Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్What is alternative to Coal?: బొగ్గుకు ప్రత్యామ్నాయమేదీ ?

What is alternative to Coal?: బొగ్గుకు ప్రత్యామ్నాయమేదీ ?

ఏదో ఒకరోజు క‌రెంటు సంక్షోభంలో యావత్ దేశం

మనదేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్రస్థాయిలో బొగ్గు కొరత నెలకొంది. మ‌న దేశంలో ఉత్ప‌త్తి అయ్యే సంప్ర‌దాయ విద్యుత్‌లో 53 శాతం వాటా థ‌ర్మ‌ల్ ప‌వర్‌దే . అంటే బొగ్గు ఆధారిత కరెంటుదే. విద్యుత్ త‌యారీకి ఎప్పుడూ బొగ్గు మీదే ఆధార‌ప‌డ‌టం మంచిదికాద‌ని నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. ఇన్నాళ్లూ మనం ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టాం. ఇకనైనా పర్యావరణవేత్తలు చేస్తున్న ఈ హెచ్చరికలకు సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. లేదంటే ఏదో ఒక రోజు దేశం క‌రెంటు సంక్షోభంలో చిక్కుకోవ‌డం ఖాయ‌ంగా కనిపిస్తోంది.

- Advertisement -

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే మే నెల వచ్చేసరికి విద్యుత్ వాడకం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు దొరకడం లేదు. దీంతో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడ బొగ్గు నిల్వలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.బొగ్గు కొర‌త నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌హ‌జంగా ఏ దేశ ప్ర‌గ‌తికి అయినా కొలమానం ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుతే. ఏ దేశ అభివృద్ది అయినా సదరు దేశ విద్యుత్ ఉత్పత్తిపై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న దేశంలో ఉత్ప‌త్తి అయ్యే సంప్ర‌దాయ విద్యుత్‌లో 53 శాతం వాటా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌దే. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్‌దే. కరెంటు ఉత్పత్తి కోసం ఎప్పుడూ బొగ్గు మీదే ఆధార‌ప‌డ‌టం మంచిదికాద‌ని నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు.ఈ విషయమై ప్రభుత్వాలను విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. ప్రభుత్వాలు ఇన్నాళ్లూ ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టాయి. ఇకనైనా విద్యుత్‌రంగ నిపుణులు చేస్తున్న ఈ హెచ్చరికలకు సీరియస్ గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది.లేదంటే ఏదో ఒక రోజు దేశం క‌రెంటు సంక్షోభంలో చిక్కుకోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌న‌గానే అంద‌రికీ వెంట‌నే గుర్తుకువ‌చ్చే పేరు సౌర విద్యుత్‌. అంటే సూర్య కిర‌ణాల నుంచి విద్యుత్ త‌యారు చేసుకోవ‌డ‌న్న‌మాట‌. ఇళ్లు లేదా ప‌రిశ్ర‌మ‌ల పై క‌ప్పుల‌కు ప‌ల‌క‌లు ఏర్పాటు చేసుకుంటే సునాయాసంగా క‌రెంటు త‌యారు చేసుకోవ‌చ్చు. బొగ్గు ఆధారిత విద్యుత్‌తో పోలిస్తే సౌర విద్యుత్‌ త‌యారీ చౌక అంటారు నిపుణులు. ఈ కార‌ణంతో 1980ల‌ నుంచి వ్యాపార కార్య‌క‌లాపాల కోసం సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఖ‌ర్చు త‌క్కువ కావ‌డంతో లక్షలకొద్దీ సోలార్ ప్యానెల్స్, విద్యుత్ గ్రిడ్ లో భాగం అవ‌డం మొదలైంది. సౌర విద్యుత్‌ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే కొత్త రికార్డు సాధించింది. జోన్ పరిధిలోని నంద్యాల, యర్రగుంట్ల సెక్షన్‌ల మధ్య తొలి సౌర విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్ పరిధిలోని ఎనిమిది స్టేషన్‌ లలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నూతన వ్యవస్థ ఏర్పాటు ద్వారా క‌ర్బ‌న ఉద్గారాలు తగ్గించడం సాధ్య‌ప‌డుతుంద‌ని రైల్వే ఉన్న‌తాధికారులు తెలిపారు. అలాగే ఇటీవల కేర‌ళ‌లోని కొచ్చిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు ఒక రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌పంచంలోనే పూర్తిగా సౌర విద్యుత్‌ పై న‌డిచే విమానాశ్ర‌యంగా పేరు న‌మోదు చేసుకుంది. విమానాశ్రయ విద్యుత్ అవ‌స‌రాల కోసం ప్ర‌త్యేకంగా ఒక హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఏడాదికి 14 మిలియ‌న్ ట‌న్నుల విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఈ ప్లాంట్ కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా నిపుణులు చెబుతున్న సౌర విద్యుత్‌రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికి ప్రభుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాలి. ప్యానెల్స్ తో పాటు ఇత‌ర ముడిపదార్థాల కొనుగోలుకు స‌బ్సిడీలు ఇవ్వాలి. సౌర విద్యుత్ వాడ‌కాన్ని అన్ని రంగాల్లో ప్రోత్స‌హించ‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల పరిధిలోని భవనాల నిర్మాణంలో పైకప్పుకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును తప్పనిసరి చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. సౌర విద్యుత్ త‌రువాత పవన విద్యుత్‌ పేరు కూడా వినిపిస్తోంది. క్లీన్ ఎన‌ర్జీగా పవన విద్యుత్‌కు పేరుంది. సౌర విద్యుత్‌లాగే పవన విద్యుత్‌ కూడా త‌క్కువ ఖ‌ర్చుతో ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లి కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పవన విద్యుత్‌కు క్రేజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి ఇటీవలి కాలంలో పెరిగింది. పవన విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. పవన విద్యుత్‌తో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. పవన విద్యుత్ నూటికి నూరుశాతం పర్యావరణహితమే. పవన విద్యుత్‌ తయారు చేయడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. టర్బైన్‌ల వంటి సాధారణ పరికరాలతో విండ్ పవర్‌ను జనరేట్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే కరెంటులో పవన విద్యుత్‌ ఏడు శాతం కంటే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి. పవన విద్యుత్‌లో విండ్‌ఫామ్ అనేది కీలకం. విండ్‌ఫామ్ అంటే ఒకే ప్రదేశంలో ఉండే విండ్ టర్బైన్‌ల సమూహం. ఒకపెద్ద పవన క్షేత్రంలో అనేక వందల విండ్ టర్బైన్‌లు విస్తరించి ఉంటాయి. టర్బైన్‌ల మధ్య ఉన్న భూమిని వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో విండ్ టర్బైన్ టెక్నాలజీ బాగా అభివృద్ది చెందింది. దీంతో పవన విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గింది.అనేక కారణాలతో పవన విద్యుత్ ప్రాజెక్ట్ మూలధన వ్యయం అలాగే నిర్వహణా ఖర్చులు తగ్గాయి. ఈ నేపథ్యంలో పవన విద్యుత్ ఉత్పత్తి పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఏడాదికి 39.2 గిగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం మ‌న‌దేశానికి ఉంది. రానున్న ఐదేళ్లలో మ‌రో 20 గిగావాట్ల విద్యుత్‌ను త‌యారు చేసే సామర్థ్యం భారతదేశానికి వ‌స్తుంద‌ని గ్లోబ‌ల్ విండ్ ఎన‌ర్జీ కౌన్సిల్ పేర్కొంది. అమెరికా అయితే విండ్ ప‌వ‌ర్ సెక్టార్ కు ఇస్తున్న ప్ర‌యారిటీ అంతాఇంతా కాదు. ఆ దేశంలో దాదాపు ల‌క్ష‌మందికి పైగా యువత పవన విద్యుత్‌రంగంలో ప‌నిచేస్తున్నారు. బయో గ్యాస్, ఇది మరో ప్రత్యామ్నాయ ఇంధన వనరు. వ్యర్థాలతో కూడా విద్యుత్ తయారు చేయవచ్చంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రక్రియలో కాలుష్యం అనే ప్రసక్తే ఉండదు. ఎక్కువ‌గా పరిశ్రమల్లో వినియోగించే వ్యర్థాలతో బ‌యోగ్యాస్‌ను త‌యారు చేస్తారు. విదేశాల్లో చాలా చోట్ల బ‌యోగ్యాస్‌పై ఆధార‌ప‌డి వాహ‌నాలు న‌డుపుతుంటారు. మాములు ఇంధ‌నాల వాడ‌కం వల్ల వ‌చ్చిన క‌ర్బన ప‌దార్ధాల కంటే ఇలా బ‌యోగ్యాస్‌తో విడుద‌ల‌య్యే వ్యర్థాలు 95 శాతం మేర త‌క్కువ‌గా ఉంటాయంటారు సైంటిస్టులు. ఒక్కమాటలో చెప్పాలంటే బయో గ్యాస్ పవర్‌తో పర్యావరణానికి మేలు జరిగినట్లే. బొగ్గు వాడ‌కాన్ని త‌గ్గించుకోవ‌ల‌సిన ప‌రిస్థితులు ! బొగ్గు వాడకాన్ని అన్ని దేశాలు ద‌శలవారీగా తగ్గించాలని పర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చాలాకాలం నుంచి చెబుతున్నారు. మ‌న దేశానికి కీల‌క ఇంధ‌నవ‌న‌రు ఇప్ప‌టికీ న‌ల్ల బంగార‌మే. ప‌ర్యావ‌ర‌ణవేత్త‌ల నుంచి వ‌స్తున్న ఒత్తిడి మేర‌కు ఇవాళ కాక‌పోయినా రేపైనా బొగ్గు వాడ‌కాన్ని మ‌నం త‌గ్గించుకోవాల్సిన ప‌రిస్థితులు రాకమాన‌వు. మ‌న‌మే కాదు ప్ర‌పంచ‌ దేశాల‌న్నీ ఆయా దేశాల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా బొగ్గుకు ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌ను స‌న్న‌ద్ధం చేసుకుంటున్నాయి. ఈ ప‌రిస్థితుల‌ను మ‌న ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. ప్ర‌పంచంలోని అనేక దేశాలు విద్యుత్ ఉత్ప‌త్తి కోసం కేవ‌లం బొగ్గు మీదే ఆధార‌ప‌డ‌టం మానేసి చాలా కాల‌మైంది.ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే మ‌నం మాత్రం ఇప్ప‌టికీ బొగ్గునే న‌మ్ముకుని ఉన్నాం. ఇది ఎంత మాత్రం సరైన పద్దతి కాదని ఇంధ‌నరంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఇప్ప‌టికైనా ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై పాల‌కులు దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వాటిని ప్రోత్స‌హించాలి. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాలి. అలా జ‌రిగిన‌ప్పుడే, బొగ్గు నిల్వ‌ల్లో తేడాలు వ‌చ్చినా ఆ ప్ర‌భావం విద్యుత్ ఉత్ప‌త్తి పై ప‌డ‌దు. ఏదిఏమైనా బొగ్గు కొరత తీవ్రమైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,

సీనియర్ జర్నలిస్ట్

63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News