Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Welfare is the best: ఉచితాల స్థానంలో సంక్షేమం ఉత్తమం!

Welfare is the best: ఉచితాల స్థానంలో సంక్షేమం ఉత్తమం!

ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోవాలనుకున్న పక్షంలో పొదుపుగా, జాగ్రత్తగా ఉండడం మంచిదని భారతీయులలో ఎక్కువ మంది అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆర్థిక మాంద్యం సమయంలోనే కాకుండా కోవిడ్‌ సమయంలోనూ భారతీయుల్ని కాపాడింది ఈ పొదుపు అలవాటేనని మహా మహా ఆర్థిక నిపుణులు సైతం అంగీకరించడం జరిగింది. 1990 దశకానికి ముందు భారతీయులలో ఎక్కువ మంది అప్పు చేయడానికి భయపడేవాళ్లు. ఎప్పుడో ఆదాయం పెరుగుతుందని, ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఇప్పుడు భారీగా ఖర్చు చేయడమన్నది జరిగేదే కాదు. ‘ఇప్పుడు కొనుక్కో, తర్వాత చెల్లించు’ అన్న పదమే ఉండేది కాదు భారతీయుల నిఘంటువుల్లో. చిన్న పిల్లలు సైతం ఇంట్లో డబ్బులు కూడ బెట్టుకోవడం, కిడ్డీ బ్యాంకుల్లో దాచుకోవడం ఒక అలవాటుగా, సంప్రదాయంగా కొనసాగింది. పరిమితులకు, పరిస్థితులకు లోబడి జీవించేవాళ్లు. పొదుపు అనేది అప్పట్లో ఒక గొప్ప అలవాటు. కానీ, ఇప్పుడది ఒక వ్యర్థమైన, నిరర్థకమైన అలవాటుగా మారిపోయింది.
ప్రస్తుతం దీని తాలూకు దుష్పరిమాణాల్ని దాదాపు ప్రతి దేశమూ అనుభవిస్తోంది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం రేటు కనీవినీ ఎరుగని రీతిలో 54.2 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం ఆ దేశం ఆర్థికంగా, సామాజికంగా పడుతున్న బాధలు, కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. దాని జి.డి.పి కూడా 4.2 శాతం పడిపోయింది. నేపాల్‌ విషయంలో కూడా దాదాపు ఇదే జరుగుతోంది. దీని రుణ భారానికి, జి.డి.పికి ఎక్కడా ఏ విధంగానూ పొంతన లేకుండా పోయింది. అది అప్పుల సముద్రంలో దారీతెన్నూ లేకుండా కొట్టుకుపోతోంది. ఈ రెండు దేశాలు దిగుమతుల మీద అతిగా ఆధారపడడం వల్ల విదేశీ మారక నిల్వలు చాలా వరకు అడుగంటిపోయి అవస్థలు పడుతున్నాయి. పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా దిగజారి, పేదరికం విస్తరించిపోతోంది. ఆయేటికాయేడు లక్షలాది మంది ప్రజలు నిరుపేదలుగా మారిపోతున్నారు. స్వల్పకాలిక జనాకర్షణ కోసం, స్వల్పకాలిక ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం చేపడుతున్న పథకాల కారణంగా దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ద్రవ్య సంబంధమైన పొదుపు, స్థూల ఆర్థిక స్థిరత్వం లోపించాయంటే ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా చప్పగా చతికిలబడిపోవడం ఖాయం.
ముందుంది ముసళ్ల పండుగ
అయిదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలకే జనాకర్షణ పథకాలు ఇంతగా వెల్లువెత్తినప్పుడు, లోక్‌ సభ ఎన్నికల సమయానికి ఇది ఏ స్థాయిలో ఉండబోతోందో తేలికగా అంచనా వేయవచ్చు. ప్రజా సంక్షేమం ఎక్కడ ముగుస్తుందో, ఉచితాలు, జనకర్షణలు ఎక్కడ ప్రారంభం అవుతాయో ఏ ఆర్థిక విధానకర్తకూ, ఏ ఆర్థిక నిపుణుడికీ అంతుబట్టడం లేదు. ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 10 కోట్ల మంది రైతులకు ఏటా రూ. 6,000 మం జూరు చేయడమన్నది సంక్షేమం అవుతుందా లేక జనాకర్షణ అవుతుందా అనేది అర్థం కావడం లేదు. ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద 81.35 కోట్ల మందికి ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయడం, దాని మీద ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఉచితం అవుతుందా లేక అవసరం అవుతుందా అనేది కూడా అర్థం కాని విషయమే.
లక్షల కోట్ల రూపాయలు రుణాలు చేసి, వాటికి వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్న పంజాబ్‌, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయడం సంక్షేమ పథకం అవుతుందా? ముఖ్యంగా పంజాబ్‌ ప్రభుత్వం రూ. 3.27 లక్షల కోట్లు అప్పు చేసి తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతోంది. ఉచిత విద్యుత్‌ సరఫరా వల్ల రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడుతుందో ఈ ప్రభుత్వాలకు తప్పకుండా తెలిసి ఉండాలి. 1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 12వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయడమే కాకుండా, 2003లో ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం దాదాపు ప్రతి రాష్ట్రమూ ఇటువంటి చట్టాలను తీసుకు రావడం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాలు కానీ ద్రవ్య వినియోగం విషయంలోనూ, బడ్జెట్‌ నిర్వహణ విషయంలోనూ ఎటువంటి జాగ్రత్తలూ పాటించడం లేదు. ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన లక్ష్యాలను ఇవి లెక్క చేయడం లేదు. 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ రుణం-జి.డి.పి నిష్పత్తి 57.1 శాతానికి చేరు కోగా, భారతదేశ రుణ-జి.డి.పి నిష్పత్తి 83 శాతానికి చేరింది. నిజానికి ఆర్థిక బాధ్యతల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి 40 శాతానికి, రాష్ట్ర ప్రభుత్వాల రుణ నిష్పత్తి సమిష్టిగా 20 శాతానికి పరిమితం కావలసి ఉంది.
నిబందనలకు తిలోదకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పెట్టుబడి, మూల ధన వ్యయాలకు మాత్రమే రుణాలు సేకరించాలి తప్ప, సంక్షేమాలకు, ఉచితాలకు రుణ సేకరణ జరపకుండా కఠిన నిబంధనలు విధించడం లేదా చట్టాలు తీసుకు రావడం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వచ్చిన ఈ ఆర్థిక బాధ్యతలు, బడ్జెట్‌ నిర్వహణ చట్టాన్ని కూడా పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఈ చట్టంలో ఇప్పటికే అనేక పర్యాయాలు సవరణలు తీసుకురావడం, కొత్త అంశాలు చేర్చడం జరిగింది. ఇక రుణ సేకరణ పరిమితుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 292, 293లు విధించిన నిబంధనలకు కట్టుబడి లేనందువల్ల రాజ్యాంగంలో ఈ రుణ పరిమితులకు ప్రత్యేక షెడ్యూల్‌ను చేర్చవలసిన అవసరం కూడా ఉందనిపిస్తోంది. ఈ రెండు ఆర్టికల్స్‌లో కూడా సవరణలు తీసుకురావలసి ఉంది.
ఇక కేంద్ర ప్రభుత్వానికి పింఛన్‌ చెల్లింపుల మొత్తం కూడా పెనుభారంగా మారుతోంది. గత తొమ్మిదేళ్ల కాలంలో పింఛన్‌ చెల్లింపుల మొత్తం మూడు రెట్టు పెరిగింది. 2012-13లో రూ. 98,468 కోట్లున్న పింఛన్‌ మొత్తం 2021-22 నాటికి రూ. 2,54,284 కోట్లకు పెరిగి పోయింది. ఇక రాష్ట్రాల పింఛన్లు కూడా 11 రెట్లు పెరిగి పోయాయి. 2004-05లో రూ. 37,378 కోట్లున్న పింఛన్‌ మొత్తం 2021-22 నాటికి రూ. 3,99,819 కోట్లకు చేరుకుంది. రక్షణ వ్యయం కూడా ఏటా 9.5 శాతం చొప్పున పెరిగిపోతుండడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. భారత ప్రభుత్వం తన మొత్తం రెవిన్యూ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల మీద 18 శాతం ఖర్చు చేయడం జరుగుతోంది. దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఖ్య మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 3.2 శాతం మాత్రమే ఉంది. అమెరికా ప్రభుత్వం మొత్తం ఉద్యోగులందరి మీదా కలిపి మొత్తం 15 శాతం మాత్రమే పింఛన్‌ కింద ఖర్చు చేయడం జరుగుతోంది.
కాగా, తన కాలం చెల్లిన పింఛన్‌ వ్యవస్థలో మార్పులు తీసుకు రానందువల్లే 2009లో గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలింది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతో అప్పటి గ్రీస్‌ ప్రభుత్వం ఈ పింఛన్‌ జోలికి వెళ్ల లేకపోయింది. ఈ పింఛన్లు చెల్లించడానికి గ్రీస్‌ ప్రభుత్వం 32,000 కోట్ల డాలర్లు రుణం తీసుకోవాల్సి వచ్చింది. చివరికి ఇదంతా తడిసి మోపడైంది. ఫలితంగా గ్రీస్‌ దేశం, గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకోలేనంతగా చతికిలబడిపో వడం జరిగింది. అందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనుత్పాదక పింఛన్ల విషయంలో కొన్ని నిబంధనలను పునఃపరిశీలించడం చాలా అవసరం. అందువల్ల భారత దేశ రాజకీయ వ్యవస్థ ఈ పోటాపోటీ జనాకర్షణ పథకా లకు ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాలను పొదుపుగా, సమతూకంగా నిర్వహించడం అన్నది తప్పనిసరిగా అలవరచుకోవాల్సి ఉంది. పొదుపు చర్యలను కఠినంగా అమలు చేయడం వల్ల దేశ భవిష్యత్తు చాలావరకు పదిలంగా ఉంటుంది. లేని పక్షంలో భావి తరాల వారు అతి భయంకరమైన జీవన పరిస్థితులకు దిగ జారిపోవలసి వస్తుంది.

  • డాక్టర్‌ ఎస్‌.మార్కండేయ శర్మ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News