Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Welfare or Free: ఇది సంక్షేమమా? ఉచితమా?

Welfare or Free: ఇది సంక్షేమమా? ఉచితమా?

పేద ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేయడమన్నది సంక్షేమ కార్యక్రమం కిందకు వస్తుందా లేక ఉచితాల పంపిణీ కిందకు వస్తుందా? గత జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ పథకానికి స్వస్తి చెప్పింది. అంతేకాదు, ఆహార ధాన్యాలపై ఇస్తున్న సబ్సిడీని 2,87,000 కోట్ల రూపాయల నుంచి గత బడ్జెట్‌లో 1,97,000 కోట్ల రూపాయలకు తగ్గించేసింది. కోవిడ్‌ను పురస్కరించుకుని 2020 ఏప్రిల్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ‘అన్న యోజన; కింద ఒక్కో కుటుంబానికి నెలకు అయిదు కిలోల గోధుమను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. అదే విధంగా కిలో కాయధాన్యాలను కూడా ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమం వల్ల సుమారు 82 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందారని అంచనా. మొదట్లో మూడు నెలలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నారు కానీ, చివరికి దీన్ని ఆరు పర్యాయాలు పొడిగించడం జరిగింది. మొత్తం మీద 2022 డిసెంబర్‌ 31 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
కోవిడ్‌ కారణంగా తీవ్ర అస్వస్థుతులు కావడం, ఉద్యోగాలు పోవడం, ఉపాధి కోల్పోవడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పేద ప్రజలకు రెండు పూటలా ఆహారం ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు చిన్నాభిన్నం అయింది. జీడీపీ 6.6 శాతం తిరోగమనం చెందింది. దాంతో ప్రభుత్వం ఏదో విధంగా పేదలను ఆదుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, విజయవంతంగా అమలు చేసింది. ఆ తర్వాత 2021-22 నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభించింది. సుమారు 6.8 నుంచి 7 శాతం వరకు వృద్ధి కూడా కనిపించింది. ఫలితంగా మళ్లీ ఉద్యోగాలు లభించడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ చాలావరకు పట్టాలెక్కింది. ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అవకాశం లభించింది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం కనిపించలేదు. అయితే, రాజకీయ లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని మరికొంత కాలం కూడా కొనసాగించారు.
దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నందువల్ల, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నందువల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటారని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పింది. ఈ కార్యక్రమానికి బదులుగా జాతీయ భద్రతా చట్టం కింద ఒక ఏడాది పాటు, అంటే ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు 82 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కోవిడ్‌ మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గినందువల్ల, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నందువల్ల ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పడం అనేది సమంజసమైన నిర్ణయమే. అయితే, చాలా కాలం నుంచి సజావుగా అమలు జరుగుతున్న ఆహార భద్రతా చట్టంలో జోక్యం చేసుకోవడం ఎంత వరకు అవసరమన్నది మాత్రం అంతుబట్టడం లేదు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉన్నందువల్ల పేద ప్రజలను మరికొంత కాలం ఆదుకునే ఉద్దేశంతో ఈ అన్న యోజనను, ఆహార భద్రతా చట్టాన్ని కలిపేయడం జరిగిందని కేంద్ర ఆహార, ప్రభుత్వ పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థించుకుంటూ ప్రకటించారు. అయితే, ప్రపంచ ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగానే ఉందని ప్రభుత్వం పార్లమెంట్‌లోనే ప్రకటించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు కార్యక్రమాలను కలపడం, దానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31ని గడువుగా నిర్ణయించడం సమంజసంగా తోచడం లేదు. అన్న యోజనను ఉపసంహరించడం వల్ల ప్రభుత్వానికి జరిగిన లబ్ధి ఏమిటి? నెలకు అయిదు కిలోల గోధుమను ఉచితంగా ఇవ్వడం అంటే, ప్రభుత్వానికి కిలో గోధుమకు రెండు రూపాయలు, కుటుంబానికి నెలకు పది రూపాయలు ఖర్చవుతయాన్న మాట. పేద ప్రజలు నిజంగా ఆర్థిక సమస్యల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తే ఈ అత్యల్ప మొత్తం వీరిని కాపాడగలుగుతుందా?
కేవలం ఎన్నికల మీద దృష్టితోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ, మసి పూసి మారేడు కాయ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 2021-22 సంవత్సరంలో కొన్ని ఎన్నికల్లో విజయం సాధించడానికి పాలక పక్షానికి ఈ అన్న యోజన కార్యక్రమమే ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించడం త్వరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనన్నది తేలికగా అర్థమైపోతోంది. ఒక సంక్షేమ కార్యక్రమంగా ఉండాల్సిన పథకాన్ని పాలకులు ఉచిత పథకం కింద మారుస్తున్నారు. ఉచిత విద్యుత్తు, ఉచిత లాప్టాప్లు, ఉచిత వస్తువులు, ఉచిత రవాణా వంటి కార్యక్రమాల స్థాయికి దీన్ని కూడా దించేయడం జరుగుతోంది. ఆహార భద్రత చట్టం కింద మూడు వంతు ప్రజలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడం జరుగుతోంది. ఆ చట్టం ప్రకారం దేశంలో 40 శాతం మందికి చౌకగానూ, ఉచితంగానూ ఆహార ధాన్యాలు అందాల్సి ఉంది. ఉచిత పథకాలు కొంత కాలం తర్వాత ఆగిపోయే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకం మాత్రం కలకాలం కొనసాగుతుంది. ప్రభుత్వం దీనిని ఉచితంగా కాకుండా సంక్షేమంగా కొనసాగించడం మంచిది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News