Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Tourism industry needs promotion: పర్యాటక రంగానికి ఊతం అవసరం

Tourism industry needs promotion: పర్యాటక రంగానికి ఊతం అవసరం

ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా పర్యాటకులు పెరిగే అవకాశం

అనేక సంవత్సరాల పాటు దేశం పర్యాటక రంగం స్తబ్ధుగా, సానపెట్టని వజ్రంలా ఉండిపోయింది. ఇబ్బడిముబ్బడిగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి అవకాశమున్న పర్యాటక రంగం అభి లషణీయ స్థాయికి చేరుకోకపోగా, కష్టనష్టాల్లో చిక్కుకుపోయింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ప్రతిష్టంభనకు లోనవుతూ వస్తున్న పర్యాటక రంగాన్ని కోవిడ్‌ మహమ్మారి సుమారు మూడేళ్లపాటు అపస్మారక స్థితిలో ఉంచడం కూడా జరిగింది. అతి కష్టం మీద దీన్ని మళ్లీ పట్టాలెక్కించేసరికి అనేక రాష్ట్రాలలో భారీ వర్షాలు ఈ రంగాన్ని మళ్లీ పుట్టి ముంచుతున్నాయి.
కోవిడ్‌ కారణంగా దాదాపు మూడేళ్లపాటు విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం ఈ రంగాన్ని ఒక్కొక్క ఇటుకా పేర్చి అభివృద్ధి చేయడం జరుగుతోంది. ‘బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌’ ఇచ్చిన సమాచారం ప్రకారం, భారతదేశానికి 2022లో 62 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. వారి వల్ల దేశానికి 1.35 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఒనగూడింది. అయితే, కోవిడ్‌కు ముందు, అంటే 2019 సంవత్సరానికి ముందు 1.1 కోట్ల మంది విదేశీ పర్యాటకులు దేశానికి వచ్చిన విషయాన్ని విస్మరించకూడదు. అయితే, 2024 మధ్య నాటికి భారత్‌ మళ్లీ 2019 సంవత్సరం ముందు నాటి స్థాయికి చేరుకోవాలన్నది ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది.
భారత ప్రభుత్వం ఆశించిన విధంగా 2024 మధ్య నాటికి దేశానికి కోటి 50 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చే పక్షంలో, కేవలం పర్యాటక రంగం వల్ల దేశ జి.డి.పికి 5,000 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, 3,000 కోట్ల డాలర్ల విదేశీ మారకం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశ జి.డి.పిలో 5 శాతం వాటా పర్యాటక రంగం నుంచే అందుతోంది. కాగా, 2030 నాటికి పర్యాటక రంగం వల్ల 13.70 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని, 5,600 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని, 2.5 కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ కు రావడం జరుగుతుందని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
ఈ ఏడాది కూడా ‘ఇంక్రెడిబుల్‌ ఇండియా’ అనే నినాదం కారణంగా, సుందరమైన సముద్ర తీరాలను, మంచుకప్పిన పర్వతాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి లక్షల సంఖ్యలో విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సుమారు 166 దేశాలకు చెందిన పర్యాటకులకు ఈ-వీసాలను మంజూరు చేయడం, పర్యాటకం, వైద్యం, వ్యాపారం, వైద్య సహాయం, సమావేశాల కోసం ఈ రకమైన వీసాలను మంజూరు చేయడం జరుగుతోంది. వీటి కారణంగా ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా పర్యాటకులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వీసా ఫీజు తగ్గించడం, హోటల్‌ రూమ్స్‌ విషయంలో కూడా జి.ఎస్‌.టిపై కోత విధించడం, పర్వతారోహణను ప్రోత్సహించడం కోసం కొత్త శిఖరాలను ఎంపిక చేయడం వంటి వల్ల కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
ఇటువంటి కీలక సమయంలో ప్రకృతివైపరీత్యాల వల్ల పర్యాటక రంగం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగి పడడం వంటి కారణాల వల్ల రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి, వాటిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. నిజానికి పర్యాటక రంగం జాతీయ పర్యాటక విధానం కోసం ఎదురు చూస్తోంది. దీనివల్ల పన్నుల తగ్గింపు, ఆతిథ్య రంగానికి పరిశ్రమల హోదా వంటివి సాధ్యమవుతాయి. పర్యాటక కేంద్రాలు, మహానగరాల చుట్టూ స్టార్‌ హోటల్స్‌ను నిర్మించడం, పర్యాటక అనుకూల సౌకర్యాలను అభివృద్ధి చేయడం వంటి వాటిని ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక సమగ్ర విధానం అమలు జరిగితే తప్పకుండా జి.డి.పిలో పర్యాటక రంగ వాటా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News