అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావ రణం ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపెడుతున్నా, దాని ప్రభావం భారత్‌పై మరింత ఎక్కువగా పడుతోంది. మన దేశం చమురు అవసరాలకు భారీగా దిగుమతులపై ఆధారపడ టంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం నేరుగా ప్రజల జీవితాలపై కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ముడి చమురు ధరలు భారీగా పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు తీసుకొచ్చింది. యుద్ధానికి ముందు బ్యారెల్ చమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు అది 110 డాలర్లకు చేరుకోవడం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తోంది.
మన దేశం దాదాపు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల రూ పంలో ఆ భారం ప్రజలపై పడుతుంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడంతో చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు పడుతున్నాయి. గ్యాస్ ధరల పెరుగుదల కార ణంగా ఆహార పదార్థాల ధరలూ పెరిగే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశముం దని ప్రచారం జరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో పెట్రో లు ధరలు పెంచే అవకాశముందని వార్తలు రావడంతో అనేక ప్రాంతాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. “ఈరోజు నింపించుకుంటే మంచిది.. రేపు రేట్లు పెరి గితే?” అన్న భయంతో చాలామంది ముందుగానే ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ధరలు పెంచకపోయినా, పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు చూస్తే భవిష్యత్తులో ధరల పెంపు తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.
చమురు ధరలు పెరగడం అంటే కేవలం వాహనాలకు ఇంధనం ఖరీదు అవడమే కాదు. దాని ప్రభావం ప్రతి ఇంటిపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, పాలు, బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. లారీ ఛార్జీలు పెరగడం వల్ల మార్కెట్‌లో సరుకుల ధరలు ఎక్కిపోతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, పేద ప్రజలకు ఇది మరింత భారంగా మారు తోంది. ఒకవైపు ఉద్యోగాలు, ఆదాయాలు అంతగా పెరగక పోతే, మరోవైపు ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతుం డటం కుటుంబాల బడ్జెట్‌ను గందరగోళానికి గురిచేస్తోంది.
హార్మోజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత భారత్ కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం ద్వారా భారతదేశానికి కూడా భారీగా చమురు వస్తుంది. అక్కడ దిగ్బంధం కొనసాగితే సరఫరా ఆలస్యం అవుతుంది. వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండ డంతో రవాణా ఖర్చులు, బీమా చార్జీలు పెరుగుతున్నాయి. ఇవన్నీ చివరికి చమురు ధరల పెరుగుదలకు దారితీస్తున్నా యి. సరఫరాలో అంతరాయం ఏర్పడితే దేశీయ మార్కెట్‌లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ల పైనా స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ధరలు పెరిగినప్పుడు విమానయానం, ఆటోమొబైల్, రవాణా, రసాయన పరిశ్ర మలు నష్టపోతాయి. పెట్టుబడిదారులు భయంతో పెట్టుబ డులు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మార్కెట్లు ఒత్తిడిలోకి వెళ్లి సూచీలు పడిపోతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గితే రూపాయి విలువ కూడా బలహీనపడే ప్రమాదం ఉంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగు తుంది. అంటే చమురు ధరల ప్రభావం ఒకదానితో ఒకటి కలిసిపడి దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోంది.
ఇప్పటికే సాధారణ ప్రజలు పెరిగిన విద్యుత్ బిల్లులు, గ్యాస్ ధరలు, నిత్యావసరాల ఖర్చులతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగితే పరి స్థితి మరింత కఠినమవుతుంది. ముఖ్యంగా రోజువారీగా వాహ నాలు నడిపే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది, చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల వ్యవసాయ వ్యయం కూడా అధికమవుతుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తూ ఇంధన నిల్వలను సమీక్షిస్తోంది. అయినప్పటికీ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, వ్యూహాత్మక చమురు నిల్వలు, దిగుమతుల విభిన్నీకరణ వంటి చర్యలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
మొత్తానికి అమెరికా-ఇరాన్ యుద్ధం భారత్‌కు కేవలం అంతర్జాతీయ రాజకీయ అంశం మాత్రమే కాదు. అది ప్రతి కుటుంబం జేబుకు, ప్రతి వాహనదారుడి ఖర్చుకు, ప్రతి వ్యాపారి లాభనష్టాలకు సంబంధించిన అంశంగా మారింది. యుద్ధం త్వరగా ముగిసి చమురు ధరలు తగ్గకపోతే, రాబోయే రోజుల్లో దేశ ప్రజలు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
–
నాగరాజు గుప్త తాళ్ళపల్లి

