Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Vasthu: వాస్తు వాస్తవాలు

Vasthu: వాస్తు వాస్తవాలు

మనకోసం మనమే పుట్టించిన వాస్తు మన అదృష్టాన్ని మారుస్తుందా?

సామాజిక జీవితానికి అలవాటు పడిన తొలి నాళ్ళలో విజ్ఞానం పెరుగుతున్న క్రమంలో మానవుడు వృద్ది చేసిన భవన నిర్మాణ శాస్త్రం వాస్తు శాస్త్రం. ఇది ఈనాటి సివిల్‌ ఇంజినీరింగ్‌ అని చెప్ప వచ్చు. ఆనాటి సామాజిక, ఆర్ధిక, వాతావరణ పరిస్థితుల ప్రకారం ఏర్పా టు చేసి, వృద్ధి చేసిన ఒక విజ్ఞాన శాస్త్రమే ‘వాస్తు శాస్త్రం’ తెరచి ఉన్న బావులు, తెరచి ఉన్న మురుగు కాలువలు, కట్టెల పొయ్యిలు వాడిన కాలమది. విద్యుత్తు, ఫ్యాన్స్‌, ఏసి లు, కూలర్లు, కార్లు, మోటార్లు లాంటివి లేని కాలమది. వ్యవసాయము, రాజోద్యోగము (మంత్రులు, సైనికులు మొదలగునవి), శిల్పులు, భవన నిర్మాణ పని, కుల వృ త్తులు లాంటి కొన్ని పరిమిత వృత్తులతో జీవితం సాగించే కాలమది. పక్కా రహదారులు, కేంద్రీయ మురుగు కాలువ వ్యవస్థ లేని కాలమది, మిద్దెలు మించిన కట్టడాలు లేని కాలమది. అటువంటి కాలంలో అంటువ్యాదులు ప్రబలకుండా, సహజ వనరులను వినియోగించి సరియైన గాలి, వెలుతురు వచ్చేవిదంగా వృద్ధి చేసిన ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రము వాస్తు శాస్త్రము. రోగాలకు సరియైన, ఖచ్చితమైన చికిత్స లేని ఆ కాలంలో, చికిత్స కంటే రోగ నిరోధనే ముఖ్యం అనే సిద్ధాంతం పైన ఆధారపడి, అభివృద్ధి చేయబడిన శాస్త్రం వాస్తు శాస్త్రం. సరియైన గాలి వెలుతురు నేడు కూడా మనకు అవసరమే, అయితే వాటిని అదుపులో ఉంచుకొని, కృత్రిమంగా వృద్ధి చేయగలిగిన విజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉన్నది. వాస్తు శాస్త్రానికి ఆధునికత జోడించి, సివిల్‌ ఇంజనీరింగ్‌తో కలిపి ఆలోచించాల్సిన సమయమిది. మనిషి గాలి కోసం చెట్టు పైనే అధికంగా ఆధార పడిన ఆ కాలంలో చెట్టు ఉన్న ప్రదేశానికి వ్యతిరేకంగా మురికి కాలువలు, బావులు నిర్మించినారు, కారణం మురికి కాలువలో, భావిలో ఎండుటాకులు పడి మురిగి పోకుండా, అదే విధంగా ఆగ్నేయంలోని వంట గదికి ఇబ్బంది లేకుండా అలా సెలవిచ్చారు. గాలి పైన అదుపు లేని కాలంలో వంట గదిలోని పొగ ఇల్లంతా రాకుండా, వంట గదిని ఆగ్నేయంలో కట్టాలన్నారు. దక్షిణ గాలి అగ్నేయం ద్వార ప్రవేశించి ఉత్తరం వైపు నుండి తనతో పొగను కూడా తీసికొని వెళ్తుంది, అదే విధంగా వంట గది పరిశుభ్రమైన గాలితో, ఉదయపు ఎండతో ఉండగలుగుతుంది. బహుశా వంట గది గాలికి మరియు తూర్పు దర్వాజకు అడ్డు రాకుండా అదేవిదంగా తూర్పు సూర్యకిరణాలు ఇల్లంతా పరుచుకునే విధంగా, ఈశాన్యం తగ్గాలని చెప్పి ఉంటారు. అదే విధంగా దక్షిణగాలి ప్రవేశించే విధంగా, మరియు సాయంకాలం సూర్యకిరణాలు ప్రవేశించే విధంగా నైరుతిలో గృహస్తు పడక గదిని ఏర్పాటు చేసారు. ఆ కాలంలో ఆఫీస్‌ గదుల అవసరం అంతగా లేకుండెను. అందుకే నిర్మాణంలో ఆవిధమైన ఆలోచన చేయలేదు. పడమరకు వంగిపోయే సూర్యుని కిరణాల వలన నైరుతిలో ఉండే గదిలో సాయంకాలం ఎక్కువ సమయం వెలుతురు ఉంటుంది అందుకే ఆ గది ఇంటి పెద్దకు కేటాయించారు, బోశానాలు (నేటి బీరువాలు) కూడా అందుకే కాబోలు నైరుతిలో ఉండాలనేవారు. నాడు తూరుపు వీధులు ఎక్కువగా ఉండేవి. సహజంగా నీరు వీదిలోని మోరీలోకి ( డ్రైనేజీ) వెళ్ళాలంటే ఆగ్నేయం, లేక ఈశాన్యం మాత్రమే సరైనది, ఆగ్నేయంలో వంటరూమును నిర్ణయించారు కనుక ఈశాన్యం గుండా నీరు వెళ్ళిపోవాలని బహుశా నిర్ణయించి ఉంటారు.
ఇప్పుడు వంట గదులలోని గాలిని తోడేసే విదంగా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌ వచ్చాయి. తెరిచి ఉన్న బావులకు బదులు బోర్‌ బావులు వచ్చాయి. అంతర్గత మురికి నీటి వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. బొగ్గు, సౌర శక్తి, నీరు, గ్యాస్‌ మొదలగు వ్యవస్థల ద్వారా విద్యుత్తును సృష్టించి తద్వారా, వెలుతురును, గాలిని విరివిగా వినియోగించుకుంటున్నాము, 50 డిగ్రీల మండుటెండలో కూడా మంచు కొండల చల్లదనాన్ని ఆస్వాదించే విజ్ఞానం నేడు మనకు అందుబాటులో ఉన్నది. అటువంటి ఈ కాలంలో వాస్తు శాస్త్రాన్ని వాస్తవ దృక్పథంతో చూడటం మనిషిగా మన ధర్మం.
దురదృష్టమేంటంటే మనం అభివృద్ధి చేసిన విజ్ఞాన శాస్త్రానికి మనమే అనూహ్య శక్తులను ఆపాదించి, తన గూటిలో తానే బందీ అయిన సాలీడులా విలవిల లాడుతున్నాము. చివరికి ఈ పైత్యం ఎంతవరకు ముదిరిందంటే సృష్టికర్త అయిన భగవంతుని ఆలయాలకు కూడా వాస్తు దోషాలు ఆపాదిస్తున్నాము. సృష్టికర్త అందించిన మేదస్సుతో అభివృద్ధి చేసిన శాస్త్రం, ఆ సృష్టికర్తనే అదుపు చేస్తుంది అని నమ్మేంత మూర్ఖత్వం మనలో పెరిగింది. ఈశాన్యంలో బరువుంటే మంచిది కాదు అని మూర్ఖంగా ఇంటికే కాదు, ఇంట్లోని గదులలో సైతం ఈశాన్యం ఖాళీ చేస్తున్నారు. తూర్పు తలుపుల కోసం విశాలమైన రహదారిని వదిలి చీకటి సందుల నుండి నడుస్తున్నాము. మనిషి బ్రతకడానికి అనేక వేల కారణాలు ఉన్నాయి, అందులో సరియైన గాలి, నీరు, వెలుతురు కొన్ని కారణాలు. ఈశాన్యంలో బరువు లేని, తూర్పు దర్వాజాతో కూడిన, ఆగ్నేయంలో వంటగది ఉన్న ఇంట్లో ఉంటేనే మనిషి బ్రతుకుతాడని లేకుంటే ఎంత మేధాశక్తి ఉన్నా, ఆర్థిక వనరులు ఉన్నా క్షీణిస్తాడని మూర్ఖంగా విశ్వసించడం దురదృష్టకరం. అవకాశం ఉన్నప్పుడు ఆవిధమైన కట్టడాలు నిర్మించడం వలన సహజ వాతావరణంలో బ్రతుకుతున్నామనే తృప్తి మనకు మిగులుతుంది. ప్రకృతి సహజంగా ఉచితంగా అందించిన వనరులను వినియోగించుకున్న వాళ్లము అవుతాము, అయితే అంత మాత్రం చేతనే మన ఆయుష్యు అమాంతం వృద్ధి కాదు, మన సంపద పెరుగుదల, తరుగుదలలో అమాంతంగా మార్పులు రావు.
ఇంటికి మరో ఇల్లు తగులరాదని, ప్రహారీ గోడలు సమానంగా ఉండాలని, దక్షిణం పెరగాలని, పడమటి దారికి నడవరాదని, అసలటువైపు తలుపే ఉండరాదని, బాత్రూం ఫలానవైపే ఉండాలని, బాత్రూములో సీట్‌ ఫలా నా దిక్కులోనే ఉండాలని, దర్వాజలు, కిటికీలు సరిసంఖ్య లోనే ఉండాలని, ఈశాన్యం భరువు ఉండరాదని, ఈశా న్యం మూసి ఉండరాదని, నీళ్ళు ఈశాన్యానికి మాత్రమే వెళ్లాలని ఒకటా రెండా ఎన్నో కారణాలతో విశాలమైన ఇంటిని అటు ఇటూ తవ్వి, కూలగొట్టి ఇరుగ్గా చేసుకుని, అనేకమంది స్వంత ఇండ్లలో కిరాయి మనుషుల్లాగా సర్దుకుంటూ బతుకుతున్నారు. ఎప్పుడో 60 సంవత్సరాల కిందట కట్టిన ఇంటికి తరాలు గడిచిపోయిన తరువాత ఇప్పుడ వాస్తు చూస్తూ, జరిగిన దానికి సంతృప్తి చెందకుండా, వాస్తు బావుంటే అదృష్టం దానికదే వచ్చిపడుతుందన్న బ్రమలో బ్రతుకుతున్నారు అనేక లక్షలమంది. చదువు ఆలోచనలను విశాలంగా పెంచాలి. సంపద హుం దాగా వ్యవహరించే సంస్కారాన్ని పెంచాలి, విచిత్రంగా ప్రస్తుత సమాజంలో చదువు మనిషిలోని ఆలోచనలను చంపేస్తున్నది, సంపద ఇది సరిపోదు, ఇంకా సంపాదిం చాలన్న దురాలోచనను, దురాశను ప్రేరేపిస్తున్నది. ఫలితంగా మనుషులు మూర్ఖులుగా మారుతున్నారు. మనిషిని సృష్టించిన దేవునికన్నా, మనం సృష్టించిన వాస్తుకోసం వెంపర్లాడుతున్నాం. మనకోసం మనమే పుట్టించిన వాస్తు మన అదృష్టాన్ని మారుస్తుందా? వేదాల్లో, ఉపనిషత్తులలో, భగద్గీత, భాగవతాల్లో, రామాయణ, భారతాలలో ఎక్కడా మచ్చుకైనా కనిపించని వాస్తును ఒక్కసారిగా మన సంస్కృతిలో భాగం చేసిందెవరు? దానికి బలి అవుతున్నది ఎందరు, ప్రపంచ జనాభాలో 90% మందికి అక్కరలేనిది, వారినెవరినీ భయపెట్టనిది మనలను మాత్రమే ఎందుకు బయపెడుతున్నది?
వాస్తు శాస్త్రం ఉద్భవించిన కాలాన్ని పరిశీలిస్తే, నగదు రూపంలో కాకుండా వస్తుమార్పిడి ద్వారా వ్యాపారాలు జరిగిన కాలమది, భౌతిక సుఖాలకంటే ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఉన్న కాలమది. పుట్టుక రేటుకన్నా మరణాల రేటు ఎక్కువ ఉన్న కాలమది. ప్రకృతి సిద్ధ వనరుల మీదనే అంటే పంచభూతాల మీదనే ఎక్కువగా ఆధారపడిన కాలమది, ప్రకృతితో పోరాడి బతకడమే గగనమైన ఆ కాలంలో మనిషి ఆయువే మనిషికి సంపద. ఆ కాలంలో వాస్తు ప్రకారం ఇల్లు కడితే ఆయువువృద్ధి, సంపద వృద్ధి అన్నారు అంటే, దానర్థం రోగాలు తగ్గి, ఆయువు పెరుగుతుంది అంటే ఆయువు సంపద వృద్ధి అవుతుంది అని అర్థం. అంతేగాని మన శక్తి యుక్తులతో మనం సృష్టించిన సంపదకు, మన భవిష్యత్తుకు, మన ఇంటి వాస్తుకు ఎటువంటి అలౌకిక సంబంధం లేదు. గాలిలో కాలుష్యాన్ని తగ్గించే నియమాలు పాటిస్తూ, ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, శుద్ధి చేసిన నీటిని తాగుతూ, సరైన ఆహార పద్దతులను పాటిస్తూ జీవించేవారు, వాస్తు విరుద్ధంగా కట్టిన ఇళ్ళలో ఉన్నప్పటికీ ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతారు. భగవంతుని సృష్టి మానవ జీవితం, మానవుని సృష్టి వాస్తు శాస్త్రం. విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్ర బద్ధంగా ఆలోచించకుండా మూర్ఖంగా మన ఇంటిని మనమే కుల్చుకుని, మన సంపద మనమే నాశనం చేయడం నిజంగా భగవద్రోహమే అవుతుంది.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News