Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Why violent politics: హింసా రాజకీయాలెందుకు?

Why violent politics: హింసా రాజకీయాలెందుకు?

హింసాకాండను రాజకీయ వ్యూహంగా చేసుకోవడమన్నది ఈ మధ్య కాలంలో అనేక రాష్ట్రాలలో పరిపాటి అయిపోయింది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటిదే జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా ఇటీవలి కాలంలో అనేక పర్యాయాలు హింసాకాండ చోటు చేసుకుంది. విజయవాడ నగర సమీపంలోని గన్నవరంలో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి కార్యకర్తలకు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య భీకర స్థాయిలో ఘర్షణలు జరగడాన్ని చూస్తే రాజకీయ పక్షాలు హింసను ఓ రాజకీయ వ్యూహంగా వాడుకోవడమన్నది ఈ రాష్ట్రంలో కూడా మొదలైపోయినట్టు కనిపిస్తోంది. మొదట దీనిని స్థానికుల మధ్య జరిగిన సాధారణ ఘర్షణగా అంతా భావించడం జరిగింది. అయితే, ఇది ఒక పథకం ప్రకారం జరిగిందనే సంగతి నిశితంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది.
గన్నవరం ఘర్షణ జరిగిన తర్వాత నుంచి నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాలక పక్ష శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరాం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరిపోయింది. పార్టీ కార్యకర్తలను తీసుకుని హుటాహుటి న గన్నవరానికి బయలుదేరిన పట్టాభిరాంకి అక్కడ పెద్ద సంఖ్యలో వై.ఎస్‌.ఆర్‌.సి.పి కార్యకర్తలు ఎదురు పడ్డారు. ఈ రెండు పార్టీల మధ్యా ఘర్షణలు చెలరేగడం, పాలక పక్ష కార్యకర్తలు అక్కడికి దగ్గరలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగిపోయింది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు కానీ, ఈ గొడవలో ఒక పోలీస్‌ అధికారి గాయపడ డం కూడా జరిగింది. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు పోలీసులతో కూడా వివాదానికి దిగడంతో పరిస్థి తి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు పట్టాభిరాంను కూడా అరెస్టు చేయడం జరిగింది.
మొత్తం మీద ఈ ఘర్షణలు, దాడులు ఒక పథకం ప్రకారం జరిగాయన్నది అర్థమైపోయింది. పోలీసులు తనను కొట్టారంటూ పట్టాభిరాం స్థానిక న్యాయ స్థానంలో ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన చెయ్యి వాచిన మాట నిజమే కానీ, అది పోలీసుల దెబ్బల వల్ల జరిగింది కాదని వైద్య పరీక్షలో తేలింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం పాలక పక్షం మీద, పోలీసుల మీద అసభ్య పదజాలంతో విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించారు. కాగా, గతంలో కూడా పట్టాభిరాం ఒకసారి తనపై ప్రత్యర్థులు దాడి చేసినట్టు, ఆ దాడిలో తాను గాయపడినట్టు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రాజకీయ హింసా కాండ పేట్రేగి పోతోందంటూ ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు సాగించారు. చివరికి, అవన్నీ పట్టాభిరాం వ్యక్తిగత వివాదాలకు సంబంధించిన అంశాలని తేలింది. ఈ దాడులకు, ఘర్షణలకు సంబంధించి న్యాయస్థానంలో అబద్ధాలు చెప్పాల్సిందిగా ఆయన తమ కార్యకర్తలతో చెబుతున్నట్టుగా వీడియోలు కూడా బయటికి వచ్చాయి. అయితే, వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
మొత్తం మీద రాజకీయ హింసాకాండకు సంబంధించి, పాలక, ప్రతిపక్షాల పాత్రలో కొద్దిగా తేడాలుంటే ఉండవచ్చు కానీ, పార్టీలన్నీ హింసాకాండనే తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయన్న సంగతి రానురానూ నిర్ధారణ అవుతోంది. ఏదో రూపేణా హింసాకాండను రెచ్చగొట్టడం, ప్ర త్యర్థుల మీద ఆరోపణలు చేయడం, చివరికి పోలీసుల మీద కూడా ఫిర్యాదులు చేయడం రాష్ట్రంలో ని త్యకృత్యమైపోయింది. పాలక, ప్రతిపక్షాలు పోటాపోటీగా ఇటువంటి దాడులు, ఘర్షణలను తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడం కూడా ఎక్కువైపోయింది. తన హయాంలో ఇటువంటి రాజకీయ హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తానే ఈ వలలో చిక్కుకోవడం, తమ పార్టీ నాయకులను ఏ విధంగా నూ అదుపు చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను హింసాకాండ ద్వారా అప్రతిష్ఠపాలు చేద్దామనుకుంటే అంతకన్నా అవివేకం, తప్పుడు వ్యూహం మరొకటి ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News