Homeఎడిటోరియల్ / బహుళవృత్తి కులాలు ఏకమైతే చరిత్ర మారుతుందా..!

వృత్తి కులాలు ఏకమైతే చరిత్ర మారుతుందా..!

భారతదేశ సమాజ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కుల వ్యవస్థను అర్థం చేసుకోవాల్సిందే. కులం అనేది కేవలం ఒక సామాజిక గుర్తింపు మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా అధి కార సంబంధాలను, ఆర్థిక అవకాశాలను, విద్యా ప్రాప్యతను, సామాజిక గౌరవాన్ని నిర్ణయించిన శక్తివంతమైన వ్యవస్థ. కులం లేదని చెప్పడం ఎంత అవాస్తవమో, కులం వల్ల వివక్ష లేదని చెప్పడం కూడా అంతే అవాస్తవం. హిందూ సమాజంలో మూడు వేల సంవత్సరాలకు పైగా కుల వ్యవస్థ సామాజిక నిర్మాణంలో భాగమై ఉంది. కులం ఉన్నచోట అసమానత ఉంటుంది, అసమానత ఉన్నచోట సామాజిక న్యాయం కోసం పోరాటం అనివార్యమవుతుంది. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతలు రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే సరిపోదని, సామాజిక స్వాతం త్య్రం కూడా రావాలని భావించారు. రాజ్యాంగ పీఠికలో ‘సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం’ అనే పదాలను చేర్చడం వెనుక ఉన్న తాత్వికత ఇదే. సమాజంలో చారి త్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి ప్రవాహంలోకి తీసుకురావడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను తొలగించడం రాజ్యాంగ లక్ష్యంగా నిర్దేశించ బడింది. ఈ భావన రాజ్యాంగంలోని ఆర్టికల్స్​‍ 14, 15, 16, 17లలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఆర్టికల్‌ 39 (ఎ) ద్వారా ప్రతి పౌరుడికి సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం అందించాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఈ విలువలు భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగ మని సుప్రీంకోర్టు కేశవానంద భారతి తీర్పులో స్పష్టం చేసింది. సామాజిక న్యాయం అంటే కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాదు, కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా ఎవరూ వివక్షకు గురికాకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, మానవ గౌరవంతో జీవించే పరిస్థితులు సృష్టించడం, చారిత్రక అన్యాయా లను సరిదిద్దడం, వెనుకబడిన వర్గాలను సమాన స్థాయికి తీసుకురావడం. ఈ దృష్టితో చూస్తే భారతదేశంలో వెనుకబడిన తరగతుల పరిస్థితి ఇప్పటికీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

- Advertisement -

స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నప్పటికీ, బీసీలు అనేక రంగాల్లో ఇంకా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రామీణ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సాంప్రదాయ చేతివృత్తులు, కులవృత్తులు కాలానుగుణ మార్పులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, పారిశ్రామికీకరణ, మార్కెట్‌ విధా నాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న వృత్తులు క్రమంగా కనుమరుగ య్యాయి. అయితే ఆ వృత్తులపై ఆధారపడిన కుటుంబా లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే సమగ్ర విధానాలు మాత్రం రూపుదిద్దుకోలేదు. ఫలితంగా లక్షలాది కుటుం బాలు ఆర్థికంగా బలహీనపడ్డాయి. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో కూడా బీసీలు ఆలస్యంగా అవకాశాలు పొం దారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు 1993 తర్వాతే అమలులోకి వచ్చాయి. కేంద్ర విద్యా సంస్థల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 2008 నుంచి అమలయ్యాయి. రాష్ట్రాలవారీగా పరిస్థితులు మారినా, అనేక ప్రాంతాల్లో బీసీలకు సముచిత అవకా శాలు ఆలస్యంగానే లభించాయి. మరోవైపు శాసనసభలు, పార్లమెం ట్‌లో బీసీలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల వారి జనాభాకు తగిన ప్రాతినిధ్యం లభించ డం లేదు. ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్‌ భర్తీ, పదోన్నతుల్లో రిజర్వేషన్‌ వంటి అంశాల్లో కూడా బీసీలకు ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సమానమైన రాజ్యాంగపర మైన రక్షణలు లేవని పలువురు సామాజిక విశ్లేషకులు పేర్కొంటు న్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక సబ్‌ ప్లాన్లు, జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం కూడా బీసీల అభివృద్ధిని పరిమితం చేస్తున్న అంశంగా చర్చకు వస్తోంది. సంఖ్యలో అధికంగా ఉన్నప్ప టికీ, రాజకీయంగా సంఘటిత శక్తిగా మారడంలో బీసీలు ఇప్పటికీ విజయవంతం కాలేదు. ఇదే వారి బలహీనత. దశాబ్దాలుగా అనేక బీసీ సంఘాలు ఏర్పడ్డాయి. ఉద్య మాలు జరిగాయి. కానీ బీసీల ఐక్యత మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ప్రతి కులం తన సమస్యలకే పరి మితమవడం, ప్రతి సంఘం తన పరిధిలోనే పనిచేయడం, నాయకత్వ పోటీలు, రాజకీయ విభేదాలు బీసీ ఉద్య మాన్ని సమగ్ర శక్తిగా ఎదగనివ్వలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కమ్యూనిస్టు ఉద్యమం ఒక ఉదాహర ణగా చెప్పవచ్చు. ప్రపంచ కార్మికుల ఐక్యతకు పిలుపు నిచ్చిన కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రభావం చూపింది. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అనే నినాదం సామాజిక మార్పుకు చిహ్నంగా నిలిచింది. అయితే అదే సిద్ధాంతాన్ని అనుసరించిన కమ్యూనిస్టు పార్టీలు కాలక్రమేణా అనేక చీలికలకు గురయ్యాయి.

ఒకే సిద్ధాంతం ఉన్నప్పటికీ రాజకీయ, వ్యూహాత్మక భేదాలు వారిని విడదీశాయి. ఫలితంగా వారి రాజకీయ ప్రభావం కూడా తగ్గింది. బీసీ ఉద్యమంలోనూ ఇలాంటి విభజనలు కనిపించడం ఆందోళన కలిగించే అంశం. కేవలం ‘బీసీలు ఏకం కావాలి’ అనే నినాదం సరిపోదు. ఆ ఐక్యతకు ఒక స్పష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాది అవసరం. ఆ పునాది వృత్తి ఆధారిత ఐక్యత కావచ్చనే అభిప్రాయం నేడు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే బీసీలు అనేది ఒకే కులం కాదు. అనేక వృత్తి ఆధారిత కులాల సమా హారం. రైతులు, యాదవులు, గౌడలు, బెస్తలు, ముది రాజులు, పద్మశాలీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, విశ్వకర్మలు, పద్మశాలి, మత్స్​యకారులు, చేతివృత్తులపై ఆధారపడిన అనేక వర్గాలు భారత ఉత్పత్తి వ్యవస్థకు చారిత్రకంగా వెన్నెముకగా నిలిచాయి. ఈ వృత్తి కులాల ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి సమస్యలు, ఉమ్మడి లక్ష్యాల ఆధారంగా నిర్మితమయ్యే ఐక్యత మరింత స్థిరమైన రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. అయితే, ఆ ఐక్యత సమానత్వ సూత్రాలపై నిర్మిత మవ్వాలి. ఒక వర్గం ఆధిపత్యం కోసం కాదు; ప్రతి వర్గానికి న్యాయమైన భాగస్వామ్యం కోసం ఉండాలి. జనాభా, సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అవకాశాలు దామాషా ప్రకారం పంచబడాలి. వెనుకబడిన వర్గాల్లో మరింత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఏబీసీడీ వర్గీకరణ వంటి అంశాలపై శాస్త్రీయ, రాజ్యాం గబద్ధ చర్చ జరగాలి. అలాంటి విధానాల ద్వారా ప్రతి వృత్తి కులానికి రాజ్యాధికారంలో, విద్యలో, ఉద్యోగాల్లో, అభివృద్ధి ఫలితాల్లో సముచిత వాటా లభిస్తుందనే విశ్వాసం ఏర్పడితేనే నిజమైన ఐక్యత సాధ్యమవుతుంది.

రాజ్యాధికారం అంటే కేవలం అధికార కుర్చీ కాదు. నిర్ణయాధికారం. చట్ట నిర్మాణంలో భాగస్వామ్యం. బడ్జెట్‌ కేటాయింపుల్లో వాటా. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక విధానాలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రభావం చూపగల స్థితి. ఆ స్థితికి చేరుకోవాలంటే బీసీలు తమ సంఖ్యాబలాన్ని సంఘటిత రాజకీయ శక్తిగా మలచు కోవాలి. ఓటు వేయడమే ప్రజాస్వామ్యం కాదు, విధానా లను ప్రభావితం చేయగల శక్తిగా ఎదగడమే నిజమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యం. నేటి బీసీ సమాజం ముందు ఉన్న అతిపెద్ద సవాలు బాహ్య శక్తులు కాదు, అంతర్గత విభజనలే. కులాల మధ్య అనుమానాలు, సంఘాల మధ్య పోటీ, నాయకత్వాల మధ్య విభేదాలు కొనసాగినంత కాలం సామూహిక రాజకీయ శక్తి నిర్మాణం కష్టమే. అందుకే పరస్పర గౌర వం, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత, సామాజిక న్యాయం పట్ల విశ్వాసం, సమాన భాగస్వామ్యం అనే నాలుగు స్తంభాలపై బీసీ ఉద్యమం పునర్నిర్మాణం కావాలి. చివరగా చెప్పాలంటే, భారతదేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు కావాలంటే రాజ్యాంగం కల్పించిన అవకాశాలను వెనుకబడిన వర్గాలు సంఘటి తంగా వినియోగించుకోవాలి. బీసీల ఐక్యత నినాదంగా కాకుండా ఆచరణగా మారాలి. వృత్తి కులాలు పరస్పర గౌరవంతో, సమాన భాగస్వామ్య సూత్రంతో, రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం ఐక్యంగా నిలిస్తేనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడగలవు. అప్పుడు మాత్రమే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం మరింత సార్థకమవుతుంది. అదే బీసీల సాధికారతకు, అదే ప్రజాస్వామ్య పరిపూర్ణతకు, అదే సమానత్వ భారత నిర్మాణానికి నిజమైన మార్గం.

మన్నారం నాగరాజు
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News