Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Maldives: ‘పిచుక’ మాల్దీవులపై భారత్‌ బ్రహ్మాస్త్రం

Maldives: ‘పిచుక’ మాల్దీవులపై భారత్‌ బ్రహ్మాస్త్రం

పరిస్థితి మదింపు జరిగేదెన్నడో

మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్‌ మొయిజూను ప్రధాని నరేంద్ర మోదీ కలుసు కున్న నెల రోజులకే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. మోదీ ఇటీవల లక్షద్వీప్‌ ను సందర్శించి, దానిని అభివృద్ధి చేయాలని సంకల్పించిన తర్వాత మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు ట్విట్టర్‌ లో మోదీని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడడం, మాల్దీవుల పర్యాటక రంగాన్ని దెబ్బ తీయడానికే మోదీ అక్కడికి వెళ్లారని విమర్శించడం రెండు దేశాల మధ్యా సంబంధాలను దెబ్బతీసింది. పైగా, మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడడాన్ని కూడా ఈ మంత్రులు ఘాటుగా దుయ్యబట్టడం కూడా ఈ రెండు దేశాల సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. భారతీయుల మీద కూడా ఈ మంత్రులు అసభ్యకర విమర్శలు చేసి, భారత ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించారు. మాల్దీవుల ప్రభుత్వం ఆ తర్వాత ఈ ట్వీట్లను డిలీట్‌ చేసింది. ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. తమకు, ఆ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధమూ లేదని కూడా మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మాల్దీవుల ప్రభుత్వం భారతీయ దౌత్యాధికారిని, భారత ప్రభుత్వం మాల్దీవుల దౌత్య వేత్తలను పిలిచి తమ తమ వాదనలను తెలియజేయడం జరిగింది. మాల్దీవులను సందర్శించడాన్ని, ఆ దేశానికి ఆర్థికంగా సహాయం చేయడాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తూ లక్షలాది మంది ప్రజలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులుగా వెళ్లేది భారతీయులే. భారతీయుల మీదే మాల్దీవుల పర్యాటక రంగం, దాని ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడడం జరుగుతోంది. కోవిడ్‌ సమయంలో ఆర్థికంగా బాగా చితికిపోయిన మాల్దీవులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, ఆ దేశానికి నిత్యావసరాలను, కోవిడ్‌ నివారక మందులను అత్యధిక మొత్తాలలో సరఫరా చేయడం కూడా జరిగింది. అయితే, మాల్దీవులలో మొయిజు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆ దేశ వైఖరి మారిపోతూ వచ్చింది. ‘భారత్‌ను బహిష్కరించండి’ అనే నినాదంతోనే మొయిజు అధికారంలోకి రావడం జరిగింది.
మాల్దీవులలోని గత ఇబ్రహీం సోలీ ప్రభుత్వంతో భారతదేశానికి సత్సంబంధాలున్నాయి. పైగా మొయిజు ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ ప్రత్యేకంగా ఒక మంత్రిని కూడా పంపించడం జరిగింది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు సందర్భంగా మొయిజును మోదీ ప్రత్యేకంగా కలుసుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ, మొయిజు ప్రభుత్వం భారత వ్యతిరేక శక్తులకు సన్నిహితం కావడానికి విఫల యత్నం చేస్తూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం టర్కీ వెళ్లిన మొయిజు ఇటీవల చైనాను కూడా సందర్శించారు. సాధారణంగా మాల్దీవులలో అధికారానికి వచ్చిన ప్రతి ప్రభుత్వమూ భారత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను నెరపడానికే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. మొయిజూ ప్రభుత్వం మాత్రమే అందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రారంభించింది. కొద్ది కాలంపాటు మాల్దీవులలో భారత్‌ బహిష్కరణ ఉద్యమాన్ని నడిపిన మాజీ అధ్యక్షుడు యమీన్‌ కూడా ఆ తర్వాత 2014లో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. మాల్దీవుల్లో స్థావరం ఏర్పాటు చేసుకున్న 77 మంది భారతీయ సైనికులను వెంటనే ఉపసంహరించవలసిందిగా మొయిజు భారత్‌ పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అయితే, భారత ప్రభుత్వం కూడా దీని మీద అనేక పర్యాయాలు వివరణ ఇచ్చింది.
భారత, మాల్దీవుల ప్రభుత్వాలు ఇప్పటికైనా ధూషణ భూషణలను పక్కన పెట్టి పరిస్థితిని మదింపు చేయడం మంచిది. భారత ప్రభుత్వంతో శత్రుత్వాన్ని పెంచుకునే స్థాయిలో మొయిజు లేరు. ఆర్థికంగా, చారిత్రాత్మకంగా బాగా సన్నిహితంగా, అండగా ఉన్న భారతదేశంతో వైరం పెంచుకోవడం వల్ల మొయిజు ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు. టర్కీ గానీ, చైనా గానీ మొయిజు ప్రభుత్వాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటాయే తప్ప భారతదేశం మాదిరిగా ఈ ప్రభుత్వానికి అయాచితంగా సహాయం చేయడం జరగదు. హిందూ మహా సముద్రంలో ఉన్న మాల్దీవులకు భారతదేశం మొదటి నుంచి పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. మొయిజు ప్రభుత్వం వీటినన్నిటినీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం కూడా మాల్దీవుల లాంటి పిచ్చుక దేశం మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడం సమంజసం కాదు. ఒకప్పుడు సోలీ ప్రభుత్వం కారణంగా ఆ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన భారత ప్రభుత్వం వీటిని ఇక మీదట కూడా కొనసాగించడమే మంచిది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంబంధాలు మారడం అనేది ప్రాంతీయ సుస్థిరతకు గొడ్డలిపెట్టే అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News