని జూలై 6, 13 తేదీల్లో పరీక్షించి కల్తీ జరిగినట్టు నిర్ధారించడం జరిగింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కల్తీ వ్యవహారానికి మతం రంగు పులమకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి, నిజాలను నిగ్గు తేల్చాలని జగన్మోహన్‌ పార్టీ గట్టిగా డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News