Saddam Hussein: ఇరాక్ దేశంపైన యుద్ధం ప్రకటించి తనదేశ సొరంగంలో మాటుకాసిన దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను నిర్బంధించి పట్టుకుపోయినప్పుడు అమెరికా ప్రపంచానికి చెప్పిన మాటలు గుర్తున్నాయా? మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. ఇరాక్ దేశమంతటా రసాయనిక ఆయుధాలు ఉన్నాయనీ, ఇలాంటి విధ్వంసక ఆయుధాలతో యావత్తు ప్రపంచానికి పెనుప్రమాదం పొంచివుందనీ కనుక ప్రపంచ మానవాళిని కాపాడేందుకు సద్దాం హుస్సేన్‌ను (2003, డిసెంబర్ 13) బంధించి విచారిస్తున్నామని అమెరికా ప్రపంచానికి చెప్పింది.
మూడేళ్ళపాటు జైలులో సద్దాంను నిర్బంధించి, తన ఇష్టం వచ్చినట్టు విచారించి చివరకు (2006, డిసెంబర్ 30) ఉరితీసి చంపేసింది. ఇరాక్ దేశంలో ఉన్నాయన్న రసాయనిక ఆయుధాలను ఒక్కదాన్ని కూడా ప్రపంచానికి అమెరికా ఇప్పటి వరకూ చూపించలేకపోయింది. సద్దాం హుస్సేన్ నిర్మూలన విషయంలో అమెరికా అసలు లక్ష్యం ఇరాక్‌లో విస్తారంగా వున్న పెట్రోలు నిల్వలను బలవంతంగా ఆక్రమించి దోపిడీ చేయడమేనని ప్రపంచానికి తెలుసు. కానీ విధ్వంసక ఆయుధాలు ఉన్నట్టు అబద్ధాలను ప్రచారం చేసిందని కూడా ప్రపంచానికి తెలుసు. ఇదే విధంగా పనామా దేశంపై దాడిచేసి ఆ దేశ అధ్యక్షుడైన నోరీగా ను నిర్బంధించింది. నోరీగా అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నాడనీ, మాదక ద్రవ్యాల వ్యాపారానికి ఊతమిస్తున్నాడనీ అమెరికా ఆరోపించింది. అమెరికా జైలులో మగ్గుతూ నోరీగా తన 83 ఏళ్ళ వయస్సులో బ్రెయిన్ ట్యూమర్‌తో (2017) మరణించాడు.
ఇరాక్ అధ్యక్షుడైన సద్దాం పట్ల, పనామా అధ్యక్షుడైన నోరీగా పట్ల అమెరికా ఏ వ్యూహాన్ని అనుసరించిందో ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడైన నికోలస్ మదురో పట్ల కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నది.
వెనెజువెలాపై యుద్ధ దాడి వెనక?
స్పెయిన్ వలస పాలన నుండి 1811లో స్వాతంత్య్రం పొంది ఆ తర్వాత అనేకానేక అంతర్గత వైరుధ్యాలతో, వివాదాలతో సతమతమై చివరకు ‘బొలివేరియన్ రిపబ్లిక్ వెనెజువెలా’గా సార్వభౌమాధికారం కలిగిన దేశంగా అవతరించింది. మూడు కోట్ల మూడు లక్షలకు పైగా ఉన్న జనాభాలో 80 శాతం మంది క్రైస్తవులైనప్పటికీ రాజ్యాంగం ద్వారా తమది లౌకిక విధానమని ప్రకటించుకున్నది. దేశంలో మత సహనాన్ని కోరుతూ ఇతర మతాలపై విద్వేషం వెదజల్లితే దాన్ని నేరంగా పరిగణిస్తూ 2017లో చట్టసవరణను ఆమోదించుకున్నది. అధ్యక్ష తరహా నియంతృత్వం కింద వెనెజువెలాలో సమాఖ్య ప్రభుత్వం నడుస్తోంది. ప్రపంచంలోనే చమురు నిల్వలు భారీగా ఉన్న దేశాల్లో వెనెజువెలా ఒకటి. సుమారు 30,500 కోట్ల బ్యారెళ్ళ చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా.
చమురు విక్రయాలతో వస్తున్న ఆదాయాలు వెనెజువెలాకు ప్రధానమైన ఆర్ధికశక్తి. ఈ క్రమంలో అమెరికన్ చమురు వ్యాపార కంపెనీలు తమ వ్యాపారాలను ఇక్కడా విస్తరించాయి. ఈ దేశంలో బంగారం నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే మొత్తం ఆయిల్ నిల్వలను దక్కించుకునే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో ఉండే విధంగా నియంత్రించుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో మాటుకాసి వ్యూహాలను రచిస్తున్నది. 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి రాకముందు వరకూ అమెరికా ఆయిల్ కంపెనీలు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. అయితే సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన హ్యూగో చావెజ్ దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేశాడు.
దీంతో అమెరికా కంపెనీల ఆధిపత్యం కుదేలయింది. దీనికితోడు చైనా, రష్యా, ఇరాన్, క్యూబా లాంటి దేశాలతో చావెజ్ సన్నిహితంగా వ్యవహరించాడు. దీంతో చావెజ్ ప్రభుత్వంపైన తీవ్రమైన కక్షను పెంచుకున్నది అమెరికా. చావెజ్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి 2002లో వెనెజువెలాలో అంతర్గత తిరుగుబాటును ఎగదోసింది. అమెరికా తెరవెనక నడిపిన తిరుగుబాటు విఫలమై వెనెజువెలా ప్రజల భారీ మద్దతుతో రెండు రోజుల్లోనే తిరిగి చావెజ్ అధికారాన్ని దక్కించుకున్నాడు. వెనెజువెలా పైన అమెరికా అనేక ఆర్ధిక ఆంక్షలను విధించి నష్టపరిచేందుకు ప్రయత్నిస్తూనే వస్తుంది. దశాబ్దం పాటు ఎదురులేకుండా పాలించిన హ్యూగో చావెజ్ 2013లో అనారోగ్యంతో మృతి చెందడంతో నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు.
పెత్తనాన్ని, దోపిడీని ఆపినందుకే..
రెండు దశాబ్దాల నుంచీ అమెరికా చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో తమ స్వీయ రక్షణకోసం చైనా, రష్యా, ఇరాన్‌ల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసాడు మదురో. అమెరికా నిత్యం పెడుతున్న ఆర్ధిక ఆంక్షలు ఇతర వత్తిడిల కారణంగా వెనెజువెలాలో ద్రవ్యోల్బణం తలెత్తింది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ప్రజల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. అయినప్పటికీ మదురో 2018, 2024 ఎన్నికల్లో విజయం సాధించాడు. తమకు వ్యతిరేకంగా ఉన్నాడనే కోపంతో మదురోను దేశాధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా నిరాకరించింది. చివరకు మదురో అమెరికాను అస్థిర పరచడానికి ప్రయత్నిస్తున్నాడనీ, మాదకద్రవ్యాలు, అక్రమ వలసదారులు రావడానికి మదురో కారణమంటూ ప్రచారం చేపట్టింది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక వెనెజువెలాలో డ్రగ్స్ ముఠాలున్నాయనీ, అవి ఉగ్రవాదులతో సమానమనీ ప్రకటించాడు. దేశాధ్యక్ష పదవి నుంచి మదురో తప్పుకోవాలనీ ట్రంప్ హెచ్చరించాడు. ట్రంప్ అబద్ధాలకు ప్రతిస్పందిస్తూ తమదేశంలోని చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా చమురు కంపెనీలు తమను ఉగ్రవాదులుగా చిత్రిస్తున్నాయన్నాడు మదురో. వెనెజువెలా రాజధాని కారకాస్పై 2026 జనవరి 3 తెల్లవారు జామున అమెరికా సైన్యం పెద్దఎత్తున దాడి చేసి దేశాధ్యక్షుడైన మదురోను, అతని భార్య సిలియా ప్లోర్స్ను దారుణంగా నిర్బంధించి అమెరికాకు తీసుకుపోయింది. మదురో కళ్ళకు గంతలు కట్టి, చేతులను బెల్టులతో కట్టేసిన ఫోటోలను విడుదల చేసింది.
వెనెజువెలా మాదక ద్రవ్యాలను, వలసలను అమెరికాలోకి రాకుండా నిలువరించలేనంత బలహీనస్థితిలో అమెరికా రక్షణ వ్యవస్థ, పాలనా వ్యవస్థ లేదనేది ప్రపంచానికంతటికీ తెలుసు. అమెరికా అబద్ధాలు చెబుతున్నదనీ దాని అసలు లక్ష్యం వెనెజువెలాలోని చమురు, బంగారు, సహజవాయు నిక్షేపాలను కాజేయడమేనని ప్రపంచమంతా నమ్ముతున్నది. ఒక్క మాటలో పెట్టుబడిదారీ దోపిడీ ఉగ్రవాద విశ్వరూపమే వెనెజువెలా అధ్యక్షుడి నిర్బంధం వెనక అసలు కారణమనీ, అమెరికాది సామ్రాజ్యవాద ఆధిపత్య నియంతృత్వమనీ, ఇదొక సామ్రాజ్యవాద ఉగ్రవాదమనీ ప్రత్యర్ధి దేశాలు విమర్శిస్తుండటంలో వాస్తవం లేకపోలేదు.
సద్దాంను పోలిన మదురో సమాధానం
నికోలస్ మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్లపై ఆఘమేఘాలపై విచారణకు సోమవారం (జనవరి 5) కోర్టులో ప్రవేశపెట్టింది అమెరికన్ ప్రభుత్వం. డ్రగ్స్ ట్రాఫికింగ్, అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నారన్న అభియోగంపైన కోర్టులో విచారణ మొదలైంది. కోర్టులో సమాధానం చెబుతూ మదురో ‘తాను వెనెజువెలా దేశానికి అధ్యక్షుడిననీ, తాను గౌరవనీయమైన వ్యక్తిననీ, తాను ఏ తప్పూ చేయలేదనీ, తనను తన భార్య సిలియాను అక్రమంగా నిర్బంధించారని’ చెప్పాడు. సరిగ్గా సద్దాం హుస్సేన్ కూడా ఇలాంటి సమాధానమే చెప్పాడు. ఆనాడు కోర్టులో జడ్జి రవూఫ్ రషీద్ అబ్దుల్ రెహమాన్ సద్దాంను ఉద్దేశించి నువ్వు ఎవరు? అని అడిగినప్పుడు అనంతమైన ధైర్యం నిండిన గుండెతో, గర్జించే ముఖంతో పెదాలపై చిరునవ్వుతో తాను ఇరాక్ అధ్యక్షుడినని సగర్వంగా సమాధానం చెప్పడం చూసి ఆనాడు ప్రపంచం ఆశ్చర్యపోయింది.
ఇప్పుడు మదురో కూడా సరిగ్గా అలాగే చెప్పాడు తాను వెనెజువెలా అధ్యక్షుడినని. అందుకే అప్పుడు సద్దాంను ఇప్పటి మదురోతో కలిపి పోల్చుకుంటున్నది ప్రపంచం. ఇద్దరి నిర్బంధం వెనకా లక్ష్యం, కారణం ఒక్కటే. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యం నియంతృత్వం, పెట్రోలు, చమురు, బంగారం, సహజవాయువులపై పెట్టుబడిదారీ శక్తుల దోపిడీ విధానం. అయితే ఆనాడు సద్దాంను ఉరితీసింది. ఈనాడు మదురోను ఏమిచేస్తుందో? చూడాలి.
ప్రధాని మోడీ మౌనం వెనక?
భారత ప్రధాని నరేంద్రమోడీ వెనెజువెలా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన అంశంపైన, అమెరికా దురాగతంపైన ఇంతవరకూ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. విదేశీ వ్యవహారాల మంత్రి కూడా నేరుగా స్పందించలేదు. కానీ విదేశీవ్యవహారాల శాఖ నుండి విడుదల చేసిన ప్రకటనలో అమెరికా దౌర్జన్యాన్ని కనీసంగా కూడా ఖండించలేదు. వెనెజువెలా అధ్యక్షుడి నిర్బంధం అంశాన్ని ‘లోతుగా’ పరిశీలిస్తున్నామని మాత్రమే ప్రకటనలో చెప్పారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాత్రం అమెరికా చర్యను తీవ్రంగా తప్పుపట్టాడు. చరిత్రలో సామ్రాజ్యవాద కాంక్షతో నియంతలుగా వ్యహరించిన ముస్సోలినీ, హిట్లర్‌ల మాదిరిగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఖర్గే సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దేశంలోని వామపక్షాలు అమెరికా నియంతృత్వ చర్యను ఖండించాయి. చైనా, రష్యా లాంటి అనేక దేశాలు అమెరికా దుశ్చర్యను తప్పుపడుతున్నాయి. కొన్ని అమెరికా అనుకూల దేశాలు మినహా ప్రపంచమంతా వెనెజువెలా అధ్యక్షుడు మదురో నిర్బంధాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి. అయినా భారత ప్రధాని నరేంద్ర మోడీ మౌన వ్యూహం దాల్చడంతో ప్రజల్లో అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రధాని మోడీ మౌనం దేశ ప్రయోజనాల కోసమా? లేక తన అనుచరుల వ్యాపార ప్రయోజనాలు అమెరికాతో ముడిపడి ఉన్నందుకా? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది. నరేంద్ర మోడీ మౌనం వీడేవరకూ ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది.
జంగా గౌతమ్
(ఏఐసీసీ మెంబర్)

