Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Union Budget 2024: ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌ ప్రాధాన్యం

Union Budget 2024: ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌ ప్రాధాన్యం

గత మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌ నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను, రాజకీయ అనివార్యతలనే కాక, దేశంలో నెలకొని ఉన్న నిరుద్యోగ సంక్షోభానికి అద్దం పట్టింది. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయింపులు జరపడం ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం సంతరించు కుంది. ఈ రెండు రాష్ట్రాలలోని పాలక పక్షాల మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధారపడు తున్నందువల్ల, ఈ కేటాయింపులు అనివార్యం అయినట్టు కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగాల సృష్టికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం దేశంలో తీవ్రస్థాయిలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నిరుద్యోగ సమ స్యను అత్యవసరంగా పరిష్కరించే ప్రయత్నం చేయడాన్ని ఒక ఆర్థిక అవసరంగా, రాజకీయ సవాలుగా పరిగణించవచ్చు.
దేశంలో నిరుద్యోగ సమస్య చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిందనడంలో సందేహం లేదు. ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ మహమ్మారి కారణంగా నిరుద్యోగ సమస్య మరింత జటిలంగా మారింది. దేశం అగ్రరాజ్యాలతో సమానంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నా, స్టాక్‌ మార్కెట్లు విజృంభిస్తున్నా నిరుద్యోగ సమస్య ఉధృతమవుతోందే తప్ప తగ్గే సూచనలు కనిపిం చడం లేదు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగాల సృష్టికి ప్రత్యేకంగా పొందుపరచిన కొన్ని అంశాలు ఈ సమస్యను ఏ మేరకు పరిష్కరిస్తాయన్నది వేచి చూడాలి. ఈ ప్రశ్నకు వెను వెంటనే సమాధానం దొరికే అవకాశం లేదు కానీ, కనీసం ఈ సమస్య పరిష్కారానికి ప్రాధా న్యం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ సమస్య తీవ్రతను గుర్తించడమే పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. స్వల్ప కాలంలో అర్థవంతమైన, గౌరవప్రదమైన ఉద్యోగాలను సృష్టించడానికి కూడా బడ్జెట్‌ పరంగా ప్రయత్నం ప్రారంభమైంది.
జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా విద్యాధిక యువతీ యువకులకు ఉద్యోగాలు సృష్టిం చడం పైన కేంద్రం దృష్టి పెట్టడంతో దేశవ్యాప్తంగా దీని మీదకు చర్చ మళ్లింది. నైపుణ్యాలను పెంచడానికి, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, పెట్టుబడులు పెంచడంతో పాటు, చిత్త శుద్ధితో వ్యవహరించడం కూడా తప్పనిసరిగా జరగాలి. మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థనొక దానిని ఏర్పాటు చేయడం జరుగుతుందని బడ్జెట్‌ ప్రతిపాదిం చింది. అయితే, ప్రాథమిక సదుపా యాల కల్పన రంగం మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్‌ రంగం సిద్ధంగా లేకపోవడంతో ఈ ప్రతిపాదన ఎంత వరకూ అమలు జరుగు తుందన్నది సందేహాస్పదమే. ఇక అరకొర చర్యల ద్వారా మానవ మూలధనం అభివృద్ధి చెందడం జరిగే పని కాదు. రేపటి తరం ఉద్యోగాలకు ఇప్పటి తరం విద్యార్థులను తయారు చేయగలిగినంత సామర్థ్యం ప్రస్తుత విద్యా వ్యవస్థకు లేదు. ఇందుకుఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం కూడా సాధ్యం కాదు. విద్యారంగాన్ని ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్ద డానికి దీర్ఘకాలిక ప్రయత్నాలు, ప్రణాళికలు అవసరం. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకో వాల్సి ఉంటుంది. వీటన్నిటికీ భారీ నిధులు, పెట్టుబడుల అవసరం ఉంటుంది. ద్రవ్యలోటును, ప్రభుత్వ రుణాలను తగ్గించడం మీద ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ ఆధారపడి ఉంటుంది. పన్నేతర ఆదాయాన్ని 35.78 శాతం పెంచడం ద్వారా ఆదాయ లోటును జీడీపీలో 0.8 శాతం వరకూ తగ్గించడం జరిగింది కానీ, దీన్ని మరింతగా తగ్గించడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. రిజర్వు బ్యాంకు నుంచి భారీగా నిధులు తరలి రావడం వల్ల ఈ లోటు బాగా తగ్గడానికి అవ కాశం ఏర్పడింది. మొత్తం మీద రెవెన్యూ లోటు తగ్గడంతో ద్రవ్యలోటు కూడా చాలావరకు తగ్గింది. ఇక పన్నుల వల్ల నికరంగా లభించే ఆదాయం 2023-24లో 10.5 శాతం పెరగగా, ఈ ఏడాది అది 11.7 శాతం పెరిగింది. పన్నుల వ్యవస్థలో మార్పులు, చేర్పుల వల్ల 1.1 శాతానికి మించి పెరుగుదల లేకపోవడం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పెద్దగా దోహదం చేయదు. మొత్తం మీద కొద్దిగా కష్టసాధ్యమైన విషయమే అయినప్పటికీ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News