Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్West Asia unrest: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం

West Asia unrest: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం

ఇజ్రాయెల్‌, హిజ్బుల్లాల మధ్య గత 25వ తేదీన భీకర స్థాయిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కానీ, అదృష్టవశాత్తూ అవి కొద్ది గంటల్లో చెల్లాచెదురైపోయాయి. ఆ కొద్ది గంటల్లో పశ్చిమాసియాలో యుద్ధం పేట్రేగిపోయింది. గాజాలోని హమాస్‌ వర్గాల మీద ఇజ్రాయెల్‌ ఉధృతం చేయడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లెబనాన్‌లో తమ సైనికాధికారి ఫాద్‌ సుకర్‌ను హతమార్చినందుకు, గత నెల ఇరాన్‌లో హమాస్‌ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్‌ హనీయేను చంపినందుకు ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్‌ లోని సైనిక, గూఢచారి సంస్థల కార్యాలయాలను హిజ్బుల్లా వర్గాలు లక్ష్యంగా చేసుకుని రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించాయి. అయితే, హిజ్బుల్లా వర్గాలు ఈ పనిచేయబోతున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఇజ్రాయెల్‌ కూడా లెబనాన్‌ లో ఉన్న హిజ్బుల్లా స్థావరాల మీద ముందు నుంచే దాడులు చేపట్టింది. చివరికి ఈ దాడులు మరీ ఎక్కువగా పేట్రేగిపోలేదు కానీ, ఇది జరిగి ఉంటే అమెరికా, పాశ్చాత్య దేశాలు, ఇరాన్‌ కూడా రంగంలోకి దిగి ఉండేవి.
హమాస్‌ మీద తాము గెలిచే అవకాశం లేదని ఇజ్రాయెల్‌ సైనిక వర్గాలు సైతం పదే పదే చెబుతున్నప్పటికీ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ మాత్రం యుద్ధం కొనసాగిం చాలని, హమాస్‌ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇజ్రాయెల్‌ ‘యుద్ధ’ మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండడంతో ఆయన ఈ మంత్రి వర్గాన్ని కూడా రద్దు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చుకోవా లని అనేక దేశాల నుంచి, స్వదేశంలోని అనేక వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఆయన తన మంకుపట్టును కొనసా గిస్తున్నారు. జూలైలో ఈ మేరకు జరిగిన ఒక సమావేశం నుంచి నెతన్యాహూ వాకౌట్‌ చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సంధి కోసం అమెరికా, ఖతార్‌, ఈజిప్టు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వాస్తవానికి హమాస్‌ కూడా ఈ శాంతి ప్రయత్నా లను గట్టిగా వ్యతిరేకించడం జరుగుతోంది. ఇజ్రాయెల్‌ కు అత్యధికంగా రాయితీలు ఇవ్వడానికి, వెసులుబాట్లు కల్పించడానికి తాము సిద్ధంగా లేమని హమాస్‌ ప్రకటించింది.
ఇజ్రాయెల్‌ మీద హమాస్‌ దాడి చేసి 1,200 మందిని హతమార్చి, మహిళలు, పిల్లలనే తేడా లేకుండా వేలాది మందిని బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఇజ్రాయెల్‌ హమాస్‌కు చెందిన గాజా మీద దాడులు జరిపి సుమారు 40,000 మందిని ప్రాణాలు తీసింది. ఇందులో పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హమాస్‌ వర్గీయు లందరినీ పూర్తిగా తుడిచిపెట్టే వరకూ తాము వెనుతిరిగేది లేదని అప్పట్లోనే నెతన్యాహూ శపథం చేశారు. ఈ మరణాల సంఖ్యను గమనించిన అంతర్జాతీయ న్యాయస్థానం దీన్ని యుద్ధం అనకూడదని, నరమేధం అనాలని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే, నెతన్యాహూ తన వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల ఈ యుద్ధాన్ని ఆపడానికి ససేమిరా అంటున్నారు. ఆయన మొండితనం, మూర్ఖపు పట్టుదల ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలో పడేస్తోందని, చివరికి చుట్టు పక్కల దేశాలన్నీ కల్పించుకుని దీనిని ఒక మహా యుద్ధంగా మార్చడం జరుగుతోందని అనేక శాంతిప్రేమిక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య జరిగిన యుద్ధాలనన్నిటినీ ఇది మరిపించబోతోందని కూడా అవి వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, ఇరాన్‌ కూడా తన మిత్ర దేశాలను కలుపుకుని, ఇజ్రాయెల్‌ మీద దాడులు జరపడానికి సాధన సంపత్తిని కూడగట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ గత వారం డెమొక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ లో మాట్లాడుతూ, తాము ఇజ్రాయెల్‌ వైపునే ఉన్నప్పటికీ, పాలస్తీనా స్వయం నిర్ణయాధికారానికి కూడా మద్దతునిస్తున్నామని, ఈ రెండు దేశాలు శాంతియుతం గా యుద్ధానికి స్వస్తి చెప్పాలని తాము కోరుకుంటున్నామని ప్రకటించారు. అయితే, అమెరికా ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉన్నందువల్ల ఈ యుద్ధం విషయంలో నిర్ణయాలు తీసుకోవ డానికి గానీ, నెతన్యాహూను ఒప్పించే విషయంలో గానీ ప్రయత్నాలు సాగించలేకపోతోంది. ఫలితంగా, ఎవరికీ ఇష్టం లేకపోయినా, పశ్చిమాదేశాలు యుద్ధం వైపుగా నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News