Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Unemployment: నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది?

Unemployment: నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది?

దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందా, తగ్గుతోందా? కాంగ్రెస్‌ హయాంలో ఏ స్థితిలో ఉంది? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థితిలో ఉంది? నిజానికి, దేశంలో నిరుద్యోగ సమస్యకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లభ్యం కావడం లేదు. ఒకప్పటి నిరుద్యోగ సమస్యకు, ఇప్పటి నిరుద్యోగ సమస్యకు చాలా తేడా ఉందని, దీనికి సంబంధించిన నిర్వచనం బాగా పెరిగిపోయిందని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున డిజిటలైజేషన్‌ జరిగి పోతుండడంతో నిరుద్యోగ సమస్య స్వరూప స్వభావాల్లో ఎంతో మార్పు చోటు చేసుకుందనేది వారి అభిప్రాయం. డిజిటలైజేషన్‌ జరగక ముందు గణించిన తీరులోనే డిజిటలైజేషన్‌ జరిగిన తర్వాత కూడా ఈ సమస్యను గణించడంలో అర్థం లేదని కూడా వారు చెబుతున్నారు. ప్రముఖ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, 2010 ప్రాంతంలో ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారు అయిన సుభాష్‌ సక్సేనా అభిప్రాయం ప్రకారం, నిరుద్యోగ సమస్యకు కొత్త నిర్వచనం కనుగొనాల్సి ఉంది. ఈ సమస్యను సరికొత్తగా గణించాల్సి ఉంది.
సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సి.ఎం.ఐ.ఇ) తాజా అంచనాల ప్రకారం గత 16 నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 8.3 శాతానికి చేరుకుంది. దేశాన్ని కరోనా మహమ్మారి చు ట్టుముట్టడానికి ముందు నాలుగు కోట్ల మంది నిరుద్యోగులుండగా, ఆ తర్వాత డిసెంబర్‌ నాటికి అది 10.3 శాతానికి చేరుకుందని ఈ సంస్థ అంచనా. విచిత్రమేమిటంటే, మహమ్మారికి ముందు నిరుద్యోగ ‘ 6.2 శాతం మాత్రమే ఉంది. మొత్తానికి కరోనా కారణంగా చాలామందికి ఉద్యోగాలు పోవడం, ఎవరికీ ఉద్యోగాలు రాకపోవడం ఈ సమస్యను పెంచి పెద్ద చేసింది. నిజానికి, నిరుద్యోగ సమస్యకు సంబం ధించినంత వరకూ అధికారిక, అనధికారిక లెక్కలకు మధ్య ‘హస్తిమశకాంతరం’ తేడా ఉంది. అధికారిక లెక్కలను బట్టి చూసినప్పటికీ దేశంలో నిరుద్యోగ సమస్య ఆయేటికాయేడు తగ్గుతూనే ఉంది తప్ప పెరగడం లేదని సుభాష్‌ సక్సేనా వంటి నిపుణులు చెబుతున్నారు. అంతేకాక, ఈ సమస్యకు సంబంధించి న కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆధారమేమీ లేదని, అవి చెబుతున్న గణాంక వివరాలు చాలా వరకు సత్యదూరమని కూడా నిపుణులు వాదిస్తున్నారు. అయితే, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం మాత్రం ఉందని తేలుతోంది.
ఈ సమస్యకు సంబంధించి అసలు సిసలు వివరాలు లభ్యమైతే ప్రభుత్వాలు కొత్త విధానాలను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, దేశంలో నిరుద్యోగులు ఎంత మంది? వారి విద్యా ర్హతలేమిటి? ఎటువంటి ఉద్యోగాల కోసం వారు ప్రయత్నిస్తున్నారు? వారు పూర్తిగా ఖాళీగానే ఉంటున్నారా? ఇటువంటి వివరాలను సేకరించగలిగే పక్షంలో నిరుద్యోగ సమస్య అసలు సిసలు స్వరూపం కళ్లకు కడుతుంది. ఈ రకమైన వివరాలు సేకరించడం ప్రభుత్వాలకు గగనమైపోతోంది. దేశం పారిశ్రామిక ప్రకగతిలో, కార్పొరేట్‌ సంస్థల అభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీపడుతున్నప్పటికీ, విద్యావకాశాలకు దీటుగా ఏదో ఒక ఉద్యోగం లభించడానికి అవకాశాలు ఉంటున్నప్పటికీ నిరుద్యోగ సమస్య మాత్రం యథాత థంగా ఉంటూ వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనాభాపరంగా భారత్‌ తన పొరుగు దేశమైన చైనాను త్వరలో మించిపోయే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా ఉద్యోగాల సృష్టి, కల్పన జరగాల్సి ఉంది. ఇది జరగని పక్షంలో దేశంలో అశాంతి, అసహనాలు పెరిగే ప్రమాదం ఉంది. అయితే, దేశంలో ఏ విధంగా చూసినా అశాంతి పెరిగేంత స్థాయిలో నిరుద్యోగ సమస్య పేట్రేగిపోవడం లేదని నిపుణులు భావిస్తున్నారు.
తప్పుడు లెక్కలు అధికం
ఇది ఇలా ఉండగా, అనధికారిక లెక్కల ప్రకారం, దేశంలో ఉద్యోగాలు చేయ డానికి అర్హతలు సంపాదించుకున్నవారి సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతోంది. చదువులపరంగా, వయసుపరంగా ఉద్యోగాలకు అ ర్హతలు సంపాదించుకున్నవారి సంఖ్య మరో పదేళ్లలో వందకోట్లకు పెరిగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. సరైన జీత భత్యాలతో, విద్యకు తగ్గ ఉద్యోగాలు సమకూర్చడానికి ఇప్పటి నుంచే గట్టి ప్రయ త్నాలు ప్రారంభించాల్సి ఉంటుందని కూడా ప్రైవేట్‌ రంగాలవారు అభిప్రాయపడుతు న్నారు. ఆసియాలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో విద్యార్హతలున్న నిరు ద్యోగుల సంఖ్య బాగా తక్కువగానే ఉందనే అభిప్రాయం 2021లో జరిగిన ప్రపంచ బ్యాంక్‌ సర్వేను బట్టి అర్థమవుతోంది. కాగా, నిరుద్యోగ సమస్యను గణించడానికి ఇంతవరకూ ఉపయోగిస్తున్న పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతులను ప్రవేశ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఉద్యోగం-నిరుద్యోగాలకు సంబంధించి డాటాను సమీకరించి, క్రోడీకరించడానికి ఒక ఆధునిక యంత్రాంగాన్ని చేపట్టడంతో పాటు, ఈ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్ట డానికి కూడా కేంద్రం ప్రయత్నిస్తోంది.
నిజానికి, 2019 ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఈ రకమైన ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో నిరుద్యోగం 6.1 శాతంగా ఉంది. అయితే, ఈ సమస్యను మసి పూసి మారేడుకాయ చేయడానికే ప్రభుత్వం కొత్త పద్ధతి అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో ఈ ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. సి.ఎం.ఐ.ఇ అనుసరిస్తున్న పద్ధతుల్లో కొన్ని లోపాలున్నట్టు ప్రముఖ ఆర్థిక నిపుణులు జాన్‌ డ్రైజ్‌, అన్మోల్‌ సోమంచి వ్యాఖ్యానించారు. అంటే, ఉద్యోగాలు తత్సంబంధిత సూచికల కోసం నమ్మదగిన, ఆధారపడదగిన, అధికారిక గణాంకాలను సాధ్యమై నంత త్వరలో సమీకరించాల్సిన అవసరం ఉంది. నమ్మదగిన, ఆధారపడదగిన డాటా లభించకపోవడంతో నిరుద్యోగ సమస్యతో పాటు మరికొన్ని కీలక సమస్యలకు పరిష్కారం అందుబాటులోకి రావడం చాలా కష్టమవుతుంది. తప్పుడు సమాచారం ఆధారంగా రూపుదిద్దుకునే విధానాలు లోపభూయిష్టంగానే ఉంటాయి.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News