Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Tourism has no boundaries: పెరుగుతోన్న పర్యాటకరంగం పరిధి

Tourism has no boundaries: పెరుగుతోన్న పర్యాటకరంగం పరిధి

పర్యాటకరంగం అంటే ఒకప్పుడు సమీపానగల గుళ్లు, గోపురాలు చూడటమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పర్యాటకరంగం పరిధి విస్తృతమైంది. పుణ్య క్షేత్రాల పరిధి దాటింది. రకరకాల కారణాలతో ప్రజలు దేశాలు, ఖండాలు దాటడం మొదలెట్టారు. మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో, యావత్‌ ప్రపంచం పర్యాటకరంగానికి పెద్దపీట వేసింది. ప్రపంచంలోని అనేక దేశాలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇండోనేషియా లాంటి కొన్ని దేశాలైతే కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి.
ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం పెరిగింది. ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తే తొలిరోజుల్లో పర్యాటకరంగానికి పునాదిగా ఉండేది. అయితే రానురాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి. రకరకాల కారణాలతో ప్రజలు వేర్వేరు కొత్త ప్రదేశాలకు వెళ్లడం మొదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం పెరిగింది. ప్రస్తుతం ఒక పరిశ్రమగా మారింది. లెక్కలు తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో కనీసం ఒక్కరైనా టూరిజం ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వారే అయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పర్యాటక రంగంలో మన దేశం కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధినే సాధించింది. భారతదేశంలో కోట్లాదిమందికి టూరిజం ఉపాధి కల్పిస్తోంది. మనదేశంలో పర్యాటకరంగ పరిస్థితి ఆశాజనకంగా ఉంది. దేశ ఆర్థికరంగాన్ని నిలబెడుతున్న వాటిలో పర్యాటక రంగం కూడా ఉంది. 2018 నాటి లెక్కల ప్రకారం పర్యాటకరంగం దేశవ్యాప్తంగా 4.26 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. జీడీపీలో కూడా పర్యాటక రంగం వాటా ఎక్కువగానే ఉంది. దీంతో, భారత ప్రభుత్వ సంతృప్తి పడలేదు. 2029 నాటికి పర్యాటకరంగం ఆదాయం రూ.35 లక్షల కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ‘స్వదేశ్‌ దర్శన్‌’, ‘ప్రసాద్‌’ పథకాలను మొదలెట్టింది. అలాగే స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి… ‘ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌ …. పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాలతో పర్యాటకులను ఆకట్టుకోవడంలో కేంద్రం ప్రభుత్వం విజయవంతమైంది.
కోవిడ్‌ కారణంగా ఢామ్మన్న టూరిజం కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా, అనేక దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. కోవిడ్ దెబ్బకు యావత్‌ ప్రపంచం, ఇంటి గడపకే పరిమితమైంది. గడప దాటి బయటకు వచ్చే జనమే కరువయ్యారు. వీథులు, గల్లీలు, చౌరాస్తాలు అన్నీ నిర్మానుష్యమయ్యాయి. కోవిడ్ తీవ్రత తగ్గిన తరువాత, పర్యాటకరంగం మళ్లీ జోరందుకుంది. సాధారణ ప్రజలు, సూట్‌కేసులు సర్దుకున్నారు. పిల్లాపాపలను తీసుకుని పర్యాటక ప్రదేశాలు చూడ్డానికి బయల్దేరారు. కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో, మరోసారి పర్యాటక రంగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని కోసం కేంద్రం పక్కా ప్రణాళిక తయారు చేసింది. రైలు, రోడ్డు, విమాన మార్గాల అనుసంధానానికి టాప్‌ ప్రయారిటీ ఇచ్చింది. అలాగే, మౌలిక వసతులు కల్పనకు కేంద్రం పెద్ద పీట వేయడం మొదలెట్టింది. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో పనిచేయడానికి భారత్‌ రెడీ అయింది. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి, వికాస్‌ భీ…విరాసత్‌ భీ అనే నినాదంతో కేంద్రం ముందుకు వెళుతోంది.

- Advertisement -


బహుముఖంగా విస్తరించిన పర్యాటకరంగం
పర్యాటకరంగం బహుముఖాలుగా విస్తరించింది. హెల్త్‌ టూరిజం, ఎడ్యుకేషనల్‌ టూరిజం, ఆగ్రో టూరిజం ఇవన్నీ తెరమీదకు వచ్చాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎన్ని సిరిసంపదలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే వృధాయే. ఆరోగ్యంపై ప్రజల ఆలోచనాధోరణి మారింది. వ్యాధులు వస్తే, వెంటనే చికిత్సల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అవసరమైతే విదేశాలకు కూడా వెళుతున్నారు. దీనినే హెల్త్‌ టూరిజం అంటున్నారు. ఇటీవలి కాలంలో మనదేశం..హెల్త్‌ టూరిజానికి హబ్‌గా మారింది. భారత్‌తో పోలిస్తే అనేక దేశాల్లో వైద్యానికి బాగా డబ్బులవుతాయి. సామాన్య ప్రజలు ఈ ఖర్చును భరించలేరు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మెడికల్‌ ట్రీట్మెంట్‌కు అయ్యే ఖర్చు బాగా తక్కువ. దీంతో, అనేక దేశాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం భారత్‌ కు వస్తున్నారు. ఇలా వచ్చే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలోని పంచకర్మ ఆయుర్వేద ట్రీట్మెంట్‌ కోసం విదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. విదేశీ క్లయింట్లను ఆకట్టు కోవడానికి పేరొందిన వైద్య సంస్థలు రకరకాల ప్యాకేజీల ను సిద్ధం చేశాయి. సంపన్నులకు ఒక రేటు, మధ్యతరగతి కి ఒక రేటు, పేదలకు మరో రేటు… అంటూ చికిత్స ఖర్చు ను ఫిక్స్‌ చేశాయి. అయితే చికిత్స విషయంలో రవ్వంత కూడా రాజీ పడటం లేదు వైద్యసంస్థలు. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చే రోగుల భరోసాను భారత్‌ వైద్య సంస్థలు నిలబెట్టుకుంటున్నాయి. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. ఎడ్యుకేషనల్‌ టూరిజం, ఇదో కొత్త తరహా పర్యాటకరంగం. ఉన్నత చదువుల కోసం విదే శాలకు వెళ్లడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఎంఎస్‌ కోర్సులు చేయడానికి మన దేశం నుంచి ప్రతి ఏడాది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశా లకు పెద్ద సంఖ్యలో యువతీయువకలు వెళుతున్నారు. అలాగే వైద్య విద్య చదవడం కోసం ఉక్రెయిన్‌ సహా అనేక దేశాలకు వెళ్లడం కొంతకాలంగా పెరిగింది. ఇటీవలి కాలంలో తెరమీదకు వచ్చిన పేరు, ఆగ్రో టూరిజం. ఇది మౌలికంగా వ్యవసాయ ఆధారిత పర్యాటకం. ఆర్థికపర మైన ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఆగ్రో టూరిజం ప్రధానోద్దేశం. ఆగ్రో టూరిజం వల్ల ఒక్క అన్నదాతల బతుకులు బాగపడటమే కాదు, గ్రామీణ భారతదేశానికి కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఆగ్రో టూరిజం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. వ్యవసాయ పర్యాటకం మొదటగా అమెరికాలో వాడుకలోకి వచ్చింది. మనదేశంలో మహారాష్ట్రలోని బారామతిలో వ్యవసాయ పర్యాటక అభివృద్ధి పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థే, భారతదేశంలో ఆగ్రో టూరిజానికి నాంది పలికింది. మనదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పర్యాటకం కీలకంగా మారింది. ఆగ్రో టూరిజం ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికేడాది ఇరవై శాతం పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలను పర్యాటకంతో జోడిస్తున్నారు. దీంతో స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది భారతదేశం.
పర్యాటక రంగంలో హైదరాబాద్‌ ప్రత్యేకత
మనదేశ పర్యాటకరంగంలో హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పర్యాటకులను ఆకట్టుకోవడానికి భాగ్యనగరంలో అనేక చారిత్రక ప్రదేశాలున్నాయి. గోల్కొండ కోట, హైదరాబాద్‌ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. భారతదేశానికి వచ్చిన టూరిస్టులు ఎవరైనా తప్పకుండా చూడదగ్గ ప్రదేశం గోల్కొండ కోట. మన దేశంలోని చారిత్రక అద్భుతాల్లో గోల్కొండ కోట ఒకటని చెబుతారు.
చౌమహల్లా ప్యాలెస్‌, ఇదో అద్భుత కట్టడం. పథ్నాలుగు ఎకరాల్లో విస్తరించిన చౌమహల్లా ప్యాలెస్‌లో చూపు తిప్పుకోనివ్వని నిర్మాణాలు అనేకం ఉన్నాయి. చౌమహల్లా ప్యాలెస్‌కు 2010లో యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా అవార్డు లభించింది.
హైదరాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చార్మినార్‌. నాలుగు మినార్‌లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్‌ అంటారు. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్‌ను నిర్మించారు అప్పటి నిజాం ప్రభువు. 1889లో లండన్‌ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్‌ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. మనదేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియంలలో హైదరాబాద్‌లోన ‘సాలార్‌ జంగ్‌ మ్యూజియం’ ఒకటి. ‘సాలార్‌ జంగ్‌ మ్యూజియం’ చూడటానికి ఒకట్రెండు రోజులు సరిపోవు. మ్యూజియంలోని పాల రాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులు పర్యాటకులను కట్టిపడేస్తాయి. పర్షియా, ఈజిప్ట్‌, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, వంటి దేశాలకు సంబంధించిన లోహ కళా ఖండాలు, తివాచీలు, సెరామిక్స్‌, బొమ్మలు, శిల్పాలను ’సాలార్‌ జంగ్‌ మ్యూజియం’లో భద్రపరిచారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాల్లో ‘బిర్లా మందిర్‌’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. బిర్లా మందిర్‌ నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. 1966లో మొదలైన బిర్లా మందిర్‌ నిర్మాణం 1976 నాటికి పూర్త య్యింది. మనిషి గడపదాటి విశాల ప్రపంచంలోకి అడుగు పెడితే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. ట్రావెలింగ్‌, మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. డిప్రెషన్‌ అంటూ ఉంటే మనసు నుంచి ఆ లక్షణాలను పారదోలుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త అనుభూతులు మిగులుతాయి. దీంతో, మెదడు చురుగ్గా ఉంటుంది. మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.
ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

  • 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News