‘Data Centers’ Forever chemical pollution : ఉద్యోగాల జాతర! లక్షల కోట్ల పెట్టుబడులు! అభివృద్ధి పరుగులు! కృత్రిమ మేధ (AI) విప్లవంతో ప్రపంచాన్ని శాసించే సత్తా! విశాఖ తీరంలో కొలువుదీరనున్న డేటా సెంటర్లపై ప్రభుత్వాలు, టెక్ దిగ్గజాలు మనకు అందిస్తున్న చిత్రం ఇది. డేటాను ఆధునిక ఇంధనంగా అభివర్ణిస్తూ, ఈ సెంటర్లను నవతరం రిఫైనరీలుగా కీర్తిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరి రెండో వైపు కంటికి కనిపించని, తరతరాలను వెంటాడే ఒక పెనుభూతం పొంచి ఉందన్న సంగతి మీకు తెలుసా? అభివృద్ధి రంగులద్దిన ఈ చిత్రంలో, ‘శాశ్వత రసాయనాల’ రూపంలో దాగి ఉన్న ఆ చీకటి కోణం ఏమిటి…? ఈ ఆందోళన ఎందుకు అవసరం…?
డేటాసెంటర్లు.. ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదేమాట వినిపిస్తోంది. డేటా అనేది ఆధునిక ఇంధనమైతే డేటాసెంటర్లే సరికొత్త రిఫైనరీలని కూడా చాలామంది చెబుతున్నారు. రాబోయే రోజుల్లో విపరీతంగా డబ్బులు సంపాదించిపెట్టే ఈ డేటాసెంటర్ల ఏర్పాటుకోసం కొన్ని లక్షల కోట్లు వెచ్చించడానికి కూడా టెక్ దిగ్గజాలు వెనకాడటం లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సాంకేతిక దిగ్గజాలకు వారి సెర్వర్, నెట్‌వర్కింగ్ పరికరాలకు.. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న డిజిటల్ ట్రాఫిక్ నిర్వహణకు డేటా సెంటర్లు చాలా అవసరం. దానికితోడు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న ఏఐ, ఎంఎల్ విప్లవం కూడా డేటా సెంటర్ల అవసరాన్ని బాగా పెంచుతోంది. అయితే.. లక్షల కోట్ల పెట్టుబడులతో వీటిని ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారు.. మన దేశంలోనే! అది కూడా అక్కడా ఇక్కడ కాదు.. తాజాగా గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తమ అత్యధిక పెట్టుబడిగా చెబుతున్న డేటాసెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటుచేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా భారీగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇవన్నీ నాణేనికి ఒకవైపయితే, రెండోవైపు వీటివల్ల వచ్చే నెగెటివ్ ప్రభావాలు ఏంటన్నది చూడాలి. అమెరికాలో వీటివల్ల విద్యుత్ డిమాండ్ ఉన్నట్టుండి అనేక రెట్లు పెరిగిపోయింది. పోనీ ఇవేమైనా స్వచ్ఛ ఇంధనం వాడుకుంటాయా అంటే.. ఆయా మార్గాల్లో ఏడాది మొత్తం ఒకేలా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమైసనదాంట్లో 80% వరకు సౌర విద్యుత్తు లాంటివాటినే వాడుకుంటామని చెబుతున్నారు. కానీ విశాఖ అసలే సముద్రతీర ప్రాంతం. తుపానులు వచ్చే అవకాశం ఎక్కువ. మబ్బుపట్టి, వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత వస్తుంది? అది రాకపోతే సంప్రదాయ విద్యుత్తు పెద్దమొత్తంలో కావాల్సిందే కదా? అంతేకాదు.. వీటికి పెద్దమొత్తంలో నీరు కూడా అవసరం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫరెవర్ కెమికల్ పొల్యూపన్.. అంటే శాశ్వత రసాయన కాలుష్యంగా చెప్పే పీఎఫ్ఏ అనేది మరో ఎత్తు.
పీఎఫ్ఏ గ్యాస్ లేదా ఎఫ్-గ్యాస్‌ను వీటిలో తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఇది గ్రీన్ హౌస్ వాయువు అవుతుంది. దీనివాడకం వల్ల ఇంతకుముందు డేటాసెంటర్ల వల్ల వస్తుందని భావిస్తున్న కాలుష్యం కంటే చాలా దారుణంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఎఫ్-గ్యాస్‌లు చాలా శరవేగంగా ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్నాయి. మరోవైపు డేటాసెంటర్ల వల్ల వచ్చే వాయు, గాలి కాలుష్యంపై ఇంతవరకు పరిశోధనలు, పరీక్షలు ఏమీ జరగలేదు. ఈ కంపెనీలు తాము వాడే రసాయనాలు ఏవేంటి, విడుదల చేసే వాయువులు ఏంటన్న విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఇలా చెప్పడాన్ని తప్పనిసరి చేసేలా చట్టాలను మార్చాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. డేటాసెంటర్లు ఉపయోగించే పీఎఫ్ఏ, ఇతర రసాయనాలపై వేగంగా సమీక్షిస్తామని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించిన తర్వాతి నుంచి ఈ డిమాండ్లు పెరిగాయి. తాము వాడే పీఎఫ్ఏల వల్ల పెద్దగా కాలుష్యం ఉండబోదని డేటాసెంటర్ పరిశ్రమలు చెబుతున్నా.. పర్యావరణవేత్తలు మాత్రం కాదంటున్నారు.
“డేటాసెంటర్లలో పీఎఫ్ఏలు వాడతారని మాకు తెలుసు. అలా వాడినదంతా ఎక్కడో ఒకచోటుకు వెళ్లాల్సిందే. కానీ ఇంత ప్రమాదకరమైన విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా పరిశీలన, పరిశోధన జరగడం లేదు. డేటాసెంటర్ల నిర్మాణం జరుగుతున్న వేగంతో పోలిస్తే పరిశోధనల వేగం చాలా తక్కువగా ఉంది” అని ఎర్త్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రముఖ న్యాయవాది జొనాథన్ చెబుతున్నారు. ఈ సంస్థ డేటాసెంటర్లలో పీఎఫ్ఏల వాడకాన్ని పరిశీలిస్తోంది. తమ సంస్థల్లో వాడే పరికరాలు నీళ్ల వల్ల పాడవ్వకుండా, మరకలు పడకుండా, గ్రీజు మకిలి అంటకుండా ఉండేందుకు పీఎఫ్ఏలను ఉపయోగిస్తారు. ఇందులో 16వేల రసాయనాలు ఉంటాయి. వీటివల్ల క్యాన్సర్, పుట్టుకతో లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గడం, కొలెస్టరాల్ పెరగడం, కిడ్నీ వ్యాధులు.. ఇలా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. పీఎఫ్ఏ అనేది పర్యావరణంలో సహజంగా కలిసిపోదు కాబట్టి దీన్ని శాశ్వత రసాయనం అంటారు.
డేటాసెంటర్ల వల్ల పీఎఫ్ఏ కాలుష్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా పెరుగుతుంది. ప్రధానంగా వాటిలో ఉపయోగించే కూలింగ్ పరికరాల్లో దీన్ని వాడతారు. దీనివల్ల అక్కడే కాలుష్యం చాలా ఏర్పడుతుంది. దాంతోపాటు పరికరాల్లో వాడే పీఎఫ్ఏలను తప్పక ఎక్కడో ఒకచోట పారేయాలి. ఎందుకంటే, వీటిలో రసాయనాలను పూర్తిగా నాశనం చేయలేం. డేటాసెంటర్లలో వాడే సెమీకండక్టర్ల ఉత్పత్తిలో కూడా చాలా పెద్దమొత్తంలో పీఎఫ్ఏ వాడతారు. దాంతో సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్లాంట్ల వద్ద కూడా కాలుష్యం పెరుగుతుంది.
ఆందోళనలను కొట్టిపారేసిన సీఎం చంద్రబాబు : ప్రపంచ ఏఐ రాజధానిగా విశాఖను చేయాలనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ కాలుష్యం గురించిన చర్చ లేశమాత్రంగానైనా కనిపించడం లేదు. అమెరికా, చైనాలతో పోటీపడుతూ విశాఖను ఏఐ రాజధానిగా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచం మొత్తానికి అవసరాలను ఇక్కడి నుంచే తీరుస్తామని, దీనివల్ల రాష్ట్రానికి బోలెడంత సంపద సమకూరడంతో పాటు ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. విద్యుత్, నీటి అవసరాల గురించి కొందరు ప్రశ్నించినా, వాళ్లు తమకు కావల్సిన విద్యుత్తు అవసరాల్లో 80% వరకు వాళ్లే సౌర విద్యుత్తు ఉత్పత్తితో తీర్చుకుంటారని, అందువల్ల దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ఆయన చెబుతున్నారు. ఆధునిక కూలింగ్ వ్యవస్థల్లో నీటి అవసరం లేదంటూ ఆ విషయాన్ని కూడా కొట్టిపారేశారు. అయితే, అప్పటికి ఎవరికీ పెద్దగా ఈ డేటాసెంటర్లలో వాడే పీఎఫ్ఏల గురించి తెలియకపోవడంతో దాని గురించి ఆయన్ను ఎవరూ అడగలేకపోయారు.
చల్లబరచాలంటే ఎఫ్-గ్యాస్ ఉండాల్సిందే : సాధారణంగా సెమీకండక్టర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కకుండా ఉండాలంటే భారీగా కూలింగ్ వ్యవస్థ తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఇంతకుముందు సంప్రదాయ కూలింగ్ వ్యవస్థల్లో భారీ మొత్తంలో నీరు, నైట్రేట్ల లాంటి రసాయనాలు, ఇతర పదార్థాలు వాడేవారు. ఇప్పుడు రాగి గొట్టాల గుండా పీఎఫ్ఏఎస్ లేదా ఎఫ్-గ్యాస్‌ను పంపుతారు. అదే రిఫ్రిజిరెంట్ కూలెంట్‌గా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఎఫ్-గ్యాస్ గాల్లోకి వెళ్తే అది టీఎఫ్ఏ అనే పదార్థంగా మారుతుంది. ఇది ఇంతకుముందు అనుకున్నదాని కంటే చాలా విషపూరితం అని తాజా పరిశోధనల్లో తెలుస్తోంది. గాలిలో, నీటిలో, చివరకు మనుషుల రక్తంలో కూడా ఈ టీఎఫ్ఏ కనిపిస్తోంది. ఇక ఎఫ్-గ్యాస్‌లు వాతావరణంలోకి విడుదలైతే అవి కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. డేటాసెంటర్ల కేబుళ్లు, పైపులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు రకరకాల పీఎఫ్ఏలు పూస్తారు. అవన్నీ క్రమంగా గాల్లో కలిసిపోయి వాతావరణాన్ని కలుషితం చేసేస్తాయి.
అమెరికాలో ఆందోళన : డేటాసెంటర్లు, ఏఐ విస్తృత వాడకంతో అమెరికాలోని వెస్ట్ వర్జీనియా, పిట్స్‌బర్గ్, నార్త్ కరొలినా తదితర ప్రాంతాల్లో ఉన్న కెమౌర్స్ అనే కర్మాగారంలో ఎఫ్-గ్యాస్ ఉత్పత్తిని పెంచారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని గాలి, నీరు, మట్టి అన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఈ సంస్థ కాలుష్యం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని అక్కడివారు వాపోతున్నారు. దాంతో మిన్నెసోటాలోని పర్యావరణ గ్రూపులు రాష్ట్రంలోని చట్టసభల సభ్యులతో కలిసి ఒక కొత్త చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలన్నీ తమ కూలింగ్ అవసరాలకు ఎంతమొత్తంలో పీఎఫ్ఏలను వాడుతున్నారో చెప్పాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఇప్పటికే తమ ప్రాంతంలో ఉన్న డేటా సెంటర్లను వాటి కూలింగ్ అవసరాలకు ఏం వాడుతున్నారో ప్రశ్నిస్తే సంతృప్తికరమైన సమాధానం రాలేదని క్లీన్ వాటర్ యాక్షన్ సంస్థ మిన్నెసోటా స్టేట్ డైరెక్టర్ అవొన్నా స్టార్క్ చెప్పారు. ఈ పెద్ద సంస్థలన్నీ బయటకు వెల్లడించకుండా దాచిపెడుతున్న విషయాలు చాలానే ఉంటున్నాయని స్టార్క్ అన్నారు.
చట్టాలన్నీ అత్యంత కఠినంగా అమలుచేసే అమెరికా లాంటి దేశాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


