మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో దేశంలో సాంప్రదాయ కులవృత్తి దారుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన రోజుల నుండి వివిధ స్థాయిల్లో కులవృత్తిదారుల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థిక సామాజిక వికాసం కోసం కృషి చేస్తున్నారు. కులవృత్తిదారుల వృత్తి కౌశలాన్ని పెంపొందించేందుకు శిక్షణ పరిశోధన ఉత్పత్తుల నాణ్యత ప్రామాణికతకు మెరుగులు దిద్ది ప్రపంచ స్థాయిలో పోటీపడేట్లు పలు రాయితీలు ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టారు.
విశ్వకర్మ యోజన చేతి వృత్తులు రుణాలు
విశ్వకర్మ పథకం కింద గ్రామీణ చేతి వృత్తుల వారికి రాయితీ రుణాలు మంజూరు చేయాలని సంకల్పించారు. ఈ పథకం కింద నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి వడ్రంగి, చేనేత ఇతర కులవృతుల వారికి నైపుణ్య శిక్షణ అవసరమైన ఆధునిక పనిముట్లు యంత్రాలు యంత్ర పరికరాలు కొనుగోలు కోసం 15 వేల రూపాయల వరకు ఉచిత ఆర్థిక సహాయం అందించడం వల్ల చేతి వృత్తిదారుల్లో ఉత్పాదక సామర్థ్యం పెరిగి ఆర్థికంగా పురోగమించటానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా లక్ష రూపాయల వరకు తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందిస్తారు. రెండో విడత 2 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తారు. వృత్తి కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద దేశంలో 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
పీఎం విశ్వకర్మ పథకం బడ్జెట్
పిఎం విశ్వకర్మ పథకం కోసం ఐదేళ్ల పాటు కేంద్ర బడ్జెట్లో రూ.13000 కోట్ల నుండి రూ.15000 వరకు కేటాయిస్తారు. మొదటి దశలో 18 సాంప్రదాయ వృత్తులకు ఈ పథకాన్ని అందించనున్నారు. చేతివృత్తి పనివారికి పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్స్ జారీ చేసి, గుర్తింపు కార్డులు ఇస్తారు. తొలి దశలో లక్ష, రెండో దశలో 2 లక్షల వరకు రుణాలు అందిస్తారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ యోజన పథకం అమలు చేస్తారు.
ఈ పథకంలో చర్మకారులు, మేస్త్రిలు, స్వర్ణకారులు, టైలర్లు, పనిముట్లు తయారు చేసే కమ్మరి మట్టి పాత్రలు చేసే కుమ్మరి శిల్పి, వడ్రంగి, పడవలు తయారు చేసేవారు బ్లాక్ స్మిత్, లాక్ స్మిత్, శిల్పులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారు.
విశ్వస్థాయి సరఫరాతో ఏకీకృతం
వృత్తి కళాకారుల ఉత్పత్తుల్లో నాణ్యత పెంచడం దేశం, ప్రపంచ సరఫరా గొలుసుతో వారిని ఏకీకృతం చేయడానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీ, సీ మహిళలు, ట్రాన్స్ జెండర్స్, బలహీన వర్గాల కార్మికులకు ఆర్థిక సాధికారిత సాధనకు విశ్వకర్మ యోజన సహాయపడుతుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేయూత అందిస్తారు.
చేతి వృత్తులు ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి
చేతివృత్తులు తరతరాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఆర్థిక స్వావలంబనా సాధనలో బహుముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇనుము, కొయ్య, మట్టి పాత్రలు, గృహోపకరణాలు గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలు మనిషి జీవన యానానికి తోడ్పడే వివిధ పనిముట్లు తయారు చేసే చిన్న తరహా కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు గ్రామీణ ఆర్థిక ప్రగతికి పట్టుకొమ్మలుగా నిలిచాయి.
కుటీర పరిశ్రమలు గ్రామీణ స్వరాజ్యం
కుటీర చిన్న తరహా పరిశ్రమలు కుటీర గ్రామీణ ఖాది పరిశ్రమలు గ్రామీణ స్వరాజ్యానికి దోహదపడతాయని జాతిపిత మహాత్మా గాంధీ స్పష్టం చేశాడు. చిన్న తరహా పరిశ్రమలు పెద్ద తరహా పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆనాడే గాంధీ ఉద్బోధించారు. కుటీర పరిశ్రమలు చేతి వృత్తులు స్వయం ఉపాధి అవకాశాలను విస్తృత పరుస్తాయి. ఆర్థిక వ్యవస్థ స్వావలంబన సాధనలో బహుముఖ పాత్రపోషిస్థాయి.
ప్రపంచీకరణ కుల వృత్తులు
ప్రపంచీకరణ కార్పొరేటీకరణ ప్రభావం వల్ల గ్రామాల్లో చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు కులవృత్తులు దెబ్బతిన్నాయి. బతుకు పోరాటంలో ఉపాధి కొరకు గ్రామాల నుండి పట్టణాలకు నగరాలకు కార్మికుల వలసలు పెరిగాయి. ఎంతో నైపుణ్యం కలిగిన చేతివృత్తి పనివారు ఉపాధి కొరకు నగరాలలో పట్టణాలలో మాల్స్‌ల్లో ప్రైవేటు అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. తరతరాల చేతి వృతులను వదిలి, అల్ప వేతనాలకు పనిచేస్తూ, ఎక్కువ పని గంటలు శ్రమించినప్పటికీ సక్రమంగా వేతనాలు అందక, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి విశ్వకర్మ యోజన పథకం ఉపయోగపడుతుంది.
చేతి వృత్తిదారుల రుణాలు ఆత్మ విశ్వాసం
విశ్వకర్మ యోజన పథకం కింద చేతివృత్తిదారులకు రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించారు. వృత్తి పనివారికి రోజుకు500 రూపాయల చొప్పున ఉపకారవేతనం (స్కాలర్షిప్) ఇచ్చి మెరుగైన శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారు సొంతంగా చిన్న పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించుకోవచ్చు. ప్రభుత్వం కావలసిన సహాయం అందిస్తుంది. చేతివృత్తిదారుల్లో పారిశ్రామిక ఉద్యమిత్వ నైపుణ్య సామర్థ్యాలను ప్రోత్సహిస్తారు. విశ్వకర్మ యోజన పథకం చేతి వృత్తి దారుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. వారిలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి ఆర్థికాభివృదికి దోహదపడి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. స్వదేశీ ఉత్పత్తులు పెరిగి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ది సాధ్యమౌతుంది.
కులవృత్తులు – ఆత్మగౌరవం
కుల వృత్తుల వారి ఆత్మగౌరవం పెంచడం కోసం సమాజాన్ని కులాల వారీగా వర్గీకరించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. సమాజంలో అందరూ ఇంజనీర్లు డాక్టర్లు టీచర్లుగా తయారు కాలేరు. ఎవరికి ఏ రంగంలో ఆసక్తి వుంటుందో వారిని ఆ రంగములో వృద్ధి చెందేట్లు చేయూత ఇవ్వాలి. నైపుణ్య భారత్, ఆత్మనిర్బర భారత్ పేరున కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఎంచుకున్న రంగంలో రాణించాలంటే నైపుణ్యం పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత ఆదాయ సృష్టి జరిగి, వృద్ధి అభివృద్ధి జరుగుతుంది.
డిజిటల్ ఇండియా నైపుణ్యం ఉపాధి
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా 5.25 లక్షల ఐ.టి ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడం, సూపర్ కంప్యూటర్స్ అందుబాటులోకి తేవడం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్త్రరణ బలోపేతానికి వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.
స్కిల్ డెవలప్మెంట్ చేతి వృత్తుల ఆర్థిక పునర్జీవనం
స్కిల్ ఇండియా మిషన్ స్కిల్ ఎంప్లాయిమెంట్ కేంద్రాల ద్వారా కోట్లాది మంది యువతకు నైపుణ్యాలను అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం, సంప్రదాయ వృత్తులకు గౌరవించడం చేతివృత్తిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా వారి ఆర్థిక పునురుజ్జీవన వికాసానికి పథకం దోహదపడుతుంది.
పట్టణ కాలుష్య నియంత్రణ
దేశంలోని 169 పట్టణాలలో కాలుష్య నియంత్రణ కొరకు ఈ బస్సు సేవా కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించిన మరుసటి రోజే అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రజల ఆర్థికాభివృద్ధికి జీవన ప్రమాణాలు పెంపొందించే ఆర్థిక వ్యూహాలతో ఉపాధి ఉత్పత్తి ఉత్పాదకత సామర్థ్యాలను పోటీతత్వాన్ని పెంచి, ప్రామాణికతతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులతో భారత్ ను ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగటానికి సమగ్రమైన ఆర్థిక ప్రణాళికలతో సరికొత్త వ్యూహాలతో కార్యాచరణకు పూనుకోవాలి.
- నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు - 9440245771