తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి ఎడారిలో వర్షపు జల్లుల్లా యువతను ఊరించాయి. నోటిపికేషన్లు ఏప్పుడోస్తాయో తెలియని అయోమయస్థితిలో ఉన్న విద్యార్థి, నిరుద్యోగు లకు ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ.. ‘రేపు అం దరూ టీవీల ముందు కూర్చుని చూడండి. యావత్తు తెలం గాణ ఆశ్చర్యపోయే ప్రకటన చేస్తాన’ని చెప్పినప్పుడు ఇలాంటి మాటలు ఎన్నో విన్నామనుకున్నారు నిరుద్యో గులు. అయితే, ముఖ్యమంత్రి చట్టసభలో తెలిపినట్టుగానే మరునాడు ఉద్యోగ ఖాళీలపై ప్రకటన చేసి యావత్తు రాష్ట్రాన్ని ఒక్కసారిగా విస్మయానికి గురి చేశాడు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కలిపి యాభై వేల పై చిలుకు ఖాళీలు ఉన్నాయని, ఒక్కపోస్టును కూడా ఖాళీగా పెట్టకుండా అత్యంత పారదర్శకంగా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పాడు. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశా లిచ్చాడు. ఆ వెంటనే నోటిఫికేషన్ల పరంపర మొదలైంది. దానితో రాష్ట్రంలో ఉద్యోగ సంరంభం ప్రారంభమైంది. కోచింగ్ సెంటర్లన్నీ నిండిపోయాయి. తెల్లవారుఝాము నుంచి రాత్రి పొద్దుపోయే దాకా బ్యాచిలు, బ్యాచిలుగా కోచింగ్ వచ్చే విద్యార్థులతో కోచింగ్ కేంద్రాలే కాదు, వీధులు వాడలన్నీ సందడిని సంతరించుకున్నాయి. ఈ ప్రత్యక్ష కోచింగ్‌లకు తోడు ఆన్‌లైన్ క్లాసులకు కూడా విద్యార్థుల తాకిడి కొనసాగుతున్నది. ఉద్యోగాలపై ఆశ లొదిలేసి ఊర్లో వ్యవసాయ పనుల్లో మునిగిన వారు సైతం ఇసారి ఏదైతే అదిగానీ అని కోచింగ్ సెంటర్ల దారిబట్టి ప్రభుత్వ ఉద్యోగా లకు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఊళ్లల్లో ఆసరా పింఛన్లు తీసుకునే ముసలోళ్ల నుంచి ఉపాధి కూలీలు, నిరక్షరా స్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. ఇలా ఏ ఇద్దరు కలిసి నా, ఏ సందర్భంలో అయినా గవర్నమెంట్ జాబ్ నోటిఫి కేషన్ల గురించే మాట్లాడుకోవడం కామన్ సీన్‌గా తయారైంది.
సీఎం ప్రకటించినట్టుగానే 18000 వేలకు పైగా పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్.. వేల సంఖ్యంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలతో పోలీస్‌బోర్డు నోటిఫికేషన్స్.. ఇలా ఒకదాని వెంట ఒకటిగా వరుస నోటి ఫికేషన్లు విడుదలయ్యాయి. దీనితో ‘నూరు ఆరైనా సరే..’ ఈసారి ఉద్యోగం కొట్టాల్సిందే అన్న కోరికతో, కసితో ప్రతిఒక్కరూ ప్రిపరేషన్ ప్రారంభించారు. కోచింగ్‌లకు వేలకువేలు వెచ్చిస్తూ హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల హస్టళ్లు, రూమ్‌లలో ఉంటూ చదువుకుంటున్నారు. వేల రూపాయలు వెచ్చించి కాంపిటేటివ్ పుస్తకాలు కొంటు న్నారు. నిరుపేదలు, నిరుద్యోగులు తమ పేదరికం గురించి ఆలోచించకుండా ఉద్యోగమొస్తే తమ బతుకులు మారుతా యన్న ఏకైక ఆలోచనతో అప్పులు తడిసి మోపెడైనా వెనుకంజ వేయకుండా.. అయ్యాఅవ్వలకు ఉద్యోగం వస్తే అన్ని అప్పులు తీర్చుకుందాం అని భరోసా ఇచ్చి కోచిం గుల్లో చేరుతున్నారు. ఇంకొందరైతే ఉన్నపొలం అమ్మేసి, మరికొందరైతే ఇల్లూపొల్లూ తాకటు ్టపెట్టి మరీ డబ్బులు చేతపట్టుకుని హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, దిల్‌సుక్ నగర్, కూకట్‌పల్లి వంటి కోచింగ్ అడ్డాలలో వాలిపోతు న్నారు. పెళ్లైన నిరుద్యోగులు కన్నకలలను నిజం చేసుకోవ డానికి కట్టుకున్న భార్యాపిల్లల్ని వదిలిపెట్టి హైదరాబాద్ బాటపట్టారు. ముఖ్యంగా పెళ్లైన ఆడపిల్లలు అత్తింటివారిని ఒప్పించి మరీ కోచింగ్‌లు పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్లు లేకపోతే చంటిపిల్లలు, ఎదపిల్లలను సైతం హస్టళ్లలో వేసి భార్యాభర్తలెంతో మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో హైదరాబాద్ బస్సెక్కారు.
ఇలా వచ్చిన అభ్యర్థులతో హైదరాబాద్‌లోని అశోక్ నగర్, దిలుసుక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, రీడింగ్ హళ్లు.. ఇలా ఎక్కడ చూసినా నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. తిండీతిప్పలు మానేసి.. ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ.. ప్రిపరేషన్లను కొనసాగిస్తున్నారు. పోటీ పరీక్షలో అధిక మార్కులు సంపాదించి ఉద్యోగం సాధించ డం అన్న ఏకైక సంకల్పమే తప్ప వేరే ఆలోచనే లేని పరిస్థితి. నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు, బంధుమి త్రులే కాదు రాష్ట్రంలో అందరూ ఉద్యోగ నియామాకాల గురించే చర్చించుకోవడం ఎక్కడైనా చూడొచ్చు.
ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల తేదీల ప్రకటన, గ్రూప్-1, ఇతర పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఇంకే ముంది నెలల వ్యవధిలో ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుని మరింత గట్టిగా ప్రిపేరవుతున్న తరుణంలో అత్యంత పారదర్శకతతో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, దేశంలో ఎక్కడా నిర్వహించని విధంగా గ్రూప్-1 రిక్రూట్ మెంట్ టెస్టులు కండక్ట్ చేస్తామని, జంబ్లింగ్ మెథడ్‌లో క్వశ్చన్ పేపర్ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఇంటర్వ్యూ లేనందున పైరవీ లకు ఆస్కారం ఉండదు కాబట్టి ప్రతిభ చూపితే ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే నమ్మకంతో అందరూ శక్తికి మించి ప్రిపేరై పరీక్షలు రాసారు. టీఎస్‌పీఎస్సి చైర్మన్ చెప్పినట్లు గానే పరీక్షలు పకడ్బందీ&.గానే నిర్వహించారు. పేపరు స్థాయి కూడా గ్రూప్-1 స్థాయిలోనే ఉంది.
హమ్మ.. తెలంగాణలో ఇంత మార్పులా!
మన రాష్ట్రంలో మన ప్రభుత్వం కదా అని ఊపిరి పీల్చుకున్నారు. గ్రూప్-1 మెయిన్స్‌తోపాటు ఇతర పరీక్ష లకు ప్రిపరేషన్‌ని సానబెడుతున్నారు. దాంట్లో చాలా పరీక్షలు జరిగాయి. ఒక్కోపరీక్ష పేపరు ఒక్కోతీరు.. అం చనా వేసే పరిస్థితి లేదు. అందరూ తెలంగాణలో పోటీ పరీ క్షల్లో నయా ట్రెండ్ ప్రారంభమైందని సంతోష పడుతున్న తరుణంలో అనగనగా ఒక రోజు రాత్రికిరాత్రి టీఎస్‌పీఎస్సీ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి, జరుగబోయే తదుపరి పరీక్ష లను వాయిదా అనే వార్తలు వెల్లువడ్డాయి. సాంకేతిక ప్రపంచంలో ఇలాంటివి అప్పుడప్పుడు జరగొచ్చు, టీఎస్‌పీఎస్సీ కూడా సానుకూలంగా స్పందించి తమకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటుందని నిరుద్యోగులు, వారి శ్రేయోభిలాషులు భావించారు. కానీ, వారి కలలు కారి పోవడం మొదలైంది. రోజులు గడిచి అసలు వ్యవహారం బయటకొచ్చింది. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ఒక చిరుద్యోగి బయటవ్యక్తులకు ప్రశ్నాపత్రాల లీక్ చేయడంతో మొదటికే మోసం వచ్చింది. ఆ విధంగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన దాదాపు 15 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. అవి, వాట్సాప్‌ల ద్వారా దేశవిదేశాలకు వెళ్లడంతో మన అవినీతి ఘనకీర్తి ఖండాంతరాలు దాటింది. తినోతినకనో, పండ గొచ్చినా పబ్బమొచ్చినా ఇంటికి వెళ్లకుండా లైబ్రరీల్లో, హైదరాబాద్‌లోని ఇరుకు గదుల్లో పుస్తకాలతోనే సావాసం చేసిన నిరుద్యోగులు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సినిమా ట్విస్టుల్లాగా ఒకదాని తర్వాత ఒకటి జరిగిన పరీక్షలన్నీ రద్దవడం మళ్లీ వాటిని నిర్వహిస్తామనడంతో అందరూ హతాశులయ్యారు. నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. నేటికీ ఈ లీకేజిపై స్పష్టమైన నిర్ణయాలను బోర్డు, ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల నిరుద్యోగులను నిరత్సాహం కమ్మే సింది. ఈ ఉద్యోగ నియామాకాలు పూర్తవుతాయా? అస లు తమకు ఉద్యోగాలు వస్తాయా? అన్న సందిగ్ధ స్థితిలో పడిపోయారు.
చేస్తున్న పనులు, బతుకుదెరువు కోసం చేస్తున్న ఉద్యోగాలు.. అన్నీ వదులుకుని కుటుంబానికి దూరంగా ఉంటూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడు మళ్లీ ప్రిపరేషన్ కొనసాగించాలా?! తిరిగి ఇంటికి వెళ్లిపోయి ఏదైనా పని దొరకబుచ్చుకుని కలోగంజో తాగుతూ బత కాలా? తేల్చుకోలేని మనోవేదనలో నిరుద్యోగులు కొట్టు మిట్టాడుతున్నారు. అచ్చంగా చెప్పాలి అంటే ‘కొన ఊపిరి తో ఉన్న నిరుద్యోగి మెడపై కాళ్లు పెట్టి బలంగా తొక్కుతూ ఊపిరి తీస్తున్నట్టుగా ఉంది నేటి నిరుద్యోగి పరిస్థితి’. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా నీరుగారి పోతున్నాడు నిరుద్యోగి. ప్రభుత్వం వీరికి భరోసా కల్పిం చాలి. ఉద్యోగాలు భర్తీ చేసి తెలంగాణ ఆకాంక్షలు తీర్చాలి.
సర్కారు నౌకరీ ఇక కలేనా..?
కొట్లాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కలగానే మిగిలిపోయే పరిస్థితులు దాపురించాయి. నడిసముద్రంలో అలలతాకిడికి కొట్టు మిట్టాడుతున్న చిన్న నావకి రంధ్రం పడితే ఎలా ఉం టుందో. నేటి నిరుద్యోగి పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. నడి బజారున పడ్డ నిరుద్యోగిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
- అల్లం సాయి కృష్ణ
బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఫ్యాకల్టీ