బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే సార్వత్రిక పౌరస్మృతిని (యూసీసీ) అమలు చేస్తామన్న నమ్మకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. సార్వత్రిక పౌరస్మృతి అంటే వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, సంరక్షణ వంటి కుటుంబ-వ్యక్తిగత చట్టాలను మతభేదం లేకుండా ఒకే న్యాయవ్యవస్థలోకి తీసుకుని రావడం. “అందరికీ ఒకే చట్టం”, “చట్టం ముందు అందరూ సమా నం” అనే మాటలు వినడానికి ఎంతో ఆకర్షణీయంగా ఆదర్శంగా ఉంటాయి. కానీ అసలు ప్రశ్న అక్కడితో ఆగదు. ఆ చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు? ఏ సామాజికవర్గాల సాంప్రదాయాన్ని ప్రమాణి కంగా తీసుకుంటారు? ఇతర సమాజాలపై దాన్ని ఎలా ప్రయోగి స్తారు? అనేవే యూసీసీలో ప్రధాన వివాదం.
వ్యక్తిగత చట్టం ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రతి మత సమూహం తనదైన ప్రత్యేక సంస్కృతిని కలిగి వుంటుంది. ఇది బాహ్య వైవిధ్యం. అలాగే, అంతర్గతంగానూ అనేక సమూహాల మధ్య భిన్నత్వం వుంటుంది. ఇది అంతర్గత వైవిధ్యం. సమాజంలో సాంస్కృతికంగా ఇంతటి వైవిధ్యం వున్నప్పుడు సార్వ త్రిక నేరస్మృతిని విధించినట్టు సార్వత్రిక పౌరస్మృతిని విధించడం సాధ్యం కాదు.
మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలైన కొత్త లోనే ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం చెలరేగింది. స్థానిక సాంస్కృతిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని కంపెనీ పాలకులకు అర్ధం అయింది. మతం ఆధారంగా కుటుంబ వ్యవహా రాలను నియంత్రించే చట్టపరమైన పద్ధతి రూపొందింది. కంపెనీ బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772లో జుడీషీయల్ ప్లాన్ రూపొందించాడు. సాంప్రదాయాలు ఆచారాల విషయంలో హిం దువులకు శాస్త్రాల్ని, ముస్లింలకు ఖురాన్‌ను, వర్తింపచేయాలని న్యాయస్థానాలను ఆదేశించాడు. హిందూ ధర్మశాస్త్రాలు అనేకం వున్నప్పటికీ మనుధర్మశాస్త్రాన్ని ప్రమాణికంగా భావించేవారు. ఆ క్రమంలో ఆంగ్లో-హిందూ లా, ఆంగ్లో-ముహమ్మడన్ లా రూపొందాయి. బ్రిటీష్ భాషాశాస్త్రవేత్త విలియం జోన్స్ 1794లో Institutes of Hindu Law; or the Ordinances of Manu పేరుతో మనుస్మృతిని ఇంగ్లీషులోనికి అనువదించాడు.
హిందూ సమాజాన్ని ఒక వృత్తంలో ఏడు వృత్తాలుగా సమాంతరంగానూ చూపించవచ్చు. పిరమిడ్ ఆకారంలో నిలువు గానూ చూపించవచ్చు. శిఖరభాగంలో బ్రాహ్మణులు, ఆ కింద క్షత్రీయులు, దాని కింద వైశ్యులు, దాని కింద ఎగువ శూద్రులు, దాని కింద దిగువ శూద్రులు. ఈ ఐదు అంతస్తులనే చాలామంది వర్ణవ్యవస్థ అంటున్నారు. ఆ కింద దళితులు వుంటున్నారు.. కొంతకాలం క్రితం వరకు ఆదివాసులు హిందూ వ్యవస్థకు భిన్నంగా వుండేవారు. ఇటీవల జనాభా లెఖ్ఖల్లో ఆరు మతాల్ని మాత్రమే గుర్తిస్తూ ఆదివాసుల్ని హిందూ సమూహపు గ్రౌండ్ ఫ్లోర్లో చేర్చారు. దీన్ని కాగితాల మీద చూస్తే పెద్ద విశేషంగా అనిపించదు. కానీ సమాజంలో ఆ రెండు సమూహాలను కలిపినపుడు కొన్ని వివాదాలు చెలరేగుతాయి. ఉదాహరణకు మణిపూర్‌లో మెయి తీలు, కుకీ జోలు ఒకే సామాజికవర్గం అంటే కుకీ జోలు అంగీకరించకపోవచ్చు.
నాడు వారెన్ హేస్టింగ్స్ అనుసరించిన విధానాన్నే రాజ్యాంగ సభ కూడా అనుసరించింది. ఎవరి మతం వారిదీ, ఎవరి ఆరాధనా రూపాలు వారివి, ఎవరి సాంస్కృతిక వ్యవహారాలు వారివి అనే నిర్ధారణకు వచ్చింది. మత స్వేచ్ఛను రాజ్యాంగ బద్ధం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి అంశం కూడ రాజ్యాంగసభలో చర్చకు వచ్చింది. ఆ తేనెతుట్టెను కదపడం ఇష్టంలేక దాన్ని ఆదేశిక సూత్రాల్లో 44వ అధికరణంగా పెట్టేశారు.
రాజ్యాంగం నాలుగవ షెడ్యూలులోని ఆదేశిక సూత్రాల్లో 36 నుండి 51 వరకు 16 అధికరణలున్నాయి. ఆర్టికల్ 38 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి చెబుతుంది. ఆర్టికల్ 39 సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణను నిరోధించడం, సామాజిక వనరులను సామాన్య మేలు కోసం వినియోగించడం గురించి చెబుతుంది. ఆర్టికల్ 41 పని, విద్య, ప్రజా సహాయం వంటి అంశా లపై దృష్టి పెడుతుంది. ఈ ఆదేశాలను పాటిస్తున్నారా? వాటిని పాటించకుండా నేరుగా ఆర్టికల్ 44 చెప్పిందని ఆచరిస్తామనడం సబబేనా?
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370) రద్దు, ఉమ్మడి పౌరస్మృతి (ఆర్టికల్ 44) అమలు అనే డిమాండు బీజేపీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ కాలం నుండే వున్నాయి. 1980లలో బాబ్రీమసీదు కూల్చివేత అంశాన్ని కూడా చేర్చుకున్నారు. కాస్త గమనించి చూస్తే ఇవి మూడూ సారాంశంలో ముస్లిం వేధింపు విధానాలని ఎవరికయినా అర్ధం అవుతుంది. లోక్ సభ ఎన్నికల ప్పుడు ఈ డిమాండ్లను బీజేపీ ముందుకు తెస్తుంటుంది. వీటిల్లో రెండు నెరవేరాయి. 2029 ఎన్నికలకు ఉమ్మడి పౌరస్మృతిని ముందుకు తెచ్చారు.
ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి బీజేపీ చేస్తున్న వాదన ఒక్కటే. ముస్లిం స్త్రీల మీద సాగుతున్న అణిచివేతను అడ్డుకుంటామని. ఇస్లామిక్ పౌరస్మృతిలో తండ్రి ఆస్తిలో కుమార్తెకు ఒకవాటా, కుమా రుడికి రెండు వాటాలు ఇస్తారు. ఆ ఒక్క అంశాన్నే విడిగా చూస్తే ఇది అన్యాయంగానే కనిపిస్తుంది. దీనికో సమర్ధన కూడ వుంది. కుమార్తె పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోతుంది. వృద్ధాప్యంలో తల్లి దండ్రుల్ని చూడాల్సిన నైతిక బాధ్యత కొడుకులది. అంతేకాదు, కుమార్తె వివాహ సందర్భంలో కట్నకానుకలు కూడ ఇవ్వాల్సి వుంటుంది. కనుక కొడుకులకు రెట్టింపు వాటా ఇవ్వాలనే సమర్ధన వుంది. ఇది అసమంజసం ఏమీకాదు. చట్ట ప్రకారం వరకట్న నిషేధం వుంది. అది ఆచరణలో వుందని ఏ ఒక్కరయినా నమ్ముతారా?
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం 7వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాము. ఆ సమయంలో, స్త్రీలకు ఆస్తిహక్కు, నిర్బంధ విద్య, విడాకులు ఇచ్చే సదుపాయం, వితంతు పునర్వి వాహం వంటి సంస్కరణల్ని ఇస్లాం చేపట్టింది. ఈ మహిళా సంస్క రణలు అనేక ఇతర సమూహాల్లో వెయ్యేళ్ళ తరువాతకు గానీ చర్చకు రాలేదు.
ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి మీద సంతానానికే కాక, భార్య, తల్లిదండ్రులు, సోదరులు, ఇతరులకు కూడ భిన్నమైన నిష్పత్తుల్లో వారసత్వ హక్కు వస్తుంది. ఈ వాటాల్ని లెక్కగట్టి పంపకాలు జరపడం చాలా చాలా సంక్లిష్ట వ్యవహారం.. 9వ శతాబ్దంలో పర్షియన్, ఇస్లామిక్, భారతీయ, గ్రీకు, బాబిలోనియన్ గణితశాస్త్రాల నుండి అల్ జీబ్రా విభాగాన్ని అభివృద్ధి చేసిన అల్-ఖ్వారిజ్మీ ఇస్లామిక్ ఆస్తి పంపకాల సమస్యను పరిష్కరించాడు. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో విరివిగా వాడుతున్న అల్గారిథమ్స్ అతని పేరు నుండే పుట్టింది.
ముస్లిం సమాజాన్ని అదుపు చేయడానికి ఈ చట్టాన్ని తెస్తున్నట్టు బీజేపీ పెద్దలు చెపుతున్నప్పటికీ ఇది ఆదివాసుల మీద తీవ్ర ప్రభావాన్ని వేసే ప్రమాదం వుంది. బయటి ప్రపంచానికి అర్ధం కానంత తీవ్ర వైవిధ్యం ఆదివాసుల్లో వుంటుంది. అసలు వాళ్లను పితృస్వామిక సమాజం అనడం కూడ కుదరదు. అది దాదాపుగా మాతృస్వామిక సమాజం. వాళ్ల మీద ఏకీకృత పౌరస్మృతిని రుద్దడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూళ్లు ప్రత్యేక గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా రక్షణలను కల్పిస్తున్నాయి. అంతేకాదు, నాగాలాండ్‌కు 371ఏ అధికరణం ద్వారా, మిజోరాంకు 371జి ద్వారా ప్రత్యేక నిబంధ నలు మత, సామాజిక ఆచారాలు, కొన్ని న్యాయపద్ధతులు, భూమి యాజమాన్యం వంటి అంశాల్లో ప్రత్యేక రక్షణలు వున్నాయి. వీటన్నింటినీ రద్దు చేయడానికే ఉమ్మడి పౌరస్మృతిని తెస్తున్నట్టు ఆదివాసీ సమూహాలు ఐదారేళ్ల క్రితమే గుర్తించాయి. ఝార్కండ్ లో చాలా పెద్ద సభ నిర్వహించి ఉమ్మడి పౌరస్మృతిని తిరస్కరిస్తు న్నట్టు తీర్మానాలు చేశాయి. ఈ కారణంగానే, తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో తీసుకునివచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టంలో ఆదివాసులు, మరికొన్ని సమూహాలకు మినహాయింపునిచ్చారు. కొన్ని సమూహాలను మినహాయిస్తే దానిని ఉమ్మడి పౌరస్మృతి అని ఎలా అంటారో అమిత్ షా చెప్పాలి.
ముస్లింలు ఎక్కువమందిని పెళ్ళి చేసుకుని, ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తున్నారనే ఆరోపణలతో ఒక ప్రచారం సాగుతోంది. “హమ్ పాంచ్, హమారే పచ్చీస్” నిందను నరేందర్ మోదీ స్వయంగా ప్రచారంలో పెట్టారు. జనాభా లెఖ్ఖలు దీన్ని సమర్ధి స్తున్నాయా? ప్రస్తుతం మనదేశంలో చనిపోతున్నవాళ్ల కన్నా పుడుతున్నవాళ్ళు తక్కువ. టోటల్ ఫెర్టిలిటీ రేటు రుణంగా మారిపోతున్న దశలో ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లను సన్మానిం చాలి. ఇలా నిందలేస్తారా? ఇస్లాంలో బహుభార్యత్వానికి ఆమోదం వున్న విషయం వాస్తవం. కానీ, దాన్ని ఆచరిస్తున్న దెంతమందీ? దాదాపుగా అది ఆచరణలో లేదు. అధికారికంగా బహు భార్యలు వున్నవారిని మనం ఎంతమందిని చూశాం అని ప్రశ్నించుకుంటే ఈ వాదనలోని డొల్లతనం అర్ధం అవుతుంది.
జెన్ జీ ఉద్యమం ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది – “జబ్ జబ్ నరేంద్ర మోదీ డర్తా హై; హిందూ ముస్లిం కర్తా హై”. ఈ వ్యూహం ఎన్నికల్లో తమకు లాభిస్తుందని బీజేపీ నమ్ముతోంది. అది ఉమ్మడి పౌరస్మృతికి కూడ వర్తిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని తెస్తామంటే అది రాజ్యాంగం కోరుకున్న సామాజిక బహుళత్వాన్ని నిరాకరించడమే అవుతుంది.
డానీ
సమాజ, రాజకీయ విశ్లేషకులు

