ప్రపంచ పటం మీద ఇప్పుడు రెండు రకాల యు ద్ధాలు సాగుతున్నాయి. ఒకటి గ్లోబల్ ఇంకొకటి లోకల్.
అమెరికా – ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ మీద ఆయిల్ యుద్ధం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ మీద ఇరాన్ ఎలాగూ ప్రతిదాడులు చేస్తుంది. కానీ, టెహరాన్, న్యూయార్క్ నగరాల మధ్య రానూపోనూ దూరం పాతిక వేల కిలో మీటర్లు. అంతదూరం వెళ్ళి క్షిపణులు ప్రయోగించి తిరి గొచ్చేంత సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అభివృధ్ధి చెంద లేదు. కనుక గల్ఫ్ ప్రాంతంలో, వివిధ దేశాల్లోవున్న అమెరికా యుద్ధ స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అలా ఇది ఒక ప్రాంతీయ యుద్ధంగా మారింది. రేపు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు రంగంలోనికి దిగితే అది మరో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు. భారతదేశంలో అబూజ్‌మడ్‌లోనూ కొన్నేళ్ళుగా ఒక యుద్ధం సాగుతోంది. అక్కడ భారత ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మావోయిస్టుల్ని తుద ముట్టించినట్టు కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో ప్రకటించారు.
నక్సలైట్ ఉద్యమంలో 50 యేళ్ళ క్రితం కూడ ఇలాంటి నైరాశ్య పరిస్థితి ఒకసారి వచ్చింది. దాదాపు కాలి బూడిదగా మారిపోయిందనుకున్న ఉద్యమానికి ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచి దేశ వ్యాప్తంగా విస్తరింప చేసిన ఘనత కొండపల్లి సీతారామ య్యకు దక్కుతుంది. కేఎస్ కృషిని తలకిందులు చేసిన ఘనత ఇప్పటి మావోయిస్టు పార్టీకి దక్కుతుంది. అది పరాజయం నుండి పెరుగుదలకు ప్రయాణం అయితే ఇది పెరుగుదల నుండి పరాజయానికి ప్రయాణం. అలా ఈరోజు ఆనాటి కొండపల్లిని తలచుకోవాల్సిన అవసరం వచ్చింది.
కేఎస్ వర్ధంతి ఏప్రిల్ 12. ఆయన చనిపోయి 24 ఏళ్ళు. ఈ సమాజం బాగోలేదనీ, దీన్ని మార్చాల్సిన అవసరం వుందని ఆశించేవారికి కేఎస్ ఇప్పటికీ స్ఫూర్తి.
కేఎస్ చాలా విస్తారంగా సిద్ధాంత వ్యాసాలు రాశా రు. అవన్నీ యధాతధంగా ఈరోజు పనికి వస్తాయని అనుకోవడం తప్పు. స్థలకాలాలు మారిపోయినపుడు ఉద్యమాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు సమూలంగా మారి పోతాయి. ఆనాటి ఆ పరిస్థితుల్ని మార్చడానికి ఆయనేం చేశాడు? ఆయన స్ఫూర్తితో- ఈనాడు ఈ పరిస్థితుల్ని మార్చడానికి మనం ఏం చేయాలీ? అనే కనీసపు స్పృహ లేకపోవడం గతితార్కిక చారిత్రక భౌతికవాద మౌలిక సూత్రాలకు వ్యతిరేకం.
వాస్తవ సమాజ అవగాహన వాస్తవ పోరాట విధా నాలు అనేవి కొత్త తరాలు కేఎస్ నుండి నేర్చుకోవాల్సిన మార్గదర్శకాలు. అర్ధంకాని సమాజాన్ని మార్చలేం! We cannot transform a society that we do not understand.
నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి శకం 1990లో ముగిసింది. సరిగ్గా అప్పుడే మన దేశంలో అర్ధ వలస-అర్ధ భూస్వామ్య శకం కూడ ముగిసింది. ఆ తరువాత ప్రపంచంలో పునర్‌వ్యవస్థీకరణ సాగింది. తూర్పు యూరప్ దేశాలు సోషలిజాన్ని వదిలివేశాయి. ప్రపంచ కమ్యూనిస్టు విప్లవ కేంద్రంగా వెలసిల్లిన సోవియట్ రష్యా ముక్కలైంది. తూర్పుగాలి ఆగిపోయి పడమటి గాలి వీచడం మొదలయింది. వామపక్ష భావజాలం బల హీనపడి రైట్ వింగ్ తీవ్రవాదం బలపడింది. మతతత్త్వం చెలరేగింది. అందులో భాగంగానే దేశంలో అద్వానీ రథయాత్రలు సాగాయి. బాబ్రీమసీదు కూల్చివేత, గుజ రాత్ మారణకాండ, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో అధికార కూటమి ఏర్పడడం వగైరాలు వాటికి కొనసా గింపే. ఆర్ధికరంగంలో గరీబీ హఠావో నినాదాలు అంత రించి కార్పొరేట్ బడావో విధానాలు విజృంభించాయి.
విద్యా వైద్య తదితర సమస్త రంగాల్లో పబ్లిక్ సెక్టార్ ను వెనక్కి నెట్టి ప్రైవేట్ సెక్టార్‌కు పెద్దపీట వేశారు. విద్య ఖరీదైపోవడంతో ఆ విద్య ద్వారా ఉపాధి పొందినవారు అవినీతిపరులైపోవడానికి ఆస్కారం పెరిగింది. రాజకీ యార్ధిక రంగాల్లో వచ్చిన మార్పులు బెడ్ రూముల వరకూ విస్తరించాయి. కుటుంబ వ్యవస్థ ప్రైవటైజ్ అయి పోయింది. అంతేకాదు; మనుషుల ఆలోచనా ధోరణి మారిపోయింది. మనిషికీ సమాజానికి ఒక అనుబంధం వుందనుకునే కాలం అంతరించి మనిషి ఒంటరివాడై అంతఃసంఘర్షణకు గురయ్యే కాలం వచ్చింది. ఒక్క మాటలో ఈ సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం)గా మారి పోయింది.
కొత్త సమాజంలో కార్పొరేట్లకు అడవులు, ఖని జాలు మొత్తంగా కావాలి. ఫలితంగా విస్తాపనకు గుర య్యే ఆదివాసులు దీనికి మొదటి బాధితులు. మతతత్త్వా న్నీ సమాజపు అట్టడుగు పొరల వరకు తీసుకుని వెళితే రాజకీయ పైపొరల్లో మెజారిటీ మత సమూహానికి అధి కారం దక్కడం సులువు అవుతుంది. దీనికి ప్రధాన బాధి తులు మైనారిటీ మత సమూహాలు; ముస్లింలు, క్రైస్త వులు, శిక్కులు. అలాగే, ప్రభుత్వ నియంతృత్వ పోక డలకు ప్రధాన బాధితులు ఉదారవాదులు, మత సామర స్యవాదులు. ఈ సమూహాలన్నీ ప్రధాన బాధితులు మాత్రమే; నిజానికి బాధితుల జాబితా చాలా పెద్దది, చాలా విస్తారమైనది.
మావోయిస్టుల పోరాట పటిమను, అంకిత భావా న్నీ, ప్రాణ త్యాగాలనూ ప్రత్యర్ధులు సహితం తక్కువగా అంచనా వేయరు. కానీ, కొత్తగా ఏర్పడిన కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్‌షిప్ (కార్పొరేట్ మతతత్త్వ నియం తృత్వం) సమాజాన్ని వాళ్లు అర్ధం చేసుకోలేదు. లేదా అర్ధం చేసుకోదలచలేదు. 1927-40ల మధ్య కాలంలో వ్యవసాయ ప్రధాన చైనాలో పుట్టిన అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సిద్ధాంతాన్ని వాళ్ళు ఇప్పటికీ గుండెలకు హత్తుకుని తిరుగుతున్నారు. భారత జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 14 శాతానికి పడిపో యినా వాళ్ళ ఆలోచనలు మారలేదు. వాళ్ళ ప్రాణపద కార్యక్రమాలైన ‘వ్యవసాయిక విప్లవం’, ‘నూతన ప్రజా స్వామిక విప్లవం’ రూపకల్పనలో మనకు ఎక్కడా ‘ఆది వాసులు’ అనే పదం కనిపించదు. ‘ముస్లిం’ కాదుకదా, మైనారిటీలు అనే పదం అందులో వుంటుందని ఆశిం చడం కూడ అమాయకత్వమే అవుతుంది. విచిత్రం ఏమంటే, ఉదారవాదుల మీద వాళ్ళకు కనీసపు గౌరవం కూడ లేదు.
నిర్బంధాన్ని తట్టుకునే క్రమంలో మావోయిస్టులు ఎంచుకున్న వెనకతట్టు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆది వాసులు వున్నారు. అభూజ్‌మడ్ ప్రాంతపు ఆదివాసు లతో కలిసి ఒక దశాబ్ద కాలంగా వాళ్ళు పనిచేస్తున్నా రు. వాళ్ళు ఆచరిస్తున్నది వాళ్ళ కార్యక్రమంలో కనిపిం చదు; వాళ్ళ కార్యక్రమంలో ప్రకటించుకున్నది వాళ్ళ ఆచరణలో కనిపించదు. ఇలా ప్రకటిత కార్యక్రమానికీ, ఆచరణకు పొంతన కుదరకపోతే ఉద్యమాలు ముందుకు కాక వెనక్కు పరుగులు తీస్తాయి. ఇప్పుడు మనం అలాంటి పరిణామాలనే చూస్తున్నాం.
సంఘపరివారం ప్రచారం చేసే హిందూత్వ సిద్ధాం తం, దాని లక్ష్యమైన హిందూరాష్ట్ర ఏర్పాటు ప్రస్తుతం దేశంలో అధికార భావజాలంగా మారిపోయింది. విపక్ష పార్టీలు, ఉదారవాదులతో పాటూ కమ్యూనిస్టుల మీద కూడ దీని ప్రభావం కనిపిస్తోంది. నిజానికి వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారిపోయిందనవచ్చు. అధిక సంఖ్యాక సమూహాలకు దూరం కాకుండా వుండడానికి వాళ్ళు పడరానిపాట్లు పడుతున్నారు.
సంఘపరివారం మతం అనే ఆపరేటివ్ సిస్టమ్‌తో హిందూ మత సమూహాల మెదళ్ళను మొత్తంగా తన కంట్రోల్‌లోనికి తీసుకుంది. వాళ్లలో ఉండాల్సిన సెన్సిటి విటీస్ను క్రమంగా చంపేస్తోంది. “హిందూ ఖతరేమే హై” అన్నది ప్రధాన ప్రచారం. పార్లమెంటరీ ప్రజాస్వా మిక ఎన్నికల కార్యక్షేత్రంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలో కమ్యూనిస్టులకు అర్ధం కావడంలేదు. ఎంతటి కమ్యు నిస్టులైనాసరే హిందూవులకు జరుగుతున్న అన్యాయా లను గురించి కూడా మాట్లాడాలి కదా అని నిలదీస్తే వీళ్ళు నీళ్ళు నములుతున్నారు.
వాస్తవ ప్రపంచంలో మైనార్టీల మీద కొనసాగు తున్న అణిచివేతను గట్టిగా విమర్శించడానికి కూడ ఇప్పు డు కమ్యూనిస్టులు జంకుతున్నారు. అంతేకాదు, వ్యక్తి స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛా, మత స్వేచ్ఛని ప్రసాదిం చే ఆర్టికల్ 21, ఆర్టికల్ 25లను అమలు పరచమని గట్టిగా అడిగే సాహసాన్ని కూడ వీరు ప్రదర్శించలేక పోతున్నారు. ఈ పరిస్థితి దేశంలోని మైనార్టీల్ని ఏకా కుల్ని చేసి అభద్రతా భావానికి గురిచేస్తున్నది. ధార్మిక రంగంలో మొదలైన ఈ వివక్ష రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలకు కూడ విస్తరించింది.
అమెరిక-ఇజ్రాయిల్ సైనికాధికారులు ఇరాన్‌పై యుద్ధాన్ని పవిత్ర యుద్ధం (క్రూసేడ్స్)గా ప్రచారం చేయడం మొదలెట్టారు. అలాంటి సన్నివేశం మనదేశం లోనూ రూపుదిద్దుకుంటున్నది. ఈ వాస్తవాన్ని కమ్యు నిస్టులకు అనుక్షణం గుర్తు చేయడం మైనారిటీ ఆలోచ నాపరుల సామాజిక బాధ్యతగా మారింది.
కాలమ్ : కాలధార
డానీ
సమాజ, రాజకీయ విశ్లేషకులు

