Homeఎడిటోరియల్ / బహుళUnderprivileged: బడుగుల బతుకులకు రక్షణేది?

Underprivileged: బడుగుల బతుకులకు రక్షణేది?

ఇటీవలి ఐఐటీ ముంబై విద్యార్థి సాహిల్‌ వాంకిడే మరణం భారత సమాజంలో రాజ్యాంగ విలువలు వాస్తవ జీవితంలో ఎంతవరకు సాకారమయ్యాయనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది. పరీక్ష సమ యంలో మొబైల్‌, చాట్‌జిపిటి వినియోగంపై వివాదం ఏర్పడిన తరువాత విద్యార్థి మరణిం చాడు. అతని కుటుంబం కుల వివక్షకు సంబంధించిన ఆరోపణలు చేసింది. ఐఐటీ ముంబై ఆ ఆరోపణలను ఖండించింది. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగి స్తున్నారు. కాబట్టి కుల వివక్షే ఆ మరణానికి కారణమని ముందుగానే నిర్ధారించడం సరి కాదు. అయితే ఈ ఘటనను కేవలం పరీక్షా నిబంధనల ఉల్లంఘన లేదా వ్యక్తిగత విషాదంగా మాత్రమే చూడటం కూడా సరిపోదు. విద్యాసంస్థల్లో కులం, గౌరవం, సంస్థాగత బాధ్యత, విద్యార్థి సంక్షేమం, సమానత్వం వంటి ప్రశ్నలను మనం ఎలా అర్థం చేసుకుంటున్నామనే దానిపై ఇది ఆలోచింపజేస్తుంది. 2020-21 నుంచి 2024-25 మధ్య దేశంలోని అన్ని ఐఐటీలలో అణగారిన కులాలకు చెందిన 45 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో కుల వివక్ష ఆరోపణలు, దర్యాప్తు, న్యాయ ప్రక్రియలతో పాటు ఒక మౌలిక ప్రశ్న ముందుకొస్తుంది: చట్టపరమైన సమానత్వం ఉన్నత విద్యాసంస్థల దైనందిన సంస్కృతిలోనూ సమాన గౌరవం లభించదా?

- Advertisement -

ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలపై సాధారణంగా జరిగే చర్చల పరిధిని విస్తరించాలి. మన చర్చలు ఎక్కువగా రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, అవకాశాలు, అధికారంలో వాటా, సంక్షేమం చుట్టూనే సాగుతాయి. ఇవన్నీ అవసరమైనవే. అయితే ఈ వర్గాలు రాజ్యాంగం వల్ల ఏర్పడ్డాయా? లేక రాజ్యాంగానికి ముందే ఉన్న సామాజిక వాస్తవాలను రాజ్యాంగం గుర్తించి, వారి గౌరవప్రదమైన మానవ జీవితానికి కొత్త రాజకీయ న్యాయ మార్గాన్ని నిర్మించిందా? రెండవదే చారిత్రకంగా, సిద్ధాంత పరంగా సరైన అవగాహన. ఈ వర్గాలు రాజ్యాంగానికి పూర్వమే భారత సమాజంలో ఉన్నాయి; 1950 తర్వాత కూడా ఉన్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి. కాబట్టి వారి సమస్యను “రాజ్యాంగ రక్షణలు ఎంతవరకు లభిస్తున్నాయి?” అనే ప్రశ్నకే పరిమితం చేయకుండా, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తిగత గౌరవం వాస్తవ జీవితంలో ఎంతవరకు సాకారమవుతున్నాయనే ప్రశ్నగా చూడాలి. ఈ దృక్పథానికి “రాజ్యాంగానంతరవాదం” (పోస్ట్‍-కాన్స్​‍టిట్యూషనలిజం) ఉప యోగకరమైన సిద్ధాంత చట్రం. ఇది రాజ్యాంగం తర్వాతి కాలాన్ని మాత్రమే సూచించదు; రాజ్యాంగాన్ని జీవించే సామాజిక పరివర్తన ప్రాజెక్టుగా స్వీకరించి, దాని విలువలను ప్రతి తరంలో అమలు చేసే నిరంతర ప్రక్రియను సూచిస్తుంది.

గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ భారత రాజ్యాంగాన్ని రాజకీయ ప్రజా స్వామ్యంతో పాటు “సామాజిక విప్లవం” లక్ష్యాన్ని మోసే రాజ్యాంగంగా విశ్లేషించాడు. డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఆలోచన ఈ దృక్పథానికి కేంద్రబిందువు. రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదని, దానికి సామాజిక ప్రజాస్వామ్యం పునాది కావాలని ఆయన భావించాడు. చట్టపరమైన సమానత్వం ఉన్నప్పటికీ కుల ఆధిపత్యం, అంటరానితనం, పితృస్వామ్యం, సామాజిక అవమానం కొనసాగితే రాజ్యాంగ ప్రజాస్వామ్యం అసంపూర్ణం గానే ఉంటుంది. ఆయన ప్రతిపాదించిన “కాన్స్​‍టిట్యూషనల్‌ మొరాలిటీ” అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం మాత్రమే కాదు; మనిషిని కులం, తెగ, లింగం, మతం, జన్మ లేదా వృత్తి ఆధా రంగా తక్కువగా చూడని సామాజిక సంస్కృతిని నిర్మించడం కూడా. జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, పెరియార్‌, నారాయణగురు వంటి సంస్కర్తల సామాజిక విమర్శలను కూడా ఈ చట్రంలో అనుసంధానించవచ్చు. ఫూలేకు శూద్ర, అతి శూద్రుల విముక్తి కేవలం ఉద్యోగం లేదా అధికారంలో భాగస్వామ్యం కాదు; విద్య, జ్ఞానం, ఆత్మగౌరవం, సామాజిక ఆధిపత్య నిర్మూలనలో ఉంది. సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య ద్వారా పితృస్వామ్య నిర్మా ణాన్ని సవాలు చేసింది. అందువల్ల రిజర్వే షన్‌ను కేవలం “సీట్ల పంపకం”గా కాకుండా, చారిత్రకంగా అవకాశాల నుంచి దూరంగా ఉంచబడిన సమూహాలు సమాన పౌరత్వాన్ని వాస్తవంగా అనుభవించేందుకు ఉపయోగపడే సాధనంగా చూడాలి.

పాశ్చాత్య రాజకీయ తత్వంలో జాన్‌ రాల్స్​‍ “జస్టిస్ యాజ్‌ ఫెయిర్‌నెస్” సమాన ప్రాథమిక స్వేచ్ఛలు, సమాన అవకాశాలు, సామాజిక-ఆర్థిక న్యాయాన్ని ఆలోచించడానికి దోహదపడుతుంది. అమర్త్యసేన్‌, మార్తా నుస్బా మ్‌ల సామర్థ్యాల విధానం వనరులు ఉన్నాయా అనే ప్రశ్నకన్నా, వ్యక్తి తాను విలువైనదిగా భావించే జీవితాన్ని గడపగల సామర్థ్యం ఉందా అనే ప్రశ్నను ముందుకు తెస్తుంది. ఈ కోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలకు న్యాయం అంటే కేవలం సీటు, ఉద్యోగం లేదా పదవి కాదు; విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం, రాజకీయ భాగస్వామ్య సామర్థ్యాలను పెంపొందించడం. హాబె ర్మాస్ డెలిబరేటివ్‌ డెమోక్రసీ, చార్లెస్ టేలర్‌ “గుర్తింపు” భావనలు కూడా కీలకం. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల్లో ఓటు వేయ డంతో ముగియదు. ప్రభావిత ప్రజలు సమాన గౌరవంతో మాట్లాడగలగడం, తమ అనుభవాలను ప్రజా చర్చలోకి తీసుకు రాగలగడం కూడా ప్రజాస్వామ్యమే. చట్టపరంగా సమానులుగా ప్రకటించడం మాత్రమే కాదు; సామాజికంగా వారి అస్తిత్వం, గౌరవం, గుర్తింపును అంగీకరించడం కూడా అవసరం.

రాజ్యాంగానంతరవాదం “అణగారిన సమూహాలకు ఏమి ఇవ్వాలి?” అనే దాతృత్వ దృక్పథం నుంచి “వారు సమాన గౌరవంతో తమ జీవితాన్ని నిర్మించుకునే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎలా సృష్టించాలి?” అనే ప్రజాస్వామ్య దిశకు మారుస్తుంది. మహిళల విషయంలో కుటుంబం, విద్య, ఉపాధి, ఆస్తి, భద్రత, రాజకీయ భాగస్వామ్యం; ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో కుల వివక్ష, భూమి, విద్య, ఉపాధి, ప్రాతి నిధ్యం, సామాజిక గౌరవం; మైనారిటీల విషయంలో సమాన పౌరత్వం, భద్రత, సాంస్కృతిక స్వేచ్ఛ, అవకాశాలను సమ గ్రంగా చూడాలి. ఈ దృష్టిలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్‌, సంక్షేమం, ప్రత్యేక రక్షణలు, ప్రాతినిధ్యం అన్నీ రాజ్యాంగ పరంపరలోని సాధనాలు మాత్రమే; అవే తుది లక్ష్యం కావు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలను శాశ్వతంగా “బలహీన వర్గాలు”గా బంధించడం కూడా రాజ్యాం గానంతరవాదం కాదు. చారిత్రక అవమానాన్ని శాశ్వత గుర్తిం పుగా, వెనుకబాటుతనాన్ని శాశ్వత విధిగా, రిజర్వేషన్‌ను శాశ్వత ఆధారపడటంగా మార్చకుండా, సమాన గౌరవం, సమాన పౌర సామర్థ్యాల వైపు సమాజాన్ని నడిపించడమే దాని లక్ష్యం.

అందువల్ల 1950లో రాజ్యాంగం ఆమోదించబడటం ముగింపు కాదు; భారత సమాజం ప్రతి తరంలో పూర్తి చేయాల్సిన ప్రజాస్వామ్య వాగ్దానానికి ఆరంభం. రాజ్యాంగా నంతర వాదం అసలు ప్రశ్న “రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలకు ఏమి ఇచ్చింది?” అనేది మాత్రమే కాదు. “రాజ్యాంగం ఊహించిన గౌరవప్రదమైన మానవ జీవితాన్ని వారు వాస్తవంగా ఎంతవరకు అనుభవిస్తున్నారు?” అనేదే. ప్రతి విద్యార్థి కేవలం “రిజర్వేషన్‌ లబ్ధిదారు” కాదు; సమాన గౌరవం కలిగిన పౌరుడు. రాజ్యాంగాన్ని పుస్తకం నుంచి జీవన విధానంగా మార్చే నిరంతర సామాజిక పరివర్తన ప్రక్రియే నిజమైన రాజ్యాంగానంతరవాదం. ఈ విశాల దృక్పథంతో ముంబై ఐఐటిలోని మనుషులు వ్యవహరించి ఉంటే సాహిల్‌ వాంకిడే సజీవంగా ఉండేవాడేమో; భవిష్యత్తులో వ్యక్తిత్వం కలిగిన పౌరుడిగా దేశ సేవ చేసేవాడేమో.

డా.నాగం కుమారస్వామి
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
పాలమూరు యూనివర్సిటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News