Sunday, November 16, 2025
Homeఓపన్ పేజ్Tragedy in 2025: గడిచిన 10 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు.. రహదారులు రక్తసిక్తం.!

Tragedy in 2025: గడిచిన 10 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు.. రహదారులు రక్తసిక్తం.!

Tragedy in 2025 Accidents Stampedes and Deaths: ఈ ఏడాదికి వీడ్కోలు పలకడానికి ఇంకా 48 రోజులు ఉంది. ఈ కొన్ని రోజులూ ప్రజలంతా కోరుకునేది ఒకటే.. ఈ 48 రోజులూ త్వరగా గడిచిపోవాలని.. ఏ తల్లీ తండ్రికీ కడుపు కోత ఉండకూడదని.. ఏ పిల్లలూ అనాథలుగా మిగిలిపోకూడదని.. ఎవరూ తమ జీవితంపై నిర్లక్ష్యం వహించకూడదని.. పసికందుల రక్తంతో భూమాతకి రక్తాభిషేకం జరగకూడదని.. ఈ సంవత్సరం మిగిల్చిన విషాదం మరే సంవత్సరంలో చోటుచేసుకోవద్దని.. విషాద నామ సంవత్సరంగా మరే సంవత్సరం మారవద్దని..

- Advertisement -

2025 సంవత్సరం తలచుకుంటే ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకే.. తెల్లారి నిద్ర లేస్తే ఎక్కడ ఎలాంటి చావు కబురు వినాల్సి వస్తుందో అని.. అక్కడక్కడా రోడ్డు ప్రమాదాల్లో ఒకరిద్దరు చనిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఒకేసారి పదుల సంఖ్యలో మరణాలు.. అది కూడా మృతదేహాలు గుర్తు పట్టలేనంత వీలుగా మారిపోవడం, అగ్నికి ఆహుతై అయినవాళ్లకి బూడిద మాత్రమే దొరకడం, తొక్కిసలాటలో గుండె చప్పుడు ఆగి కానరాని లోకాలకు చేరుకోవడం. ఇలా ఒకటా రెండా.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సంవత్సరం ప్రతి నెలా వివిధ రూపాల్లో జరిగిన ప్రమాదాల్లో మూకుమ్మడి మరణాలు యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఓ సారి ఆ దుర్ఘటనలను పరిశీలిస్తే.. 

కలియుగ దైవం సన్నిధిలో

జనవరి 8: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు.. దర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా లక్షా ఇరవై వేల టోకెన్లు జారీ చేయగా.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో భక్తులు, పోలీసులు- టీటీడీ అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో బైరాగి పట్టెడ వద్ద టోకెన్ల కోసం తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా 29 మందికి గాయాలయ్యాయి. 

SLBC టన్నెల్‌లో ప్రమాదం

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందించేందుకు చేపట్టిన SLBC ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల్‌ పనుల్లో 14 కిలోమీటర్‌ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 22న రాత్రి 8:30 గంటల సమయంలో కార్మికులు పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలిపడటంతో కాంక్రీట్‌ పెచ్చులు ఊడి పడి 8 మంది ఉద్యోగులు, సిబ్బంది చనిపోయారు. 

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి

ఏపీలోని ఒంగోలులో మార్చి 28న సముద్రంలో పడవ మునిగి పలువురు మత్స్యకారులు చనిపోయారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఏప్రిల్‌ 29న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కురవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

గుల్జార్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మే 18న తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఇన్వర్టర్‌లో షార్ట్ సర్క్యూట్ అని అధికారులు గుర్తించారు. మంటలు త్వరగా వ్యాపించడంతో పెద్ద ఎత్తుల ప్రాణనష్టం సంభవించింది. 

పాశమైలారం పరిశ్రమలో పేలుడులో 45 మంది మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరులోని పాశమైలారంలో జూన్‌ 30న సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో రియాక్టర్‌ పేలుడు సంభవించగా ఘటనలో 46 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.

బోల్తాపడ్డ లారీ

జులై 14న రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అదుపుతప్పి బోల్తా పడటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

మంటల్లో తగలబడ్డ వేమూరి ట్రావెల్స్‌ బస్సు

అక్టోబర్ 24న కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్ని జ్వాలలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా.. 22మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

తొక్కిసలాటలో మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా నవంబర్‌ 1న స్వామి వారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తుల రద్దీ చోటుచేసుకుంది. దీంతో తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందారు. 

కంకర లారీ బోల్తా.. 19 మంది మృత్యువాత

నవంబర్‌ 3న సోమవారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సుపై కంకర లారీ బోల్కా పడటంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. మరో కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. 

విమానంలో మృత్యుఘోష

ఇక దేశవ్యాప్తంగా జరిగిన ఘోర ప్రమాదాలను తలచుకుంటే మొదటగా గుర్తొచ్చేంది అత్యంత భయంకరమైన ఎయిరిండియా విమాన ప్రమాదం.. జూన్‌ 12 న అహ్మదాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన ఇప్పటికీ భయాన్ని కలుగజేస్తుంది. లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (AI-171, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీ నగర్ సమీపంలోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు మెడికల్‌ కాలేజ్‌లోని 19 మంది కూడా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 260 కి చేరింది. ఈ దుర్ఘటనలో ఒకే ఒక వ్యక్తి విశ్వాస్‌ కుమార్‌ మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు. 

చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట

జూన్‌ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ సంఘటనకు కారణం అంచనాలకు మించి జనం రావడం అని, దీనికి అవసరమైన అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడం అని ప్రభుత్వ విచారణలో తేలింది. 

కరూర్‌ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట

2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట సంభవించింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. హైకోర్టు ఆదేశాలతో ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టింది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad