Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Tough time to BJP: ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షే !

Tough time to BJP: ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షే !

3 రాష్ట్రాల్లోనైనా అధికారంలోకి తిరిగి రాకపోతే పరువు పోతుంది

నెలరోజుల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా జరిగే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కమలం పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ రెండు రాష్ట్రాలు రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉంది. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని భారత్‌ రాష్ట్ర సమితి సర్కార్‌ ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పవర్‌లో ఉంది. ఇంతకీ సెమీ ఫైనల్స్‌ ఎలా ఉండబోతున్నాయి ? ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని చోట్ల అధికారంలోకి రాగలుగుతుంది ? మధ్యప్రదేశ్‌ను కమలం పార్టీ మరోసారి నిలుపు కోగలుగుతుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

- Advertisement -

అతి త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి రావడానికి కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉభయ పార్టీలు ఆయుధాలతో ఎన్నికల సమరంలోకి దూకాయి. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఐదేళ్ల శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పాలన తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. చౌహాన్‌ సర్కార్‌ అవినీతికి మారుపేరుగా మారిందన్న విమర్శలు మిన్నంటుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ సర్కార్‌ పై వస్తున్న అవినీతి అరోపణలు కీలకాంశంగా మారుతున్నాయి. కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్‌ లోనూ కమలం పార్టీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వంలోని అవినీతి అంశాన్నే కాంగ్రెస్‌ నేతలు ప్రస్తావిస్తున్నారు. చౌహాన్‌ది 50 శాతం కమిషన్‌ సర్కార్‌ అంటూ ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో అన్నిటిలోనూ ఢీ అంటే ఢీ అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతి వ్యూహాలు పన్నుతోంది. కమలం పార్టీ హిందూత్వ జపం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా హిందూత్వ మంత్రం ఆలపిస్తోంది. హిందూత్వకు కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఊరూవాడా ఏకం చేసి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాధ్‌ అయితే తాను వ్యక్తిగతంగా ఆంజనేయస్వామి భక్తుడినని చెప్పుకుంటున్నారు. హిందూ బంధువులంటూ ప్రతి సభలోనూ ప్రజలనుద్దేశించి సంబోధిస్తున్నారు. బీజేపీకి పెట్టని కోటలాంటి హిందూ ఓట్‌ బ్యాంక్‌ను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌. మధ్యప్రదేశ్‌ జనాభాలో 70 శాతం మంది రైతులే. అయితే మధ్యప్రదేశ్‌లో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పంటలు పండించినా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి రాష్ట్రంలో తగినన్ని గోదాములు కూడా లేవు. దీంతో శివరాజ్‌ సింగ్‌ సర్కార్‌పై రైతులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. మొత్తానికి మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ విజయం ఈసారి నల్లేరు మీద నడక కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగలదా ?
ఎన్నికలు జరిగే ఐదింటిలో రెండు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు. ఒకటి రాజస్థాన్‌ కాగా మరోటి చత్తీస్‌గఢ్‌. ఎటు చూసినా మహారాజుల కోటలు కనిపించే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. రాజస్థాన్‌లో ప్రస్తుతం అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌ ఉంది. సహజంగా రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకు ఓసారి సర్కారు మారుతుంది. రాజస్థాన్‌ రాజకీయాల్లో కొంతకాలంగా ఇదొక ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ తరువాత వచ్చేది తమ ప్రభుత్వమేనంటున్నారు బీజేపీ నాయకులు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆనవాయితీకి బ్రేకులు పడటం ఖాయమంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. రాజస్థాన్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటున్నారు. ఈసారి రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలు కీలకంగా మారాయి. పరీక్షా పత్రాల లీకేజీ, మహిళలపై దౌర్జన్యాలు, యువతకు ఉపాధి కల్పన, ఇందులో ముఖ్యమైనవి. రాజస్థాన్‌లో పరీక్షాపత్రాల లీకేజీ ఒక ఆనవాయితీగా మారింది. గత ఐదేళ్ల కాలంలో కనీసం 14 పేపర్‌ లీకేజీ సంఘటనలు వెలుగు చూశాయి. ఈ పేపర్‌ లీకేజీ సంఘటనలు అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వానికి మచ్చగా మారాయి. అంతేకాదు దాదాపు కోటి మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పేపర్‌ లీకేజీ అంశాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక చత్తీస్‌గఢ్‌ విషయానికి వస్తే ఇక్కడ భూపేష్‌ బఘేల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. చత్తీస్‌గఢ్‌ సహజంగా భారతీయ జనతా పార్టీకి దుర్భేద్యమై కోట. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 23 ఏళ్లు. 2003 వరకూ అంటే రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 2003 నుంచి బీజేపీ విజయపరంపర ప్రారంభమైంది. 2003 నుంచి 2018 వరకూ బీజేపీ తరఫున రమణ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చత్తీస్‌గఢ్‌ రాజకీయ పరిస్థితిని మార్చేశాయి.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2018లో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో 68 సెగ్మెంట్లను గెలుచుకుని చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర కిందట..
చత్తీస్‌గఢ్‌లోని మొత్తం రిజర్వేషన్ల కోటాను 76 శాతానికి పెంచింది భూపేష్‌ సర్కార్‌. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇదిలా ఉంటే ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను సీనియర్‌ నేత రమణ్‌ సింగ్‌కు అప్పజెప్పింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. దీంతో కాంగ్రెస్‌ సర్కార్‌ను ఎండగట్టడానికి వీలున్న ఏ చిన్న అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వదులుకోవడం లేదు. 2018 ఎన్నికల్లో ‘ప్రజా మ్యానిఫెస్టో’ పేరిట ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది కాంగ్రెస్‌ పార్టీ. నాలుగున్నరేళ్లు గడిచినప్పటికీ, అందులోని ప్రధాన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదన్న విమర్శలున్నాయి. అంతేకాదు, బొగ్గు రవాణాలో అవినీతి ఆరోపణలు, మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు మినరల్‌ ఫౌండేషన్‌ నిధుల దుర్వినియోగం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాల్లో అవకతవకలు.. ఇవన్నీ కాంగ్రెస్‌ సర్కారుకు తలనొప్పిగా మారాయి. టోటల్‌గా ఇవన్నీ కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మిజో పోరులో విజేత ఎవరో ?
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. మిజోరం చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు నలభై. ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఇక్కడ అధికారంలో ఉంది. మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌, జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌తో పాటు కాంగ్రెస్‌ కూడా బరిలో ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉనికి నామమాత్రమే. అయితే బరిలో నేనూ ఉన్నానంటూ బీజేపీ ఇటీవల కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను నిలబెట్టింది.

తెలంగాణలో హోరాహోరీ పోటీ !
తెలంగాణలో ఈసారి భారత్‌ రాష్ట్ర సమితి , కాంగ్రెస్‌ , బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. నాలుగున్నరేళ్ల కాలంలో తాము చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలుపు తీరాలకు చేరుస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. వందలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌, రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు తాము దగ్గరయ్యామని గులాబీ పార్టీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఆరు గ్యారంటీలు తమను అధికార పీఠానికి దగ్గరకు చేరుస్తాయంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఘర్‌ వాపసీ కార్యక్రమం విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కర్ణాటకలో సక్సెస్‌ అయిన ఫార్ములానే తెలంగాణలోనూ విజయవంతమవుతుందని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కన్నడ కాంగ్రెస్‌ ప్రముఖుడు, డీ కే శివకుమార్‌ తెలంగాణలో పర్యటించి క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. కాగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రెండంచెల వ్యూహంతో ముందుకు పోతోంది. తెలంగాణ జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులను ఆకర్షించడానికి ఈటెల రాజేందర్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. ఈటెలకు స్వంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌తో పాటు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో కూడా నిలబెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని సూర్యాపేట జనగర్జన సభలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా కుండబద్దలు కొట్టారు. దీనికి తోడు తెలంగాణలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవడానికి వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా నల్లు ఇంద్రసేనా రెడ్డికి గవర్నర్‌ పదవి కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నా తెలంగాణలో హ్యాట్రిక్‌ కొడతామన్న భరోసాతో ఉన్నారు భారత్‌ రాష్ట్ర సమితి నాయకులు. ఏమైనా ఐదింటిలో కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా బీజేపీ గెలవాలి. లేదంటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజల్లో కమలం పార్టీ పలచన అవడం ఖాయం.

     -ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News