Sunday, June 30, 2024
Homeఓపన్ పేజ్Why BRS collapsed: ఉద్యమ పార్టీ ఎందుకిలా చతికిలబడిపోయింది?

Why BRS collapsed: ఉద్యమ పార్టీ ఎందుకిలా చతికిలబడిపోయింది?

రాజకీయాల్లో పదేళ్ల కాలమంటే సుదీర్ఘ కాలం కిందే లెక్క. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌) విషయంలో ఇదే అభిప్రాయం నిర్ధారణ అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించి, రెండు పర్యాయాలు, అంటే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఈ బి.ఆర్‌.ఎస్‌ పార్టీ ప్రస్తుతం నామరూపాల్లేకుండా పోయే స్థితిలో ఉంది. గత డిసెంబర్‌ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఈ పార్టీ ఇటీవలి లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఒక్క స్ధానాన్ని కూడా సంపాదించుకోలేకపోయింది. మొత్తా నికి, బి.ఆర్‌.ఎస్‌ కారు (ఎన్నికల గుర్తు)లో ఇంధనం అయిపోయినట్టు కనిపి స్తోంది. మొత్తం 17 లోక్‌ సభ స్థానాల్లో 14 స్థానాల్లో ఈ పార్టీ మూడవ స్థానం లో ఉండగా, ఎనిమిది స్థానాల్లో ఈ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కక పోవడం ఈ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఏ పార్టీకైనా జయాపజయాలు సహజమే కానీ, ఒక పార్టీ ఇంతగా తుడిచిపెట్టుకుపోవడం మాత్రం ఆశ్చర్యంగా, ఆందోళనకరంగా ఉంది. తెలం గాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌)ను జాతీయ పార్టీగా మార్చే ఉద్దేశంతో ఇది బి.ఆర్‌.ఎస్‌ గా మారడమైతే జరిగింది కానీ, జాతీయ స్థాయిలో ఇది ఓటర్లకు ఇవ్వగలిగిన అజెండా ఏదీ లేకుండా పోయింది. తమిళనాడులో అన్నాడి.ఎం.కె, ఒడిశాలో బిజూ జనతాదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.ఆర్‌.సి.పిలు ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత భవిష్యత్తులో ఇక కోలుకునే స్థితిలో లేకపోవడం విచిత్రంగా ఉంది. ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయి సిద్ధాం తాలు, ఆశయాలు అవసరం లేదని, బీజేపీ లేదా కాంగ్రెస్‌ వంటి జాతీయ స్థాయి పార్టీలతో చేతులు కలిపితే తప్ప ఇవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం కూడా లేదని ఓటర్లు తేల్చి చెప్పినట్టు కనిపిస్తోంది.
ప్రధాన కారణాలు
వాస్తవానికి, 2019లో బి.ఆర్‌.ఎస్‌ పార్టీ 9 లోక్‌ సభ స్థానాలను సంపాదిం చినప్పటికీ, అది జాతీయ స్థాయిలో సాధించింది ఏమీ లేదు. నిత్యం ప్రధాని మోదీతో తలపడడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీని ప్రభావం లోక్‌ సభ ఎన్నికల మీదే కాకుండా శాసనసభ ఎన్నికల మీద కూడా పడింది. బి.ఆర్‌.ఎస్‌ ఓట్ల వాటా గత డిసెంబర్‌ లో 37 శాతం నుంచి ఎకాయెకిన 16 శాతానికి పడిపోయింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే దాని ఓట్ల వాటా అప్పటి 41 శాతం నుంచి 16 శాతానికి పడిపోవడం ఆ పార్టీ అస్తిత్వాన్నే దెబ్బతీసింది. సాధారణంగా బి.ఆర్‌.ఎస్‌ ఓటర్లకు కాంగ్రెస్‌ పార్టీ బద్ధ శత్రువు. ఈ పార్టీ ఓటర్లకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అయినా నచ్చుతుంది కానీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పడదు. ఈ కారణంగానే ఈ ఓటర్లు రాష్ట్రంలో బి.ఆర్‌.ఎస్‌ కి, కేంద్రంలో బీజేపీకి ఓటు వేసే ఉద్దేశంలో ఉన్నారు. బి.ఆర్‌.ఎస్‌ ఓటమి తర్వాత చాలామంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పటికీ, కార్యకర్తలు మాత్రం బి.ఆర్‌.ఎస్‌ లోనే ఉండిపోవడం జరుగుతోంది.
బి.ఆర్‌.ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఓటమికి మాత్రమే పరిమితమా లేక పార్టీలోని అంతర్గత శత్రువుల వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం కూడా ఉందా? తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి కుట్ర సిద్ధాంతాలు షికార్లు చేస్తున్నాయి. బి.ఆర్‌.ఎస్‌ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు రహస్యంగా బీజేపీతో చేతులు కలిపారని, మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల, మల్కాజ్‌ గిరి, సికింద్రాబాద్‌, భువనగిరి, జహీరాబాద్‌ స్థానాలను బీజేపీకి వదు లుకునేటట్టు, అందుకు ప్రతిగా తన కుమార్తె కవితకు ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో బెయిల్‌ ఇప్పించేటట్టు ఆయన బీజేపీతో ఒప్పందం కుదర్చుకున్నారని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసారం సాగించడం ఆ పార్టీని దారుణంగా దెబ్బ తీసింది. బి.ఆర్‌.ఎస్‌ చాటుమాటున బీజేపీతో అంటకాగడం కేవలం కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీయడానికేనని కూడా ఆయన విమర్శలు సాగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మజ్లిస్‌ పార్టీ అధినేత, పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నియోజక వర్గాల్లో బి.ఆర్‌.ఎస్‌ కార్యకర్తలంతా బీజేపీకే ఓటు వేయడం కనిపించిందని కూడా ఆయన అన్నారు.
నాయకత్వ లోపం
బి.ఆర్‌.ఎస్‌ పార్టీకి కంచుకోటల్లాంటి ఎనిమిది లోక్‌ సభ స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్క కుండా ఓడిపోవడం, అందులో ఆరు స్థానాల్లో బీజేపీ ఘన విజయాలు సాధించడం ఈ వాదనకు ఊతమిస్తోంది. హైదరాబాద్‌, జహీరాబాద్‌లలో తప్ప మిగిలిన ఆరు స్థానాల్లో బీజేపీ మంచి మెజారిటీతో గెలిచింది. శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి చూసినా ఇక్కడ ఏడు స్థానాల్లో బి.ఆర్‌.ఎస్‌ గెలవగలిగి ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో తమకు 50 లక్షల మంది విధేయ ఓటర్లు ఉన్నారంటూ గతంలో బి.ఆర్‌.ఎస్‌ నాయకుడు హరీశ్‌ రావు వెల్లడించారు. అయితే, ఈసారి ఎన్నికల్లో బి.ఆర్‌.ఎస్‌కు 36 లక్షల ఓట్లు మాత్రమే పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిగిలిన ఓట్లన్నీ బీజేపీకి వెళ్లిపోయి నట్టు బి.ఆర్‌.ఎస్‌ నాయకులు సైతం అంగీకరించడం జరిగింది. రేవంత్‌ రెడ్డి, ఒవైసీలు భావిస్తున్నట్టుగా బి.ఆర్‌.ఎస్‌ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేయడం జరి గిందా? బి.ఆర్‌.ఎస్‌ పట్ల ఆ పార్టీ ఓటర్లే విసుగెత్తిపోయారా? ఇటువంటి ప్రశ్నలకు నాయకులు కూడా సమాధానం ఇచ్చే స్థితిలో లేరు.
బి.ఆర్‌.ఎస్‌ భవిష్యత్తేమిటి? రాష్ట్రంలో అతి వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే, ఈ పార్టీ క్రమంగా అంతర్ధానం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాయకులనే కాదు, కార్యకర్తలను కాపాడుకోవడం కూడా అగ్ర నాయకులకు కష్టమైపోతోంది. చంద్రశేఖర్‌ రావు అధికారంలో ఉన్నంత కాలం ప్రతి శాసనసభ్యుడూ తమ నియోజకవర్గాల్లో ఒక రాజు మాదిరిగా వెలగడం, అధికారం చెలాయించడం జరిగింది. ఈ అహంకారం, ఈ భూస్వామ్య ధోరణులే పార్టీని ఇప్పుడు అధఃపాతాళానికి తొక్కేశాయి. బి.ఆర్‌.ఎస్‌ నాయ కుల్లో ఎక్కువ మంది పార్టీ ఫిరాయింపుల్లో రికార్డులు సృష్టించినవారే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. చంద్రశేఖర్‌ రావు అధికారంలో ఉన్నంత కాలం ఆయనకు నీరాజనాలు పట్టిన నాయకులంతా ఆయన అధికారం నుంచి దిగి పోయే సరికి ఆయనకు గు్‌డ బై చెప్పడం జరుగుతోంది. చంద్రశేఖర్‌ రావు ఇప్పటికైనా నడుం బిగించి పార్టీని నాయకుల స్థాయి నుంచి కాక, కార్యకర్తల స్థాయి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ఎంతగా వేధిస్తున్నా, ఎన్ని దాడులు సాగిస్తున్నా పార్టీ కార్యకర్తలను కాపాడుకున్న విధంగా బి.ఆర్‌.ఎస్‌ నాయకత్వం కూడా తమ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ సెంటిమెంట్‌ అనేది మటుమాయం అయిపోయిందని, దాన్ని ఇక మీదట అస్త్రంగా చేసుకుని ప్రయోజనం లేదని చంద్రశేఖర్‌ రావు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడిక ప్రజా సమస్యలను, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకుని రణ రంగంలోకి దిగడం అవసరం. తెలంగాణ సంస్కృతి పేరుతో ఇతర పార్టీల నాయకులను అసభ్య పదజాలంతో దూషించడం ఇక చెల్లకపోవచ్చు. తొందరపాటు ధోరణులు, తిట్ల దండకాలు తెలంగాణ సంస్కృతిలో భాగం కావని, ఇది దొరల పాలనకు సంబంధించిన పదజాలమేనని ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పరిణతి చెందిన రాజకీయ నాయకుడు అయినందువల్ల ఆయన ఇప్పటి కైనా నిర్మాణాత్మక విమర్శలు సాగించడం కూడా చాలా అవసరం. నిజానికి, రానున్న అయిదారు నెలలు ఆయన కీలకమైన కాలం. గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ, వర్త మానాన్ని తిట్టుకుంటూ కూర్చోకుండా మళ్లీ ఉద్యమ కాలంనాటి స్థితికి చేరుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం లేనప్పుడు కూడా తాను అపర చాణక్యుడినేని ఆయన అర్థం చేసుకోవడం శ్రేయస్కరం.

  • వి. సుదర్శన రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News