గొంగళి కట్టుకుని గజ్జెలు ధరించి ఎర్ర రుమాలు, చేతిలో కర్ర ధరించి గద్దర్ ఆడే ఆట, పాడే పాట లక్షలాది మంది ప్రజలను ఉత్తేజపరిచేది. వయసును లెక్కచేయకుండా ఎగురుతూ ఉంటే గద్దర్ ను మరిచిపోవడం సాధ్యం కాదు. తెలుగులో పాటలు రాసుకునేందుకు వీలైన వారి ఆట చూస్తూ ఉంటే కదలకుండా చూడడమే తప్ప మరో పనీ ఉండదు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలుగు నేలపై ఉద్భవించిన అరుదైన ప్రజా గాయ కుడు, కవి, విప్లవ సాంస్కృతిక ఉద్యమకారుడు గద్దర్. తన గొంతును, ఆటకు నిలయమైన దేహాన్ని అణచివేతకు గురైన ప్రజల ఆయుధంగా మార్చి, దశాబ్దాల పాటు ప్రజలను చైతన్యపరిచిన ఆయనను ప్రజలు ‘ప్రజా యుద్ధ నౌక’ అని పిలుచుకుంటారు.
గద్దర్ 1949లో మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా తూప్రాన్ గ్రామంలో ఒక దళిత పేద కుటుం బంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు ధన్యజీ వులు- శేషయ్య, లచ్చమ్మ. హైదరాబాద్‌లోని ఉస్మా నియా యూనివర్సిటీ లో కెమికల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ, సమాజంలో నెలకొన్న అసమానతలు ఆయనను ప్రజా ఉద్యమాల వైపు నడిపించాయి. 1910లలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రసిద్ధ ‘గదర్ పార్టీ’ పేరును స్ఫూర్తిగా తీసుకుని విఠల్ రావు తన పేరును ‘గద్దర్’ గా మార్చుకున్నారు.
నాట్య కళ – జననాట్య మండలి స్థాపన
1970వ దశకంలో ప్రముఖ దర్శకుడు బి. నర సింగరావుతో కలిసి జననాట్య మండలి అనే సాంస్కృతిక విభాగాన్ని స్థాపించారు. నక్సల్‌బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రభావంతో, పల్లెపల్లెకూ తిరుగుతూ జానపద కళారూపాల ద్వారా విప్లవ భావాలను వ్యాప్తి చేశారు.
సినిమాలు, ప్రజాదరణ
మా భూమి, రంగుల కల, ఒరేయ్ రిక్షా, జై బోలో తెలంగాణ వంటి చిత్రాలలో ఆయన రాసి, పాడి, నటించిన పాటలు సంచలనం సృష్టించాయి. ఒరేయ్ రిక్షా చిత్రంలోని ‘నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా’ పాటకు ఆయనకు నంది అవార్డు ప్రకటించగా, ప్రజా పోరాటాల దృష్ట్యా దానిని నిరాకరించారు.
ప్రాణాంతక దాడి: 1997
1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లగా, వైద్యులు నాలుగు బుల్లెట్లను తొలగించారు. కానీ వెన్నుముక సమీపంలో ఉన్న ఒక బుల్లెట్ చివరి శ్వాస వరకు ఆయన శరీరంలోనే ఉంది. ఆ బుల్లెట్‌ను ఆయన తన పోరాటానికి గుర్తుగా, ‘ప్రజాస్వామ్య గాయం’గా అభివర్ణించేవారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో గద్దర్ పాత్ర అత్యంత కీలకమైనది. ఆయన రాసి పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడు స్తున్న కాలమా.. పోరుతెలంగాణమా’ అనే పాట తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిగా మారింది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఈ పాట ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఓటు హక్కు, చివరి రోజులు
జీవితాంతం పార్లమెంటరీ వ్యవస్థకు దూరంగా ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన గద్దర్, తన జీవిత చరమాంకంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ప్రకటించారు. 2018లో ఆయన జీవి తంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించు కున్నారు. తీవ్ర గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమ స్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఆగస్టు 6న గద్దర్ తుదిశ్వాస విడిచారు. గద్దర్ భౌతికంగా దూర మైనప్పటికీ, ఆయన రాసిన విప్లవ గీతాలు, జానపద గేయాలు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన చూపిన చైతన్యం తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వ తంగా నిలిచిపోతాయి. అమీర్‌పేట అపోలో హాస్పటల్‌లో గద్దర్‌కు ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ దాసరి ప్రసాద్ రావు ప్రత్యక్షంగా చికిత్స చేసినవారు. ఈ రచయిత కూడా చికిత్స కోసం అక్కడ చేరినపుడు, ఆగస్టు 5న పక్కనే ఉన్న గదిలో గద్దర్‌ను కలిసి చాలాసేపు మాట్లాడు కునే అవకాశం వచ్చింది. వారికి నా శ్రీమతి కల్యాణి నమస్కరిస్తే, మీ భర్త మాడభూషి సమాచార హక్కును నిలబెట్టిన వారమ్మా అని అభినందించారు. మా కోసం పాట రాసి పాడి ఆశీస్సులు ఇచ్చారు. ఆ మరు నాడే గద్దర్ అస్తమించారు. డాక్టర్ ప్రసాద్ రావు తనను కాపాడుకోలేక పోయానని బాధపడ్డారు. నేడు రవీంద్రభారతిలో సాయంత్రం ప్రముఖ రాజకీయ వేత్త ప్రకాశ్ అంబేడ్కర్ (రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మనవడు) గద్దర్‌పై స్మారక ప్రసంగం ఇస్తున్నారు.
ప్రొ. మాడభూషి శ్రీధర్

