వ్యక్తి స్వేచ్ఛను హరించేలా, నింది తుడిపై విచారణ జరపకుండా సుదీర్ఘ కాలం జైలులో నిర్బంధించడం రాజ్యాం గ విరుద్ధమని సుప్రీంకోర్టు మే 18, 2026 నాడు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబి వర్సెస్ ఎన్‌ఐఏ (జమ్ము) కేసు ను విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును ప్రకటించింది. ఈ కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఎన్‌డీపీఎస్ చట్టాలలోని పలు సెక్షన్లతో పాటు దేశద్రోహం అభియోగం కూడా మోపారు. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పాటు, ఇక్కడి చట్టపరమైన అంశాల వల్ల ఈ తీర్పుకు న్యాయపరం గానూ, రాజకీయంగానూ విశేషమైన ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, దీనికి విరుద్ధంగా గతంలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియా ధర్మాసనం ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలీద్, షర్జిల్ ఇమామ్‌ల బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన సంగతి ఇక్కడ స్మరించుకోవాలి. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశో ధక విద్యార్థులైన వీరిద్దరూ ఉత్తర ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రధాన కుట్రదారులని, ఢిల్లీని దిగ్బంధించి శాంతిభద్రతల సమస్య సృష్టించడం ద్వారా దేశంలో అస్థిరతకు పాల్పడాలనే కుట్ర చేశారని ఎన్‌ఐఏ ఆరోపిం చింది. ఈ రెండు కేసులలోని నిందితులు కూడా గత ఐదేళ్లకు పైగా జైలులోనే మగ్గుతున్నారు. కింది కోర్టులు, హైకోర్టులు వీరికి బెయిల్ నిరాకరించడం వల్లనే వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఉమర్ ఖాలీద్ బెయిల్‌ను జనవరి 5, 2026 నాడు తిరస్కరించిన సందర్భంగా దేశవ్యా ప్తంగా పెద్ద చర్చ జరగడమే కాకుండా, విచా రణ లేకుండా నిందితులను సంవత్సరాల తరబడి జైలులో ఉంచడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి ఒప్పం దాలకు విరుద్ధమని అంతర్జాతీయ పౌర సమాజం నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమ య్యాయి. ఈ నేపథ్యంలో సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబి కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఒకే రకమై న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు వేర్వేరు కేసులలో, రెండు విభిన్న ధర్మాసనాలు ఇలా పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇవ్వడం పట్ల ఇప్పుడు విస్తృతమైన న్యాయ చర్చ జరుగుతోంది.
ఈ తరహా ప్రత్యేక చట్టాల కింద నమోదవుతున్న కేసులన్నీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టినవే అన్నది పౌర సమాజంలో వ్యక్తమవుతున్న అభిప్రా యం. దేశద్రోహం కేసుల్లో కేవలం నాలుగు నుండి ఆరు శాతం కేసులలో మాత్రమే శిక్షలు పడుతున్నాయని, మిగతావన్నీ రుజువు కాని ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మా సనం ప్రకటించడం ద్వారా ఉపా (UAPA) చట్టం దుర్వినియోగం అవుతోందనే విషయాన్ని పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే పలు ఉపా కేసులలో బెయిల్ పిటీషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులను ప్రకటిం చింది. వాటిలో కె.ఎ. నజీర్ కేసులో ముగ్గురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పు శిరోధార్యమైనదిగా పరిగణించాలి. న్యాయ నిబంధనల ప్రకారం ఇద్దరు లేదా ఒక్కరు సభ్యుల ధర్మాసనం గానీ, లేదా అన్ని రాష్ట్రాల హైకోర్టులు, ట్రయల్ కోర్టులు ఆ లార్జర్ బెంచ్ తీర్పుకు లోబడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ తీర్పులో పేర్కొన్న రాజ్యాంగబద్ధ విషయాలను స్పష్టంగా చర్చించ కుండా, లేదా వాటిని తిరస్కరించకుండానే, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మా సనం ఉమర్ ఖాలీద్, షార్జిల్ ఇమామ్ కేసులో బెయిల్ ఇవ్వడం కుదరదని నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టు పరిభాషలోనే స్థిరపడిన పూర్వ తీర్పుల (Precedents) ధోరణిని పక్కనబెట్టడాన్ని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లు తీవ్రంగా తప్పుపట్టారు.
దేశద్రోహం ఆరోపణల మీద కె.ఎ. నజీర్ విచారణ ఖైదీగా ఐదేళ్లకు పైబడి జైలు నిర్బంధంలో మగ్గిపోయినప్పుడు, కింది కోర్టులు, హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడంతో 2020లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆ కేసును విచారించి ఒక మైలురాయి వంటి తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన అంశాలని, చట్టంలో పేర్కొన్న వివిధ కఠిన సెక్షన్లను చూపి రాజ్యాంగం ప్రసాదించిన ఈ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే, నిందితుడికి బెయిల్ ఇవ్వకుండా ఏ రాజ్యాంగబద్ధ కోర్టు ఉండలేదని కె.ఎ. నజీర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో చట్టపరమైన పరిమితులు కోర్టుకు అడ్డు కావని, చట్టాన్ని వ్యాఖ్యానించే సమ యంలో అది ఎంత కఠినమైనదైనా సరే, కోర్టు రాజ్యాంగవాదం వైపు, రాజ్యాం గంలో నిక్షిప్తమై వున్న వ్యక్తి స్వేచ్ఛ పట్లే మొగ్గు చూపాలని నిర్దేశించింది. ఒక ప్రత్యేక కేసులోని సాక్ష్యాధారాల ఆధారంగా ధర్మాసనం బెయిల్ నిరాకరించ వచ్చు కానీ, ఒక ప్రత్యేక చట్టం ఉందనే సాకుతో బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పడం చట్టసమ్మతం కాదని ఆనాటి ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇంత స్పష్టమైన పూర్వ తీర్పులు ఉన్నప్పటికీ, ఉమర్ ఖాలీద్, షర్జిల్ ఇమామ్‌ల బెయిల్ దరఖాస్తును విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచిత్రమైన తీర్పును వెలువరించింది. భావజాలాలు, సిద్ధాంతాలు, సంస్థలు లేదా పార్టీలతో సంబంధం లేకుండా దేశ సమైక్యతను, భద్రతను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ ధర్మాసనాలు తీర్పులు ఇవ్వాలని అది పేర్కొన్నది. వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు, వేగవంతమైన న్యాయ విచారణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తాయని, వాటిని గౌరవించడం కోర్టుల విధి అని అంగీకరిస్తూనే, దేశ ప్రయోజనాలకు లోబడే వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులు ఉండాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సామాజిక భద్రత నుంచి విడిగా ఉండదని, అది ప్రశ్నించలేని హక్కు కాదని ఆ ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. సార్వభౌమత్వం, సమైక్యత, దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ అన్నవి నైరూప్య విషయాలు కావని, అవి రాజ్యాంగ విలువలని, వాటినే పార్లమెం టు చట్టాల ద్వారా కాపాడుతుందని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియా ధర్మాసనం పేర్కొంది. అలాంటి పునాదులను కూల్చడానికి చేసే నేరాలను అదుపు చేయడానికి ప్రత్యేక చట్టాలు చేస్తే, వాటిని అమలు చేయడం కోర్టుల ప్రాథమిక విధి అని అభిప్రా యపడింది. కోర్టులు చట్టాలను అన్వ యించే క్రమంలో నిందితుల గుర్తిం పును, భావజాలాన్ని, మతాన్ని లేదా సంస్థలను పరిగణనలోకి తీసుకోదని, కేవలం నేరంలో వారి పాత్ర, ఆధారాలు, చట్టం అనే వాటి ఆధారంగానే విచారి స్తుందని సమర్థించుకుంది. అంతేకా కుండా, ఒకే రకమైన అభియోగాల విచా రణలో ఒకే రకమైన తీర్పు ఇవ్వాలని క్రిమినల్ చట్టం ఎక్కడా నిర్దేశించదని కూడా ఆ ధర్మాసనం వాదించింది.
ఈ తీర్పుకు పూర్తిగా భిన్నమైన, విరుద్ధమైన తీర్పును జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం వెలువరించింది. త్వరితగతిన న్యాయ విచారణ పొందడం రాజ్యాంగపరమైన హక్కని పునరుద్ఘాటిస్తూ, చట్టంలో పేర్కొన్న గరిష్ఠ శిక్షాకాలంలో సగ భాగం కన్నా ఎక్కువ కాలం విచారణ ఖైదీగా ఉన్న నిందితుడికి బెయిల్ ఇవ్వవచ్చని నిర్ణయించింది. అంతేకాకుండా, ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన పూర్వ తీర్పుకు లోబడి కింది కోర్టులు నడుచుకోవాలనే న్యాయ సూత్రాన్ని (Doctrine of Precedent) ఉల్లంఘిస్తున్న ధోరణిని తీవ్రంగా విమర్శించింది. ఈ రెండు పరస్పర విరుద్ధ తీర్పుల నేపథ్యంలో ప్రస్తుత భారత న్యాయ వ్యవస్థలో ప్రబలుతున్న మూడు ప్రతికూల ధోరణులను మనం గమనించాల్సి ఉంటుంది. మొదటిది, పార్లమెంటు ఉద్దేశాలకు లేదా కార్యనిర్వాహక వర్గానికి సుప్రీంకోర్టు పెద్దపీట వేస్తూ పాలకుల నిరంకుశ చట్టాలకు వత్తాసు పలకడం. రెండవది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సంక్రమించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, వేగవంతమైన న్యాయ విచారణలను నామమాత్రపు విషయాలుగా చూస్తూ ప్రభుత్వ వాదనల పట్ల సానుకూలంగా స్పందించడం. మూడవది, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ చట్టానికి లోబడి తీర్పులు ఇవ్వాల్సిన న్యాయమూర్తులు అందుకు విరుద్ధంగా తమ వ్యక్తిగత అభిరుచులు, సామాజిక భావజాలాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ నిర్ణయాలు ప్రకటించడం. ఈ మూడు ధోరణులను ఈ మధ్య కాలంలో తరచూ చూస్తున్నాము. ఈ పరిణా మాల వల్లనే న్యాయ వ్యవస్థ నిజంగా స్వయంప్రతిపత్తి గల ఒక స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థగానే ఉందా అనే చర్చ సర్వత్రా జరగడానికి కారణమైంది. అయితే, సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబి కేసులో ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం ఉమర్ ఖాలీద్‌ను, షర్జిల్ ఇమామ్‌ను బెయిల్ మీద విడుదల చేసేలా న్యాయ సమీక్ష జరుగుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

