డా. పర్వతం వెంకటేశ్వర్
పొలిటికల్ సైన్స్ లెక్చరర్
నేటి విద్యార్థులే రేప టి పౌరులు అన్నది పాత మాట.. నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకు లు అన్నది వాస్తవం. ప్రజా స్వామ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన యువత, కళాశాల దశలోనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం ఎంతో కీలకం. ప్రజలు కేవలం ఓటు వేసి ఊరుకోకూడదు, రాజకీయాల్లో పాల్గొ నడం ఒక పౌరుడి విధి. ప్రజలు రాజకీయాల పట్ల ఆసక్తి కోల్పోయి న రోజున ఆ దేశం పతనమవుతుందని, అందుకోసం యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని రాజనీతి శాస్త్రవేత్త రూసో చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విద్యార్థి సంఘం ఎన్నికలు రద్దు చేసిన 1988 తరవాత యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకపోవడం వల్ల యువత రాజకీయాల్లోకి రాలేకపోతు న్నారు. దీనివల్ల ఖాళీ అయిన స్థానాలను రాజకీయ నాయకుల వారసులు సులభంగా భర్తీ చేస్తున్నారు. కొత్త తరం నాయకులు క్షేత్రస్థాయి నుండి ఎదగకపోతే, పాత నాయకులే దశాబ్దాల పాటు పదవుల్లో కొనసాగుతారు. ఇది ప్రజాస్వామ్యంలో ‘నాయకత్వ శూన్యం’కు దారితీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. విద్యార్థి లోకాన్ని రాజకీయంగా చైతన్యపరచడం, క్యాంపస్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అనేది సామాజిక మార్పుకు తొలిమెట్టు. కరోనా తర్వాత జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన న్యాయ్‌పత్ర మేనిఫెస్టోలో విద్యార్థి సంఘ ఎన్నికల గురించి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆంగ్ల మేనిఫెస్టోలో 9వ పేజీ (పాయింట్ నంబర్ 10), 16వ పేజీ (పా యింట్ నంబర్ 15)లలో విద్యార్థి సంఘ ఎన్నికల పునరుద్ధరణ గురించి ప్రస్తావించారు. మేనిఫెస్టోలో ఏముందంటే, మేము కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించే హక్కును పునరుద్ధరిస్తాము. కాంగ్రెస్ పార్టీ తన మేని ఫెస్టోలో విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించేందుకు, క్యాంపస్లలో విద్యార్థి సంఘ ఎన్నికలను తప్పని సరిగా నిర్వహిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ ని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పరిస్థితి
ఒక దేశపు భవిష్యత్తు ఆ దేశపు తరగతి గదిలో నిర్మించబడు తుంది. ఆ తరగతి గదిలోని విద్యార్థులే రేపటి పౌరులు, పాలకులు. అందుకే ‘విద్యార్థులకు రాజకీయాలు అవసరమా?’ అనే ప్రశ్నకు ‘అవసరమే కాదు, అనివార్యం’ అనే సమాధానం వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా చాలా రాష్ట్రాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిలిచిపో యాయి. దీనివల్ల విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోవడమే కాకుండా, రాజకీయాల్లోకి కొత్త రక్తం రాకుండా పోతోం ది. విద్యార్థి దశలోనే ఎన్నికల ప్రక్రియ, ఓటు విలువ, జవాబుదారీ తనం గురించి అవగాహన ఉంటే, భవిష్యత్తులో వారు దేశానికి సమర్థవంతమైన నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. గతంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నాయకులను తయారుచేసే కర్మాగారాలుగా ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య నుండి నేటి సీనియర్ నాయకుల వరకు చాలామంది కళాశాల రాజకీయాల నుండే వచ్చారు. విద్యార్థి దశలో ఎన్నికలు లేకపోవడం వల్ల, యువతకు ఓటర్లను ఎలా కలవాలి, సమస్యలపై ఎలా పోరాడాలి, ప్రసంగ కళ వంటి ప్రాథమిక రాజకీయ పాఠాలు నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. క్యాంపస్ రాజకీయాలు లేకపోవడంతో, రాజకీయ నేపథ్యం లేదా విపరీతమైన ధనం ఉన్న వారే నేరుగా ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థాయికి వెళ్లగలుగుతున్నారు. సామాన్య యువతకు ఆ తలుపులు మూసుకుపోయాయి. చాలా మంది రాజకీయాలను కేవలం ఎన్నికలు, పార్టీలు, జెండాలుగా మాత్రమే చూస్తారు. కానీ, విద్యార్థులకు రాజకీయం అంటే సామా జిక స్పృహ. తాము చదువుకునే విద్యా సంస్థల్లో వసతులు, ఫీజుల నియంత్రణ, ఉపాధి అవకాశాల గురించి ప్రశ్నించడమే రాజకీయ చైతన్యానికి పునాది. విద్యార్థి దశలో రాజకీయ అవగాహన ఉండటం వల్ల సమాజంలోని సమస్యలను అర్థం చేసుకునే తత్వం అలవడుతుంది.
రాజకీయ ట్రైనింగ్ గ్రౌండ్ క్యాంపస్లు
గతంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జరిగే విద్యార్థి సంఘాల ఎన్నికలు నాయకులను తయారుచేసే నర్సరీలా ఉండేవి. సామాన్య కుటుంబం నుండి వచ్చిన విద్యార్థి కూడా తన వాక్పటిమతో, సేవా గుణంతో నాయకుడిగా ఎదిగే అవకాశం ఉండేది. విద్యార్థి సంఘాల ఎన్నికలు ఒక రకంగా రాజకీయ నాయకులకు ట్రైనింగ్ గ్రౌండ్ లాంటివి. తెలంగాణలో నేడు మనం చూస్తున్న చాలామంది కీలక నాయకులు ఉస్మానియా యూని వర్సిటీ లేదా ఇతర విద్యాసంస్థల్లో విద్యార్థి నాయకులుగా ప్రస్థా నాన్ని మొదలుపెట్టినవారే.. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థి దశ నుండి ఎదిగిన నాయకులు ఉన్నారు. వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషిం చారు. ఏవీ కాలేజీలో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విద్యార్థి దశలో ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేశారు. అక్కడి నుండే ఆయనకు ప్రజా సమస్యలపై పోరాడే గుణం అలవడింది. కె. కేశవరావు, మధు యాష్కీ గౌడ్, వి. హనుమంతరావు, కడియం శ్రీహరి, బండా రు దత్తాత్రేయ, మల్లికార్జున్, తీన్మార్ మల్లన్న, జార్జ్ రెడ్డి వంటి నాయకులు కేవలం విద్యార్థి దశలోనే సమాజంపై అంతటి ప్రభా వం చూపగలిగారు. 1988 తర్వాత ఎన్నికలు లేకపోవడం వల్ల సామాన్య కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే వేదికలు కరువయ్యాయి.
లింగ్డో కమిటీ సిఫార్సులు
భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికల నిర్వహణకు ఒక ప్రామాణిక మార్గదర్శకాలు తీసుకరావాలని, 2005లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రభు త్వం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జె.ఎం. లింగ్డో నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విద్యార్థి రాజకీయాల్లో నేర ప్రవృత్తిని, డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి కఠినమైన నిబం ధనలను సూచించింది. ఈ ఎన్నికల అవసరాన్ని గుర్తిస్తూనే, విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపింది. విద్యార్థులలో నిర్ణయాధికారం, సమయపాలన, ప్రజా సమస్యల పట్ల స్పందించే గుణం పెరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై ఆచరణాత్మక జ్ఞానం లభిస్తుంది.
రాజకీయాలు అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. విద్యార్థులను క్రియాశీల రాజకీయాల్లోకి ఆహ్వానించడం వల్ల అవినీతి రహిత, పారదర్శకమైన వ్యవస్థ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కళాశాలల్లో ఎన్నికలు నిర్వహించి, క్యాంపస్లలో ప్రజాస్వామ్యా నికి ఊపిరి పోయాలని విద్యార్థి లోకం ఆకాంక్షిస్తోంది. ప్రభుత్వం హామీలు కాగితాల మీద కాదు.. క్యాంపస్ మైదానాల్లో ఎన్నికల రూపంలో కనిపించాలి. రాజకీయాల్లోకి యువత రావడం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, పాలసీ మేకింగ్‌లో భాగ స్వాములు కావడం. విద్యార్థి ఎన్నికలు మళ్లీ ప్రారంభిస్తేనే, క్షేత్రస్థాయి నుండి ప్రజాస్వామ్య విలువలు తెలిసిన, ప్రజల పక్షాన నిలబడే కొత్త తరం నాయకులు పుట్టుకొస్తారు.
9177566741

