Thursday, November 21, 2024
Homeనేషనల్UNలో పర్మినెంట్ మెంబర్ గా భారత్? ఫుల్ సపోర్ట్ గా ఫ్రాన్స్

UNలో పర్మినెంట్ మెంబర్ గా భారత్? ఫుల్ సపోర్ట్ గా ఫ్రాన్స్

UNO: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించి అందులో భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలకు కూడా సభ్యత్వం కల్పించాలని ఫ్రాన్స్ పునరుద్ఘాటించింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు అవతరిస్తున్నాయనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించాలని ఫ్రాన్స్ ఈ సందర్భంగా సూచించింది. ఈశక్తివంతమైన అంతర్జాతీయ సమితిని మరింత బలోపేతం చేయడానికి ఈ దేశాలకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందంటూ ఫ్రాన్స్ వాదించింది. యూఎన్ లో ఫ్రాన్స్ ఉప శాశ్వత ప్రతినిధి నటాలియా బ్రాడ్ హర్ట్స్ సమితి ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ..“ ఫ్రాన్స్ వైఖరిలోనూ, విధానంలోనూ ఎటువంటి మార్పూ ఉండదు, అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. భద్రతా మండలి మరింత బలోపేతం కావాలంటే ప్రపంచంలో శక్తివంతమంతమవుతున్న భారత్ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించటం అనివార్యంగా కనిపిస్తోంది” అని స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ ప్లీనరీ సమావేశంలో ప్రధానంగా భద్రతా మండలి గురించిన అంశాలు చర్చకు వచ్చాయి. కొత్త శక్తివంతమైన దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, వాటికి కూడా తగిన బాధ్యతలు అప్పగించాలని దీనివల్ల మరిన్ని దేశాలు ప్రపంచ శాంతికి కృషి చేయడానికి అవకాశం కలుగుతుందని ఆమె వివరించారు. ప్రపంచ శాంతికి, యుద్ధ నివారణకు భద్రతా మండలి మరింతగా పాటుపడాలన్న పక్షంలో ఇందులో శాశ్వత సభ్యుల సంఖ్యను 25 వరకు పెంచవచ్చని ఆమె సూచించారు. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ దేశాలు ప్రస్తుతం అతి వేగంగా అభివృద్ధి సాధిస్తుండటమే కాకుండా, ప్రపంచ శాంతికి స్వయంగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆమె వివరించటం హైలైట్. వీటితోపాటు కొన్ని ఆఫ్రికా దేశాలకు కూడా సభ్యత్వం కల్పించటం వల్ల ప్రపంచం ఎంతో లబ్ది పొందుతుందని ఆమె తెలిపారు.

ఒక పక్క భద్రతా మండలి సాధికారతను పటిష్టం చేస్తూనే, దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ స్థాయిలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఈ మండలిని మరింత బలోపేతం చేయటంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉందని ఫ్రాన్స్ నొక్కి చెప్పటం విశేషం. “పెద్ద ఎత్తున ఊచకోతలు, మారణ హోమాలు జరిగిన సందర్భాల్లో భద్రతా మండలిలోని అయిదుగురు శాశ్వత సభ్యులు తమ వీటో అధికారానికి స్వస్తి చెప్పాలి. ఈ విషయాన్ని ఫ్రాన్స్ 2013 నుంచి పదేపదే చెబుతూనే వస్తోంది” అంటూ ఆమె ప్రసంగంలో వివరించారు. ఈ మండలిలోని ప్రస్తుత శాశ్వత సభ్య దేశాలు ఇందుకోసం నిబంధనావళిని మార్చాల్సిన అవసరమేమీ లేదని, వాటికి రాజకీయ నిబద్ధత ఉంటే చాలని ఆమె అన్నారు. కాగా, ఈ నాలుగు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ఫ్రాన్స్ ప్రతిపాదనకు బ్రిటన్ కూడా మద్దతు పలికింది. పర్మినెంట్ మెంబర్ దేశాలే కాక, తాత్కాలిక సభ్యుల సంఖ్యను కూడా పెంచాలని, శాశ్వత సభ్యుల కేటగిరీలో భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ లకు కూడా స్థానం కల్పించాలని తాము మొదటి నుంచీ సూచిస్తూనే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ రాయబారి బార్బరా ఉడ్ వర్డ్ స్పష్టంచేశారు. దీనివల్ల భద్రతా మండలి ఈ ప్రపంచానికి మరింతగా ప్రాతినిధ్యం వహించగలుగుతుందని, భద్రతా మండలిని మరింతగా సంస్కరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. అయిదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ లు ఇప్పటికే భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపాయి. ఇంకా చైనా మద్దతు తెలియజేయాల్సి ఉంటుంది. కాగా భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వ గడువు వచ్చే నెలతో ముగియబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News