Homeఎడిటోరియల్ / బహుళబీసీ ఉపకులాల విలీనమే రాజ్యాధికారానికి మార్గం

బీసీ ఉపకులాల విలీనమే రాజ్యాధికారానికి మార్గం

భారతదేశ ప్రజాస్వామ్యంలో “బీసీ రాజ్యాధికారం” అనే నినాదం దశాబ్దాలుగా మార్మోగుతోంది. ప్రతి ఎన్నికల సమయంలో, ప్రతి రాజకీయ సభలో, ప్రతి ఉద్యమ వేదికపై బీసీల పేరే వినిపిస్తుంది. కానీ ఒక సాధారణ బీసీ కుటుంబం వెనక్కి తిరిగి చూసుకుంటే – తమ జీవితాల్లో నిజంగా ఎంత మార్పు వచ్చింది? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం అంత స్పష్టంగా కనిపించదు. బీసీల పేరు చెప్పుకుని ఎదిగిన నాయ కులు చాలామంది ఉన్నారు. కానీ యావత్‌ బీసీ సమాజాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన నాయకత్వం మాత్రం అరుదు.  రాజకీయాల్లో పదవులు, కాంట్రాక్టులు, అవకాశాలు చాలా సార్లు కొద్ది కుటుంబాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా “బీసీ ఉద్యమం” ప్రజల ఆకాంక్ష కంటే, కొందరి రాజకీయ బ్రాండ్‌గా మారిపోయిందనే విమర్శ బలపడుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కీలక చర్చ ముందుకు వస్తోంది – బీసీలలోని వందలాది ఉపకులాలు విలీనమై లేదా కలిసి ఒకే సామాజిక శక్తిగా మారితేనే నిజమైన రాజ్యాధి కారం సాధ్యమా? ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం రాజకీయ అంశం కాదు. ఇది సామాజిక, ఆర్థిక, మానసిక, జెనెటిక్‌, కుటుంబ, జాతీయ సమగ్రతకు సంబంధించిన చర్చగా మారుతోంది.

- Advertisement -

బీసీ ఉద్యమం
ప్రజల కోరికనా? నాయకుల అవసరమా?
బీసీలు నిజంగా రాజకీయ అధికారం కోరుకుంటు న్నారు. ఎందుకంటే శతాబ్దాలుగా వారు శ్రమజీవులు, వృత్తిజీవులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలి చారు. చేనేత.. కమ్మరి.. మత్స్యకారులు పశుపోషకులు.. కూలీ వర్గాలు.. వృత్తి ఆధారిత సేవా సమూహాలు.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించినవారే బీసీలు. కానీ సమస్య ఎక్కడ మొదలైంది అంటే – బీసీ రాజ్యాధికారం  అనే భావన ప్రజల అభివృద్ధి కంటే, చాలాసార్లు కొంతమంది నాయకుల రాజకీయ బ్రాండ్‌గా మారిపోయింది. ఎన్నికల సమయంలో బీసీలను గుర్తు చేసుకునే నాయకులు, గెలిచాక తమ కుటుం బాలనే బలపరిచారు. పార్టీల్లో పదవులు కుటుంబ సభ్యు లకు.. కాంట్రాక్టులు తమ వర్గాలకు.. వ్యాపారాలు తమ వారికే. కానీ సాధారణ బీసీ యువకుడికి ఉద్యోగం, విద్య, వ్యాపార సహాయం, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం పరి మితంగానే మిగిలింది. దీంతో బీసీ యువతలో ఒక అసంతృప్తి పెరిగింది.

ఉపకులాల గోడలు
బీసీలను ముక్కలు చేస్తున్నాయా?
బీసీ సమాజం భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గం. కానీ అదే సమయంలో అత్యంత విభజించబడిన వర్గం కూడా. ఒకే వృత్తి, ఒకే జీవనశైలి, ఒకే సామాజిక నేపథ్యం ఉన్నా వందలాది ఉపకులాలుగా విడిపోయి ఉంది. ఉదాహ రణకు చేనేత వర్గాన్ని తీసుకుంటే – పద్మశాలి, పట్టుశాలి, స్వకులశాలి, తొగటవీరులు, శాలివాహనులు ఇతర ప్రాంతీయ ఉపవర్గాలు.. వీరు చేసేది నేతపనే. జీవన కష్టాలు ఒకటే. ఆర్థిక సమస్యలు కూడా దాదాపు ఒకటే. కానీ వివాహ సంబంధాలు, సామాజిక ఆచారాలు, సంఘటిత రాజకీ యాల విషయానికి వచ్చేసరికి విడివిడిగా ఉంటున్నారు. దీనివల్ల ఏమైంది? జనాభా శక్తి చీలిపోయింది. రాజకీయ ప్రభావం తగ్గింది. వివాహ సంబంధాలు పరిమితమ య్యాయి, ఆర్థిక సహకారం తగ్గింది,సామాజిక ఐక్యత బలహీనపడింది, ఒక పెద్ద సామాజిక సమూహం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది.

ఉపకులాల విలీనం భవిష్యత్తుకు మార్గమా?
“ఒకే వృత్తికి చెందిన ఉపకులాలు కలవాలి” అనే ఆలోచన కేవలం భావోద్వేగ ఆలోచన కాదు. ఇది భవిష్య త్తులో భారత సమాజ నిర్మాణంలో కీలక చర్చగా మారే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సామాజిక సమీకరణ (Social Integration) పెరుగుతోంది. యువత క్రమంగా, కులాల కంటే విద్యను, వంశాల కంటే వ్యక్తి త్వాన్ని, ఆచారాల కంటే ఆర్థిక స్థిరత్వాన్ని, చిన్న చిన్న గుర్తిం పుల కంటే సామాజిక అవకాశాలను ఎక్కువగా ప్రాధా న్యంగా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉపకులాల మధ్య గోడలు తగ్గితే అనేక ప్రయోజనాలు కలగవచ్చు. సామాజిక ఐక్యత పెరుగుతుంది. ‘‘మనవాళ్లు – మీవాళ్లు” అనే భావన తగ్గుతుంది. పరస్పర సహకారం పెరుగుతుంది. వివాహ సంబంధాలు విస్తరిస్తాయి. చిన్న ఉపకులాల్లో ప్రస్తుతం పెళ్లిళ్లకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. దీనివల్ల  ఆలస్య వివాహాలు, అధిక ఖర్చులు, కుటుంబ ఒత్తిళ్లు, జన్యు సమ స్యల ప్రమాదం కొన్ని సందర్భాల్లో పెరుగుతున్నాయి. అం తర్‌-ఉపకుల వివాహాలు పెరిగితే జన్యు వైవిధ్యం (Genetic Diversity) పెరిగి, ఆరోగ్యకరమైన తరాలు ఏర్పడే అవకాశం ఉంది.

రాజకీయ శక్తి పెరుగుతుంది. పది ఉపకులాలు విడిగా ఉంటే రాజకీయంగా బలహీనంగా కనిపిస్తాయి. కానీ అవన్నీ ఒకే సామాజిక వేదికపై ఐక్యమైతే, ఓటు శక్తి పెరుగుతుంది, రాజకీయంగా ఆ సమూహంపై చర్చించే సామర్థ్యం పెరుగు తుంది, నాయకత్వం బలపడుతుంది, ఏ పార్టీ కూడా నిర్ల క్ష్యం చేయలేని స్థాయికి చేరవచ్చు, ఆర్థిక సహకారం పెరుగు తుంది. ఒకే వృత్తికి చెందిన వర్గాలు కలిస్తే  కోఆపరేటివ్‌ వ్యవస్థలు బలపడతాయి.
మార్కెటింగ్‌ నెట్‌వర్క్‍ పెరుగుతుంది. వ్యాపార అవకా శాలు విస్తరిస్తాయి, ప్రభుత్వ పథకాలు సమర్థంగా చేరే అవకాశం ఉంటుంది.

పరిష్కార మార్గమేమిటి?
“బీసీ రాజ్యాధికారం” అనే మాట నిజం కావాలంటే ముందుగా “బీసీ సమాజ ఆత్మపరిశీలన” ప్రారంభం కావాలి. ఉపకులాల మధ్య గోడలు తగ్గితేనే భవిష్యత్తులో ఒక కొత్త సామాజిక శక్తి పుట్టుకొస్తుంది. లేకపోతే బీసీల పేరు మీద రాజకీయాలు కొనసాగుతాయి. కానీ సాధారణ బీసీ కుటుం బం జీవితం మాత్రం అదే స్థితిలో మిగిలిపోతుంది. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి – ఉపకులాల విలీనం అనేది బలవంతపు సామాజిక మార్పు కాకూడదు. ఎందుకంటే ప్రతి ఉపకులానికి ఒక ప్రత్యేక చరిత్ర, ప్రాంతీయ సంస్కృతి, ఆచారాలు, భాషా శైలి, దేవతా సంప్రదాయాలు ఉంటాయి. వాటిని చెరిపేయడం కాదు లక్ష్యం, వాటిని కాపాడుకుంటూనే, వాటి మధ్య ఉన్న గోడలను తగ్గించడం అసలు లక్ష్యం.

బీసీల అసలు బలహీనత సంఖ్య తక్కువ కావడం కాదు ఐక్యత లేకపోవడం. ఒకే వృత్తి ఒకే కష్టం ఒకే జీవన పోరాటం ఉన్నా ఇంకా చిన్న చిన్న విభజనల్లోనే మిగిలిపోవడం వల్ల సమాజ శక్తి చీలిపోతోంది. వేదికలపై ప్రసంగాలు, పోస్టర్లు, సభలు, నినాదాలు కొంతకాలం భావోద్వేగాన్ని పెంచవచ్చు. కానీ శాశ్వత మార్పు తీసుకురావాలంటే బీసీ సమాజంలోనే ఒక మౌన విప్లవం మొదలుకావాలి. కేవలం ముఖ్యమంత్రి పదవి సాధించడం మాత్రమే రాజ్యాధికారం కాదు. ఒక బీసీ యువకుడు ఆత్మగౌరవంతో ఎదగడం రాజ్యాధికారం. ఒక బీసీ అమ్మాయి ఉన్నత విద్యను అందుకోవడం రాజ్యాధి కారం. ఒక బీసీ కుటుంబం గౌరవంగా జీవించడం నిజమైన రాజ్యాధికారం.

ఒక గొప్ప సమాజం కేవలం నినాదాలతో ఎదగదు. విద్యతో ఎదుగుతుంది. ఆలోచనతో ఎదుగుతుంది. స్వీయ విమర్శతో ఎదుగుతుంది. ఐక్యతతో ఎదుగుతుంది. ఉపకు లాల మధ్య గోడలు కూలిన రోజు.. “మనమంతా ఒక్కటే” అనే భావన పెరిగిన రోజు.. బీసీ సమాజం తన శక్తిని తానే గుర్తించిన రోజు.. అదే రోజు నిజమైన బీసీ రాజ్యాధికారానికి పునాది పడుతుంది.

డా. కేశవులు భాషవత్తిని. ఎండీ
తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News