Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Vakati a magician in Telugu literature: సాటిలేని సాహితీ సవ్యసాచి ‘వాకాటి’

Vakati a magician in Telugu literature: సాటిలేని సాహితీ సవ్యసాచి ‘వాకాటి’

రెండు పడవల మీద నడవడం కష్టమంటారు కానీ, వాకాటి పాండురంగా రావు తాను మూడు పడవల మీద కూడా నడవగలనని నిరూపించారు. సాహిత్యంలో అటు ఇంగ్లీషులోనూ, ఇటు తెలుగులోనూ అద్భుతాలు సృష్టిస్తూనే ఆయన పత్రికా రచనలో కూడా తన ప్రత్యేకతను నిరూ పించుకున్నారు. సాహిత్యంలో ఐంద్రజాలికుడు ఆయన. ఇంగ్లీషు సాహి త్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని మదించడమే కాకుండా కొత్త రకం సాహితీ సృష్టికి పాటుపడ్డారు ఆయన. 1934 ప్రాంతంలో మద్రాసులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వాకాటి అహర్నిశలూ శ్రమపడి సొంతగా ఇంగ్లీషు, తెలుగు భాషల మీద ఆధిపత్యం సంపాదించారు. గ్రంథ రచయితగా ఎదగడానికి ముందు ఆయన గ్రంథాల పాఠకుడిగా సరికొత్త రికార్డులు సృష్టించారు. రచయితగా పేరు తెచ్చుకోవాలనే ఏకైక తపనతో ఆయన పత్రికా రంగంలో అడుగుపెట్టారు. ఆనందవాణి, ఆంధ్రజ్యోతి, న్యూస్‌ టైమ్‌, ఏపీ టైమ్స్‌, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికల్లో పనిచేసిన వాకాటి పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించు కోవడమే కాక, అనేక కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు.
కొద్ది కాలం పాటు ఆయన హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యంలో జర్నలిజం అధ్యాపకుడుగా కూడా పనిచేసిన వాకాటి, ఆ తర్వాత విశాఖపట్నం పోర్టులో డిప్యూటీ డైరెక్టర్‌ గా కూడా పనిచేయడం జరిగింది. ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఆయన రెండు వ్యాపకాలను మాత్రం నిరంతరం కొనసాగిస్తూ వచ్చారు. ఒకటి గ్రంథ పఠనం, మరొకటి రచనా వ్యాసంగం. ఆయన ఎన్నో వ్యాసాలు రాసినప్పటికీ, ప్రధానంగా కథా రచయితగానే మంచి గుర్తింపు పొందారు. ‘మిత్ర వాక్యం’ పేరుతో ఆయన రాసిన సంపాదకీయాలు ఆయనకు అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. ఆయన సంపాద కీయాలను రెండు సంపుటాలుగా ప్రచురించడం జరిగింది. ఆయన చాలా కాలం పాటు, ఏపీ టైమ్స్‌ అనే ఇంగ్లీషు దినపత్రికలో కూడా పనిచేశారు. తెలుగు పత్రికల్లో రచనలు సాగించినంత సులువుగా ఆయన ఇంగ్లీషు పత్రికల్లోనూ రచనలు సాగించడం ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది.
ఆయన రాసిన కథలన్నీ ఏదో ఒక కొత్త సమాచారాన్ని అందిస్తాయి. ఎవరికీ తెలియని విషయా లెన్నో ఆ కథల్లో దాగి ఉంటాయి. అంతేకాదు, ఆయన రాసిన కథల్లో ఉపదేశ నేపథ్యాలు కూడా ఉంటాయి. మిత్ర వాక్యం పేరుతో ఆయన రాసిన కథ, మరణం ఒక కామా, దిక్సూచి వంటి ఇతర కథలు వేలాది మంది పాఠకులను అలరించడమే కాకుండా, ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆయన రాసిన కథల్లో 12 కథలను ద్వాదశి పేరుతో ఒక సంపుటంగా వెలువరించడం జరిగింది. ఆయన కథలు, ఇతర రచనలతో సంపుటాలుగా వెలువడిన పాండు రంగారావు కథలు, మిత్రవాక్యం, చేత వెన్న ముద్ద, సృష్టిలో తీయనిది, దిక్సూచి వంటివి పాఠక లోకంలో కొత్త పుంతలు సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఆయనను సత్కరించని సాహితీ సంస్థ లేదంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, గోపీచంద్‌, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు ఆయనను వరించాయి. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, సాహిత్య అకాడమీకి చెందిన పుస్తకాలకు ఆయన సంపాదకుడుగా కూడా వ్యవహరించారు. చివరి క్షణం వరకూ గ్రంథ పఠనం, రచనలు కొనసాగిస్తూనే ఆయన 1999 ఏప్రిల్‌ 17న కన్నుమూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News