Homeఎడిటోరియల్ / బహుళబుల్లెట్‌ ట్రైన్‌ బాట మార్పు వెనుక మర్మమేమిటి?

బుల్లెట్‌ ట్రైన్‌ బాట మార్పు వెనుక మర్మమేమిటి?

ప్రభుత్వాలు రైలుమార్గాలను నిర్మిస్తాయి. ఆ మార్గాలే రేపటి అభివృద్ధి పటాన్ని నిర్మిస్తాయి. అందుకే ఒక అలైన్‌మెంట్‌ నిర్ణయం కేవలం సాంకేతిక అంశం కాదు; అది ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, ప్రాంతీయ భవిష్య త్తును నిర్దేశించే విధాన నిర్ణయం. శంషాబాద్‌-చెన్నై బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి దశలో జాతీయ రహదారి-65 వెంట, రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన వాణిజ్య అక్షాన్ని అనుసరిస్తూ రూపొందిం చిన మార్గాన్ని పక్కనబెట్టి మరో అలైన్‌మెంట్‌ను ప్రతిపాదిం చడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూర్చే మార్గం ఏది? ఇప్పటికే రూపొందిం చిన తొలి అలైన్‌మెంట్‌ను మార్చాల్సిన అవసరం ఏమొ చ్చింది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ముందున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల అసలు లక్ష్యం ప్రజల అవస రాలను తీర్చడం. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పారిశ్రా మిక కేంద్రాలు, విద్యా-వైద్య సదుపాయాలు, వాణిజ్య కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలను అనుసంధానించినప్పుడే ఆ ప్రాజెక్టు సార్థకమవుతుంది. బుల్లెట్‌ ట్రైన్‌ అనేది కేవలం వేగవంతమైన ప్రయాణ సాధనం కాదు.. అది ఒక ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల మౌలిక వసతి. అందుకే అలాంటి ప్రాజెక్టుల మార్గ నిర్ణ యంలో ప్రజా ప్రయోజనమే ప్రధాన ప్రమాణంగా ఉండాలి. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లను ప్రకటించారు. వాటిలో మూడు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ను కేం ద్రంగా చేసుకొని పుణె-ముంబై, బెంగళూరు, చెన్నై వైపు వెళ్లే మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 నుంచి 650 ఎకరాల భూమిని కేంద్రానికి అందించేందుకు అంగీకరిం చగా, శంషాబాద్‌ను బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక రూపొందింది. శంషాబాద్‌-చెన్నై కారిడార్‌కు తొలుత ప్రతిపాదించిన మార్గం శంషాబాద్‌-ఫ్యూచర్‌ సిటీ-డ్రై పోర్టు-బాటసింగారం-నార్కట్‌పల్లి-సూర్యాపేట-కోదాడ-జగ్గయ్యపేట-నందిగామ-అమరావతి-తిరుపతి-నెల్లూరు-చెన్నైగా ఉంది. జాతీయ రహదారి-65కు సమాంతరంగా ఈ మార్గం ఉండటం వల్ల ఇప్పటికే ఉన్న రవాణా వ్యవస్థను అనుసంధానించుకోవడం, భూసేకరణ సమస్య లను తగ్గించడం, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

- Advertisement -

అయితే, అనంతరం ఈ మార్గాన్ని మార్చి మాల్‌-మల్లేపల్లి-నాంపల్లి-హాలియా-వాడపల్లి-దాచేపల్లి-గుంటూరు వైపు మరో అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించినట్లు ప్రచారం జరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మొదటి అలైన్‌మెంట్‌తో పోలిస్తే రెండో మార్గం ఏ విధంగా ఎక్కువ ప్రజా ప్రయోజనాన్ని అందిస్తుందో స్పష్టత ఇవ్వా లని ప్రజలు కోరుతున్నారు. జాతీయ రహదారి-65 కేవలం ఒక రహదారి కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జీవనాడి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర జిల్లాల వరకు, అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. పండుగలు, సెలవుల సమయంలో కొర్లపహాడ్‌, పంతంగి టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవడం సాధారణ దృశ్యంగా మారింది. రద్దీకి తోడు ప్రమాదాలు కూడా ఈ మార్గంలో తీవ్ర సమస్యగా ఉన్నాయి. అధిక వాహనాల రాకపోకల కారణంగా ఎన్నో కుటుం బాలు విషాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థి తుల్లో జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తే ప్రయాణ ఒత్తిడి తగ్గడమే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా తోడ్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక జిల్లా కేంద్రం కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు అనేక జిల్లాల ప్రజలు హైదరాబాద్‌ చేరుకోవాలంటే సూర్యాపేట మార్గాన్నే ఆశ్రయిస్తారు. భౌగోళికంగా, వాణి జ్యపరంగా, రవాణా పరంగా సూర్యాపేటకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే తొలి అలైన్‌మెంట్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ రావడం ఈ ప్రాంత అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుంది.

చౌటుప్పల్‌, నార్కట్‌పల్లి, చిట్యాల, నకిరేకల్‌, సూర్యా పేట, కోదాడ ప్రాంతాలు కేవలం మార్గంలోని పట్టణాలు కావు.. ఇవి అభివృద్ధి కేంద్రాలు. పారిశ్రామిక, వాణిజ్య, విద్యా, వైద్య రంగాల్లో వేగంగా ఎదుగుతున్న ప్రాంతాలు. చౌటుప్పల్‌ పరిసరాల్లో అనేక పరిశ్రమలు ఏర్పడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రి, హెరిటేజ్‌ వంటి సంస్థలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. చిట్యాల, నకిరేకల్‌ ప్రాంతాలు వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలకు కీలక కేంద్రాలుగా ఉన్నాయి. సూర్యాపేట ఇప్పటికే విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో కీలక స్థానాన్ని సంపాదించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది సేవా కేంద్రంగా మారింది. దురాజ్‌పల్లి జాతర వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యమున్న జాతరలు ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తెస్తున్నాయి. కోదాడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రైస్ మిల్లులు, వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఇలాంటి అభివృద్ధి కేంద్రాలను అనుసంధానించే బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ కేవలం ప్రయాణ సౌకర్యం కాదు.. ఇది భవిష్యత్‌ పెట్టుబడులకు మార్గం. కొత్త పరిశ్రమలు రావడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడానికి, విద్యార్థులు, ఉద్యోగులు వేగవంతమైన రవాణా పొంద డానికి, పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఇది ఒక కీలక అవకాశం. ముఖ్యంగా సూర్యాపేటకు రైల్వే అనుసంధానం అనేది దశాబ్దాలుగా ప్రజల చిరకాల ఆకాంక్ష. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి. 42 మంది రైల్వే మంత్రులు పనిచేశారు. అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. అయినా సాధా రణ రైల్వే మార్గం కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బుల్లెట్‌ ట్రైన్‌ రూపంలో వచ్చిన ఈ అవకాశం కూడా చేజారితే భవిష్యత్‌ తరాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ప్రజల్లో ఉంది.

అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. ప్రధాన పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా మాత్రమే పెట్టుబడులకు, ఉపాధికి ఊతం లభిస్తుంది. ఆ ప్రమాణాల ప్రకారం చూస్తే జాతీయ రహదారి-65 వెంట రూపొం దించిన తొలి అలైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం పెరుగు తోంది. చౌటుప్పల్‌ నుంచి కోదాడ వరకు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వ్యాపార వర్గాలు, యువజన సంఘాలు, మేధావులు సాధన కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సూర్యాపేట అఖిలపక్ష పార్టీలతో బలమైన ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. నకిరేకల్‌ వంటి ప్రాంతాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాదు అనేక ప్రాంతాలలో ఉద్యమా లకు సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇది ఒక ప్రాంత భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం. ఈ ప్రాంతానికి పోరాట చరిత్ర కూడా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ఆరుట్ల కమలాదేవి, భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం వంటి మహనీయులు పోరా టాలకు నాంది పలికారు. హక్కుల కోసం ఐక్యంగా నిలబడటం ఈ నేల చరిత్ర. అదే స్ఫూర్తితో అభివృద్ధి హక్కు కోసం కూడా పోరాడతామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

ఇది రాజకీయాలకు అతీతమైన అంశం. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ విషయంలో ఒకే స్వరంతో స్పందిం చాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి తొలి అలైన్‌మెంట్‌ కొనసాగేం దుకు కృషి చేయాలి. మౌనం పాటించడం అంటే ఒక ప్రాంత అభివృద్ధి అవకాశాలను బలహీనపరచడమే అవుతుంది. బుల్లెట్‌ ట్రైన్‌ అనేది కేవలం అత్యాధునిక రవాణా వ్యవస్థ కాదు.. అది రాబోయే తరాల ఆర్థిక భవిష్యత్తుకు పునాది. ఒక రైలు మార్గం ఏ ప్రాంతం మీదుగా వెళుతుందో ఆ ప్రాంత అభివృద్ధి దిశ కూడా అంతే మారుతుంది. అందుకే అలైన్‌మెంట్‌ నిర్ణయంలో ప్రజా ప్రయోజనం, శాస్త్రీయ అధ్యయనం, ఆర్థిక అవసరాలు ప్రధాన ప్రమాణా లుగా ఉండాలి. అభివృద్ధి అంటే కొందరి ప్రయోజనం కాదు… ఎక్కువ మందికి మేలు చేసే నిర్ణయం. అందుకే ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ, సమగ్ర అధ్యయనం అనం తరం రూపొందించిన తొలి అలైన్‌మెంట్‌ను కొనసాగిం చడం ప్రజాహితమైన నిర్ణయం అవుతుంది. ‘హైవే వెంటే బుల్లెట్‌ బాట… ప్రజల చిరకాల ఆకాంక్ష’ అనే నినాదం కేవలం ఒక ప్రాంతపు డిమాండ్‌ కాదు.. సమతుల అభివృద్ధి కోసం వినిపిస్తున్న ప్రజా స్వరం. ఆ స్వరాన్ని ప్రభుత్వాలు ఆలకిస్తేనే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిజమైన అర్థంలో ప్రజల ప్రాజెక్టుగా నిలుస్తుంది.

గడగోజు రవీంద్రాచారి, జర్నలిస్టు, రచయిత
9848772232

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News