Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Vidwan Viswam: విద్వాన్‌ విశ్వం ఓ సాహితీ వీణ

Vidwan Viswam: విద్వాన్‌ విశ్వం ఓ సాహితీ వీణ

అప్పటికీ, ఇప్పటికీ రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రభావం

విద్వాన్‌ విశ్వం ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని చదివినా, ఆయన వ్యాస పరంపర ‘మాణిక్య వీణ’ను పఠించినా ఆయన సాహితీపరంగా ఎంత విశిష్టమైన వ్యక్తో అర్థమైపోతుంది. ఒక పక్క పత్రికా సాహిత్యాన్ని కొనసాగిస్తూనే మరోపక్క అనేక కావ్యాలు, వ్యాసాలు రాసిన విద్వాన్‌ విశ్వం అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో 2015 పుట్టి పెరిగారు. ఆయన అసలు పేరు మీసర గండ విశ్వేశ్వర శాస్త్రి అయినప్పటికీ సంస్కృత, ఆంధ్ర భాషల్లో విద్వాన్‌ పట్టా తీసుకున్నందు వల్ల ఆయన పేరు విద్వాన్‌ విశ్వంగా స్థిరపడిపోయింది. ఆయన సంస్కృతాంధ్ర భాషల్లో నిజంగానే పరిపూర్ణ విద్వాంసులు. ఈ రెండు భాషల్లో ఆయన అసమాన ప్రతిభా సంపన్నులనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాకంగా ఉన్న ఆయన శిష్యులు ఆయనను విజ్ఞాన సర్వస్వంగా పరిగణిస్తారు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తూ అనారోగ్యం కారణంగా తిరిగి అనంతపురం వచ్చేసిన విద్వాన్‌ విశ్వం ఆ తర్వాత తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు.
ప్రజలను చైతన్యపరచడానికి ప్రచురణ సంస్థ అవసరమని భావించిన విశ్వం నవ్యసాహితి ప్రచు రణ సంస్థ పేరుతో అటువంటి సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా అదే పేరుతో ఒక పత్రికను కూడా నడపడం ప్రారంభించారు. ఫాసిజం మీద గ్రంథాలను ప్రచురించారు. తరిమెల నాగిరెడ్డితో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది. బ్రిటిష్‌ పాలకులు రాజద్రోహం కింద నాగిరెడ్డితో పాటు ఆయనను మొదట అలీపూర్‌ జైల్లోనూ, ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలులోనూ నిర్బంధించారు. తిరుచిరాపల్లి జైలులో ఆయనకు బెజవాడ గోపాలరెడ్డి, రాజాజీ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి దేశభక్తుల సాహచర్యం లభించింది. మరింత లోతుగా రాజకీయ అవగాహన పెంచుకోవడా నికి, స్వాతంత్య్ర పోరాటం కొనసాగించడానికి ఆయన పత్రికా రంగాన్ని ఎంచు కున్నారు. ఒక పక్క సాహితీ సేవ చేస్తూనే మరొకపక్క పత్రికా రంగంలో విశ్లేషణాత్మక వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అడవి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్‌ పత్రికలో సంపాదక వర్గంలో చేరిన విద్వాన్‌ విశ్వం ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక వార పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఆయన నిర్వహించిన ‘మాణిక్య వీణ’ శీర్షిక అశేషంగా పాఠకుల్ని ఆకట్టుకుంది. అదే పేరుతో ఆయన రాసిన వ్యాస పరంపర ఒక సంపుటంగా కూడా వెలువడింది. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడుగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురణ విభాగం అధిపతిగా పనిచేయడం జరిగింది.
ఆయన కథా సరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనిగించారు. ‘చందమామ’లో ఆయన రాసిన పంచతంత్ర కథలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తర్వాత గ్రంథ రూపంలో ప్రచురించింది. బ్రహ్మసూత్రాలు శంకర భాష్యాన్ని నాలుగు సంపుటాలుగా, అధర్వణ వేదా న్ని తెలుగులోనూ ప్రచురించడం కూడా జరిగింది. ఆయన 1987లో కాలధర్మం చెందారు. అయితే, వీటన్నిటికన్నా ఎక్కువగా ఆయన రాసిన పద్యకావ్యాలు, గేయాలు పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన రాసిన ‘పెన్నేటి పాట’ పద్యకావ్యం తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆయన ప్రచురించిన ‘మాణిక్యవీణ’ వ్యాసాలు అప్పటికీ, ఇప్పటికీ రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రభావాన్ని కలిగించడంతో పాటు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కొన్ని అనువాద గ్రంథాలతో పాటు ఆయన తన జీవిత కాలంలో కావ్యాలు, నాటికలు, వ్యాసాలతో కలిపి 35 గ్రంథాల వరకూ రాశారు. అటు పత్రికా రచయితగా, ఇటు సాహితీవేత్తగా ఆయన తెలుగునాట చెరగని ముద్ర వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News