Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Unnecessary tension: అనవసర హడావిడి

Unnecessary tension: అనవసర హడావిడి

ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులు నిర్వహించడమనేది ఈ మధ్య కాలంలోనే ప్రారంభం అయింది. 1991లో ఆర్థిక సరళీకరణ ప్రక్రియ మొదలైన తర్వాత దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టడం జరిగింది.ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో వాగ్దానాలు ఎక్కువ , ఆచరణలు తక్కువ అనే అభిప్రాయం చాలా ఏళ్ల క్రిందటే చోటు చేసుకుంది. ఈ సదస్సులలో సలువురు పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు ప్రకటించడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇందులో ఎన్ని వాగ్దానాలు ఆచరణలోకి వస్తాయన్నది ఆ తర్వాత దేవుడికే తెలియాలనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. సుమారు రెండు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలో ఇదే విధంగా ఎంతో ఆర్భాటంగా ఒక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరిగినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రిని ఆ తర్వాత కొందరు విలేఖరులు, ఎన్ని ఒప్పందాలు (ఎం.ఓ.యూలు) వాస్తవ పెట్టుబడులుగా మారే అవకాశం ఉందని అడిగారు. ఆయన ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, “విద్యుత్‌ రంగంలో గతంలో అనేక ఒప్పందాలు జరిగాయి. అవన్నీ ఆచరణలోకి వచ్చి ఉంటే, మొత్తం భారతదేశంలో కంటే మహారాష్ట్రలోనే ఎక్కువగావిద్యుత్‌ ఉత్పత్తి అవుతుండేది” అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టాయి. అప్పుడు సంతకాలు జరిగిన ఒప్పందాలేవీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు.
కాగా, 1991 తర్వాత ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్స్‌కి ప్రాధాన్యం పెరిగింది.పాలక పక్షం రాజకీయంగా పట్టు, పలుకుబడి సంపాదించడానికి, తమ ప్రాధాన్యం పెంచుకోవడానికి, ప్రజల్లో ఇమేజ్‌ను ఇనుమడింపజేసుకోవడానికి ఇది కూడా ఒక అస్త్రంగా మారింది. ఒకప్పుడు గుజరాత్‌, మహారాష్ట్రలలో ఇదే విధంగా ఎంతో ఆర్భాటంగా సమ్మిట్‌లు జరగడం, పాలక పక్ష ఇమేజ్‌ ఇబ్బడిముబ్బడిగా పెరగడం, రాజకీయంగా కూడా కొద్దో గొప్పో లబ్ధి పొందడం ఆనవాయితీగా మారింది.ఈ సమ్మిట్‌లు జరిగినప్పుడలా ఆయా రాష్ట్రాలకు కొత్త పేర్లు పెట్టడం కూడా జరిగింది. అవకాశాల అసోం, ప్రగతిశీల పంజాబ్‌, అయస్కాంత మహారాష్ట్ర, పెట్టుబడుల చత్తీస్‌గఢ్‌, పునరుజ్జీవన రాజస్థాన్‌, ఆకర్షణీయ ఆంధ్రప్రదేశ్‌ వంటివి ఇందులో కొన్ని. ఈ పేర్ల విషయంలో కూడా వివిధ రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. ఈ పెట్టుబడుల సదస్సులకు గ్లోబల్‌ అనే మాటను ఎవరు చేర్చారో తెలియదు కానీ, ఇదంతా నేతి బీరకాయ వ్యవహారమని విశ్లేషకుల అభిప్రాయం. ఈ సదస్సులు జరగడానికి చాలా రోజుల ముందే అధికారులు వివిధ దేశాలలో పర్యటించి, భారీగా పెట్టుబడి పెట్టగలిగిన వాణిజ్యవేత్తలను, పారిశ్రామికవేత్తలను కలిసి, వారు భారత్‌ రావడానికి ఒప్పించి తిరిగి వచ్చేవారు. నిజానికి, ఈ సదస్సుల్లో అపర కుబేరులు, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడంకూడా జరుగుతుంటుంది.
మరో విశేషమేమిటంటే, కొద్ది సంవత్సరాలుగా ఈ ఎం.ఓ.యూల సంఖ్య కూడా ఎంతగానో పెరిగిపోయింది. ఒకప్పుడు వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్న ఒప్పందాల విలువ ప్రస్తుతం లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరిగినప్పుడు, 32.92 లక్షల కోట్ల రూపాయల విలువైన 18 వేల ఒప్పందాలు చోటు చేసుకున్నట్టు ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఒప్పందాల విలువ ఉత్తర ప్రదేశ్‌ జీడీపీ కంటే అనేక రెట్లు ఎక్కువ. గత వారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఇదే విధంగా సమ్మిట్‌ జరిగినప్పుడు, 13 లక్షల కోట్ల రూపాయల మేరకు 342 ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. ఈ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్‌ జీడీపీ కంటే చాలా ఎక్కువ. ఇక కర్ణాటక రాష్ట్రం కూడా 9.8 లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగినట్టు ప్రకటించింది.గత ఏడాది ఏప్రిల్‌లో అసోంలో జరిగిన సమ్మిట్‌లో 87 వేల కోట్ల మేరకు ఒప్పందాలు జరిగాయి. నిజానికి ఒక ఈశాన్య రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవహించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక గత ఏడాది జూలైలో తమిళనాడులో కూడా 1.20 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. రాజస్థాన్‌లో 70 వేల కోట్లు, మహారాష్ట్రలో 1.37 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి.
ఇప్పటికి ఈ ఒప్పందాలన్నీ అమలు జరిగి ఉంటే, పెట్టుబడుల మొత్తంలో దేశం ప్రపంచంలోనే మొదటిస్థానాన్ని కూడామించి పోయి ఉండేది. కానీ, ఈ ఒప్పందాలు ఎంత వరకూ అమలు జరిగాయన్నది ఇక్కడ ప్రశ్న.దేశంలో ఇదివరకే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల పెట్టుబడుల మొత్తం 30 శాతంగా ఉండేది.అది ఈ కొత్త ఒప్పందాలతో 31.5 శాతానికి మాత్రమే పెరిగినట్టు అంచనా.విచిత్రమేమిటంటే, ఇది కూడా ప్రభుత్వ వాటా పెరగడం వల్లే జరిగింది తప్ప ఒప్పందాల ప్రకారం వచ్చిన పెట్టుబడుల వల్ల కాదని నిపుణులు చెబుతున్నారు.
గత రెండు సంవత్సరాల కాలంలో సుమారు 60 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నదివాస్తవం. ఇవన్నీ వాస్తవ రూపం లేదా ఆచరణ రూపం దాలుస్తాయన్న నమ్మకమేమీ లేదు కానీ, స్థానికంగా, దేశీయంగా పెట్టుబడులు పెరగడానికి మాత్రం కాస్తో కూస్తో దోహదం చేస్తున్నాయి. ఈ ఒప్పందాలకు తగ్గట్టుగా రాష్ట్రాలు భూమిని సమకూర్చవలసి ఉంటుంది. సుశిక్షితులైన లేదా నైపుణ్యాలు కలిగిన శ్రామికులు, ఉద్యోగులను కూడా ప్రభుత్వాలే సమకూర్చవలసి ఉంటుంది. ఈ ఒప్పందాలు అమలు జరిగేటట్టుగా సంబంధింత పెట్టుబడిదార్లపై ప్రభుత్వాలే ఒత్తిడి తీసుకు రావడం జరగాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి వాతావరణం కల్పించడంతో పాటు, పాలన, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అనేక సంస్కరణలు కూడా చేపట్టాల్సి ఉంటుంది.
రాష్ట్రాలలో భూమి, కార్మికుల లభ్యత, అక్కడి సంస్కరణలు, ఆర్థిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న నైపుణ్యాలతో నీతి ఆయోగ్‌ ఒక డాటా బేస్‌ను తయారు చేసుకుని ముందుగా ఇన్వెస్టర్లకు తెలియజేసి, వారిని అన్ని విధాలా సమాయత్తం చేసి సమ్మిట్లకు ఆహ్వానించగలిగితే, రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఎంతగానో వీలుంటుంది. రాష్ట్రాలు కూడా ఇందులో రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి, లేనిపోని గొప్పలు చెప్పుకోవడం తగ్గించి, ఒక పథకం ప్రకారం పెట్టుబడులకు వీలైన వాతావరణాన్ని సృష్టించడం వల్ల ఉపయోగం ఉంటుంది. రాష్ట్రాలు ఇకనైనా ఆర్థిక కోణానికి, సామాజిక కోణానికి ప్రాధాన్యం ఇవ్వగలిగితే, రాష్ట్రం అభివృద్ధిని సాధించగలుగుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News