Central Government Injustice: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగా ణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రాష్ట్రానికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. ఇక జాతీ య పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రా ష్ట్రాల ప్రయోజనాలు సహజంగానే కాపాడ బడతాయన్న నమ్మకం తెలంగాణ విష యంలో పదేపదే తప్పుదోవ పట్టుతోంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం కొనసాగుతున్న ఈ 12 ఏళ్ల కాలంలో తె లంగాణకు ఎదురవుతున్న అనుభవాలు ఆ నమ్మకాన్ని పూర్తిగా ప్రశ్నార్థకంగా మార్చే శాయి.
2026-27 కేంద్ర బడ్జెట్ కూడా అదే ధోరణిని మరోసారి నిర్ధారించింది. ఇది కేవలం ఒక ఆర్థిక పత్రం మాత్రమే కాదు, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ దృష్టి ఏంటో, సమాఖ్య వ్యవస్థను కేంద్రం ఎలా చూస్తుందో చెప్పే రాజకీయ ప్రకటన. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఒక్క ప్రత్యేక కేటాయింపూ కనిపించలేదు. గతంలో మాదిరిగానే ‘దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాల్లో భాగంగానే తెలంగాణ కు ప్రయోజనం’ అనే వాదనతో కేంద్రం చేతులు దులుపు కుంది. అంటే దేశానికి ఏది వస్తే అదే తెలంగాణకు వస్తుంది, అంతకు మించి తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదన్న సందేశమే ఈ బడ్జెట్ ఇచ్చింది.
విభజన చట్టంలోని హామీలతో పాటు దాదాపు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టా ఇప్పటికే కేంద్రం ముందు ఉంచిన తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా వాటికి మో క్షం లభిస్తుందని భావించినా ఆశించిన ప్రయోజనం లేకుం డా పోయింది. హైదరాబాద్ విశ్వ నగర విస్తరణకు మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిచ్చే కీలక ప్రాజెక్టుల పైన కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పంపింది. ఈ నేప థ్యంలో వాటి పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావించిం ది.
మొత్తం 34 వేల 367 కోట్ల రూపాయలతో చేప ట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను కలిపే 45 వేల కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రాన్ని కోరుతున్న తెలంగాణ ఈ బడ్జెట్‌లో కేటా యింపులపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న అప్పులు, అభివృద్ధి-సంక్షే మాల మధ్య సమతౌల్యం సాధించాల్సిన అవసరం నేపథ్యం లో కేంద్రం నుంచి సహకారం తప్పనిసరి అని తెలంగాణ ప్రభు త్వం భావించింది. ముఖ్యంగా తెలంగాణను ఫ్రీ ట్రిలి యన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగు ణంగా నిధులు వస్తాయని, 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయి లకు మోక్షం లభిస్తుందని, విభజన హామీల్లో కొన్నిం టికైనా న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఆశించింది. కానీ ఈ మూడు అంశాల్లో ఏ ఒక్కదానిపైనా స్పందించలేదు.
రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, సీవరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు, లెదర్ పా ర్కులు, సింగరేణికి గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, రాష్ట్రం కోరిన ప్రతిపాదనల జాబితా చాలా పెద్దది. కానీ కేంద్ర బడ్జెట్‌లో వాటి ఊసే లేదు. ఇది కేవలం నిధుల లేమి కాదు, రాష్ట్ర అవసరాల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం.
దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్వే కారి డార్లను ప్రకటించగా, అందులో మూడు హైదరాబాద్‌కు సంబం ధించినవని కేంద్రం చెబుతోంది. పుణె-హైదరాబాద్, బెంగళూరు-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై కారిడార్లు తెలంగాణకు వరమంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇవి తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తుల ఫలితాలు కావు, జాతీయ ఆర్థిక అవసరాల మేరకు రూపొందిన ప్రాజెక్టులు మాత్రమే. వాటి ద్వారా రాష్ట్రానికి కొంతమేర లాభం చేకూరినా, వాటిని తెలంగాణకు ప్రత్యేకంగా చేసిన మేలు అని చెప్పడం మోసమే.
పన్నుల వాటా విషయంలోనూ తెలంగాణకు జరుగు తున్న అన్యాయం తీవ్రంగానే ఉంది. 2.11 శాతం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో పెద్ద భాగం ఇప్పటికీ అంద లేదు.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన వేల కోట్లకు బదులు కేవలం చిల్లర మొత్తమే ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది కేవలం లెక్కల తేడా కాదు, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరిచే విధానపరమైన వివక్ష. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యాన్ని పరిశీలిస్తే కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా అర్థమవుతాయి. మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయిం చిన మొత్తం పరిమితంగానే ఉంది. అప్పులపై వడ్డీ చెల్లింపు లకు ఖర్చు చేస్తున్న మొత్తంతో పోలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయింపులు చాలా తక్కువ. డ్రోన్లు, ఏఐ, డిజిటల్ వ్యవసా యం వంటి పదాలు బడ్జెట్ ప్రసంగంలో వినిపించినా, రైతు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు ఇవి ఎంతవరకు పరిష్కారం చూపిస్తాయన్న ప్రశ్నకు సమాధానం లేదు.
మధ్యతరగతి, వేతన జీవుల విషయంలోనూ ఈ బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. ఆదాయ పన్ను మినహాయింపుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల భారంతో నలిగిపోతున్న వేతన జీవులకు ఊరటనిచ్చే ఒక్క నిర్ణయమూ కనిపించలేదు. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్నా, ఆ వృద్ధి ఫలి తాలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాల్లో ఎందుకు కనిపిం చడం లేదన్న ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది.
తెలంగాణకు సంబంధించి రాజకీయ కోణం మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం ప్రజ ల్లో బలపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని ప్రతిని ధులు రేపు మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకు ని ఓట్లు అడుగుతారన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడం ఈసారి కూడా కొనసాగిందన్న విమర్శ లు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయని రాజకీయ వర్గాలు ఆరోపిస్తు న్నాయి. తెలంగాణకు ఎప్పటిలాగే నిర్లక్ష్యమే ఎదురైంది.
మొత్తంగా చూస్తే 2026-27 కేంద్ర బడ్జెట్ తెలంగా ణకు మరోసారి ఒక చేదు నిజాన్ని గుర్తు చేసింది. జాతీయ పార్టీ అధికారంలో ఉందని రాష్ట్ర ప్రయోజనాలు స్వయంగా కాపాడబడవు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యతను మరిచినప్పుడు, ఆ ప్రభావం నేరుగా రాష్ట్ర ప్రజల మీదే పడుతుంది.
దేశానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే టాప్ రాష్ట్రా ల్లో తెలంగాణ ఒకటి. ఐటీ, ఫార్మా రంగాల్లో దేశానికి తలమా నికంగా నిలుస్తున్న హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ, గుజరాత్, కర్నాటక, బీహార్ వంటి రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం సగభాగం కూడా తెలంగాణకు ఇవ్వలేదని, ఇది కచ్చితంగా రాజకీయ వివక్షేనని రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు, మేధావులు ఆర్థి క బడ్జెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన హా మీల అమలులోనూ, కొత్త ప్రాజెక్టుల మంజూరులోనూ తీవ్ర వివక్ష కనబరుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే. తెలంగాణ ప్రజలు ఈ పరిస్థితిని ఎంతకాలం భరిస్తారు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైన ప్రతినిధులకు ప్రజలు ఎలాంటి రాజకీయ సమా ధానం ఇస్తారు? తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేనని తాజా బడ్జెట్ ద్వారా మరోసారి బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన 16 ఎంపీలుండీ ఏం ప్రయోజనం అని ప్రజలనుకుంటు న్నారు. ఇక తెలంగాణ ప్రజలు వచ్చే మున్సిపాలిటీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల ద్వారా తడాఖా చూపెట్టాలని కోరుకుందాం.
మన్నారం నాగరాజు
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

