Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Will Modi dream come true? : మోదీ 'ఆశ'యం నెరవేరుతుందా?

Will Modi dream come true? : మోదీ ‘ఆశ’యం నెరవేరుతుందా?

5 రాష్ట్రాల ఎన్నికల్లో డబుల్ ఇంజిన్.. మోడీ టార్గెట్ ఇదే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు కంటున్న అనేక ఆశయాలలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ పార్టీ ప్రభుత్వమే ఉండాలన్న ఆశయం కూడా ఉంది. ఆ ఆశయం ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నెరవేరుతుందా అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్ది రోజులకు ముందు ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆయన దీన్ని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంగా అభివర్ణించారు. సాధారణంగా పర్వత మార్గాలలో రైలు వెడుతున్నప్పుడు రైలుకు ముందు వైపే కాకుండా వెనుక వైపు కూడా ఇంజిన్‌ అమర్చడం జరుగుతుంటుంది. దీనివల్ల రైలు సమాన వేగంతో పైకి ఎక్కడానికి వీలవుతుంది. అదే విధంగా దేశానికి కూడా డబుల్‌ ఇంజిన్‌ అవసరమని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఒక వాదన వినిపిస్తోంది. ఆ పార్టీ ఉద్దేశంలో కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో కూడా ఉన్న పక్షంలో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉండడం వల్ల కొన్ని సవాళ్లను అధిగమించవచ్చని, కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా, పటిష్టంగా అమలు చేయవచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది. 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీ దీనినే ఒక ప్రచారాంశం చేసుకుని ఓటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఎటువంటి ఆటంకాలూ లేకుండా అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ ఫలాలు ప్రజలకు సవ్యంగా అందాలన్నా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంటేనే మంచిదని అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బీజేపీ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లోనే కాకుండా 2024లో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇటు వంటి వాదనను ఓటర్ల ముందుకు తెచ్చే అవకాశం ఉంది.
డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అనేది రాజకీయ పరిభాషలో ఒక ప్రధానపదంగా మారిపోయింది. 2014 నుంచి దేశంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ దీన్ని ఒక ప్రధాన ప్రచారాంశంగా ఓటర్ల ముందుకు తీసుకు వస్తుండడంతో విశ్లేషకులు దీనిలోని మంచి చెడులను విశ్లేషించడం ప్రారంభించారు. వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించి ఇందులోని నిజానిజాలను నిర్ధారించ వలసి ఉంటుంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి నినాదాన్ని పట్టించుకోకపోవడానికి కారణమేమిటో మాత్రం అర్థం కావడం లేదు. బీజేపీ వాదన అర్థం చేసుకోదగిందే. దీనిని కాదనే అవకాశం కనిపించడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలను రాష్ట్రాల్లో కూడా ప్రవేశ పెట్టడానికి, వాటి అమలును పర్యవేక్షించడానికి అవకాశం ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తోంది. అయితే, ఇక్కడ వాస్తవ పరిస్థితులను మరోసారి నిష్పక్షపాతంగా అవలోకించాల్సి ఉంటుంది.
పరస్పర సహకారం ఉదాహరణకు ఆరోగ్యరంగాన్నే తీసుకుందాం. మధ్యప్రదేశ్‌లో యు.పి.ఏ హయాంలో మరణాల రేటు ప్రతి లక్ష మందికి 221 ఉండేది. 2014లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఒకే విధమైన విధానాలను అనుసరించడంతో ఈ మరణాల సంఖ్య గత తొమ్మిదేళ్ల కాలంలో 173కు తగ్గిపోయింది. ఇక ప్రధాన మంత్రి మాతృ వందన యోజనను అమలు చేసే విషయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. యు.పి.ఎ హయాంలో ప్రతి వెయ్యి మందికి 54 ఉన్న శిశు మరణాల రేటు కూడా బీజేపీ హయాంలో 2022 నాటికి 43కు తగ్గిపోయింది. ఇతర సామాజిక, ఆర్థిక రంగాలలో కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభావం బాగానే కనిపిస్తోంది. యు.పి.ఎ అధికారంలో ఉండగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 2011-12లో ప్రతి కుటుంబానికి సగటు పని రోజులు 43 వరకూ ఉండేవి. 2022-23 నాటికి అది 50 రోజులు దాటి పోయింది. 2011-12లో యు.పి.ఎ హయాంలో వంద రోజుల ఉపాధి లభించిన కుటుంబాల సంఖ్య 2,80,656 కాగా, 2020-21 నాటికి ఈ సంఖ్య 3,22,434కు చేరు కుంది. అంటే, మరో 50,000 మందికి ఉపాధి లభించింది.
మొత్తానికి ఏ రంగాన్ని పరిశీలించినప్పటికీ, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల వల్ల సానుకూల ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 2002-14 మధ్య మధ్యప్రదేశ్‌ లో వార్షిక ప్రభుత్వ మూలధన వ్యయం 10.68 శాతం ఉండగా, 2014 తర్వాత నుంచి అది 14.23 వరకూ పెరిగింది. అదేవిధంగా వ్యవసాయోత్పత్తులు 15 శాతా నికి మించి పెరిగాయి. సాగు భూమి కూడా దాదాపు రెట్టింపు అయింది. ధాన్యం ఉత్పత్తి 40 నుంచి 50 వరకూ పెరిగింది. నీతి ఆయోగ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, బియ్యం, కాయధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తన గోదాములు, శీతలీకరణ కేంద్రాలను ఇబ్బడిముబ్బడిగా విస్తరించాల్సి వచ్చింది. ఈ డబుల్‌ ఇంజిన్‌ ప్రభావం ఆర్థిక రంగం మీద మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2013-14 సంవత్సరంలో రూ. 4,34,729 కోట్లు ఉన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఉత్పత్తి 2023-24 నాటికి రూ. 13,00,00 కోట్లకు పెరిగింది. అదేవిధంగా రాష్ట్ర తలసరి ఆదాయం కూడా రూ. 59,000 నుంచి రూ. 1.4 లక్షలకు పెరిగింది.
విధానాలలో సమన్వయం అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పక్షంలో పథకాల అమలులో ఆలస్యంగానీ, ఆటంకాలు గానీ ఉండే అవకాశం లేదు. అభివృద్ధి కూడా వేగంగా చోటు చేసుకుంటుంది. 2021లో త్రిపుర శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ప్రచారం చేస్తూ, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కారణంగానే త్రిపుర రాష్ట్రం విద్యుత్‌ లోటు రాష్ట్రం స్థాయి నుంచి విద్యుత్‌ మిగులు రాష్ట్రం స్థాయికి ఎదిగిపోయిందని వ్యాఖ్యానించారు. నిజానికి, కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉండడం అనేది ఏ రాష్ట్రానికైనా ఎంతో వెసులు బాటుగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. రాష్ట్రాలు కేంద్రం నుంచి తమకు రావలసిన నిధులను, పథకాలను, కార్యక్రమాలను తేలికగా రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును శంకించే వారికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ స్వలాభంతో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టి, తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి, పథకాలను అప్పగించడానికి ముందుకు వచ్చినప్పటికీ, విభేదాలు, వివాదాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని అందిపుచ్చుకోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి.
కొత్త జాతీయ విద్యా విధానం కానీయండి, ఉపాధి పథకాలు కానీయండి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాత ధోరణిని అనుసరించడం వల్ల, కేంద్ర విధానాలను అనుమానించడం వల్ల కేంద్ర సహాయాన్ని దూరం చేసుకోవడం జరిగింది. బీజేపీ వాదనను ఏదోవిధంగా అడ్డుకోవాలనుకునే రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్‌ను ఉదాహరణగా చూపిస్తే చూపించవచ్చు. ఈ ఉదాహరణ తీసుకురావడం వల్ల డబుల్‌ ఇంజిన్‌ విధానాన్ని నీరు కార్చడం జరిగేపని కాదు. నిజానికి ఇక్కడి సమస్య చివరికి డబుల్‌ ఇంజిన్‌ విధానం వల్లే చాలావరకు పరిష్కారం అయింది. అనేక నెలలుగా సంక్షోభాలతో, సమస్యలతో, అల్లర్లతో, ఆందోళనలతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్‌ సమస్య డబుల్‌ ఇంజిన్‌ కారణంగానే ఒక కొలిక్కి వచ్చిందనే విషయాన్ని విస్మరించకూడదు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పాలకులు ఒకే విధానంతో వ్యవహరించడం వల్ల మణిపూర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
ఒకదానికొకటి ఊతం నిజానికి, ఈ డబుల్‌ ఇంజిన్‌ విధానం కొంతకాలంగా ప్రజల దృష్టినే కాక, పాలకుల దృష్టిని కూడా ఆకట్టుకుంటోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ విధానాన్ని అన్యాపదేశంగా సమర్థిస్తూ, కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉండాలన్న వాదన సమర్థనీయమే కానీ, అక్కడా ఇక్కడా బీజేపీ ప్రభుత్వం కాకుండా బీజేపీయేతర కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఆయన అన్నారు. బీజేపీ ఒక వ్యవస్థీకృత పార్టీ కనుక ఈ విధానానికి, విధానానికి సంబంధించిన వాదనకు ఒక అర్థముంది. కూటములు, ఫ్రంట్‌ల వల్ల డబుల్‌ ఇంజిన్‌ ప్రయోజనం నెరవేరకపోవచ్చు. బీజేపీ అభిప్రాయంతో కూటముల అభిప్రాయాలను పోల్చలేం. వాటికి, వీటికి ఎక్కడా పొంతన కుదరదు. ఒకే రకమైన విధానాలను రూపొందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గానీ, సీని యర్‌ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసినా, సంప్రదింపులు జరిపినా సానుకూల స్పందనే లభిస్తుంది తప్ప, పక్షపాత ధోరణికి అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును విశ్లేషించడానికి, మదింపు చేయడానికి కేంద్రానికి అవకాశం ఉంటుంది. ఇతర ప్రభుత్వాలున్నప్పుడు ఇది సాధ్యం కాకపోవచ్చు.

  • డాక్టర్‌. వి. వెంకటేశ్వర రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News