జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఆ పార్టీకి చేయూతనిచ్చే పార్టీల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోవడం అటుంచి, ప్రతిపక్షాలలో అనేకం కాంగ్రెస్ నే విమర్శించడం, కాంగ్రెస్ పైనే ఆరోపణలు గుప్పించడం ఆ పార్టీ పరిస్థితిని మరింత బలహీనపరుస్తోంది. అంతకన్నా విషాదకర విషయమేమిటంటే పాలక బీజేపీని ఢీకొనగలిగిన ప్రతిపక్షం దేశంలో లేకపోవడం. ప్రతిపక్షాలు ఐక్యత సాధించలేకపోవడం, నరేంద్ర మోదీ నాయకత్వంతో తలపడగల సత్తా ఏ పార్టీలోనూ, ఏ నాయకుడిలోనూ లేకపోవడం గమనించినవారికి దేశంలో ప్రజాస్వామ్యం పట్టాలు తప్పుతోందనే నగ్న సత్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత అవసరమో, ప్రతిపక్షం కూడా అంతే అవసరం అనడంలో సందేహమే లేదు. ఇండీ కూటమి పేరుతో ఏడెనిమిది నెలల క్రితం ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇంకా పూర్తిగా లేచి నిలబడకుండానే చిన్నాభిన్నం అయిపోతుండడం, బీజేపీకి తగ్గ ప్రతిపక్షమేదీ లేకపోవడం ప్రజాస్వామ్యవాదులకు ఎవరికైనా విచారం కలిగిస్తుంది. రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున్ ఖర్గేల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగల అవకాశం కనిపించడం లేదు. ఈ నాయకుల మధ్య హస్తిమశకాంతరం తేడా కనిపిస్తోంది. సరికొత్త విజన్ తో, వాగ్ధాటితో మోదీ ముందుకు దూసుకుపోతుండగా రాహుల్ గాంధీ ఇప్పటికీ ఆదాని దగ్గరే ఆగిపోవడం, ఎటువంటి వాగ్ధాటినీ ప్రదర్శించకపోవడం, మోదీ విజన్ ను మించిన విజన్ ను ప్రకటించలేకపోవడం ఎవరికైనా ఆందోళన కలిగించే విషయమే.
ఇండీ కూటమిపై దేశ ప్రజలకు కొద్దో గొప్పో ఆశలు రేకెత్తుతున్న సమయంలో ఈ కూటమి నుంచి బీహార్ ముఖ్యమంత్రి, ప్రధాన సంధానకర్త అయిన నితీశ్ కుమార్ అకస్మాత్తుగా వైదొలగడమే కాకుండా బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ కూటమిలో చేరడం నిజంగా దిగ్భ్రాంతికర విషయం. ఇంకా ఎన్నికలు జరగకుండానే ప్రతిపక్షాలు ఓటమిని ప్రకటించేసినట్టుగా కనిపిస్తోంది. నితీశ్ కుమార్ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఈ కూటమి మీద ధ్వజమెత్తడం మరో దిగ్భ్రాంతికర పరిణామం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదర్చుకునే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించడం ఈ కూటమికి దెబ్బ మీద దెబ్బగా పరిణమించింది. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తాము ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సీట్లు కేటాయించే అవకాశం లేదంటూ ప్రకటించి కూటమిని మరింతగా అభాసుపాలు చేశారు. నిజానికి ఈ ముగ్గురు నాయకులకూ ఇండీ కూటమి మీద మొదటి నుంచి శ్రద్ధాసక్తులు లేనట్టు కనిపిస్తోంది. కూటమి విషయంలో వారు నిజంగా చిత్తశుద్ధి కలిగి ఉంటే కూటమి నాయకు లతో ఏకాంతంగానైనా చర్చించి నిర్ణయం తీసుకునేవారు. మొత్తానికి మూడు కీలక రాష్ట్రాల నుంచి కూటమికి సహకారం లభించే అవకాశం లేదని తేలిపోయింది. మహారాష్ట్ర నుంచి కూడా ఆశించిన సహకారం లభించే అవకాశం కనిపించడం లేదు. శరద్ పవార్ పార్టీ ఏ క్షణంలో ఎటువైపు దూకుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇక్కడ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీలు చీలిపోయాయి కనుక వాటి నుంచి పెద్దగా మద్దతు లభించే అవకాశం లేదు.
ఐక్యత ఇక ఎండమావే
ఇక కాంగ్రెస్ పాత్రకు సంబంధించి వామపక్షాలు కూడా ఎటూ తేల్చి చెప్పడం లేదు. ముఖ్యంగా వామపక్షాలకు కండచుకోట అయిన కేరళలో ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు ఇప్పటికే వామపక్షాలు చేతుల్లోంచి జారి పోయినందువల్ల కేరళలో వామపక్షాలు మాత్రం ఎంత కాలం ఉంటాయో తెలియని పరిస్థితి నెల కొంది. కేరళలో వామపక్షాలు మరింత పటిష్టం అవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అవి కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేవు. వాయనాడులో రాహుల్ గాంధీ పైన తమ అభ్యర్థి అనీ రాజాను నిలబెట్టాలని వామపక్షాలు భావిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
లలో మాత్రం ప్రతిపక్షాలు కొద్దిగా ఆశలు పెట్టుకోవచ్చు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలకు సవాళ్లు ఎదురు కావచ్చు. గత సోమవారం నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కకావికలమైన ప్రతిపక్ష కూటమి అంటూ ఎద్దేవా చేయడం జరిగింది. ఇప్పుడు అదే
జరగబోతోందనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇదివరకు నాయకత్వం వహించిన యు.పి.ఏ కూటమికి, ఇప్పటి ఇండీ కూటమికి సైద్ధాంతికంగా చాలా తేడా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇండీ కూటమి ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి కాగా, యు.పి.ఏ ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి అని కూడా ఆయన తెలిపారు. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండీ కూటమి కూడా ఎన్నికల తర్వాత కూటమిగానే అవతరించే అవకాశాలు ఎక్కువవుతు న్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మండల్ రాజకీయాల మీదా, సమాఖ్య స్ఫూర్తి మీదా ఆధార పడుతోంది. ప్రాంతీయ పార్టీలు ఈ రెండు అంశాలను మినహాయించి, మరికొన్ని ప్రజానుకూల విధానాలతో ముందుకు వెడుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రవచించే సిద్ధాంతాలు, నినాదాలను తాము అక్కున చేర్చుకుంటే తమ పరిస్థితి అధ్వానంగా తయారవుతుందని ప్రాంతీయ పార్టీలన్నీ భయపడుతున్నాయి. తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ కొద్ది అవకాశం ఇచ్చినా అది తమకే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని కూడా అవి అనుమానిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆధిపత్య ధోరణిని చెలాయించడం కొన్ని పార్టీలకు ససేమిరా మింగుడుపడడం లేదు.
పార్టీలన్నీ కకావికలం
గత ఏడాది మే నెలలో కర్ణాటకలో విజయం సాధించినప్పటి నుంచి డిసెంబర్ నెలలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో అంటీ ముట్టని ధోరణినే అనుసరిస్తోంది. డిసెంబర్ ఎన్నికల్లో కూడా విజయం సాధించే పక్షంలో తాము ఎక్కువ సీట్లను బేరం చేసుకోవచ్చని, తామే ఈ ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించవచ్చని, తద్వారా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపక్షాలను ఒప్పించవచ్చని కాంగ్రెస్ భావించింది. అయితే, అనుకున్నదొకటి, అయిందొకటి అనే పరిస్థితి ఏర్పడే సరికి, రాహుల్ గాంధీతో మళ్లీ పాదయాత్రకు ప్లాన్ చేసింది. కూటమి విషయంలో కాంగ్రెస్ పార్టీ తన పెత్తనం కోసం వ్యూహం పన్నుతోందని అర్థమైపోయింది. అంతేకాక, డిసెంబర్ ఎన్నికల్లో విఫలమయ్యే పక్షంలో తమ ప్రత్యామ్నాయ వ్యూహమేమిటన్నది కాంగ్రెస్ ముందుగా తయారు చేసుకోలేకపోయింది.
తమకు బీజేపీతో తలపడగల అవకాశం ఏమాత్రం లేని సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టడం మంచిదంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు సూచించడం కాంగ్రెస్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏ స్థానంలో అయినా ప్రతిపక్షాలకు ఒకే అభ్యర్థి ఉండాలంటూ నితీశ్ కుమార్ చేసిన సూచన కూడా కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. ఇది తమ జాతీయ పార్టీని కుదించే ప్రమాదం ఉందని అది భావించింది. ప్రతిపక్షాలతో మాటమాత్రంగానైనా సంప్రదించకుండా రాహుల్ గాంధీ తన న్యాయ యాత్రను ప్రారంభించడాన్ని బట్టి ఇతర పార్టీలను కలుపుకునిపోవడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా లేదనే విషయం స్పష్టమయింది. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన జాతీయవాదం, నాగరికత పునరుద్ధరణ, ఆర్థిక వైభవం వంటి నినాదాల ముందు కాంగ్రెస్ పార్టీ నినాదాలు వెలావెలపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా కుహానా లౌకికవాదం, ఆదానీ, నోట్ల రద్దు, జి.ఎస్.టి వంటి అంశాల చుట్టూనే పరిభ్రమిస్తోంది. ఈ అంశాల్లో ఎక్కడా ఆ పార్టీ విజన్ ప్రతిఫలించడం లేదు. ఇక బీజేపీ ప్రభుత్వం అద్వానీ, కర్పూరీ ఠాకూర్, పి.వి.
నరసింహారావు, స్వామినాథన్, చరణ్ సింగ్ లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం కూడా రాజకీయ సమీకరణాల్ని మార్చేసింది.
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కానీ, బడ్జెట్ పై చేసే ప్రసంగంలో కానీ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితర నాయకులు కొత్త విషయాలను చెప్పడం గానీ, కొత్త విధానాలను ప్రకటించడం గానీ చేయలేదు. ఆదానీ పేరును పట్టుకుని వేలాడడం వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవడం లేదనిపిస్తోంది. అంతేకాదు, మోదీ స్థాయి వక్తకు తగ్గ వాగ్ధాటి కాంగ్రెస్ పార్టీ నాయకులెవరిలోనూ కనిపించలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరాటం తప్పేటట్టు లేదు. యు.పి.ఎ కూటమి నాటి అవకాశాలు కూడా అందివచ్చేట్టు లేదు. ఒంటరి పోరాటానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నాయకుల సత్తా సరిపోదు.
– వి. ఆనందరావు, సీనియర్ జర్నలిస్టు