Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Vision India@2047: మోదీ ముందరి కాళ్లకు బంధాలు

Vision India@2047: మోదీ ముందరి కాళ్లకు బంధాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి నుంచే తమకు అందిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటే తప్ప 2047 నాటికి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఆయనకు ప్రతి క్షణం విలువైనదే. 2024-25 బడ్జెట్‌లో ఆయన రాజకీయ వ్యూహాలను, సంకీర్ణ ఒత్తిళ్లను, ప్రతిభా పాటవాలను కలగలిపి, అభివృద్ధికి, సంక్షేమానికి కేటా యింపులు జరపాల్సి వచ్చింది. ఆదిలోనే ఇటువంటి హంస పాదులు ఎదురవుతున్న పరిస్థితిలో ఆయన ఇంటా బయటా సమస్యల మధ్య తన ఆశయాన్ని, తన లక్ష్యాన్ని నెరవేర్చగలరా అనిపిస్తోంది. గత లోక్‌ సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి తక్కువ స్థానాలు లభించడం, అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడడం తప్ప నిర్మాణాత్మక సూచనలు, సలహాలకు ప్రతిపక్షాల నుంచి ఆస్కారం లేకపోవడం, ఇతర దేశాలనేకం సంక్షోభాలతో చిక్కు కుపోవడం వగైరాలు ఆయనకు అనేక ప్రతిబంధకాలను సృష్టిం చే అవకాశం ఉంది. ఇది ఏటికి ఎదురీదడమే అవుతుంది.
అసూయా ద్వేషాలు
లోక్‌ సభ ఎన్నికల్లో తాము కోల్పోయిన రాజకీయ బలాన్ని, ఆత్మస్థయిర్యాన్ని కూడగట్టుకునే దిశగా మోదీ తన మొదటి బడ్జెట్‌ను ఉపయోగించుకోవడం జరిగింది. ఈ బడ్జెట్‌ జనాకర్షక బడ్జెట్‌ కాదు. అలా అని బాధ్యతారహితమైన బడ్జెట్‌ కూడా కాదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం, ఆర్థికంగా స్థిరత్వం సంపాదించడం ఈ బడ్జెట్‌ లక్ష్యం. ద్రవ్య లోటును మరింతగా తగ్గించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ, మరో రెండు దశాబ్దాల కాలంలో భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యాల స్థాయికి చేరుకుంటుందా, చేరుకోగలుగుతుందా అంటూ పలువురు వ్యక్తం చేస్తున్న సందే హాల్లో వాస్తవం లేకపోలేదు. దేశం కొద్దిపాటి అభివృద్ధి సాధిం చాలన్నా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక సవా ళ్లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించడం ఆషామాషీ వ్యవ హారం కాదు. గత రెండు పర్యాయాల పాలనలో ఎదురు కానం త ప్రతిఘటన, ప్రతిబంధకాలు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఎదురు కాబోతున్నాయి. వాస్తవ విరుద్ద మైన విషపూరిత కథనాలను ప్రజల మనసుల్లోకి జొప్పించడం జరుగుతోంది. మత, కుల విభజనకు సంబంధించిన అవాస్తవ కథనాలు దేశ ప్రగతికి క్రమంగా ముప్పుగా మారుతున్నాయి. మోదీపరంగా అభివృద్ధి జరగడం ఇష్టం లేని ప్రతిపక్షాలు అడు గడుగున్నా ఆటంకాలు సృష్టిస్తున్నాయి.
నిజానికి మోదీ కంటున్న కలలు నెరవేరడం కష్టమైన విషయమే కాదు. అందుకు ఆయన పాలనా దక్షతే ప్రబల నిదర్శనం. గత రెండు పర్యాయాల పాలనా కాలంలో ఆయన అనేక ప్రతిబంధకాలను అధిగమించారు. అనేక మార్పులు చేశారు. అనేక అడ్డుగోడలను బద్దలు కొట్టారు. నియమ నిబంధనలను, పాలనాపరమైన ఆలస్యాలను తోచిరాజని ఆయన సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు అందించగలిగారు. కోట్లాది మంది భారతీయులకు ఆయన గ్యాస్‌ కనెక్షన్లు ఇప్పించారు. నేరుగా ఆహార ధాన్యాలను సరఫరా చేశారు. ఇళ్లను, మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చారు. మంచి నీటి సరఫరాకు అవకాశం కల్పిం చారు. గ్రామాల్లో కూడా రోడ్లను నిర్మించారు. వీటన్నిటి ఫలి తంగా దేశంలో పేదరికం స్థాయి గణనీయంగా తగ్గిపోయింది. ఇక 8 శాతం జీడీపీతో భారతదేశం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవ స్థకు దీటుగా ఎదుగుతోంది. రాష్ట్రాలు ఇచ్చే ఉచితాల స్థాయిని దాటిపోయిన కోట్లాది పేద కుటుంబాలు ఇప్పుడు మరిన్ని అభి వృద్ధి ఫలాల కోసం అర్రులు చాస్తున్నాయి. ఈ పరిణామం సవాళ్లనూ పెంచింది, అవకాశాలనూ పెంచింది.
సరికొత్త ఆశయాలు
దేశంలోని కోట్లాది మంది యువతీ యువకుల ఆశయాలు, ఆశలు క్రమంగా హద్దులు దాటడం మొదలైంది. మరింత మెరుగైన జీవన ప్రమాణాల కోసం వారు తాపత్రయ పడుతున్నారు. వారి ఆశయాలకు తగ్గట్టుగా భారతదేశం ఎదుగుతుందా అన్నది ప్రశ్న. మోదీ ప్రభుత్వం గనుక కొన్ని సవాళ్లు, సమస్యల విషయంలో కొద్దిపాటి శ్రద్ధ తీసుకుని, వాటిని పరిష్కరించిన పక్షంలో దేశం తప్పకుండా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడంతో పాటు, 2047 కల కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది.
భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర రాజకీయ, సామాజిక సమస్యలను అటుంచి, ఉద్యోగాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తాజా ఆర్థిక సర్వే ప్రకారం, దేశానికి అతి పెద్ద సవాలు ఉద్యోగాల కల్పనే. దేశంలో ఏటా 78.50 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గత బడ్జెట్లో అయిదు పథకాలను ప్రకటించింది కానీ, అవి కేవలం అరకొర చర్యలు మాత్రమే. ఇక్కడ సమస్య నిరుద్యోగం కాదు. ఉద్యోగా ల్లో చేర్చుకోలేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య.
దేశంలో ఎక్కడా ప్రపంచ స్థాయి విద్య అందుబాటులో లేదు. దేశంలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలమని చెప్పుకుంటున్న అనేక సంస్థలు డిగ్రీలను ఇవ్వడం తప్ప, ప్రతిభను, నైపుణ్యాలను పెంచడం లేదు. సరైన విద్యను అందించడం లేదు. ప్రభుత్వ నిర్వహణలోని విద్యా వ్యవస్థ, విద్యా సంస్థలు ఏనాడో కుప్పకూలిపోయాయి. వాటిని పునరుద్ధరించే ప్రయత్న మేదీ జరగడం లేదు. అర్హులైన, ప్రతిభావంతులైన అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి దేశంలోని అనేక సంస్థలు ఎదురు చూస్తున్నాయి. కానీ, దేశంలో ప్రతిభకు తీవ్రస్థాయి కొరత ఏర్పడి ఉంది. ప్రతిభకు కొరత ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఏడవ స్థానంలో ఉంది. దాదాపు 81 శాతం సంస్థలు తమకు కావలసిన అభ్యర్థులు లభ్యం కావడం లేదని చెబుతున్నాయి. సరైన అభ్యర్థులు లభ్యం కాక, అనేక సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి.
ఇక చైనాతో పోలిస్తే భారతదేశంలో వ్యాపారావకాశాలు చాలా తక్కువ. భారతదేశం తన భద్రతను కూడా కాదని, అనేక వస్తువుల ఉత్పత్తి విషయంలో చైనాపై ఇప్పటికీ ఆధారపడు తోంది. వాణిజ్య లోటు పది వేల కోట్ల డాలర్ల వరకూ ఉం టోంది. ఎక్కువగా ఉద్యోగాలకు ప్రయత్నం చేయడమే తప్ప ప్రభుత్వం ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా వ్యాపారాలు ప్రారంభించే వారి సంఖ్య దేశంలో అతి తక్కువ స్థాయిలో ఉంటోంది. ఇక పాలనా యంత్రాంగంలో అవినీతికి అంతూ పొంతూ ఉండదు. దేశానికి ఇదొక పెద్ద శాపం. గత పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో అవినీతి చాలావరకు తగ్గింది. మంత్రులు కూడా అవినీతికి పాల్పడడం లేదు. అయితే, అవినీతి, అధికారిక ఆలస్యాలు దేశాన్ని అనేక విధాలుగా చీడ పురుగుల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ కుళ్లు దేశ పాలనా వ్యవస్థలో బాగా వేళ్లు పాదుకుపోయింది. ఇటువంటి చెదలు పట్టిన వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధి కార్య క్రమమైనా, సంక్షేమ పథకమైనా ఆశించిన స్థాయిలో నెరవేరే అవకాశం ఉండదు.
ప్రతికూలతలు ఎక్కువ
న్యాయ వ్యవస్థ కూడా ఒక అభివృద్ధి నిరోధక పరికరంగా మారిపోయింది. దేశంలో దాదాపు అయిదు కోట్ల కేసులు న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్నాయి. న్యాయం ఆలస్యం అయ్యే కొద్దీ న్యాయం జరగనట్టే భావించాలి. కోట్లాది ప్రభుత్వ సంబంధమైన కేసులు అపరిష్కృతంగా ఉన్నందు వల్ల లక్షల కోట్ల రూపాయలు కేసుల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు కూడా వివాదాల్లో చిక్కుకుని ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని కేసులు 30 ఏళ్లు పైబడి పరిష్కారానికి ఎదురు చూస్తున్నాయి. ఇక ఇటీవలి సర్వేల ప్రకారం వ్యవసాయ సంబంధమైన జీడీపీలో వ్యవసాయాదాయం 1.4 శాతం కూడా లేకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దేశంలోని మొత్తం కార్మికుల్లో 45.8 శాతం కార్మికులు వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. ఈ రంగంలో సంస్కరణలేవీ చేపట్టకుండా స్వప్రయోజనాపరులు తీవ్రస్థాయిలో అడ్డుకోవడం జరుగుతోంది. చాలామంది నిరు ద్యోగులు రైతుల ముసుగులో కొద్దో గొప్పో ఆర్థిక ప్రయోజనా లను పొందడం జరుగుతోంది. రైతులకు అందించే సహా యాలు, సంక్షేమాలన్నీ చేరవలసిన వారికి చేరడం లేదు. వ్యవసాయ చట్టాల విషయంలోనే కాకుండా పౌరసత్వ సవరణ చట్టాల విషయంలో కూడా అనేక సంస్థలు కల్పిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విదేశీ నిధులతో బలపడుతున్న కొన్ని సంస్థలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలకు అడ్డు తగులుతూ అభివృద్ధి నిరోధక శక్తులుగా మారడం జరుగుతోంది. ఇక భారతదేశంలో విద్యుత్‌ ఉత్పత్తి రంగం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. విద్యుత్‌ నష్టాలు, విద్యుత్‌ చౌర్యాలు అంచనాలను మించుతున్నాయి. ఇటువంటి ప్రాథమిక సదుపాయాల వ్యవస్థల్లో అసమర్థత రాజ్యమేలుతోంది. జనరేటర్లు, ఇన్వర్టర్ల మీద నిధులన్నీ వృధా అవుతున్నాయి. అనుత్పాదక విషయాలు, వ్యవహారాల కారణంగా దేశ ఖజానా మీద పెనుభారం పడుతూ, ఇతర ప్రధాన అంశాలకు నిధులు కరువవుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ అంశాల మీద దృష్టి పెట్టగలిగిన పక్షంలో ఎన్ని ప్రతిబంధకాలున్నా తేలికగా తొలగిపోయే అవకాశం ఉంటుంది.

- Advertisement -

– కె.వి. రాఘవేంద్ర

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News