Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్అపురూప నాటిక నౌకా చరిత్రము

అపురూప నాటిక నౌకా చరిత్రము

శ్రావ్య సంగీత నాటిక ఎన్నో రికార్డులు సృష్టించింది

త్యాగరాజ స్వామి పేరు తెలుగునాట వినని వారుండరు. మేళకర్తగా, వాగ్గేయకారుడుగా ఆయన రాసిన కీర్తనలు అజరామరం. ఆయన పేరు వినగానే ‘ఎందరో మహానుభావులు’ అనే కీర్తన తప్పకుండా గుర్తుకు వస్తుంది. అయితే, త్యాగరాజ స్వామి ఒక్క కీర్తనలు మాత్రమే కాక, అనేక నాటికలు రాయడం కూడా జరిగింది. తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ ఆయనకు తెలుగు భాష మీదా, సంస్కృతం మీదా బాగా పట్టుండేది. తమిళంలో కూడా ఆయన నిష్ణాతుడైనప్పటికీ, తెలుగు భాషలో ఆయన అనేక పద ప్రయోగాలు చేయడం జరిగింది. తమిళనాడులోని తిరువొత్తియూరులో 1767లో పుట్టి 1847లో కన్నుమూసిన త్యాగబ్రహ్మ కర్ణాటక సంగీతంలో తనదంటూ ఒక ముద్రను వేయడంతో పాటు ‘నౌకా చరిత్రము’ పేరుతో రాసిన గేయ నాటిక (సంగీత నాటిక) అత్యద్భుత ఫలితాలు సృష్టించింది. తన మాతృభాష అయిన తెలుగులో ఆయన రాసిన ఈ ‘శ్రావ్య సంగీత నాటిక’ అటు తెలుగు ప్రాంతాల్లోనే కాక, తమిళనాడులో కూడా రికార్డులు సృష్టించింది. వేదికల మీద ఆ నాటికను ప్రదర్శిస్తున్నప్పుడు, అందులోని పద్యాలను గానం చేస్తున్నప్పుడు ఆయన కీర్తనలంత వినసొంపుగా ఉండేవని అప్పటి గేయ రచయితలు, గాయకులు చెప్పేవారు.
మహాభాగవతంలోని గోపికా వస్త్రాభరణం, రాసలీలలు, కృష్ణ లీలలను ఆయన రసరంజితంగా మేళవించి, ఈ నౌకా చరిత్రము గేయ నాటికను రాయడం జరిగింది. ఈ నాటికలో తెలుగు సాహిత్యంలోని అనేక కోణాలను జొప్పించడం జరిగింది. అప్పట్లో ఈ నాటిక ఘన విజయాలు సాధించడం, పైగా ప్రముఖ వాగ్గేయకారుడైన త్యాగయ్య ఈ గ్రంథాన్ని రాయడం వల్ల దీన్ని ఇతర భాషల్లోకి అనువదించే ప్రయత్నం జరిగింది. చివరికి డాక్టర్‌ సి. వసుంధర అనే మహిళా సాహితీ వేత్త దీన్ని రోమన్‌ అక్షరాలతో ఇంగ్లీషు భాషలోకి నేరుగా అనువదించడం జరిగింది. త్యాగరాజ స్వామి తన రచనలో పండించిన సాహితీ సౌందర్యం, సంగీత వైశిష్ట్యం, వేదాంత అంతరార్థం ఈ అనువాద రచనలో కూడా ప్రతిఫలించడం నిజంగా ఒక గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఈ గేయ నాటికలోని పద్యాలు గానం చేస్తుంటే మహా భారతం, భాగవతాల్లోని పద్యాలు గానం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ పురాణాల్లోని సంఘటనలు తప్పకుండా గుర్తుకు వస్తాయి. విచిత్రమేమిటంటే దాని ఇంగ్లీషు అనువాదంలోనూ అటువంటి అనుభూతులకు ఆస్కారం ఉంది. తెలుగులో డాక్టరేట్‌ చేయడంతో పాటు, భాషా శాస్త్రంలో డిప్లొమా కూడా అందుకున్న డాక్టర్‌ వసుంధర దాదాపు రెండు దశాబ్దాల పాటు అధ్యాపకురాలుగా పని చేసి, పదవీ విరమణ చేసిన తర్వాత ఈ గ్రంథ రచన చేపట్టారు.
త్యాగరాజస్వామి రాసిన నౌకా చరిత్రము గేయ నాటికను సంస్కృతంతో సహా అనేక భారతీయ భాషల్లోకి అనువదించడం జరిగింది. తన కీర్తనల్లోనే కాక, తన గ్రంథాల్లో సైతం ఆయన చిత్ర విచిత్రమైన తెలుగు పదాలను వాడడం జరిగింది. ఇందులో అర్థం తెలియని పదాలు అనేకం. ఆయన ఈ పదాలను ఎక్కడి నుంచి ఏ విధంగా సృష్టించారన్నది సాహితీవేత్తలకు ఇప్పటికీ అంతుబట్టని విషయం. భాష తక్కువగా, సంగీతం ఎక్కువగా ఉండే విధంగా ఆయన రాసిన నౌకా చరిత్రము కూడా ఇప్పటికీ సాహితీవేత్తలను భాషాపరంగా అయోమయంలో పడేస్తూనే ఉంది. ఈ నౌకా చరిత్రము గ్రంథాన్ని 1817లో మహాకవి వెంకటసూరి, ఆ తర్వాత 1969లో ఎన్‌.సిహెచ్‌. కృష్ణమాచార్యులు సంస్కృతంలోకి అనువదించడం జరిగింది. కాగా, 1939లో ప్రొఫెసర్‌. పి. సాంబమూర్తి ఈ గ్రంథాన్ని పూర్తి స్థాయిలో తెలుగులో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత పలువురు రచయితలు, సాహితీవేత్తలు, అభిమానులు, శిష్యులు కూడా ఈ నౌకా చరత్రమును ప్రచురించడం, భాష్యాలు రాయడం జరిగింది. విచిత్రంగా ఎవరు ఎప్పుడు ఈ గ్రంథాన్ని ప్రచురించినా అది లక్షల ప్రతుల్లో అమ్ముడు పోవడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News