ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీనే కాక, యావత్ ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టాలన్నది పాలక బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందని కొందరు కాంగ్రెస్ నాయకులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం ఈ మేరకు ఇప్పటికే మబహిరంగ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దేశంలో జాతీయ స్థాయిలో సరైన ప్రతిపక్షం లేని పక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడడం జరుగుతుందని మల్లికార్జున్ ఖర్గేతో సహా పలువురు నేతలు హెచ్చరించడం కూడా ప్రారంభమైంది. అయితే, బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటన్నది మాత్రం ఇంత వరకూ వెల్లడి కాలేదు. కాంగ్రెస్ పాలన నుంచి దేశాన్ని కాపాడాలన్నది తమ లక్ష్యమని నరేంద్ర మోదీ అనేక పర్యాయాలు ప్రకటించడం జరిగింది కానీ, ఇతర ప్రతిపక్షాల గురించి మాత్రం మాట్లాడలేదు. మొత్తం మీద జవహర్ లాల్ నెహ్రూ మాదిరిగా నరేంద్ర మోదీ కూడా ముచ్చటగా మూడవసారి ప్రధానిగా అధికారం చేపట్టే పక్షంలో చాలా కాలంగా ఆయన కంటున్న కల ఒకటి నెరవేరినట్టవుతుంది. భారతదేశ చరిత్రతో ముడిపడి ఉన్న నెహ్రూ శకానికి ముగింపు పలికినట్టవుతుంది. అంటే, కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీగా ఉన్న గుర్తింపు మటుమాయం అయిపోతుంది. అందువల్ల 2024 ఎన్నికలు దేశానికి ఎంతో కీలకంగా మారాయి.
గత ఆదివారం ముంబైలోని శివాజీ పార్కులో, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు దాదాపు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తమ గత వైభవాన్ని నెమరువేసుకుంటూ వారు, ఈసారి మోదీ విజయం సాధించే పక్షంలో భారత దేశానికి గత చరిత్రతో సంబంధాలు తెగిపోతాయన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మోదీ గెలిచే పక్షంలో దేశంలో రాజకీయాలు, రాజకీయ పార్టీలు సమూలంగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ, ఇండీ కూటమిలోని ఏ ప్రతిపక్షమూ కాంగ్రెస్ పార్టీతో సీట్లను సర్దుబాటు చేసుకోవడానికి ముందుకు రాలేదు. కాంగ్రెస్ బలం పెరగడమంటే తమ పార్టీ బలహీనపడడమేనని అవి భావించాయి. దీనికి కారణం దేశంలో కాంగ్రెస్ పార్టీ తన స్వయంకృతాపరాధంతో బలహీనపడుతూ పోవ డమే. ఇందిరా గాంధీ నాయకత్వంలో అత్యంత శక్తిమంతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో బాగా బలహీన పడిం దనడంలో సందేహం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాగల స్థితిలో కాంగ్రెస్ లేదు. భవిష్యత్తులో జాతీయ స్థాయి ప్రధాన ప్రతిపక్షం ఒకటి రూపు దిద్దుకుంటే తప్ప ప్రజాస్వామ్యానికి బలం చేకూరదు.
ప్రత్యామ్నాయం అవసరం
కాంగ్రెస్ రహిత భారతదేశమే తమ అంతిమ లక్ష్యమంటూ మోదీ చేసిన నినాదం అర్థరహితమైందేమీ కాదు. ఈ నినాదం చాలా బలంగా పనిచేస్తోంది. దీన్ని సార్థకం చేయడానికి గట్టి కృషే జరుగుతోంది. కాంగ్రెస్ రహిత దేశమంటే మోదీ నాయకత్వం లోని బీజేపీ ఉద్దేశం భారతదేశాన్ని గాంధీ, నెహ్రూల ప్రభావం నుంచి బయటకు తీసుకు రావడం మాత్రమే కాక, వలసవాదుల ప్రభావం నుంచి, బ్రిటిష్ పాలకుల ప్రభావం నుంచి కూడా బయటకు తీసుకు రావడం. స్వదేశీ సిరాతో దేశ చరిత్రను తిరగరాయాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరా నుంచే కొత్త పేర్లు, కొత్త ప్రాంతాలు, కొత్త ప్రజలు, ప్రత్యామ్నాయ చరిత్ర పుట్టుకురావడం జరుగుతోంది. భారతదేశానికి సంబంధించినంత వరకూ ఏం జరిగిందనేది చరిత్ర కాదు. ఏం రాశారన్నది మాత్రమే చరిత్ర. దీన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ కాంగ్రెస్ విముక్త భారత్ అంటూ పిలుపునిచ్చారు.
మోదీ ఇటువంటి పిలుపునివ్వడంలో మరో ఉద్దేశం కూడా ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కాంగ్రెస్ విముక్త భారతదేశమంటే, నెహ్రూ విముక్త భారతదేశం మాత్రమే కాదని, ఇది మున్ముందు ప్రతిపక్ష విముక్త భారతదేశం అనే నినాదంగా కూడా మారబోతోందని అవి ఆందోళన చెందుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్న పక్షంలో ఈ శూన్యాన్ని ప్రాంతీయ పార్టీలేవీ నింపలేవు. కాంగ్రెస్ లేని లోటును దేశంలోని ఏ పార్టీ కూడా భర్తీ చేయలేదు. పరిస్థి తులను బట్టే శత్రువులైనా, మిత్రులైనా పుట్టుకు వస్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరి స్థితి ఈ ఎన్నికలతో మరింత బలహీనపడినట్టయితే, కేంద్రంలో బీజేపీ మరింత బలపడినట్టయితే, ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు బీజేపీని ఆశ్రయించడం తప్ప మార్గం ఉండదు. అంటే ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులు కూడా పూర్తిగా మారిపోతాయి. ఉత్తర భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, దక్షిణ భారత దేశంలో డి.ఎం.కె వంటి పార్టీలు మాత్రం మరి కొంత కాలం మనుగడ సాగించవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ విముక్త భారతదేశంలో ఏక పక్ష రాజకీయాలకు తెరతీసినట్టవు తుంది. ఇలా జరగడం సహజమే కానీ, శ్రేయస్కరం
మాత్రం కాదు.
బుజ్జగింపులకు చెల్లు చీటీ
అయితే, మోదీ వ్యూహంలో ఇదొక భాగం. ఒపీనియన్ పోల్స్ ను బట్టి చూస్తే, బీజేపీ వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 300కు తక్కువ కాకుండా సీట్లు సంపాదించే అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేపట్టగలిగినంత మెజారిటీ బీజేపీకి లభిస్తుంది. మోదీ మూడవ సారి అధికారంలోకి వచ్చే పక్షంలో రాజ్యాంగంలో అనేక సవరణలు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం కూడా వెల్లడించారు. వీటన్నిటిని బట్టి చూస్తే, ప్రతిపక్షాలు వచ్చే అయిదేళ్లలో తమను తాము కాపాడుకోవడం ఎలా అన్న విషయాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను బట్టి, వారికి ఈ
విషయంలో పూర్తి అవగాహన ఉందన్న విషయం అర్థమవుతూనే ఉంది. కాంగ్రెస్ విముక్త భారతదేశంలో తమ మనుగడ ఎట్లా ఉండబోతుందన్నది మాత్రం వారు ఆలోచించడం లేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఏకైక సంపన్న రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో కూడా బీజేపీ విజయం తర్వాత పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. కర్ణాటకలో కొద్ది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనిశ్చితంగానే ఉంది. ప్రతిపక్షాలు బీజేపీ బలాన్నే కాదు, కాంగ్రెస్ బలహీనతలను కూడా దృష్టిలో పెట్టుకుని తమ మనుగడకు సంబంధించిన వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక, దేశంలోని ముస్లింలకు ఏదో రకంగా కళ్లెం వేయని పక్షంలో బీజేపీ హిందుత్వ ప్రణాళిక బలం పుంజుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతానికి మోదీ మూడవ పర్యాయం ప్రధాని కావడానికి ముస్లింల వల్ల ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అయితే, హిందువుల ఓట్లు సంఘటితం కావాలన్న పక్షంలో ముస్లింల విషయంలో సరైన ప్రణాళికలు రూపొందించుకోవలసిన అగత్యం ఉంది. దేశంలో మొఘలుల చరిత్రను తిరగరాయడం, ఇక్కడి రాజుల ఘన విజయాలకు, సాఫల్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి మార్పు లతో పాటు, లౌకిక విధానాలకు స్వస్తి చెప్పడం, ముస్లింల అనుకూల, బుజ్జగింపు ధోరణులకు స్వస్తి చెప్పడం వంటివి జరిగే అవకాశం ఉంది.
సమూల మార్పులు
మూడవ సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనడంలో, అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే, భారతదేశం తన గత చరిత్రతో తెగతెంపులు తెంచుకోవడానికి మాత్రం ప్రాధాన్యం ఇస్తుందనడంలో సందేహం లేదు. విచిత్రమేమింటంటే, దేశంలోని ముస్లిం వర్గాలు కూడా బీజేపీకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం పెరుగుతుంది. ముస్లింలలో అత్యధిక సంఖ్యాకులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడం
ప్రారంభం అయింది. ముంబైలో ఇటీవల ఇండీ కూటమి సభ జరిగినప్పుడు వేదిక మీద కనిపించిన ఏకైక ముస్లిం నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా మాత్రమే. ఆయనకు ఇప్పుడు జాతీయ స్థాయి ముస్లిం నాయకుడుగా గుర్తింపు లేదు. పైగా కాశ్మీర్ లోనే ఆయన తన ప్రాభవం కోల్పోయారు. మోదీ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, వెయ్యేళ్ల భారతదేశ పురోగతికి తాము పునాదులు వేస్తున్నామని అనడం ప్రతిపక్షాలలో భయాందోళనలు కలిగించింది. తాము ఒక చీకటి గుహలో ప్రవేశించబోతున్నామన్న ఆలోచన వాటికి కలిగింది.
రాహుల్ గాంధీ రెండు దఫాలుగా సాగించిన పాదయాత్రలతో కాంగ్రెస్ వైపు ముస్లింలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు మొగ్గు చూపే అవకాశం ఉందని, దాని ఓటు బ్యాంకులు వృద్ధి చెందుతాయని ఆ పార్టీలు భావించడం జరిగింది. ఇదే జరిగితే ఆ పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. నిజానికి, అటువంటిదేమీ జరిగే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ ఇంతకు మించిన ఎత్తులు, వ్యూహాలతో ముందుకు దూసుకుపోతోంది. బీజేపీ తమ రాష్ట్ర శాఖలను ఉపయోగించుకుని ఈ వర్గాలనన్నిటినీ ఆకట్టుకునే పనిని ఎప్పుడో ప్రారంభించింది. ఈ విషయంలో అది వ్యవహరిస్తున్న తీరుకు, కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుకు హస్తి మశకాంతరం తేడా ఉంది. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కాబోయే ఎన్నికలతో దేశ చరిత్ర, దేశ ప్రజల తలరాతలను తిరగ రాయడం ప్రారంభం అవుతుంది.
–జి. రాజశుక