Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Voters unity: ఓటర్ల ఐక్యత సాధ్యమేనా?

Voters unity: ఓటర్ల ఐక్యత సాధ్యమేనా?

ప్రతిపక్షాలు ఓటర్ల మధ్య ఐక్యతకు కృషి చేయగలుగుతాయా?

కొద్ది రోజుల క్రితం పాట్నాలో పదిహేను ప్రతిపక్షాలు జరిపిన సమావేశం తీరుతెన్నులు గమనిస్తే, ఇందులో 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఏదో విధంగా ఓడించాలనే తపన, ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడిగా ప్రచారం చేయడానికి ఇవి గట్టి పట్టుదలతో ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. తమను వేధించడానికి బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందంటూ పలువురు ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేయడాన్ని బట్టి, ఈ పార్టీలు ఏ కారణంగా బీజేపీ మీద ధ్వజమెత్తుతున్నాయో, ఎందుకు ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావించాయో, ఈ సమావేశం పరమార్థం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ఈ సమావేశాన్ని ‘ప్రతిపక్షాల ఉమ్మడి యుద్ధ భేరి’గా అభివర్ణించారు. అంతేకాదు, లౌకికవాద, ప్రజాస్వామిక భారతదేశ పునర్జన్మ’గా కూడా ఆయన పేర్కొన్నారు. నిజానికి, ఈ సమావేశాలు ఒక విధంగా ప్రతిపక్షాల ఐక్యతకు అవకాశాలు ఉన్నాయా అన్నది అన్వేషించడానికి మాత్రమే పరిమితమైంది. ఇది ఒక విధమైన ప్రదర్శన అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకోవడానికి అవకాశమే కనిపించ లేదు.
ఇటీవల కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్‌ విజయం సాధించడం మీద కూడా ఇక్కడ మిశ్రమ అభిప్రాయాలే వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాల ఐక్యత మీద దీని ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించలేదు. తెలంగాణలో పాలక భారత్‌ రాష్ట్ర సమితి కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం తర్వాత బీజేపీ కంటే కాంగ్రెస్‌ నుంచే ఎక్కువ ముప్పుకు అవకాశం ఉందని భావిస్తోంది. కాంగ్రెస్‌ పూర్తిగా రెండవ స్థానానికే పరిమితం కావాలని, ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీకి ఎదురుగా ఉమ్మడిఅభ్యర్థిని మాత్రమే పోటీ చేయించాలని, కాంగ్రెస్‌ ఈ విషయంలో అడ్డు రాకూడదని పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ భావిస్తున్నాయి. విచిత్రమేమిటంటే, ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటుపడుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ప్రతిపక్షాలలో సైతం విశ్వసనీయత గానీ, జనాకర్షణగానీ ఉన్నట్టు కనిపించడం లేదు.
ప్రతిపక్షాల ఐక్యతకు ఒక్క సంఖ్యాబలం మాత్రమే సరిపోదు. సిద్ధాంతాలు, ఆశలు, ఆశయాలతో సహా అనేక అంశాలలో సారూప్యత కూడా అవసరం. వెనుకటి అనుభవాలను బట్టి చూస్తే, ప్రతిపక్షాల మధ్య ఐక్యత కంటే ఓటర్ల మధ్య ఐక్యత చాలా అవసరం అని అర్థం చేసుకోవచ్చు. చేతులు కలపడానికి ఇంతగా కృషిచేస్తున్న ప్రతిపక్షాలు ఓటర్ల మధ్య ఐక్యతకు కృషి చేయగలుగుతాయా, ఓటర్లను సమాధానపరచగలుగుతాయా, వారికి బీజేపీతో ఉన్న ప్రధాన సమస్య ఏమిటో వివరించి చెప్పగలుగుతాయా అన్నది తెలుసుకోవాల్సి ఉంది. అతి కష్టం మీద ఉమ్మడిఅభ్యర్థిని ఎంపిక చేసి, బీజేపీపై పోటీ చేయించినప్పటికీ ఆ ప్రతిపక్ష అభ్యర్థి విజయం సాధిస్తాడనే నమ్మకం లేదు. ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాలను, భావాలను మార్చుకోవడం, ఐక్యతా రాగం ఆలపించడం చాలా ఏళ్ల నుంచి ఒక ఆనవాయితీగా మారిపోయింది. దేశ సమస్యలను ఎదుర్కోవడంలో ఏనాడూ ఒక్క తాటి మీదకు రాని ప్రతిపక్షాలు కేవలం ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మాత్రమే చేతులు కలపడాన్ని ఓటర్లు అవకాశవాదంగానే పరిగణిస్తారనేది జగద్విదితం.
ఉదాహరణకు, అధికారంలోకి రావడం కోసం లేదా అధికారంలోకి రావడానికి ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ప్రతిపక్ష నాయకులందరి మీదా అవినీతి ఆరోపణలను మోపడం జరిగింది. ఇప్పుడు తన అధికారాన్ని, తన ప్రాభవాన్ని కాపాడుకోవడానికి ఇవే ప్రతిపక్షాలతో చేతులు కలపడం జరుగుతోంది. పార్టీల మధ్య ఐక్యత సాధ్యం కావాలన్న పక్షంలో తప్పనిసరిగా సైద్ధాంతికమైన సారూప్యతలు కూడా ఉండాలి. పార్టీలు తప్పకుండా కొన్ని విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. సమాఖ్య స్ఫూర్తి, లౌకికవాదం ఈ ప్రతిపక్షాల తాత్కాలిక ఉమ్మడి సిద్ధాంతం కావచ్చు. కానీ, ఈ రెండు సిద్ధాంతాల ముసుగులో ప్రతిపక్ష నాయకుల అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చడం జరిగే వ్యవహారం కాదు. ఇటువంటి పార్టీలను గురించి ఓటర్లకు క్షుణ్ణమైన అవగాహన ఉందనడంలో సందేహం లేదు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నట్టు చెబుతున్న అవినీతి గురించి, అక్రమాల గురించి పదే పదే చెబుతున్న ప్రతిపక్షాలు కొద్దిగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వాటి మీద కూడా ఇటువంటి ఆరోపణలే రావడం జరిగింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా దాదాపు ఇదే విధమైన ఆరోపణలు తరచూ వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రతిపక్షాలు కూడా వేటికీ అతీతం కాదు. ఎన్నికల లోగా బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ ఆరోపణల జాబితా కూడా వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News