ప్రపంచంలో అనేక దేశాల పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఎటువంటి పాత్రా పోషించకపోవడం, శాంతి సుస్థిరతలను నెలకొల్పడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. సుమారు 175 దేశాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, అనేక దేశాల విరాళాలతో కొనసాగుతున్న ఐక్యరాజ్య సమితి తన విద్యుక్త ధర్మాన్ని, తన బాధ్యతలను నిర్వహించకపోవడం నిజంగా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ అంతర్జాతీయ సంస్థ నుంచి శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప మరేమీ కనిపించడం లేదు.
ఇజ్రాయెల్, గాజాల నుంచి వస్తున్న వార్తలు, వీడియోలు మానవత్వాన్ని మొదలంటా కుదిపేస్తున్నాయి. ప్రపంచ దేశాల సామాన్య ప్రజానీకం మనసులను కలచి వేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని కప్పిపెట్టే ఆలోచన ఎవరికీ లేకపోవచ్చు. ఎవరూ ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రపంచ దేశాల నాయకులు, మానవ హక్కుల సంఘాలు సైతం ఇజ్రాయెల్, గాజాలలో జరుగుతున్న అమానవీయ హింసా విధ్వంసకాండలను ఖండిస్తున్నాయి. స్త్రీలు, గర్భవతులు, పిల్లలనే తేడా లేకుండా హమాస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న రక్తపాతం, భీభత్స కాండను సమర్థించేవారే లేరనడంలో సందేహం లేదు. అమాయక ప్రజానీకాన్ని ఇంతలా ఊచకోత కోయడం చరిత్రలో అరుదైన సంఘటనే. ప్రపంచంలో కొన్ని దేశాలు, కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలకు మానవత్వం, నీతి నియమాలు, నైతికత అనేవి పట్టవనే యథార్థం కళ్లకు కట్టడంతో ప్రపంచమంతా చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది.
ఉగ్రవాద ధోరణులు ఏ విధంగానూ సమర్థనీయం కావనే విషయం అర్థమవుతూనే ఉంది. ఈ
సందర్భంగా ప్రపంచంలో ఎవరికీ ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం గుర్తుకు రావడం లేదు. గాజాలోని సాధారణ ప్రజల మాన ప్రాణాలనే కాక, హమాస్ ఉగ్రవాదులు తమతో తీసుకు వెళ్లిన బందీలు, గాజా విడిచి వెడుతున్న శరణార్థుల మాన ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధాన్ని, ప్రతీకార దాడు లను ప్రోత్సహించడం కూడా కనీస మానవత్వానికి విరుద్ధమే. హమాస్ ఉగ్రవాదుల దాడులను చూసినవారికి సహజంగానే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల మీద పాకిస్థానీ ఉగ్రవాదుల దాడులు గుర్తుకు వస్తాయనడంలో సందేహం లేదు. ఈజిప్టు, లెబనాన్, సిరియా, ఇరాన్ తదితర దేశాలలో జరుగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు కూడా గుర్తుకు
వస్తాయి. మానవత్వం రానురానూ మంటకలుస్తోందనడానికి ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు, దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటువంటి కీలక సమయంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అరాచక ధోరణులు
ఉగ్రవాదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు ప్రధాన కారణం ప్రపంచ దేశాల తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం. అనేక దేశాల తీరుతెన్నులు, వ్యవహార శైలి, జీవన విధానాలు క్రమంగా వక్ర మార్గం పడుతుండడం అనేక దుష్పరిమాణాలకు దారి తీస్తోంది. ఉగ్రవాదానికి సంబంధించిన దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ప్రపంచ దేశాల మధ్య మాటల యుద్ధం మొదలవుతోంది.
ఒక దేశం ఉగ్రవాదాన్ని ఖండిస్తే, మరో దేశం దాన్నే స్వాతంత్ర పోరాటంగా, వ్యక్తి స్వేచ్ఛగా అభివర్ణించడం జరుగుతోంది. అంతేకాదు, ఎంత తీవ్రస్థాయిలో ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ ప్రపంచ దేశాలు రెండుగా చీలి, ఉగ్రవాదాన్ని సమర్థించే దేశాలుగా, ఉగ్రవాదాన్ని నిరసించే దేశాలుగా కొత్త పాత్ర ధరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ధరిస్తున్నాయి. సందర్భాన్ని బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి మారిపోతున్నాయి. ఉగ్రవాదాన్ని
ఇప్పుడు సమర్థించిన దేశం మరోసారి దాన్ని ఖండించడం ఆనవాయితీగా మారిపోయింది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉగ్రవాద దాడులు చోటు చేసుకున్నా ఒకే తాటి మీద నిలబడి వీటిని ఖండించాల్సిన దేశాలు స్వయంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయిస్తూ, ప్రోత్సహిస్తున్నాయి. అవకాశవాద దేశాలు ఇస్తున్న ఆశ్రయంతో ఈ ఉగ్రవాద సంస్థలు మరింత గుండె ధైర్యంతో యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, ఎక్కడ యుద్ధాలు చోటు చేసుకున్నా, ఎక్కడ ఉగ్రవాద దాడులు సంభవించినా జోక్యం చేసుకుని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి మీద ఉంటుంది. దాని లక్ష్యాలలో
ఇవన్నీ ఉన్నాయి. ఆ లక్ష్యాలకు ఐక్యరాజ్య సమితి తప్పకుండా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అనేక లోపాలు, లొసుగులతో కునారిల్లుతున్న ఈ సమితి ప్రస్తుతం శుష్కప్రియాలు, శూన్యహస్తాలతో పొద్దుపుచ్చుతోంది. ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య అతి దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్న సమయంలో కూడా ఐక్యరాజ్య సమితి మాటా పలుకూ లేకుండా ఉండిపోయింది. అమెరికా, సౌదీ అరేబియా, రష్యా, చైనా, భారత్, ఖతార్ తదితర దేశాలు ఈ యుద్ధాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను, ఈ ఉగ్రవాద దాడులను నిలువరించడానికి నానా పాట్లూ పడుతుండగా, ఈ సమితి మాత్రం ఇందులో తనకేమీ పాత్ర లేనట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఉగ్రవాదానికి నిర్వచనం
విచిత్రమేమిటంటే, ఈ ప్రపంచ దేశాల కూటమి ఉగ్రవాదాన్ని నిర్వచించడంలో కూడా విఫలం అయింది. ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఏనాడూ నిర్మాణాత్మకంగా, ఆచరణ యోగ్యంగా స్పందించిన పాపానపోలేదు. 1972లో మ్యూనిచ్ లో ఇజ్రాయెల్ అథ్లెట్ల మీద దాడులు జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా ఉగ్రవాదానికి సంబంధించిన చర్చ మొదలైంది. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి చేసిందేమిటంటే, ఉగ్రవాదాన్ని నిర్వచించడానికి ఒక కమిటీని వేయడం.
1972 డిసెంబర్ 18న 27వ జనరల్ అసెంబ్లీ ఉగ్రవాదం గురించి, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి, దాని కారణాల గురించి వివరిస్తూ ఒక 58 పేజీల తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేయడానికి వివిధ దేశాల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి రావడంతో చివరికి అది ఎందుకూ పనికిరాని తీర్మానం కింద తయారైంది.
అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఏకాభిప్రాయం ఏర్పడ లేదు. సభ్య దేశాల అధినేతలంతా ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేశారు. సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. సభ్య దేశాలన్నీ ఉగ్రవాదం నిర్వచనం మీదే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఉగ్రవాద నిర్మూలన వ్యూహమేదీ రూపుదిద్దుకోలేదు. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడకపోవడం పట్ల భారత్ మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఉగ్రవాదానికి సరైన నిర్వచనం దొరకకపోవడం వల్లే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి చర్యా తీసుకోవడం లేదనుకుంటే పొరపాటే. అసలు దీని నిర్వహణ వ్యవస్థే లోపభూయిష్టంగా ఉన్న
విషయం మధ్య మధ్య నిరూపితమవుతూనే ఉంది. అగ్ర రాజ్యాల వీటో అధికారాల దగ్గర నుంచి, వివిధ దేశాల ఒత్తిళ్ల వరకు అనేక అంశాలు ఐక్యరాజ్య సమితిని అచేతనంగా మారుస్తూ వస్తున్నాయి.
ఉగ్రవాదానికి ఐక్యరాజ్య సమితి వద్ద నిర్వచనమేదీ లేనప్పటికీ, 2006 ప్రాంతంలో ఇది ఒక ఉగ్రవాద నిర్మూలన వ్యూహాన్ని రూపొందించింది. ‘‘ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి వ్యక్తిగతంగా, సంఘటితంగా కఠినమైన, నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని’’ ఇది వివిధ దేశాలను కోరుతూ ఒక తీర్మానం చేసింది. అయితే, ఇది ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అనేక పర్యాయాలు అందులో సూచనలైతే చేసింది కానీ, ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు
ఆశ్రయం ఇస్తున్న దేశాల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. వాటి కోసం ప్రత్యేక సూచనలేమీ చేయలేకపోయింది. అంతేకాదు, ఉగ్రవాదానికి సంబంధించి ప్రత్యేకంగా నిర్వచనమేదీ లేకుండానే, ఉగ్రవాదులకు నిధుల సహాయం, ఆయుధాల సహాయం చేయడాన్ని నిలిపివేయాలంటూ సూచనలు చేసింది. వీటన్నిటి ఫలితంగా జరుగుతున్నదేమిటంటే, ఉగ్రవాద సంస్థలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదులు అరాచకాలు విస్తరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
పనిచేయని ఆంక్షలు
ఉగ్రవాదానికి సంబంధించినంత వరకూ ఐక్యరాజ్య సమితి ఇంతవరకూ 31 దేశాల మీద
ఆంక్షలు విధించింది. 1966లో రొడీషియాతో ఇది ప్రారంభం అయింది. ఉగ్రవాదంతో
సంబంధం ఉన్న సుమారు వెయ్యి మంది వ్యక్తులు, సంస్థల పైన కూడా రకరకాల ఆంక్షలు విధించడం జరిగింది. అయినా ఇది ఎవరికీ పట్టడం లేదు. ఎవరూ లెక్క చేయడం లేదు. అఫ్ఘానిస్థాన్ లోని తాలిబాన్లు ఇందుకు పెద్ద ఉదాహరణ. పైగా అక్కడ తాలిబాన్లే అధికారంలో ఉన్నారు కూడా. పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారిపై ఆంక్షలు విధించాలని గత జూన్ నెలలో భారత్, అమెరికాలు ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతిపాదన చేశాయి. అయితే, చైనా వాటిని వీటో చేసింది. విచిత్రమేమిటంటే, కొన్ని దేశాల మీద అమెరికా ఆంక్షలు విధిస్తుండగా, మరికొన్ని దేశాల మీద ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధిస్తోంది. హమాస్ మీద అమెరికా ఆంక్షలు విధించింది కానీ, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు
విధించలేదు.
ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య ఒక సరైన పద్ధతి, వ్యవస్థ ఉండాలని 1945లో ఒక తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ, అది ఏనాడూ అమలు జరగలేదు. ప్రపంచవ్యాప్త, ప్రపంచ స్థాయి దృక్పథం కలిగిన నాయకుడు లేదా నాయకత్వం లేకపోవడం ఈ అస్తవ్యస్త పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా అదుపూ ఆపూ లేని అరాచక వ్యవస్థ వేళ్లూనుకుపోతోంది.
ఎక్కడో ఏదో దేశంలో ఉగ్రవాద దాడులు జరిగాయని, మనకేమీ ఇబ్బంది లేదని సంతృప్తిపడే రోజులు పోయాయి. ఎక్కడ ఉగ్రవాద దాడులు, అఘాయిత్యాలు, కిరాతకాలు జరిగినా ప్రపంచమంతా ఇబ్బంది పడే రోజులు వచ్చేశాయి.
– డాక్టర్ వి. వెంకటేశ్వర రావు, విశ్రాంత ఆచార్యుడు