నిర్మాణాత్మకమైన ఆలోచనలే దేశాభివృద్ధికి సోపానాలు. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం వెంపర్లాడడం వలన దీర్ఘకాలంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. గమ్యం స్పష్టంగా కనిపిస్తున్నా, గమ్యానికి చేరుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రగతి దారుల్లో పయనించి, గమ్యాన్ని చేరుకోవడం మన బాధ్యత. దేశం ఆర్థిక పథంలో ముందుకు సాగుతున్నా, అభివృద్ధి ఫలాలు ఈనాటికీ కొంతమందికే దక్కడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. అపారమైన మేథస్సుతో వికసిస్తున్నా, ఆర్ధిక ఇబ్బందులు పడే వ్యక్తులు సమాజానికిచ్చే పరోక్ష సందేశాన్ని గమనించాలి. నిజాయితీ గల వ్యక్తులు ఆర్ధికంగా వెనకబడి పోవడం, అవినీతి పరుల సంపద ఆకాశహర్మ్యాలకు తాకడం అభివృద్ధి కాదు. ఆర్ధిక అంతరాలు అభివృద్ధికి సూచకాలు కావు. కొందరి అభివృద్ది అందరి అభివృద్ధి కాదు. నిరుద్యోగ సమస్య నిర్మూలన కాబడి, అందరికీ విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చి, మధ్యతరగతి జీవితాల్లో ఆనందం వెల్లి విరిసిన నాడు దేశం నిజంగా అభివృద్ధి చెందినట్లే. మన దేశంలో ఎన్నో సహజ వనరులున్నాయి. యువశక్తి పుష్కలంగా ఉంది. మేథాశక్తికి కొదవ లేదు. ఈ అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టగలగాలి.
గత కాలపు వైభవాన్ని తలచుకుంటూ వర్తమానంలోని కష్టాలను కన్నీళ్ల కు అంకితం చేసి, బ్రతుకీడ్చడం విజ్ఞత అనిపించుకోదు. గత వైభవాన్ని స్ఫూర్తిగా తీసుకుని వర్తమానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన ఆశావహ దృక్ఫథం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, అన్ని రంగాల్లోను విప్లవాత్మక మార్పులు తెచ్చి, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుంది.సాంకేతిక విప్లవం వెల్లువెత్తిన నేటి కాలంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనం కూడా పరుగులు తీయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచానికి విజ్ఞానమంటే తెలియని రోజుల్లోనే మన భారతీయ మేథావులు అందుబాటులో ఉన్న పరిమితమైన అవకాశాలను వినియోగించుకుని, ఎన్నో వినూత్నమైన ఆవిష్కరణలకు అంకురార్పణ చేసారు. ఇప్పటి ఆధునిక ప్రపంచం వల్లె వేస్తున్న అనేకమైన విషయాలపట్ల అప్పట్లోనే అలనాటి మన మేథావులతో పాటు,సామాన్య ప్రజానీకానికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. అనేక భాషల సమాహారంగా ఉన్న దేశంలో మేథా సంపత్తిని ప్రపంచానికి వెల్లడి చేయడంలో జరిగిన తప్పిదాలను విదేశీయులు తమకు అందివచ్చిన అవకాశంగా భావించి, తమ గొప్పతనంగా ప్రకటించుకున్నారు.ఆంగ్లభాష విశ్యవ్యాప్తమై, వివిధ భాషల్లో ఉన్న భారతీయ పరిజ్ఞానం ఆంగ్ల గ్రంథాల్లోకి స్థానభ్రంశం చెందింది. భారతీయ మేథాసంపత్తిని విదేశాలు కొల్లగొట్టాయి. భారతదేశం నాగరికతకే ఓనమాలు నేర్పిన దేశం. ఎలాంటి వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కూడా ఏ వ్యాధికి ఏ ఔషధం వాడితే ప్రయోజనమో మన పూర్వీకులు ఆచరించి, ఫలితాన్ని సాధించారు. ఈ రోజుల్లో అయితే మనం ప్రతీ చిన్న విషయానికీ వైద్యుల వద్దకు పరుగెడుతున్నాం. మన పూర్వీకుల్లో దాగిఉన్న అపారమైన మేథాశక్తి, అనుభవం ముందు నేటి సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసికట్టేమో అనిపిస్తుంది.గణిత,ఖగోళ,అర్ధ వైద్యశాస్త్ర రంగాల్లో ప్రాచీన కాలంలోనే భారతదేశం విశిష్ఠ స్థానం సంపాదించింది. చరకుడు,సుశృతుడు, ధన్వంతరి,ఆర్యభట,వరాహమిహురుడు, భాస్కరుడు…ఇలా ఒకరేమిటి అనేక మంది భారతీయ మేథావులు వివిధ రంగాల్లో విశేషకృషి సల్పి ప్రాచీనకాలంలోనే భారతదేశాన్ని అమూల్యమైన విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దారు. ముద్రణా యంత్రాలు లేని రోజుల్లో కూడా మన ప్రాచీన మేథావుల మేథాసంపత్తి దేశంలోని సామాన్య ప్రజలకు చేరువలోకి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది అలనాటి మేథావుల ఆలోచనలను గౌరవించి,ఆచరించడం ఆశ్చర్యం కలిగించకమానదు. గడియారం లోని రోజుల్లో ఆకాశంలోని చుక్కలను బట్టి సమయాన్ని నిర్ధారించడం, గ్రహణాల గురించి వెల్లడించడం, వర్షాల ఆగమనం గురించి ముందే చెప్పడం, ఋతువులను నిర్ణయించి, కాలమాన పరిస్థితుల గురించి వివరించడం నేటి తరాలకు ఆశ్చర్యంగా అనిపించినా, నాటి తరాల మేథస్సును అభినందించక తప్పదు. భారత దేశం అనాదిగా విదేశీయుల దౌర్జన్యాలతోను, దండయాత్రలతోను ఆపారమైన ధనరాశులను, భూభాగాలను, చారిత్రక వారసత్వ సంపదను కోల్పోవడంతో పాటు అమూల్య మైన విజ్ఞాన సంపదను కూడా కోల్పోయింది. భారతదేశం నుండి కొల్లగొట్టబడిన మేథాసంపత్తిని వివిధ రూపాల్లో మార్చుకుని మేథో సంపత్తి హక్కుల ( ఇంటిలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్) పేరిట పేటెంట్ హక్కులను హస్తగతం చేసుకుని తామే ప్రపంచానికి మార్గనిర్ధేశకులమన్నట్టు అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్ధిక సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి.
భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశంలో సరైన గుర్తింపు లభించడం లేదనే కారణంతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్ డ్రయిన్) వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలను సాకారం చేసింది. అయితే వర్తమాన పరిస్థితులు దేశాభివృద్ధికి అనుగుణంగా రూపాంతరం చెందాయి.‘ఏదేశమేగినా, ఎందుకాలిడినా…‘అన్నట్టుగా దేశీయ మూలాలను మరవరాదన్న సత్యం మన మేథావులకు, యువతకు తెలిసి వచ్చింది. అందువలనే వారంతా ఎక్కడ ఉన్నప్పటికీ భారతదేశం అన్ని రంగాల్లో బలపడడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. విదేశాలకంటే స్వదేశమే మిన్న అన్న భావన భారతీయ యువతలో కలిగింది. సాంకేతిక రంగంలో భారతదేశం క్రొత్తపుంతలు త్రొక్కింది. కమ్యూనికేషన్ వ్యవస్థలను మెరుగు పరిచే ఉపగ్రహాల ప్రయోగాల నుండి చంద్రయాన్ ప్రయోగాల వరకు దేశం తన విజ్ఞాన పరిధిని విస్తరించుకుంది. ఆదిత్యునిపై పరిశోధనలు వేగం పుంజుకుంటున్నాయి. వైద్య శాస్త్ర పరిశోధనల నుండి అణ్వస్త్ర ప్రయోగాల వరకు భారతదేశం స్వయం స్వావలంభన దిశగా పయనిస్తున్నది. ఈ ప్రయోగ ఫలితాలన్నీ అంతిమంగా దేశాభివృద్దికి ఉపకరిస్తాయి. భారతదేశం అనేక పరిశోధనలతో,ప్రయోగాల పరంపరతో ముందుకు దూసుకు పోతున్న తరుణంలో ప్రతీ పౌరుడు దేశాభ్యున్నతికి తన వంతు సేవలను అందించాలి. పెరిగిన జనాభాకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించడం నేటికీ కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో దేశ ప్రగతి సాధనకు ముమ్మర ప్రయత్నాలు సాగాలి. ప్రభుత్వ పథకాల మీద ప్రజలు ఆధారపడే రోజులు పోవాలి. ప్రజలందరికీ బ్రతుకుదెరువుకు మార్గం చూపాలి. చుక్కలనంటిన ధరలు ప్రజలకు నిత్య నరకాన్ని చూపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో రావాలి. ధరలు పెరగడం వలన కల్తీ కూడా పెరుగుతున్నది. కల్తీ వలన ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రుల పాలవడం, వైద్య ఖర్చులను భరించలేక ఉన్నదంతా అమ్ముకోవడమో, అదీ సాధ్యం కాక పోతే ఆత్మహత్యలకు పాల్పడడమో జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులు పోవాలి. అట్టడుగు స్థాయి నుంచి అవినీతిని అరికట్టాలి. అవినీతి అంతమైతే ప్రజా జీవనం మెరుగు పడుతుంది. ఎన్నికల్లో విచ్చల విడిగా డబ్బు పంచడం వలన తిరిగి ఆ భారం కూడా వివిధ రూపాల్లో ప్రజలే మోయవలసి వస్తున్నది. ఎన్నికల ఖర్చు తగ్గితే అవినీతి తగ్గుతుంది. అవినీతి తగ్గితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఈ సూక్ష్మాన్ని గుర్తెరిగి ప్రవర్తించడమే దేశానికి అత్యంత శ్రేయస్కరం. దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, అభివృద్ధి ఫలాలు కొందరికే అందడం వలన సాధించిన ప్రగతికి అర్ధం ఉండదు.
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
మొ: 9704903463.
The end result of development: బలపడుతున్న ఆర్ధిక వ్యవస్థలో ప్రగతి ఫలాల మాటేమిటి?
ఆలోచించండి..