Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Vote from home: ఓటు హక్కు ఉన్నవారు ఓటు వేయాల్సిందే

Vote from home: ఓటు హక్కు ఉన్నవారు ఓటు వేయాల్సిందే

ఓటు హక్కు కలిగినవారంతా తప్పనిసరిగా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది ప్రశంసనీయ విషయం. వలస కార్మికులతో ప్రతివారూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది ఎన్నికల కమిషన్‌ నియమంగా మారిన నేపథ్యంలో, ఈ దిశగా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల సందర్భంగా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలైంది. సాధారణంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రానికి రాలేకపోతున్నప్పుడు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అయితే, ఇప్పుడు పోలింగ్‌ కేంద్రమే వారున్న ప్రదేశానికి వెళ్లేటట్టుగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. త్వరలో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతిని ప్రయోగాత్మంగా అమలు చేయాలని ఇది భావిస్తోంది. ఇది నిజంగా వృద్ధులకు, దివ్యాంగులకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలవుతున్న ఈ ప్రక్రియకు ఎన్నికల కమిషన్‌ ‘ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అని పేరుపెట్టింది.
ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి ఇప్పటికే 99,529 మందిఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 80,250 మంది (80 ఏళ్లు పైబడినవారు) వృద్ధులు కాగా, 19,279 మంది దివ్యాంగులు. ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రారంభమయి అయిదు రోజులు దాటుతోంది. పేర్లను నమోదు చేసుకోవడంకోసం, ఓటర్ల ఇంటికి పోలింగ్‌ కేంద్రాన్ని చేరవేయడం కోసం 2,542 బృందాలు, 2706 రూట్లలో తిరుగుతుంటాయి. ఎన్నికల కమిషన్‌ అతి చిన్న వివరాలను, సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు, ఒక కాన్‌స్టేబుల్‌, పోలింగ్‌ ఏజెంట్లు ఉంటారు. అంటే ప్రతి ఓటర్‌కు ఇదొక మినీ పోలింగ్‌ కేంద్రం అన్న మాట. బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు ఓటు వేసేవరకూ ఈ మొత్తం ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం రావడం దగ్గర నుంచి ఒక పూర్తి స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎదిగే వరకూ చోటు చేసుకున్న ప్రతి పరిణామాన్ని పరిశీలించిన వృద్ధ ఓటర్లు సాధారణంగా ఓటు వేయకుండా ఉండే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఓటు వేయాలని వారు ఒక నియమంగా పెట్టుకుంటారు. ఈ వృద్ధ ఓటర్లు ఎంతో నిష్ఠగా, శ్రద్ధగా ఓటు వేయడం ఓటు వేయడానికి బద్ధకించే యువ ఓటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
మొత్తం మీద ఓటర్లెవరూ ఓటు వేయకుండా ఉండకూడదనే పట్టుదలతో ఉన్న ఎన్నికల కమిషన్‌, వృద్ధులకు, దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించడంతో తన నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టడం ప్రారంభించింది. ఇక దేశంలో 80 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 12.15 లక్షల వరకూ ఉంటుంది.ఇందులో శతాధిక వృద్ధుల సంఖ్య 16,973.ఇందులో దాదాపు లక్షల మందికి కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పిస్తోంది. మొత్తం 5.55 లక్షల మంది దివ్యాంగ ఓటర్లలో అతి తక్కువ శాతం మందికి మాత్రమే ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతున్నప్పటికీ, ఈ వినూత్న ఆలోచన పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత కాలం పడుతుందనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.దీనివల్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన పెరిగే అవకాశం ఉందని కూడా ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.
ఇక మారుమూల గ్రామాలలో ఉన్నవారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సదుద్దేశంతో ఎన్నికల కమిషన్‌ టెక్నాలజీ సహాయంతో రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. సమీప భవిష్యత్తులో ఈ ఆలోచన కూడాతప్పకుండా కార్యరూపందాలుస్తుంది. ఎటువంటి లోపాలూ లేకుండా ఈ పద్ధతి కూడా అమలయ్యే పక్షంలో ఇది రాజకీయ దృశ్యాన్నే సమూలంగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లగలగడం, వారిని గురించిన వివరాలు సేకరించడం, వారిని రహస్యంగా ఓటు వేసేలా చేయడం వంటివి దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలను మార్చడానికి ఉపకరిస్తాయి. దేశంలో ప్రతివారూ ఓటేయడానికి ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపడితే ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్ఠం చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News