ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ టెకీ అవతారంలోకి మారుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రకంగా రాష్ట్రానికి సీఈఓ అన్న ముద్ర సంపాదించుకున్నారు. అప్పటికి చాలామందికి తెలియని ఐ ప్యాడ్లలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు తీసుకుని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వెళ్లి, వారందరినీ హైదరాబాద్‌కు రప్పించారు. బిల్ గేట్స్ లాంటివాళ్లతో గంటల తరబడి చర్చించారు. ఇప్పుడు నెమ్మదిగా మళ్లీ అదే రూపం ఆయన సంతరించుకుంటున్నారు. మెటా సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ప్రభుత్వ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపడం, డ్రోన్ టెక్నాలజీతో ప్రజలకు సేవలు అందించడం లాంటివి మొదలుపెడుతున్నారు. తొలిదశలో ఈ నెలాఖరుకల్లా వందరకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా అక్టోబర్ 22న మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఓయూ చేసుకుంది. వాట్సాప్ బిజినెస్, లామా లాంటి ఏఐ టెక్నాలజీలతో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ పత్రాల కోసం పడుతున్న ఇబ్బందులను తాను యువగళం పాదయాత్రలో చూశానని, ఇప్పుడు వాటన్నింటి పరిష్కారం చాలా సులభంగా వాట్సాప్ ద్వారా దొరకడం అనేది చరిత్రాత్మకమని చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మెటా కూడా తమకు తగినంత వ్యాపారం దొరుకుతున్నందుకు సంతోషంగానే ఉంది.
డ్రోన్స్, సీ ప్లేన్..
మరోవైపు.. రాష్ట్రాన్ని డ్రోన్ హబ్‌గా మారుస్తామని కూడా చంద్రబాబు చెబుతున్నారు. కర్నూలు సమీపంలో 300 ఎకరాలను దీనికి కేటాయించారు. దీంతోపాటు అమరావతిలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించి, రాష్ట్రంలో అందరికీ కనువిందు చేశారు. అమరావతిని, బుద్ధుడిని కూడా డ్రోన్లతో ఆవిష్కరించారు. అది అయిపోయిందో లేదో.. మరి కొన్నాళ్లకే ఆయన సీ ప్లేన్‌లో విహరించారు. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లి, అక్కడ రోప్ వే ద్వారా ప్రయాణించి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, తిరిగి సీ ప్లేన్‌లోనే విజయవాడకు వచ్చారు.
టెక్కీ సీఎంగా రిపీట్..
ఇలా ఆయన మళ్లీ పూర్తిస్థాయిలో టెక్నాలజీ సీఎంగా మారిపోతున్నారు. నిజానికి చూడడానికి ఇదంతా బాగానే ఉంటుంది. అయితే, తాను 1995 నాటి ముఖ్యమంత్రి చంద్రబాబులానే ఉంటానని, తన పని విధానం అలాగే ఉంటుందని, దాన్ని గమనించి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించాలని ఆయన పదే పదే పలు సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆయన చేతలు చూస్తుంటే మాత్రం మరోసారి టెకీ సీఎం, సీఈఓ అనే పదాలే అందరికీ గుర్తుకొస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌కు ఎలాంటి ఇమేజి తెచ్చిపెట్టానో అలాంటిదే ఇప్పుడు అమరావతికీ తెచ్చిపెట్టాలన్న కోరిక ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి చెప్పాలంటే… చంద్రబాబుకున్న టెక్నికల్ విజన్ సమకాలీన రాజకీయాల్లో ఎవ్వరికీ లేదనే చెప్పాలి. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతల్లో అగ్రగణ్యుడిగా ఉన్నా.. ఇటీవల ఇండియా టుడే విడుదల చేసిన పవర్‌ఫుల్ పొలిటీషియన్స్ జాబితాలోని ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్‌గా నిలిచినా.. ఏడు పదులు దాటిపోయిన వయస్సులో ఉన్నా.. టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో మాత్రం ఆయన నెంబర్ వన్ స్థానంలోనే నిలుస్తారు. ప్రస్తుత యువత కూడా టెక్నాలజీ విషయంలో అప్ గ్రేడ్ కాలేని విధంగా సీఎం చంద్రబాబు అప్ గ్రేడ్ అవుతారు.
టీడీపీ కోరుకుంటున్నదేంటి ?
ఇదంతా చూసేందుకు, వినేందుకు బాగానే ఉంటుంది. కానీ, అసలు ఆయన పార్టీ ఏం కోరుకుంటోంది? తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్లంతా కూడా 1995 నాటి చంద్రబాబునే చూడాలనుకుంటున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిపాలనను పరుగులు పెట్టించారని, అదే సమయంలో పార్టీని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారని చాలామంది నాయకులు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు అంతర్గత పార్టీ సమావేశాల్లో చంద్రబాబు అదే చెబుతున్నారు. పార్టీని తాను మర్చిపోలేదని, మారుమూల ప్రాంతాల్లో ఉండి పార్టీకి సేవ చేసిన వారిని కూడా గుర్తుంచుకుని వారికి ఏవో ఒక పదవులు, అవకాశాలు కల్పిస్తున్నానని చెబుతున్నారు. ఇటీవల రెండువిడతల్లో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకాల సందర్భంలో ఆయన అదే మాట అన్నారు. ఆయన ఇలా ఎంత చెబుతున్నా, బయట చూసినప్పుడు మాత్రం చంద్రబాబుకు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో, ఇప్పుడూ సరిగ్గా అలాంటిదే వస్తోందన్న చర్చ అన్నిచోట్లా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అది వారిని ఒక రకంగా భయపెడుతోంది కూడా. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రంలో టెక్నాలజీని తీసుకురావడం, ఐటీ కంపెనీలు పెట్టించడం, పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ బాగానే ఉన్నా.. రాజకీయాలు చేయడం కూడా చాలా ముఖ్యమన్నది కార్యకర్తలు, నాయకుల భావన. 2019 ఎన్నికల నాటికి అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే చంద్రబాబు ఉండాల్సిందేనని, అందువల్ల సులభంగా మళ్లీ అధికారంలోకి రాగలమని ఆయనతో పాటు పార్టీ వర్గాలు కూడా బలంగా నమ్మాయి. కానీ ఎవరూ ఊహించలేనంతగా దారుణమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. జగన్ స్వయంకృతాపరాధాల కారణంగా నభూతో న భవిష్యతి అన్నట్లు అసాధారణ ఆధిక్యంతో చంద్రబాబు తిరిగి అధికారం సాధించారు. బీజేపీ, జనసేనలను కూడగట్టుకుని రాష్ట్రాన్ని మళ్లీ తన గుప్పిట్లోకి తీసుకున్నారు.
అయితే, జగన్‌మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈసారి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చినా, చాలామంది నాయకులు వరుసగా వైసీపీని వీడి వెళ్లిపోతున్నా… ఆయన పార్టీకి మొన్న ఎన్నికల్లో దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పటికీ ఆయనకంటూ కొంత ఓటు బ్యాంకు అలాగే ఉంది. దాన్ని ఏదో రకంగా సంక్షేమ పథకాలతోనో, మరో రకంగానో తమ వైపు తిప్పుకోవాల్సిందేనన్నది టీడీపీ కార్యకర్తలు, నాయకుల భావన. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చినా, అవి ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. దానికి తోడు సోషల్ మీడియా పోస్టుల పేరుతో ఇప్పటికి కొందరు వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నా వాళ్లు పెద్దగా భయపడడం లేదు. జగన్ బయట ఉన్నంత కాలం వైసీపీ వాళ్ల నోళ్లు మూతపడవని, అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిలు మీదే ఉన్న ఆయనను మళ్లీ కొంతకాలం జైల్లో పెట్టిస్తేనే తమకు మనుగడ ఉంటుందని పార్టీ కార్యకర్తలు అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నారు. కేంద్రంతో సంబంధాలు బాగుండడం, కేంద్ర ప్రభుత్వానికి అత్యంత అవసరమైన ఎంపీలను మనమే అందిస్తున్నాం కాబట్టి వీలైనంత త్వరగా అవతలి పార్టీని గట్టిగా దెబ్బకొట్టాలని కోరుకుంటున్నారు.
సమాధాన పడని క్యాడర్..
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కొమ్ముకాసిన కొంతమంది ఉన్నతాధికారులు మళ్లీ ఈ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారని, ఇది ఏమాత్రం సరికాదని పలువురు టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాహాటంగానే మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించిన శ్రీకేష్ లఠ్కర్ బాలాజీ అనే అధికారి ఇప్పుడు అదే జిల్లాకు చెందిన కేంద్ర క్యాబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడికి పీఎస్‌గా వెళ్లడం ఏంటన్న ఆగ్రహం చాలామందిలో కనిపించింది. అలాగే, ఎస్పీల నియామకాల విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలు బాగానే ఇబ్బంది పడ్డారు. ఇలాంటి వాళ్లందరినీ సంతృప్తి పరచడం చంద్రబాబుకు కత్తిమీద సాములాగే ఉంటుంది. ఎందుకంటే.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ముందుగానే రాష్ట్ర కేడర్‌కు కేటాయిస్తారు. వాళ్లనే అటూ ఇటూ సర్దుకోవాలి తప్ప పూర్తిగా మార్చేయడం కుదరదు. ఆ విషయం చంద్రబాబు పదే పదే చెబుతున్నా కార్యకర్తలు మాత్రం సమాధానపడడం లేదు.
ఇదే తక్షణ బాధ్యత..
ఇలాంటి అడ్డంకులు అన్నింటినీ నెమ్మదిగా దాటుకుంటూ చంద్రబాబు మళ్లీ పాలనను, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సి ఉంది. ముందుగా రోడ్ల మరమ్మతులు వీలైనంత వెంటనే చేపట్టాలి. కొన్ని రోడ్లయితే 2014 నుంచే బాగోలేవని, అవి ఇప్పుడు మరింత అధ్వానంగా తయారయ్యాయని జనం అంటున్నారు. ఇలాంటి ప్రచారం ఎక్కువ జరగక ముందే మళ్లీ రోడ్లన్నింటినీ అద్దాల్లా మార్చుకోవాల్సిన తక్షణ బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది.
ఈ-ఫార్ములా మార్చిన పొలిటికల్ ఫార్ములా
ఇక తెలంగాణలో రాజకీయం మరింత రంజుగా ఉంది. ఫార్ములా ఈ-రేసింగ్ విషయంలో 55 కోట్ల రూపాయల చెల్లింపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న రెండోసారి (సెషన్-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్ (ఎఫ్‌ఈవో)తో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంఏయూడీ రూ.55 కోట్లు చెల్లించింది. అయితే, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మారగానే ఒప్పందంలోని అంశాలను పాటించకపోవడంతో తాము ఫార్ములా ఈ ఆపరేషన్ నిర్వహించడం లేదని విదేశీ సంస్థలు ప్రకటించాయి. దీంతో సెషన్-10 రద్దయ్యింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక శాఖ, ఇతర విభాగాల నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు చెల్లించినట్లుగా తేల్చింది.
కేటీఆర్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
ఈ రేసింగ్‌లో జరిగిన అక్రమాలపై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మునిసిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. రేస్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ రేసు నిర్వహణకు సంబంధించి అప్పట్లో మునిసిపల్ శాఖా మంత్రిగా వ్యవహరించి, అన్నీ తానై చూసుకున్న కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దాదాపు రెండు వారాలు దాటిపోతున్నా, గవర్నర్ దాని గురించి ఇంకా తన నిర్ణయం వెలువరించ లేదు. అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయశాఖ కార్యదర్శిని కూడా దీని గురించి ఆయన సలహా అడిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి విషయాల్లో గవర్నర్లు చాలా వరకు కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. అయితే వర్మ మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అలా చేస్తున్నారో, లేదా ఎందుకైనా మంచిదని అలా ఉన్నారో తెలియదు గానీ.. మూడు నెలల్లోగా ఆయన తన నిర్ణయం ఏంటన్నది చెప్పేయాలి.
అరెస్ట్ చేస్తారా? చేయండి!
తనను అరెస్టు చేసుకుంటే చేసుకోవాలని కేటీఆర్ బహిరంగ సభల్లో సవాలు చేస్తున్నారు. నిజానికి గతంలో కల్వకుంట్ల కవిత కూడా ఇలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సవాళ్లు విసిరారు. చివరకు అరెస్టయిన తర్వాత బెయిల్ కోసం నానా తిప్పలు పడ్డారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్ లభించింది. విడుదలైన తర్వాత మొదటి రోజు కాస్త హడావుడి చేశారు తప్ప… ఆ తర్వాత ఇంతవరకు మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. అంటే, కవిత చాలావరకూ అస్సలు బయటకు రావట్లేదు. కేసీఆర్ కూడా చాలాకాలం పాటు ఫాం హౌస్‌కే పరిమితం అయిపోయారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవితకు ఆరోగ్యం బాగా దెబ్బతిందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దానికి తోడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్న మనో వ్యథ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దాని వల్ల మానసికంగా దెబ్బతింటారు. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ఆయనకు కూడా బెయిల్ వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. అందుకే అరెస్టు విషయంలో కేటీఆర్ కొంత భయపడుతున్నారని, గవర్నర్ నుంచి అనుమతి అంత త్వరగా రాకుండా ఉండాలంటే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని.. అందుకే మొన్నామధ్య ఆయన ఢిల్లీ వెళ్లారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ధరణి అక్రమాల బాగోతం మొత్తం నాకు తెలుసు
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు క్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్ వ్యవహారం బయటపడింది. కానీ అసలు ధరణి విషయంలో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో తెలిస్తే తెలంగాణ ప్రజానీకం ముక్కున వేలేసుకోక తప్పదు. ఏకంగా బ్యాక్ ఎండ్ సర్వర్‌లోనే పేర్లు మార్చేసిన విషయం ఇప్పటి వరకు ఇంకా బయటకు రాలేదు. అందుకు సంబంధించిన పక్కా ఆధారాలు స్వయంగా నా దగ్గరే ఉన్నాయి. ధరణి అక్రమాల బాగోతం మొత్తం నాకు తెలుసు, ఆ చిట్టా అంతా ఉంది. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు వాటిని నేనే బయటపెడతాను.
వైఎస్ పాలసీ రిపీట్ చేసిన కేసీఆర్ !
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఫైళ్ల కదలికల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వంలో ఏదైనా ఫైలు కదలాలంటే.. ముందుగా నోట్ ఫైల్ సిద్ధం కావాలి. దానిమీద సెక్షన్ ఆఫీసర్ నుంచి అత్యున్నత స్థాయి కార్యదర్శి వరకు అందరూ తమ కామెంట్లు రాసి సంతకాలు చేయాలి. ఆ తర్వాత అది సీఎంఓకు వెళ్తుంది. కానీ వైఎస్ హయాంలో ఆ పద్ధతిని బైపాస్ చేశారు. నేరుగా ఉన్నతాధికారులే సంతకాలు చేసేసి సీఎంఓ వద్దకు మూవ్ చేసేవారు. దానివల్ల ఆ తర్వాత కాలంలో ఎంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కేసులు ఎదుర్కొన్నారో, జైళ్లకు వెళ్లారో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు అలాగే జరిగింది. తాము అనుకున్నది చేయాలంటే వెంటనే ఆగమేఘాల మీద అయిపోవాలని బీఆర్ఎస్ అగ్రనేతలు అనుకునేవారు. అందుకోసం అడ్డదారిలో ఫైళ్లు తెప్పించుకుని, చకచకా జీఓలు పాస్ చేసేసేవారు. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అప్పట్లో వారికి సహకరించిన అధికారులు అందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏకంగా విదేశాలకు వెళ్లిపోయి, అక్కడి నుంచి వస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని భయపడుతున్న విషయం కూడా మనం చూశాం.
కేసీఆర్-వైఎస్ ను మిక్సీలో వేస్తే రేవంత్!
రేవంత్‌రెడ్డి అంటే ఏదో ఆషామాషీ నాయకుడని మొదట్లో బీఆర్ఎస్ అగ్రనేతలు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అందుకే ఈసారి కూడా తమదే అధికారం అని ధీమాగా ఉన్నారు. కానీ రేవంత్ అంటే మాములుగా తీసుకోవడానికి వీల్లేదు. మొన్నీమధ్య వృత్తిపరమైన అవసరం కోసం ఒక మానసిక వైద్య నిపుణుడితో మాట్లాడాల్సి వచ్చింది. ఆయన నాకు సన్నిహితులు కావడంతో.. ఆసక్తి కొద్దీ ఒక విషయం అడిగాను. రేవంత్ రెడ్డి వ్యూహాలు, ఆయన పరిపాలన తీరు, మాట తీరు.. ఇవన్నీ చూస్తుంటే ఆయనను మీరు ఎలా విశ్లేషిస్తారు అని అడిగాను. దానికి ఆయన ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ఒక కేసీఆర్‌ను, ఒక రాజశేఖరరెడ్డిని మిక్సీలో వేసి బాగా తిప్పితే.. బయటకు వచ్చే మిశ్రమమే రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తలుచుకునే పేరు రాజశేఖరరెడ్డిదే. ఆయన ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాయి. అనేక ప్రాణాలను కాపాడాయి. నిరుపేద కుటుంబాల వాళ్లు కూడా కార్పొరేట్ వైద్యం పొందగలిగారంటే అది ఆరోగ్యశ్రీ పుణ్యమే. రీయింబర్స్‌మెంట్ లేకపోతే అసలు ఇంజినీరింగ్ కాలేజీలు ఇన్ని వచ్చేవే కావు, చాలామంది అక్కడ వరకు చదువుకోగలిగేవారే కారు. అదే సమయంలో, రాజకీయంగా తన సొంతవాళ్లను ఆదుకోవడానికి ఎంతవరకైనా వైఎస్ వెళ్లేవారు. ఇక రాజకీయ ఎత్తుగడల విషయంలో కేసీఆర్‌ను మించినవారు మరొకరు లేరంటారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల ఆట కట్టించడానికి ఆయన వేసే ఎత్తుగడలు అద్భుతంగా ఫలించేవి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా రేవంత్ రెడ్డిలో ఉన్నాయని, ఆయన చేసే ప్రకటనలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని సదరు మానసిక వైద్య నిపుణుడు చెప్పారు. ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత.. ఫోర్త్ సిటీతో తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకు పక్కా ప్రణాళికలు కూడా సిద్దం చేసుకున్నారు. దాన్ని సాకారం చేసి తీరుతానన్న ధీమా అడుగడుగునా రేవంత్‌రెడ్డిలో కనిపిస్తోంది. నిజంగానే అది సాకారమైతే 400 ఏళ్లు దాటిన నగర సిగలో మరో ఆభరణం మెరుస్తుంది.