‘సమయం’-బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ
రోజూ లక్ష మందికి పైగా భక్తులు వచ్చే తిరుమల-తిరుపతిలో కేవలం కొన్ని వేల మందిని నియంత్రించగలిగే పరిస్థితి లేదా? పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అసలు అంతమంది భక్తులు ఉచిత టోకెన్ల కోసం వస్తారని ముందే తెలిసినప్పుడు టీటీడీ యంత్రాంగం ఎందుకు చేష్టలుడిగి కూర్చుంది? ఆ టోకెన్లు ఇవ్వడానికి ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేశారో తెలియజేసే సమాచార వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఘటన జరిగిన తర్వాత భక్తులకు క్షమాపణ చెప్పడానికి ఒక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తప్ప మరెవ్వరికీ నోరు పెగలలేదెందుకు? ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడైన వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతిలో ఈపాటి ఏర్పాట్లు చేసే సమర్థత కూడా యంత్రాంగానికి లేదా? టీటీడీ ఛైర్మన్‌కు, ఈఓకు మధ్య ఇంత తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్న విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చేదెవరు? ఈ పాపం ఎవరిది తిరుమలేశా?
వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన రోజు
ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి.. వైష్ణవ భక్తులకు పరమ పవిత్రమైన రోజు. సాధారణంగానే అన్ని వైష్ణవాలయాల్లో ఆ రోజు స్వామివారి ఉత్తరద్వార దర్శనభాగ్యం కల్పిస్తారు. అందులోనూ పరమపవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువంటే భక్తులు సాష్టాంగపడిపోతారు. జీవితంలో ఒక్కసారైనా తిరుమలలో శ్రీ స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం ధనుర్మాస పుణ్యకాలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఆ తర్వాత కల్పించే ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. తమిళనాడు, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శన భాగ్యాన్ని లక్షా ఇరవై వేల మందికి కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ లక్షమందిలో తామూ ఒకరం కావాలన్న ఆతృతతో దాదాపు ఐదు లక్షల మంది వరకు తిరుపతి చేరుకున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి ఉచితంగా టోకెన్లు ఇస్తామని ప్రకటించడంతో బుధవారం మధ్యాహ్నానికే పెద్ద సంఖ్యలో భక్తులు అన్ని ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు మరో 48 మంది వరకు గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు.
క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీకి అస్సలు కొత్త కాదు కదా?
ప్రతిరోజూ లక్ష మందికి పైగా దర్శనం చేసుకునే తిరుమలలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కట్టుదిట్టంగా జరుగుతుంటుంది. ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో ఉన్నా కూడా వారికి నిరంతరం పాలు, అల్పాహారాలు, మంచినీళ్లు అందిస్తూ.. ఏ దశలోనూ ఎవరూ ఇబ్బంది పడకుండా చూడడంలో తిరుమల తిరుపతి దేవస్థానాల సిబ్బందికి మంచి పేరుంది. స్వామి దర్శనానికి ఒక్కోసారి ఏడెనిమిది గంటలకు పైగా సమయం పట్టినా నాకు తెలిసి భక్తులు ఎప్పుడూ సహనం కోల్పోలేదు, ఇలాంటి తొక్కిసలాటలు జరగలేదు. స్వయంగా నేనే గత మూడు దశాబ్దాల్లో చాలాసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నాను. నాకయితే ఎప్పుడూ ఇంతవరకూ తిరుమలలో తొక్కిసలాట అన్న మాటే వినిపించలేదు.
అందరూ దోషులే
కానీ ఈసారి ఇంత తీవ్రంగా తొక్కిసలాట జరగడానికి, ఆరుగురు భక్తులు తమ విలువైన ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులెవరు? ఆ మాటకొస్తే ఇందులో అందరూ దోషులే. ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు. టీటీడీ ఛైర్మన్-ఈవో మధ్య విభేదాలు చాలా తీవ్రంగా ఉన్న విషయం సాక్షాత్తు చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే బయటపడింది. ఇద్దరూ ఒకరినొకరు నువ్వంటే నువ్వు అనుకుంటూ తీవ్రంగా వాదులాడుకున్నారు. తాను ఛైర్మన్‌గా వచ్చినప్పటి నుంచి అస్సలు పట్టించుకోవడం లేదని, తనను చిన్నచూపు చూస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అంటే.. నీకన్నీ చెబుతూనే ఉన్నాం కదా అని ఈఓ శ్యామలరావు అన్నారట! వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి తనకేమీ చెప్పలేదని, తాను ఛైర్మన్‌గా ఉండి ఉపయోగం ఏంటని నాయుడు ప్రశ్నిస్తే.. శ్రీవాణి ట్రస్టు విషయంలో తనతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావంటూ.. దానివల్ల తమకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా అని శ్యామలరావు సమాధానమిచ్చారట!! చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. పరామర్శల అనంతరం టీటీడీ పరిపాలనా భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి అనిత హాజరయ్యారు. సరిగ్గా ఇంత మంది పెద్దలు పాల్గొన్న సమావేశంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి, ఈవో శ్యామల రావుకు మధ్య ఉన్న విభేదాలు కొట్టొచ్చినట్లు బయటపడ్డాయి. చివరకు చంద్రబాబు కల్పించుకుని ఇద్దరినీ మందలించాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన టీటీడీలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరి మధ్య తలెత్తిన ఇగో క్లాష్… ఆరు ప్రాణాలు పోవడానికి కారణమైందంటే ఇదంతా చూసిన తర్వాత నమ్మక తప్పడం లేదు.
తగినంత సమాచారం లేకనే
ఉత్తరద్వార దర్శనం కోసం ఉచిత టోకెన్లు ఇవ్వడానికి తిరుపతిలో 9 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే.. వీటి గురించి ఎక్కడా తగినంత సమాచారం ఇచ్చిన పాపాన పోలేదు. బుధవారం ఉదయానికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రైళ్లు, బస్సుల ద్వారా తిరుపతి చేరుకున్నారు. వాళ్లంతా ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించడంతో.. వాళ్లు భక్తులను ప్రధానంగా జీవకోన, శ్రీనివాసం, బైరాగిపట్టెడ.. ఈ మూడు కేంద్రాలకే తరలించారు. అక్కడైతే రద్దీ తక్కువ ఉంటుందంటూ అక్కడకు తీసుకెళ్లారు. కొంతమంది అలిపిరి కూడా వెళ్లారు. దాంతో.. ఈ నాలుగు కేంద్రాల్లోనే తొక్కిసలాటలు జరిగాయి.
సహనం కోల్పోవటానికి ప్రధాన కారణం ఇదే
బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్ స్కూల్ కేంద్రానికి బుధవారం ఉదయం 9గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కు గేట్లు తెరిచి, భక్తులందరినీ అందులోకి పంపారు. ఆ పార్కు ప్రధాన గేటు ముందు నుంచే టోకెన్లకు వెళ్లే క్యూలైన్ మొదలవుతుంది. దాంతో చాలామంది పార్కులోంచే తమను టోకెన్లకు పంపుతారని అనుకున్నారు. దాంతో పార్కులోకి జనం తాకిడి ఎక్కువైంది. దానికితోడు అక్కడంతా తడితడిగా ఉండడంతో కనీసం కూర్చునే అవకాశం కూడా దక్కలేదు. కొన్ని గంటల పాటు భక్తులు నిలబడాల్సి వచ్చింది. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు. అప్పటికే నిలబడి నిలబడి చాలామంది సహనం కోల్పోయారు. అంతలో ఒక మహిళకి కళ్లు తిరిగి పడిపోవడంతో.. ఆమెను బయటకు తీసుకొచ్చే క్రమంలో గేట్లు తీశారు. అది కూడా ప్రధాన గేటు తీసేశారు. దాంతో.. అప్పటి వరకు గేట్ల వద్ద చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్న భక్తుల్లో కొందరు టోకెన్లు ఇవ్వడం మొదలైందని భావించి గోవిందా.. గోవింద అనుకుంటూ ముందుకు దూకడంతో అందరూ ఒకరిని తోసుకుంటూ మరొకరు ముందుకొచ్చేశారు. పార్కులో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా లేచి పరుగులు తీశారు. అక్కడ నామమత్రపు సంఖ్యలోనే ఉన్న పోలీసులు వీళ్లను అదుపు చేయలేకపోయారు. దాంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
అసలు బుధవారం ఏం జరిగింది?
తిరుమల-తిరుపతి అంటే అత్యంత పవిత్రంగా భావిస్తారు. అక్కడకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వారిని నియంత్రించేందుకు తిరుపతి, తిరుమలలో కూడా పటిష్ఠమైన వ్యవస్థలు ఉన్నాయి. కానీ, అసలు బుధవారం జరిగిందేంటి? జగన్ చెబుతున్నట్లు చంద్రబాబు కుప్పం పర్యటన కోసం పోలీసులను అటువైపు తరలించారా? అసలు ఆయన పర్యటన ఎప్పటి వరకు సాగింది? ఆ తర్వాత పోలీసులు ఏం చేశారు? ఇవన్నీ కూడా ఎవరూ సమాధానం చెప్పని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
10 రోజులపాటు ఉత్తర ద్వార దర్శనమా?
అసలు వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఎన్నాళ్లు కల్పించాలనే విషయంలోనూ వివాదాలు ఉన్నాయి. ఒక్కరోజా, రెండు రోజులా, పది రోజులా అనే విషయం పండితులే తేల్చాలి. మామూలుగా అయితే ఏకాదశి ఒక్క రోజు మాత్రమే ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. అయితే, అప్పటి వరకు క్యూలో వేచి ఉన్నవారు నిరాశ చెందకూడదని మరొక్క రోజుకు మొదట్లో పెంచారు. అది కాస్తా గత ప్రభుత్వ హయాంలో.. అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది రోజులకు పెరిగింది. ఈసారి 1.20 లక్షల మందికి ఉచితంగా ఉత్తరద్వార దర్శనం అన్నారు. దాంతో ఆ టోకెన్ల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు 5 లక్షల మంది వరకు వచ్చినట్లు ఒక అంచనా. అంతమంది వస్తారన్న విషయం ముందుగానే పోలీసులకు కూడా తెలుస్తుంది. ఎన్ని రైళ్లు, బస్సుల్లో ఎంతమంది వస్తున్నారో తెలుసుకోవాలి. వారిని సరిగా నియంత్రించేందుకు తగిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ తిరుపతిలో క్యూలైన్ల దగ్గర వీడియోలు చూస్తుంటే.. బారికేడ్ల అవతలి నుంచి లోపలికి ప్రజలను పంపడానికి అక్కడున్న సిబ్బంది ఏకంగా తోసిపారేస్తున్నారు. అలా తోసేయడంతో సుమారు 50 ఏళ్ల పైబడిన ఒక వ్యక్తి కింద పడిపోయారు. కొంతమంది ఆయనను తొక్కుకుంటూ వెళ్లిపోతుంటే ఎలాగోలా లేచారు. తనను తోసిపారేసిన వ్యక్తిని ప్రశ్నిద్దామని ఆయన చాలాసేపు అక్కడే ఉండి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అసలు తిరుపతిలో, తిరుమలలో ఎందుకిలా చేస్తున్నారు? క్రౌడ్ మేనేజ్‌మెంట్ పద్ధతులన్నింటినీ టీటీడీ సిబ్బంది పూర్తిగా మర్చిపోయారా?
పవన్ కే తొలి అభినందనలు
తిరుపతి ఘటన తర్వాత ఎవరెలా స్పందించారన్న విషయంలో అందరికంటే ముందుగా అభినందించాల్సింది మాత్రం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌నే. తప్పు జరిగింది.. ఆ విషయం ఒప్పుకొంటున్నాను. శ్రీవారి భక్తులకు, గాయపడిన వారికి, మరణించినవారి కుటుంబసభ్యులకు, బంధువులకు అందరికీ రెండు చేతులూ జోడించి క్షమాపణ వేడుకుంటున్నాను అని ఆయన నిర్భయంగా చెప్పారు. దాంతోపాటు.. టీటీడీ ఈవో, ఛైర్మన్ కూడా ఇంటింటికీ వెళ్లి మరీ క్షమాపణలు చెప్పాలని ఆయన సూచించారు. అంత ధైర్యం అక్కడున్న నాయకులు గానీ, అధికారులు గానీ, సిబ్బంది గానీ ఏ ఒక్కరూ చేయలేకపోయారు.
జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు
అసలు వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార దర్శనం అనేది జీవితంలో ఒక్కసారి చేసుకుంటే చాలన్నది పురాణాల్లో చెబుతున్న విషయం. కానీ, ఇటీవలి కాలంలో పాపభీతి పెరిగిపోవడంతో చాలామంది ప్రతి ఏడాదీ తాము వెళ్లి ఉత్తరద్వార దర్శనం తిరుమలలోనే చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. దీన్ని కూడా నియంత్రించాలి. ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డు ఆధారంగానే ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ టోకెన్లు, టికెట్లు ఇస్తున్నారు. అందువల్ల ఈ వైకుంఠ ద్వార దర్శనానికి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చేలా ఆధార్ లింకుతో పరిమితి విధించాలి. అలాగే, అసలు క్యూలైన్లలో టోకెన్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా తొలగించి.. ఎవరైనా సరే ఫోన్ల ద్వారా గానీ, కియోస్క్‌ల సాయంతో గానీ, లేదా ఆన్‌లైన్‌లో గానీ టోకెన్లు తీసుకునే విధానం తీసుకురావాలి. శంషాబాద్ విమానాశ్రయంలో ఒకప్పుడు లగేజి చెకిన్ చేయాలంటే ఉదయాన్నే పెద్ద క్యూలైన్ ఉండేది. దాంతో విమానం ఎక్కడ వెళ్లిపోతుందో అని ఆందోళన చెందేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా లగేజి చెకిన్ కోసం కూడా కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిలోనే బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు, అలాగే లగేజి స్లిప్ కూడా తీసుకోవచ్చు. దాన్ని మన సూట్‌కేసుకు అతికించి, బరువు చూసేందుకు ఒక ఉద్యోగి ఉంటారు. అది చాలా సులభమైన పద్ధతి. అలాంటి కియోస్క్‌లను తిరుపతిలో ఉన్న వివిధ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో ఏర్పాటు చేస్తే.. ఇలా ఒకేచోట ఎక్కువమంది గుమిగూడాల్సిన అవసరం ఉండదు, భక్తులు తమకు టోకెన్లు వస్తాయో రావోనని తోసుకోవాల్సిన అగత్యమూ రాదు. ఇలాంటి సాంకేతిక పరిష్కారాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి టెక్ సేవీ నాయకుడికి చెప్పాల్సిన అవసరం లేదు గానీ, ఇంకా ఎందుకో ఆయన ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టినట్లు లేరు.
ఈ విషయంలో అయోధ్యను చూసి నేర్చుకోండి
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాలను కూడా చాలా సంక్లిష్టంగా తయారు చేశారు. 300 రూపాయల స్పెషల్ దర్శనానికి కూడా ఎప్పుడో ఒకసారి స్లాట్లు విడుదల చేస్తున్నారు. అవన్నీ ఐదు నిమిషాల్లోనే అయిపోతున్నాయి. సర్వదర్శనానికి టైం స్లాట్ టోకెన్లు ఇచ్చేచోట కూడా రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇలాంటి వాటిని క్రమబద్ధీకరించుకోవాలి. అయోధ్యను చూసుకుంటే.. ఇప్పుడు అక్కడకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే భక్తులు వెళ్తున్నారు. కానీ, అక్కడ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేకుండానే, తోపులాటలు అవసరం లేకుండానే జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. అలాంటి విధానాలను అందిపుచ్చుకోవడంపై టీటీడీ దృష్టి సారించాలి. తిరుపతిలో చాలా పెద్ద సంఖ్యలోనే పోలీసులు ఉంటారు. వారిలో చాలామంది తిరుమల-తిరుపతికి వచ్చే వీవీఐపీల సేవలో తరిస్తున్నారు. ఈ వీఐపీ, వీవీఐపీ సంస్కృతిని వీలైనంత వరకు తగ్గించాలి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జడ్జిలు.. వీళ్లంతా దర్శనాలకు వచ్చినప్పుడు సామాన్య భక్తులను గంటలకొద్దీ ఆపేస్తుంటారు. అలాగే ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ బ్రేక్ దర్శనాలకు రికమండేషన్ లెటర్లు ఇస్తుంటారు. వాటిని సంపాదించగల పరపతి ఉన్నవారికి దాదాపు గంటలోపే చాలా చక్కటి దర్శనం అయిపోతుంది. అలా కాకుండా 300 రూపాయల టికెట్లు కొనుక్కునేవారు, సర్వదర్శనంలో వెళ్లేవారికి మాత్రం స్వామివారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటోంది. దీన్నంతటినీ చక్కదిద్ది.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్త సులభుడిగా ఎప్పుడు చేయగలరో టీటీడీ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి నిర్ణయించుకోవాలి.
‘సమయం’-బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ